తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా నిర్మాతగా చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి వీరమాచనేని మధుసూదన రావు. చిత్ర పరిశ్రమలో ఆయన సాధించిన అపారమైన విజయాల వల్ల ఆయనను అందరూ ఎంతో గౌరవంగా 'విక్టరీ' మధుసూదన రావు అని పిలిచేవారు.
వి.మధుసూదన 1923 జూన్ 14 న కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయంతో సినీ రంగ ప్రవేశం చేశారు. మధుసూదన రావు 1957లో వచ్చిన 'తోడికోడళ్ళు' చిత్రానికి సహాయ దర్శకుడిగాతన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.1959లో వచ్చిన 'సతీ తులసి' చిత్రం ద్వారా ఆయన పూర్తిస్థాయి దర్శకుడిగా మారారు.
దాదాపు 70 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు, సెంటిమెంట్, సామాజిక అంశాలతో కూడిన సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో మ్యూజికల్ హిట్స్ మరియు కుటుంబ కథా చిత్రాలను ఆయన అందించారు.
వీరాభిమన్యు, అన్నపూర్ణ, రక్తసంబంధం,టాక్సీరాముడు,ఆరాధన, లక్షాధికారి, గుడిగంటలు, ఆత్మబలం, అంతస్తులు,, డాక్టర్ ఆనంద్, ఆస్తిపరులు, మంచి కుటుంబం, జమీందార్,ఆత్మీయులు, మనుషులు మారాలి, పవిత్ర బంధం, అక్కాచెల్లెలు, లక్ష్మీ నివాసం, భక్త తుకారాం, కళ్యాణ మంటపం, కృష్ణవేణి, మల్లెపూవు, జేబుదొంగ, ప్రేమలు- పెళ్లిళ్లు, మంచిరోజులు వచ్చాయి, బంగారు కానుక, శివమెత్తిన సత్యం, జూదగాడు లాంటి పలు సినిమాలు ఆయనను సక్సెస్ దర్శకుడుగా నిలబెట్టాయి.
అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, శోభన్ బాబు, కృష్ణ వంటి అగ్ర నటులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. అక్కినేని నాగార్జునను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన 'విక్రమ్' సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. కే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం 'స్వాతి కిరణం'కు మధుసూదన రావు నిర్మాతగా వ్యవహరించారు.
ఆయన దర్శకత్వం వహించిన 'అంతస్తులు' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఆయన మరో ఆరు చిత్రాలు - గుడిగంటలు, అంతస్తులు, ఆస్తిపరులు, ఆత్మీయులు, ప్రజానాయకుడు, కాంచనగంగ ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డులను గెలుచుకున్నాయి. ఆయన విశిష్ట సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997 లో ఆయనను అత్యున్నత 'రఘుపతి వెంకయ్య లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' పురస్కారంతో సత్కరించింది.
ఆయన కేవలం తెలుగులోనే కాకుండా హిందీ (దేవి, సాస్ భీ కభీ బహు థీ, లవ్ కుష్), కన్నడ భాషల్లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ పరిశ్రమకు ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను అందించిన 'మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్'ను కూడా ఆయన స్థాపించారు. 2012 జనవరి 11న హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.
No comments:
Post a Comment