Tuesday, 30 June 2026

'విక్టరీ' మధుసూదన రావు (జయంతి, జూన్ 14)


తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా నిర్మాతగా చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి వీరమాచనేని మధుసూదన రావు. చిత్ర పరిశ్రమలో ఆయన సాధించిన అపారమైన విజయాల వల్ల ఆయనను అందరూ ఎంతో గౌరవంగా 'విక్టరీ' మధుసూదన రావు అని పిలిచేవారు. 

వి.మధుసూదన  1923 జూన్ 14 న కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. ఆ తరువాత మద్రాసు వెళ్లి తాతినేని ప్రకాశరావు వంటి వారి పరిచయంతో సినీ రంగ ప్రవేశం చేశారు.  మధుసూదన రావు  1957లో వచ్చిన 'తోడికోడళ్ళు' చిత్రానికి సహాయ దర్శకుడిగాతన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.1959లో వచ్చిన 'సతీ తులసి' చిత్రం ద్వారా ఆయన పూర్తిస్థాయి దర్శకుడిగా మారారు.

 దాదాపు 70 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలు, సెంటిమెంట్, సామాజిక అంశాలతో కూడిన సినిమాలను అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో మ్యూజికల్ హిట్స్ మరియు కుటుంబ కథా చిత్రాలను ఆయన అందించారు.

వీరాభిమన్యు, అన్నపూర్ణ, రక్తసంబంధం,టాక్సీరాముడు,ఆరాధన, లక్షాధికారి, గుడిగంటలు, ఆత్మబలం, అంతస్తులు,, డాక్టర్ ఆనంద్, ఆస్తిపరులు, మంచి కుటుంబం, జమీందార్,ఆత్మీయులు, మనుషులు మారాలి, పవిత్ర బంధం, అక్కాచెల్లెలు, లక్ష్మీ నివాసం, భక్త తుకారాం, కళ్యాణ మంటపం, కృష్ణవేణి, మల్లెపూవు, జేబుదొంగ, ప్రేమలు- పెళ్లిళ్లు, మంచిరోజులు వచ్చాయి, బంగారు కానుక, శివమెత్తిన సత్యం, జూదగాడు లాంటి పలు సినిమాలు ఆయనను సక్సెస్ దర్శకుడుగా నిలబెట్టాయి. 
అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, శోభన్ బాబు, కృష్ణ వంటి అగ్ర నటులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. అక్కినేని నాగార్జునను హీరోగా పరిచయం చేస్తూ ఆయన చేసిన 'విక్రమ్' సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.  కే. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం 'స్వాతి కిరణం'కు మధుసూదన రావు నిర్మాతగా వ్యవహరించారు.

ఆయన దర్శకత్వం వహించిన 'అంతస్తులు' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఆయన మరో  ఆరు చిత్రాలు - గుడిగంటలు, అంతస్తులు, ఆస్తిపరులు, ఆత్మీయులు, ప్రజానాయకుడు, కాంచనగంగ ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డులను గెలుచుకున్నాయి. ఆయన  విశిష్ట సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997 లో ఆయనను అత్యున్నత 'రఘుపతి వెంకయ్య లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' పురస్కారంతో సత్కరించింది.

ఆయన కేవలం తెలుగులోనే కాకుండా హిందీ (దేవి, సాస్ భీ కభీ బహు థీ, లవ్ కుష్), కన్నడ భాషల్లో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ పరిశ్రమకు ఎంతో మంది నటీనటులను, సాంకేతిక నిపుణులను అందించిన 'మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్'ను కూడా ఆయన స్థాపించారు. 2012 జనవరి 11న హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు.

సినీస్మృతులు (రక్త సంబంధం)

రక్త సంబంధం (1962)  

అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని అత్యంత హృద్యంగా ఆవిష్కరించిన చిత్రాల్లో రక్త సంబంధం ఒకటి. దర్శకుడు వి. మధుసూదనరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కాంతారావు, దేవిక ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన పాశమలర్కు తెలుగు రూపాంతరం.  

చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజు (ఎన్టీఆర్), తన చెల్లెలు రాధ (సావిత్రి)ని ఎంతో ప్రేమగా పెంచుతాడు. రాధ కూడా తన అన్ననే ప్రపంచంగా భావిస్తుంది. ఇద్దరూ కష్టపడి బొమ్మలు తయారు చేసి అమ్ముతూ జీవితం సాగిస్తారు. కాలక్రమేణా రాజు తన కష్టంతో మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతాడు.  

ఒక సందర్భంలో రాధ ప్రాణాలను ఆనంద్ (కాంతారావు) కాపాడతాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మొదట రాజు ఈ ప్రేమను అంగీకరించకపోయినా, చెల్లెలి సంతోషమే ముఖ్యమని భావించి వారి వివాహాన్ని ఘనంగా జరిపిస్తాడు. తాను కూడా మాలతి (దేవిక)ను వివాహం చేసుకుంటాడు. కొంతకాలం రెండు కుటుంబాలు ఎంతో ఆనందంగా గడుపుతాయి.  

కానీ ఆనంద్ అత్త కాంతమ్మ (సూర్యకాంతం) అసూయతో అన్నాచెల్లెళ్ల మధ్య అపార్థాలు సృష్టిస్తుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూపించి ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒకప్పుడు విడదీయరాని బంధం క్రమంగా విరిగిపోతుంది. రాధ తన అన్నపై ప్రేమను తగ్గించుకోకపోయినా, పరిస్థితుల వల్ల ఇద్దరూ వేర్వేరుగా జీవించాల్సి వస్తుంది.  

ఇంతలో రాజు భార్య మరణిస్తుంది. మరోవైపు దీపావళి సందర్భంగా రాధ కుమారుడు మంటల్లో చిక్కుకుంటాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాజు బాలుడిని రక్షిస్తాడు. అయితే ఆ ప్రమాదంలో రాజు చూపును కోల్పోతాడు. ఈ సంఘటనతో జరిగిన పొరపాట్లన్నీ రాధకు, ఆనంద్‌కు అర్థమవుతాయి. మళ్లీ అన్నాచెల్లెళ్లు కలుసుకుంటారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవదు. జీవితమంతా ఒకరి కోసం ఒకరు బతికిన ఆ ఇద్దరూ చివరికి ఒకరి చేతిని ఒకరు పట్టుకుని శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెడతారు. ఈ విషాద ముగింపు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.  

ఆస్తులు, అపార్థాలు, స్వార్థాలు ఎంత పెద్దవైనా, రక్తంతో ఏర్పడిన బంధాన్ని మించినవి కావు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, త్యాగం, ఆప్యాయత ఈ చిత్రానికి చిరస్థాయిగా నిలిచే గొప్పతనాన్ని తీసుకొచ్చాయి. ఈ కారణంగానే ఈ చిత్రం నేటికీ తెలుగు కుటుంబ ప్రేక్షకుల మనసుల్లో ఒక చిరస్మరణీయ క్లాసిక్‌గా నిలిచింది

ముళ్లపూడి వెంకట రమణ మాటలు ఈ సినిమాకి భావోద్వేగ బలాన్ని ఇచ్చాయి.  ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం అందించిన పాటల్లో చందురుని మించు - పాట ఆ తరువాత అన్నాచెల్లెళ్ల పాటలకు స్ఫూర్తిగా నిలిచింది. మరో పాట బంగారు బొమ్మ రావేమే- నేటికీ పెళ్ళిళ్ళలో తప్పక వినిపించే పాట. 

రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, పి. డూండీ ఈ చిత్రాన్ని నిర్మించారు. —--------

ప్రజల మనిషి వెంకయ్య నాయుడు (పుట్టినరోజు జూలై -1)

  భారత రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన అరుదైన నాయకులలో ముప్పవరపు వెంకయ్య నాయుడు ఒకరు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, తన వాక్చాతుర్యం, అంకితభావం, నిరంతర శ్రమతో దేశంలోనే అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు. ఉత్తమ పార్లమెంటేరియన్, ప్రజల మనిషి. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తి.

