హైదరాబాద్: తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) గడువు తేదీని ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి పొడిగించింది. ఆగస్టు3వ తేదీతో పూర్తి కావాల్సిన ఎన్యూమరేషన్ ప్రక్రియను ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యూమరేషన్ పూర్తయినట్లు ఈసీ తెలిపింది.
Friday, 31 July 2026
పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు - కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ:. పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.3,15,614 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 ఆర్థిక సహాయం అందుతోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2000 చొప్పున మొత్తం జమ చేస్తున్నారు. 'పీఎం కిసాన్' పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో మొత్తం 4.47 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది. సూర్య సరోవర్ యోజన
పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రూ.5,070 కోట్లతో 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాశయాలు, పారిశ్రామిక చెరువులపై సోలార్ ప్లాంట్ల నిర్మాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని 5,000 మెగావాట్లకు పెంచనున్నారు. 10,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026-27 నుంచి 2030-31 వరకు ప్రాజెక్టులను అమలులోకి తీసుకురానుండగా, 2032-33 వరకు కేంద్రం ఆర్థిక సహకారం అందించనుంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక్కో ప్రాజెక్టుకు 50 లక్షల వరకు, అలాగే నిర్మాణ దశలో ప్రతి మెగావాట్‌కు కోటి చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం చేయనుంది.
సముద్ర వనరుల పరిశోధన, వినియోగం దిశగా చేపడుతున్న రూ.84,084 కోట్ల విలువైన 'సముద్ర మంథన్' ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా, జాతీయ క్రీడా ఫెడరేషన్ పథకానికి రూ.36, 441 కోట్లు మంజూరు చేశారు.
రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ట్విన్ ట్యూబ్ సొరంగాల నిర్మాణాలకు గాను రూ.9,779 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Thursday, 30 July 2026
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
హైదరాబాద్ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి(54) సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్ను మూశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్రానికి ఆయన పార్థివదేహాన్ని తరలిస్తున్నారు.
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్య సభ ఆమోదం తెలిపింది. 10 గంటల చర్చల తర్వాత విపక్ష సభ్యులు వాకౌట్ మధ్య బిల్లు పాస్ ఆమోదం పొందింది. బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడంతో బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు పంపనున్నారు. అక్కడ ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది. చట్టం అమల్లోకి వస్తే పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్లకు పాల్పడిన వారికి రూ.50 లక్షల జరిమానాతో పాటు 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది.
Monday, 27 July 2026
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
చిన్ననాటి స్నేహితులు (1971)
డీవీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.ఎస్.రాజు నిర్మించిన చిన్ననాటి స్నేహితులు చిత్రం 1971, అక్టోబర్ 6న విడుదల అయింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కె.విశ్వనాథ్.
శ్రీనివాసరావు (ఎన్టీఆర్), శ్రీధరరావు (జగ్గయ్య) చిన్ననాటి స్నేహితులు. శ్రీధరరావుకు అరుణ (వాణిశ్రీ) అనే పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంటుంది. శ్రీనివాసరావుకు పెళ్ళయినా పిల్లలు ఉండరు. అరుణనే తన కూతురులా చూసుకుంటూ ఉంటాడు శ్రీనివాసరావు.
అరుణ తాను ప్రేమించిన రవి (శోభన్ బాబు) తో కాలు జారుతుంది. ఉద్యోగరీత్యా ట్రైనింగ్ కు వెళ్ళిన రవి ప్రమాదంలో మరణించాడని తెలుస్తుంది. అదే సమయంలో అరుణ గర్భవతి అని తేలుతుంది. ఆమెను, ఆమె తండ్రిని కాపాడడం కోసం శ్రీనివాసరావు, అతని భార్య లలిత, అరుణకు పుట్టబోయే బిడ్డను తమ సంతానంగా చెప్పుకోవాలని భావిస్తారు. అయితే అదే సమయంలో లేటు వయసులో శ్రీనివాసరావు భార్య లలిత ( దేవిక) కూడా గర్భవతి అవుతుంది.
తొలి నుంచీ శ్రీధరరావు ఆస్తిపై కన్నువేసిన అతని బావమరిది నాగభూషణంకు ఈ విషయాలు తెలుస్తాయి. శ్రీనివాసరావు కొడుకును కిడ్నాప్ చేసి, తన కొడుకు రాంబాబును పెళ్ళాడమని అరుణను బెదిరిస్తాడు. బాబు కోసం అరుణ అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసిన శ్రీనివాసరావు మారువేషం వేసుకొని, నాగభూషణం పన్నిన పన్నాగాన్ని వమ్ము చేస్తాడు. అదే సమయంలో రవి బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. చివరకు అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
స్నేహితుని కుటుంబగౌరవం కోసం శ్రీనివాసరావు పడే తపన ఈ చిత్రంలోని అసలు అంశం.
ఈ చిత్రానికి జూనియర్ సముద్రాల రచన చేశారు. టి.వి.రాజు సంగీతానికి సి.నారాయణ రెడ్డి పాటలు తోడై అలరించాయి. ఇక్కడే ఈ గదిలోనే, అడగాలనివుంది ఒకటడగాలనివుంది, అందాల శ్రీమతికి, ఎందుకయ్యా నవ్వుతావు - పాటలు ఆదరణ పొందాయి.
ఈ సినిమ బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం అందుకొలేకపోయినా ఎన్టీఆర్ ఇమేజ్ కారణంగా రిపీట్ రన్స్ లో బాగానే వసూళ్ళు చూసింది.*
మరమ్మత్తుల కోసం ఆగస్టు మొత్తం తిరుమల పుష్కరిణి మూసివేత
తిరుపతి: సెప్టెంబరు 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి 31 వరకు పుష్కరిణి మూసివేసి మరమ్మతులు చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు ఆదేశించింది. సెక్రటరీ స్థాయి అధికారితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లోతుకుంట భూముల వ్యవహారంలో ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2 లలో ఉన్న 40 ఎకరాల భూములు శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ స్వాధీనంలో ఉన్నాయి. ఈ భూముల్లో హైడ్రా జోక్యం చేసుకొని ఫెన్సింగ్ వేసిందని, కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ లెక్కచేయకుండా హైడ్రా వ్యవహరిస్తోందని శాంతాశ్రీరామ్ కంపెనీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. 40 ఎకరాల భూమి శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకే చెందుతుందని కోర్టు ఉత్తర్వులున్నప్పటికీ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారని కోర్టుకు తెలిపింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఉత్తర్వులు వెలువరించిన హైకోర్టు కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది.
Sunday, 26 July 2026
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అప్పు చేసి పప్పు కూడు (1959)
విజయా ప్రొడక్షన్స్ ప్రతిష్ఠాత్మక చిత్రాలలో 1959 జనవరి 14 న విడుదలయిన అప్పు చేసి పప్పు కూడు ఒకటి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ఈ చిత్రానికి ఎల్ వీ ప్రసాద్ దర్శకుడు. చక్రపాణి, ఎల్.వి.ప్రసాద్, వెంపటి సదాశివబ్రహ్మం చిత్రానువాదం చేశారు.
దివాన్ బహుద్దూర్ ముకుందరావు (ఎస్వీ రంగారావు) లక్షాధికారి, అతని మనుమరాలు మంజరి (సావిత్రి) ఆయన ఆస్తికి ఒక్కగానొక్క వారసురాలు. ముకుందరావుకి తన మనుమరాలిని ఎవరైనా రాజుకిచ్చి పెళ్ళి చేయాలనే కోరిక ఉంటుంది. మంజరి రాజారావు (ఎన్టీఆర్) అనే దేశభక్తుడిని ప్రేమిస్తుంది. రాజారావు చెల్లెలు లీల (జమున). ఆమెకు రావుబహుద్దూర్ రామదాసు (సీఎస్ఆర్) కొడుకైన రఘు (జగ్గయ్య)తో వివాహమయి ఉంటుంది. విచిత్రంగా, రఘుకి లీల ఎలా ఉంటుందో తెలియదు. రఘు పైచదువుల కోసం విదేశాలకు వెళ్తాడు. రామదాసు లీలను ఇంటినుండి తరిమేసి, లీల చనిపోయిందన్న అబద్దపు వార్త రఘుకు తెలుపుతాడు. ఇదంతా రాజారావు ఒక ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. చెరసాల నుండి విడుదలై రాజారావు తన చెల్లెల్ని తీసుకుని రామదాసు ఇంటికి అతనిని నిలదీయటానికి వెళ్తాడు. కానీ, ఇరువైపువారి పరువు కోసం లీలను మూగ పనిమనిషిలాగా రామాదాసు ఇంట్లో కొన్ని సమస్యలు తొలగిపోయేదాకా ఉండటానికి ఒప్పుకుంటాడు. రామదాసు కొందరి దగ్గర అప్పు చేసి వేరేవారికి అప్పులిస్తుంటాడు. రామదాసు దగ్గర గుమాస్తాగా భజగోవిందం (రేలంగి) పనిచేస్తుంటాడు. భజగోవిందం తన అత్త రాజారత్నం (సూర్యకాంతం) కూతురైన ఉష (గిరిజ)ను ప్రేమిస్తాడు. ఇది రాజారత్నం భర్త రామలింగం (రమణారెడ్డి)కి నచ్చదు, అతను కూతురికి పెళ్ళిచూపులు జరిపిస్తూవుంటే వాటిని భజగోవిందం తన సన్నిహితులతో కలిసి చెడగొడుతూ ఉంటాడు. చివరికి రాజా ఆ మేనమామ ఆటలుకట్టించి, అతని కూతురు ఉష (గిరిజ)తో భజగోవిందానికి వివాహం నిశ్చయింపచేస్తాడు. పనిమనిషి తన భార్య లీలేనని గ్రహించిన రఘు, రాజాకు సాయపడతాడు. చివరకు అంతాకలిసి రామదాసుకు బుద్ధివచ్చేలా చేస్తారు. జరిగినదంతా గ్రహించిన ముకుందరావు పేదవాడైనా రాజాకే తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేస్తాననటంతో - రామదాసే రాజా. మంజరిల చేతులు కలపుతాడు.