వెంకయ్య నాయుడు  1949 జూలై 1న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా, చవటపాళెం గ్రామంలో  సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నెల్లూరు లోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

కాలేజీ రోజుల్లోనే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్,  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

1970 దశకంలో  జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో వచ్చిన "జెపి ఉద్యమం" ద్వారా వెంకయ్య నాయుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఆయన జైలు జీవితాన్ని కూడా గడిపారు.

 1978, 1983 లలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, తన గంభీరమైన ఉపన్యాసాలతో, ప్రజల సమస్యలపై పోరాడే తీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు.

రాష్ట్ర రాజకీయాల నుంచి  క్రమంగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2004 వరకు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు.

అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ ప్రభుత్వాలలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, సమాచార-ప్రసార,  పార్లమెంటరీ వ్యవహారాల  వంటి కీలక శాఖల మంత్రి పదవులను నిర్వహించారు. 'ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన' ద్వారా గ్రామీణ రోడ్ల అనుసంధానంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం.

ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం. రాజ్యసభ చైర్మన్‌గా ఆయన సభను నడిపించిన తీరు ఆదర్శప్రాయం. సభలో క్రమశిక్షణకు, సమయపాలనకు పెద్దపీట వేశారు. "ముందు మాట్లాడండి లేదా వెనక్కి వెళ్ళండి"  అంటూ సభ్యులను నిలదీసేవారు. సభా సమయాన్ని వృథా చేయకుండా బిల్లుల ఆమోదానికి కృషి చేశారు.

వెంకయ్య నాయుడు  ఉపన్యాసాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ముఖ్యంగా సమయస్ఫూర్తితో కూడిన ప్రాసలు వేయడంలో ఆయన సిద్ధహస్తులు. "అమ్మను, మాతృభూమిని, మాతృభాషను ఎప్పటికీ మరవకూడదు" అని ఆయన నిరంతరం చెప్తుంటారు. ప్రపంచ వేదికలపై కూడా తెలుగు భాషా గొప్పతనాన్ని చాటిచెప్పారు.

ఆయన ఇచ్చే 'ఉగాది విందులు', 'దివాలీ విందులు' రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేస్తాయి.  నెల్లూరు వంటకాలతో అతిథులను సత్కరించడం ఆయనకు ఒక అలవాటు.

దేశానికి ఆయన చేసిన నిరుపమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 2024 లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మవిభూషణ్" తో ఆయన్ను సత్కరించింది.

ఒక సామాన్య కార్కర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడు  జీవితం నేటి యువతకు, భావి రాజకీయ నాయకులకు ఒక పెద్ద సందేశం. పదవిలో ఉన్నా, లేకపోయినా నిరంతరం ప్రజల గురించి, సమాజ హితం గురించి ఆలోచించే ఆయన నిజమైన ప్రజా నాయకుడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందిద్దాం..*


సినీ స్మృతులు


 గుడిగంటలు (1964)

1964లో విడుదలైన గుడిగంటలు  హృదయాన్ని కదిలించే భావోద్వేగ కథాచిత్రం. తమిళంలో ఘన విజయం సాధించిన ఆలయమణికి ఇది తెలుగు రీమేక్. ఇందులో ఎన్టీఆర్ నటించిన పాత్ర ఆయన కెరీర్‌లో విభిన్నమైన, మానసిక సంఘర్షణలతో కూడిన పాత్రల్లో ఒకటిగా నిలిచింది.  

ధనవంతుడైన వాసు (ఎన్టీఆర్) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అపారమైన ఆస్తి ఉన్నా, ఆప్యాయత చూపించే వారు లేక ఒంటరితనంలో పెరుగుతాడు. ఈ ఒంటరితనమే అతనిలో ఒక విచిత్రమైన మనస్తత్వాన్ని పెంచుతుంది. తనకు నచ్చిన వ్యక్తి పూర్తిగా తనవాడిగానే ఉండాలని భావించే స్వభావం ఏర్పడుతుంది.