ఎస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పింగళి నాగేంద్రరావు రాసిన పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందాయి. వెంపటి సదాశివబ్రహ్మం మాటలు రాశారు.‘కదన్ వాంగి కల్యాణం‘ పేరుతో ఇదే చిత్రాన్ని విజయా సంస్థే ఏక కాలంలో నిర్మించింది. అయితే ముందు తమిళ వెర్షనే 1958 సెప్టెంబర్ 17 న విడుదల అయింది.*
Saturday, 25 July 2026
మంత్రి రాజీనామా పరిష్కారమా? (సంపాదకీయం)
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీల వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడటంతో, బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు ప్రతిపక్షాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి హోరెత్తాయి. చివరికి మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. అయితే "కేవలం ఒక వ్యక్తి రాజీనామా చేయడం వల్ల వ్యవస్థాగత సమస్య పరిష్కారమవుతుందా?" అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశం.
ప్రజాస్వామ్యంలో ఏవైనా పెద్ద వైఫల్యాలు జరిగినప్పుడు సంబంధిత శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించడం సాధారణంగా జరిగే ప్రక్రియే. రాజీనామా అనేది ప్రభుత్వ విఫలత్వాన్ని అంగీకరించడానికి, బాధితులకు కొంత ఉపశమనం కలిగించడానికి తోడ్పడవచ్చు. కానీ అది క్షీణించిన ఒక పరీక్షా వ్యవస్థను పునర్నిర్మించలేదు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణంలో లోపాలు: అపారమైన విస్తృతి కలిగిన పరీక్షలను నిర్వహించేందుకు తగినంత శాశ్వత సిబ్బంది, మౌలిక వసతులు లేకపోవడం.
థర్డ్ పార్టీ ఏజెన్సీలపై మితిమీరి ఆధారపడటం: ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, రవాణా, సెంటర్ల నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వల్ల లీకేజీలకు ఆస్కారం ఏర్పడుతోంది.
సైబర్ నేరాలు, కోచింగ్ మాఫియా: సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున నెట్‌వర్క్‌లను నడుపుతున్న మాఫియాను కట్టడి చేయడంలో నిఘా వర్గాలు విఫలమవడం
మూల కారణాలు ఇవైతే కేవలం ఒక మంత్రిని మార్చడం ద్వారా సమస్య మూలాలను తొలగించలేము. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కింది చర్యలు అత్యవసరం:
1.ఎన్టీఏ ప్రక్షాళన: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును స్వతంత్రంగా సమీక్షించి, సమూల మార్పులు చేయడం.
2. కఠినమైన చట్టాలు: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) చట్టం-2024ను పటిష్టంగా అమలు చేసి, దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడటం.
3. సాంకేతిక భద్రత: ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి డిజిటల్ క్రిప్టోగ్రఫీ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ విధానాలను తీసుకురావడం.
4. వికేంద్రీకరణ: దేశమంతటికీ ఒకే కేంద్రీకృత వ్యవస్థపై భారం వేయకుండా, రీజినల్ పరీక్షల విధానం లేదా దశలవారీ పరిక్షలపై చర్చించడం.
మంత్రి రాజీనామా ఒక రాజకీయ లేదా నైతిక చర్యగా మిగిలిపోవచ్చు. కానీ విద్యార్థులకు నిజమైన న్యాయం జరగాలంటే, సమగ్ర వ్యవస్థాగత సంస్కరణలు, పారదర్శకత మాత్రమే ఏకైక పరిష్కారం.
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
గుండమ్మకథ (1962)
విజయా వారి సినిమాల్లో మరో ఆణి ముత్యం గుండమ్మ కథ. ఎన్ టీ ఆర్, అక్కినేని వంటి హీరోలు ఉన్నా ”గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద పేరు పెట్టడం విశేషం. గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.
జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో నిర్మించిన మనె తుంబిద హెణ్ణు చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి గుండమ్మ కథగా రీమేక్ చేశారు. డి.వి.నరసరాజు మాటలు రాశారు. అయితే నిర్మాతల్లో ఒకరైన నాగిరెడ్డి దీనిని ఒేకే చేసినా మరో నిర్మాత చక్రపాణి విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని కథను పూర్తిగా తిరగరాశారు. అంతవరకు పౌరాణికాలకు పరిమితమైన కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా ఈ సాంఘిక చిత్రానికీ సత్తా చాటుకున్నారు.
గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు ఊళ్ళో గయ్యాళిగా పేరు. ఆమెకు సవతి కూతురు లక్ష్మి (సావిత్రి), స్వంత కూతురు సరోజ (జమున), కొడుకు (హరనాథ్) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే, సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య (రమణారెడ్డి) పెళ్ళి చెడగొడతూంటాడు. హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల) విడుదలయ్యాకా అతనికి సరోజను ఇచ్చి చేయాలని అతని పథకం.
పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్ వీ రంగారావు) తన ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. వారు చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో, రామభద్రయ్య పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్థం చేసుకొంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదనీ, మరోవైపు సరోజకున్న పెంకెతనం, బద్ధకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్టీఆర్), రాజా (అక్కినేని) లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని ఆకర్షిస్తాడు. గుండమ్మకు కొడుకు (హరనాథ్) ప్రేమిస్తున్న అమ్మాయి (ఎల్ విజయలక్ష్మి)కి అన్నయ్యగా రాజా ప్రవేశించి, సరోజను ఆకట్టుకుంటాడు. సరోజ మంకుపట్టు పట్టుకు తోడు రాజా అతను ఆస్తిపరుడేనని నమ్మి గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేసి, తనకు లక్ష్మినిచ్చి పెళ్ళిచేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది. రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని, దొంగనని, ఆస్తిపాస్తులూ లేనివాడినని కొత్త నాటకం మొదలుపెడతారు. రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారన్న వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి లక్ష్మిని నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు. కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి, ఉన్నదాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు. మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కించకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. గుండమ్మ కోడలి దూరపుబంధువు దుర్గమ్మ (ఛాయాదేవి) ఆ చుట్టరికం అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది. ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు. ఇంతలో అంజి, లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి, సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు. ఇటు రాజా యజమాని నుంచి జీతం తీసుకునేందుకు సరోజను పంపుతాడు. తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే యజమాని అని తెలుసుకుని అతను తనను తన భర్తను అవమానించాడన్న రోషంతో తిరిగి వస్తున్న సరోజను లక్ష్మి, అంజీ కలసి జరిగినదంతా చెప్తారు. యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. అలా అంతా కలుస్తారు.
ఈ సినిమాలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం, పాటలే ఈ సినిమా తిరుగులేని విజయానికి కారణమయ్యాయి. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లకు మొత్తం 8 పాటలను సమానంగా కేటాయించారు. ఈనాటికీ ఫ్రెష్ గా మనం వింటున్న గుండమ్మ కధ పాటల గురించి ప్రత్యేకంగా, విడివిడిగా చెప్పుకోనవసరం లేదు.*
తప్పుకున్న ధర్మేంద్ర: కాక్రోచ్ ఆందోళన విరమణ
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ యూజీ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. తనకు వ్యక్తిగత ప్రతిష్ఠ కంటే విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
కాక్రోచ్ ఆందోళన విరమణ
కాగా, సీజేపీ, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో విద్యార్థులపై ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఢిల్లీ లోనూ, మిగతా రాష్ట్రాల్లోనూ నమోదైన కేసులు ఎత్తివేస్తామని, భవిష్యత్తులోనూ ఎవరినీ కేసులతో వేధించబోమని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ విషయంలో సీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది.
Friday, 24 July 2026
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
మూగమనసులు (1964)
పునర్జన్మల ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో బాబూ మూవీస్ నిర్మించిన ‘మూగమనసులు‘ చిత్రం వివాదాలకు అతీతంగా విజయవంతమైంది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రల్లో రాణించారు. 1964 లో ఈ చిత్రం విడుదల అయింది. ఆదుర్తి తాను చదివిన చిన్న కథ ఆధారంగా చెప్పినలైన్ కి ముళ్ళపూడి వెంకటరమణ సినిమా స్క్రిప్ట్ తయారు చేశారు.
కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ బయలుదేరడంతో కథ ప్రారంభమై, గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా కొద్ది దూరంలో ప్రాణాంతకమైన సుడిగుండాలు ఉన్నాయంటూ పడవను ఆపమని గోపీ కేక పెడతాడు.నాయిక రాధ కూడా కోరడంతో పడవను ఆపుతాడు సరంగు. ఏదో గుర్తు వచ్చినట్టు ఇద్దరూ అల్లంతదూరాన ఉన్న పాడుపడ్డ మేడ వద్దకు వెడతారు. అక్కడ ఇద్దరికీ పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తాయి. ఒక ముసలివాడు తారసిల్లి వారిని రాధ, గోపీల సమాధుల దగ్గరకు తీసుకు వెళతాడు. అక్కడ ఆ సమాధులకు దీపం పెడుతూ చావు కోసం నిరీక్షిస్తున్న వృద్ధురాలు గౌరి (జమున) ను గుర్తుపడతాడు. గౌరి వారికి గత జన్మ కథ చెబుతుంది. రాధ (సావిత్రి)జమీందారు (గుమ్మడి) అమ్మాయి కాగా, ఏఎన్ఆర్ పడవ నడుపుతూ ఆమెను కాలేజీకి తీసుకు వెడుతూ ఉంటాడు. వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంతో అభిమానం. గోపీని అతని వాడలోనే ఉండే పల్లెపిల్ల గౌరి (జమున) ప్రేమిస్తూంటుంది. రాధను ఆమె తోటి విద్యార్థి (పద్మనాభం) ప్రేమిస్తాడు. ఇరువైపుల పెద్దలూ వివాహం కుదురుస్తారు. ఆ వివాహం జరిగిన కొన్నాళ్ళకే భర్త చనిపోయి రాధ తిరిగి పుట్టింటికి చేరుతుంది. గోపీ ఆమెను ఓదార్చే క్రమంలో వారిద్దరి మీద ఊళ్ళో పుకార్లు చెలరేగుతాయి. ఒకసారి గోపీ పూరింట్లో అతడు గీసిన తన బొమ్మలు చూసి అతని మూగ ప్రేమను అర్థం చేసుకుంటుంది రాధ. జనానికి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుని పడవపై బయలుదేరిన వారిద్దరినీ రాధ మేనమామ (నాగభూషణం) అడ్డుకోబోగా గౌరి అతని కోర్కె తీర్చడానికి ఒప్పుకుని అతడిని మళ్ళిస్తుంది. చివరికి గోదారి సుడిగుండంలో గోపీ, రాధ మరణిస్తారు. అలా ఈ జన్మలో వారు మళ్లీ కలిశారు. గౌరి వారికి ఇదంతా చెప్పి గోపి చేతిలో కన్ను మూస్తుంది.
19 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈసినిమా 9 థియేటర్లలో 175 రోజులు ఆడింది. మూగమనసులు సినిమాకి సంగీత దర్శకత్వం కె.వి.మహదేవన్ వహించారు. దాశరథి, కొసరాజు ఒక్కోపాట వ్రాయగా, ఆత్రేయ మిగిలిన పాటలన్నీ రాశారు. ఇందులో ఏ పాటకి ఆ పాటే హిట్. పాడుతా తీయగా చల్లగా, ఈనాటి ఈ బంధమేనాటిదో, గోదారి గట్టుంది, ముద్దబంతి పువ్వులో, నా పాట నీనోట, నాలుగు కళ్ళు రెండైనాయి, గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పాటలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి.
ప్రముఖ చిత్రకారుడు బాపు సినిమాకి టైటిల్ డిజైన్, పబ్లిసిటీ డిజైన్ చేసిచ్చారు. ఈ సినిమాని తారాచంద్ బర్జాత్యా, ఎల్.వి.ప్రసాద్ ల నిర్మాణంలో ఆదుర్తి సుబ్బారావు దర్శకునిగా నూతన్, సునీల్ దత్ ప్రధాన పాత్రలలో హిందీలో మిలన్ పేరుతో తీశారు. అక్కడా సినిమా విజయవంతమైంది. సావిత్రి దర్శకత్వంలో తమిళంలో 'ప్రాప్తం'గా ఈ సినిమాను తెరకెక్కించారు.*
Thursday, 23 July 2026
తొలి ఏకాదశి విశిష్టత
తొలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ రోజుకు ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉంది.
శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్లే రోజుగా దీనిని భావిస్తారు. అందుకే దీనిని 'శయన ఏకాదశి' లేదా 'దేవశయని ఏకాదశి' అని కూడా అంటారు.
తొలి ఏకాదశి నాటి నుంచే నాలుగు నెలల పాటు 'చాతుర్మాస్య వ్రతం' ప్రారంభమవుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున విష్ణుమూర్తి తిరిగి యోగనిద్ర నంచి మేల్కొంటారు.
తెలుగువారి ఆచారం ప్రకారం తొలి ఏకాదశి నుంచే వరుసగా పండుగల సీజన్ (వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి) ప్రారంభమవుతుంది.
ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా 'ఓం నమో నారాయణాయ' మంత్రాన్ని జపించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఏకాదశి రాత్రి ఆధ్యాత్మికంగా భజనలు, కీర్తనలతో జాగరణ చేయడం వల్ల మనశ్శాంతి, ముక్తి లభిస్తాయని నమ్ముతారు. తొలి ఏకాదశి ప్రత్యేక ప్రసాదం పేలపిండి (జొన్నలు/సజ్జలు లేదా ధాన్యపు పేలాలు, బెల్లం, యాలకులు, నెయ్యి కలిపి చేసిన పిండి). ఆషాఢ మాసంలో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరానికి వేడిని, శక్తిని అందించడానికి ఈ ప్రసాదం ఆరోగ్యాంశంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు.*
సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
న్యూఢిల్లీ:విద్యా వ్య వస్థలో మార్పు కోసం విద్యార్థులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టిన సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగుక్ తమ 26 రోజుల నిరాహార దీక్ష విరమించారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇంగ్లాండ్ షాక్ నుంచి తేరుకున్న టీమిండియా: జింబాబ్వే పై తొలి టీ 20 గెలుపు
హరారే: జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆ జట్టుతో గురువారం జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. 126 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (50 పరుగులు, 19 బంతుల్లో) అంతర్జాతీయ కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సాధించాడు. ఇషాన్ కిషన్ (35), శ్రేయస్ అయ్యర్ (28) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్భానీ 2, రిచర్డ్ నరగవె 1 వికెట్ తీసుకున్నారు.
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
లక్షాధికారి (1963)
రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 27-09-1963 న విడుదలైన ‘లక్షాధికారి‘ సినిమా అప్పట్లో పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్. తమ్మారెడ్డి కృష్ణమూర్తి, డి వెంకటపతి రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వీ మధుసూదన రావు దర్శకుడు. రచన: నార్ల చిరంజీవి.