వాసుకు అత్యంత ఆప్తుడు హరి (జగ్గయ్య). ఇద్దరూ ప్రాణస్నేహితులు. హరి నిజాయితీ, త్యాగం కలిగిన వ్యక్తి. వాసు కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

ఒక రోజు వాసు కస్తూరి (కృష్ణకుమారి)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే కస్తూరి మనసు మాత్రం అప్పటికే హరిదే. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం హరికి తెలుసు. కానీ వాసు కూడా కస్తూరిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న హరి, తన స్నేహితుడి సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. కస్తూరిని వాసును వివాహం చేసుకోవాలని ఒప్పిస్తాడు.

కస్తూరి ఇష్టంలేకపోయినా పరిస్థితులకు తలవంచి వాసును వివాహం చేసుకుంటుంది. పెళ్లి తర్వాత వాసు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కానీ ఆమె మనసులో తనపై ప్రేమ లేదనే అనుమానం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ అనుమానం క్రమంగా అసూయగామారుతుంది.

వాసు బంధువైన భద్రయ్య (రమణారెడ్డి) వాసు ఆస్తిపై కన్నేస్తాడు. తన కుమార్తె సుభద్ర (వాసంతి)ని వాసుకు పెళ్లి చేయాలని అనుకున్న అతని ఆశలు నెరవేరకపోవడంతో, వాసు దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టాలని చూస్తాడు. వాసు మనసులో అప్పటికే ఉన్న అనుమానాలను మరింత రెచ్చగొడతాడు.

ఒక సందర్భంలో హరి, కస్తూరి గతంలో ప్రేమించుకున్న విషయం వాసుకు తెలుస్తుంది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక వాసు తీవ్ర మనోవేదనకు గురవుతాడు. తనకు అత్యంత ప్రియమైన ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేశారని భావిస్తాడు. కోపంతో, అసూయతో హరిని ఒక కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేయాలని కూడా ప్రయత్నిస్తాడు. కానీ చివరి క్షణంలో తన తప్పు గ్రహిస్తాడు. హరిని కాపాడుతాడు. ఈ సంఘటన తర్వాత వాసు తనలోని లోపాన్ని అర్థం చేసుకుంటాడు.  

తాను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేయాలని నిర్ణయించిన వాసు, కస్తూరి–హరిలను మళ్లీ ఒక్కటి చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే పరిస్థితులు మరింత క్లిష్టమై ఉంటాయి. కస్తూరి వాసు భార్యగా సమాజంలో గుర్తింపు పొందింది. వాసు బ్రతికే ఉన్నప్పటికీ, కొన్ని అపార్థాల వల్ల ఆమెను వితంతువులా చూసే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇక కస్తూరి జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన వాసు, చివరి ప్రయత్నంగా ఆమెను రక్షించడానికి ముందుకొస్తాడు. ఆవేదనతో కొండపై నుంచి దూకి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించిన కస్తూరిని కాపాడతాడు. తన అనుమానాలే తన జీవితాన్ని, తన భార్య జీవితాన్ని నరకంగా మార్చాయని గ్రహించి క్షమాపణ కోరుతాడు.

వాసులో వచ్చిన మార్పును చూసిన కస్తూరి అతన్ని క్షమిస్తుంది. ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. మనిషిని నాశనం చేసేది శత్రువులు కాదు, అనుమానమే అనే సందేశంతో సినిమా ముగుస్తుంది.  

వి. మధుసూదనరావు దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం మరో అసెట్. ముఖ్యంగా జన్మమెత్తితిరా, దూరానా నీలి మేఘాలు, నీలి కన్నుల నీడలలోన, నీలోన నన్నే - పాటలు పాటలు ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తుంటాయి.*


నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...