లక్షాధికారి రంగయ్య (నాగయ్య) వద్ద సీతయ్య (గుమ్మడి) నమ్మిన బంటుగా పనిచేస్తుంటాడు. రంగయ్య బావమరది శివం ( కేవీఎస్ శర్మ) డబ్బు కోసం రంగయ్యను పీడిస్తుంటాడు. వజ్రాల వ్యాపారి హత్యానేరంపై రంగయ్య జైలుకెళతాడు. రంగయ్య కొడుకుని దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఆ బిడ్డ కృష్ణానదిలో కొట్టుకుపోతూ అచ్చమ్మ (సూర్యకాంతం),పిచ్చయ్య (రమణారెడ్డి) దంపతులకు దొరుకుతాడు. రంగయ్య ఆస్తి వ్యవహారాలను సీతయ్య చూస్తూవుంటాడు. రంగయ్య కొడుకు ప్రసాద్ పెరిగి పెద్దవాడయ్యాడు. సీతయ్య కూతురు పద్మ కూడా పెద్దదౌతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. సీతయ్య ప్రసాద్ ప్రతిభను గుర్తించి ప్రసాద్ ప్రొడక్ట్స్ పేరుతో మందుల కంపెనీ స్థాపించి దాని బాధ్యతను ప్రసాద్ కు అప్పజెబుతాడు. జైలునుంచి వచ్చిన రంగయ్య సీతయ్యను కలుసుకుంటాడు. ఆ రాత్రి రంగయ్య మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. దుండగుల బారినుంచి రంగయ్యను ప్రసాద్ రక్షించి, ఆ ప్రయత్నంలో దెబ్బలుతిని ఆస్పత్రిలో చేరతాడు. తరువాత మారువేషంలో ప్రసాద్ పద్మ సహాయంతో పానకాలు (మిక్కిలినేని) అనే రౌడీ నుంచి రహస్యాలు తెలుసుకుంటాడు. ఇంతలో ఓ ముసుగు మనిషి పానకాలును కాల్చి చంపి పారిపోతాడు. ప్రసాద్ ఆ ముసుగు మనిషిని పట్టి పోలీసులకు అప్పజెబుతాడు. ఆ ముసుగు మనిషి ఎవరో కాదు సీతయ్యే. రంగయ్యను జైలుకి పంపడం, అతడి కొడుకుని చిన్నప్పుడే చంపే ప్రయత్నం చేయడం రంగయ్య ఆస్తి కాజేయడానికేనని తేలుతుంది.
ఎన్టీఆర్ కు ఇది తొలి అపరాధ పరిశోధనా చిత్రం. గుమ్మడి విలనిజం పండింది. రేలంగి, గిరిజ హాస్యం అందించారు. టీ చలపతిరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మబ్బులో ఏముంది, దాచాలంటే దాగదులే, ఎలాగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తొలిప్రేమ- పాటలు బాగుంటాయి.*
Wednesday, 22 July 2026
జాతీయ ప్రసార దినోత్సవం (జూలై 23) -జీడిగుంట నాగేశ్వరరావు
భారతదేశంలో ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటారు. దేశంలో సమాచార రంగానికి, ప్రజల్లో చైతన్యానికి రేడియో, ఇతర ప్రసార మాధ్యమాలు చేసిన సేవలను గుర్తుచేసుకోవడానికి ఈ రోజును కేటాయించారు.
1927 జూలై 23న 'ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ' (అనే ప్రైవేట్ సంస్థ బొంబాయి (ముంబై) స్టేషన్ నుంచి దేశంలోనే మొట్టమొదటి అధికారిక రేడియో ప్రసారాన్ని ప్రారంభించింది. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా జూలై 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
1932లో ప్రభుత్వం దీనిని స్వాధీనం చేసుకుని ఇండియన్ స్టేట్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ గా మార్చింది. ఆ తర్వాత 1936 జూన్ 8న దీనికి ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టారు.
1956 నుంచి ఆల్ ఇండియా రేడియోను అధికారికంగా "ఆకాశవాణి" అని పిలవడం ప్రారంభించారు.
బహుజన హితాయ, బహుజన సుఖాయ — ఇది ఆల్ ఇండియా రేడియో అధికారిక ముద్రావాక్యం
ఇంటర్నెట్, టెలివిజన్ లేని రోజుల్లో వినోదం, వార్తలు, వ్యవసాయ సలహాలు, క్రీడల లైవ్ కామెంటరీల కోసం దేశంలో రేడియో మాత్రమే ఏకైక ఆధారంగా ఉండేది.
తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో విద్యుత్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఏకైక ప్రసార సాధనం రేడియోనే.
దేశంలోని మూలమూలల గ్రామీణ ప్రాంతాలకు, వివిధ భాషల సంస్కృతీ సంప్రదాయాలకు రేడియో వారధిగా నిలిచింది.
ఈ ఆధునిక కాలంలో డిజిటల్ మీడియా పెరిగినా ప్రధానమంత్రి 'మన్‌కీ బాత్' వంటి కార్యక్రమాల ద్వారా ప్రసార మాధ్యమాల ప్రాముఖ్యత మళ్లీ పుంజుకుంది.
ప్రస్తుతం ప్రసార భారతి ఆధ్వర్యంలో ఆకాశవాణి, దూర్ దర్శన్ రెండూ ప్రసార రంగాన్ని మరింత ఆధునీకరించి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా శ్రోతలకు అందుబాటులోకి వచ్చాయి.
ఇక సోషల్ మీడియా ప్రసార రంగానికి ఆధునిక రూపంగా అవతరించింది. సాంప్రదాయ ఆల్ ఇండియా రేడియో, దూర్ దర్శన్ వంటి ఏకముఖ ప్రసారాల నుంచి సమాచార రంగం ఈ రోజు ఇంటరాక్టివ్ డిజిటల్ మాధ్యమంగా రూపాంతరం చెందింది.
యూట్యూబ్ , పోడ్‌కాస్ట్‌లు ద్వారా వ్యక్తిగత రేడియో/టీవీ ఛానెళ్లను నడపడం, ‘ఎక్స్‘ మొదలైన పబ్లిక్ యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నిమిషాల్లో ప్రసారం చేయడం, వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండటం వంటి వెసులుబాట్లతో సోషల్ మీడియా ఆధిపత్యం పెరిగింది.*
వార్తా సమాహరం
పేపర్ల లీక్ కొత్తా? జేపీనడ్డా
న్యూఢిల్లీ: నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పేపర్ లీక్‌తో సంబంధమున్న అన్ని అంశాలపై సమగ్ర చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ గురించి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా పేపర్లు లీక్ అయ్యాయని, యూపీఏ హయాంలో ఎన్నో రాష్ట్రాల్లో పేపర్లు లీక్ జరిగాయని నడ్డా వ్యాఖ్యానించారు. విద్యార్థుల అంశాన్ని రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలనే టార్గెట్‌గా చేసుకుని రాహుల్‌గాంధీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పేపర్లు లీక్ జరిగిందని, తెలంగాణలో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడులో పేపర్లు లీక్ అయ్యాయని తెలిపారు. బంగాల్, కర్ణాటకలోనూ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం బాధ్యయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై ఆయన స్పందించలేదు.
నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా అనురాగ్ జైన్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్ నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2 ఏళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అనురాగ్ మధ్య ప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుతం ప్రధాన మధ్యప్రదేశ్ కార్యదర్శిగా పని చేస్తున్నారు.
అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే : పొంగులేటి
హైదరాబాద్: క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం 16 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
వా
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
ప్రేమించి చూడు (1965)
పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై పి. పుల్లయ్య దర్శకత్వంలో 1965 జూన్ లో విడుదలైన ‘ప్రేమించి చూడు‘ పూర్తి హాస్య ప్రధాన చిత్రం. వి.వెంకటేశ్వర్లు నిర్మాత.
బుచ్చబ్బాయి (రేలంగి) ధనవంతుడు. ఎస్టేట్ ఓనర్. అతనికి ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయి కాంచన (కాంచనమాల).రెండోఅమ్మాయి రత్నమాల (రాజశ్రీ).కుమారుడు వరహాలరాజ్కపూర్ (చలం). బుచ్చబ్బాయికి కూతుర్లంటే ప్రాణం. ఇద్దరూ కాలేజిలో చదువుతూ ఉంటారు. పెద్దకుమార్తె ఆ కాలేజిలో చుదువుతున్న శ్రీనివాసరావు/ వాసు (జగ్గయ్య) ని ప్రేమిస్తుంది. శలవులకు వారిద్దరూ ఇంటికి బయలుదేరడంతో సినిమా ప్రారంభమవుతుంది. బుచ్చబ్బాయి దగ్గర అసిస్టెంట్ మేనేజర్ రంగారావు (అక్కినేని) ఒక సాధారణ బడిపంతులు (రావి కొండలరావు) కుమారుడు. రంగ స్నేహితుడు బుచ్చబ్బాయి పెద్ద కూతురును ప్రేమించిన వాసు. రంగాకి అతను ఫైనాన్సియర్. అతని తండ్రి ఓ కోటీశ్వరుడు సుబ్బారాయుడు (గమ్మడి). తల్లిశాంతమ్మ (శాంతకుమారి). రంగ ఒక డకోటా వంటి కారు కొని తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు షికారుగా ఊరిచివరకు వచ్చిన బుచ్చబ్బాయి కుమార్తెలను రంగా ఆట పట్టిస్తాడు. కూతుర్ల మాట మీద రంగాను పనిలోంచి తీసేస్తాడు బుచ్చబ్బాయి. ‘బుచ్చబ్బాయి పని కావాలోయ్‘ అని ఆందోళన మొదలు పెడతాడు రంగా. రెండో కూతురు రత్నమాల తన వల్ల గాయపడిన రంగాను పరామర్శిండానికి వచ్చి అతని ప్రేమలో పడుతుంది. తనకంటే డబ్బున్న వాడికి తప్ప కూతుర్లనిచ్చి పెళ్ళి చేయనంటాడు బుచ్చబ్బాయి. దానితో రంగా వాసు చేత డబ్బున్న తండ్రి వేషం వేయిస్తాడు. వీళ్ల నటనకి బుచ్చబ్బాయి పడిపోతాడు. తన కుమార్తెలలో ఒక కుమార్తెను రంగాకిచ్చి పెళ్లి చేయడానికి సీద్దపడతాడు. వాసుని ప్రేమించిన పెద్దకుమార్తె అందుకు ఒప్పుకోదు. రెండో కుమార్తె తన అంగీకారం తెలుపుతుంది. కాస్త బెట్టు చూపి ఒప్పుకుంటాడు రంగా. ఊరి చివరకు తీసుకువెళ్లి కూతుర్లకు తమ కథ అంతా చెబుతారు వాసు, రంగా. రంగా పేదవాడైనా పెళ్ళి చేసుకోడానికి అభ్యంతరం లేదని చెబుతుంది రత్నమాల. ఇంతలో ఆ ప్రాంతంలో తోటని కొనడానికి వచ్చిన వాసు తండ్రి బుచ్చబ్బాయిని తన బాల్యమిత్రుడిగా గుర్తుపడతాడు. తన కుమారుడికి పెద్దకూతురిని ఇచ్చి పెళ్ళిచేయమని బుచ్చబ్బాయిని అడుగుతాడు వాసు తండ్రి. బుచ్చబ్బాయి పెద్దకూతురు ఒప్పుకోదు. వాసు ఆమెను పక్కకి తీసుకువెళ్లి ఆ పెళ్ళి కుమారుడు తనేనని చెబుతాడు. వివాహం నిశ్చయమవుతంది. రెండు వివాహాలు కలిపి చేయడానికి నిర్ణయమవుతుంది. తమఊరికి వచ్చి కారు ఇబ్బంది పెట్టడంతో రోడ్డు మీద ఉన్న వాసు తల్లి దండ్రులను తన ఇంటికి తీసుకు వెళతాడు. అక్కడ గోడ మీద రంగా ఫొటో చూసి బుచ్చబ్బాయికి హెచ్చరికగా ఫోన్ చేస్తాడు వాసు తండ్రి. బుచ్చబ్బాయి పోలీస్ కంప్లైట్ ఇస్తాడు. పోలీసులు వాసు రంగాలను అరెస్ట్ చేస్తారు. రంగా లాంటి మనిషి మరొకడని బుకాయిస్తారు వాసు, రంగా. బుచ్చబ్బాయి కేసు వాపసు తీసుకుంటాడు. వివాహ ముహూర్తం సమీపించింది. కాని వాసు జాడలేదని అతని తల్లి దండ్రులు గాభరాపడతారు. మారువేషంలో ఉన్న వాసు అందర్నీ ఏమార్చి తాళి కట్టి తమ నాటకాన్ని బయట పెడతాడు. కథ సుఖాంతం..
ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్రానికి మాటలు రాశారు. మాస్టర్ వేణు సంగీతం. జగ్గయ్యకి ఘంటసాల, ఏఎన్ఆర్ కు పీబీ శ్రీనివాస్ పాడారు. వెన్నెల రేయి ఎంతో చలి చలి, అది ఒక ఇదిలే, దొరికేరూ దొరగారు - సహా సినిమాలోని పాటలన్నీ మంచి ప్రాచుర్యం పొందాయి.
ప్రముఖ దర్శకుడు శ్రీధర్ తమిళంలో నిర్మించిన ‘కాదలిక్క నేరమిల్లై‘ ఈ చిత్రానికి మాతృక. దీనిని హిందీలో "ప్యార్ కియే జా" పేరుతో పునర్నిర్మించారు.*
Tuesday, 21 July 2026
కభీ కభీ మేరే దిల్ మే - ముఖేష్ (జయంతి జూలై 22)
ముఖేష్ చంద్ మాథుర్ భారతీయ హిందీ సినిమా పరిశ్రమలో ఒక స్వర్ణ యుగాన్ని ఏలిన సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్‌లతో పాటు ముఖేష్‌ను అత్యంత ముఖ్యమైన ముగ్గురు గాయకులలో ఒకరిగా పరిగణిస్తారు.
ముఖేష్ 1923 జూలై 22న ఢిల్లీలో జన్మించారు. ఆయన స్వరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వేదన, ఆర్ద్రత శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి. ముఖ్యంగా వియోగం, తత్వచింతనతో కూడిన పాటలకు ముఖేష్ స్వరం బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది.
ప్రముఖ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ తెరపైకి వస్తే, ఆయనకు స్వరం ముఖేష్‌దే అయి ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ బాలీవుడ్‌లో ఒక చరిత్ర సృష్టించింది. రాజ్ కపూర్ స్వయంగా ముఖేష్‌ను తన స్వరం,ఆత్మ గా అభివర్ణించేవారు.
ముఖేష్ పాటల్లో ఆవారా హూ (ఆవారా), జీనా యహా - మర్నా యహా (మేరా నామ్ జోకర్), మేరా జూతా హై జపానీ (శ్రీ 420),కభీ కభీ మేరే దిల్ మే (కభీ కభీ), ఏక్ దిన్ బిక్ జాయేగా మాటీ కే మోల్ (ధరమ్ కరమ్),సుహానా సఫర్ అవర్ యే మౌసమ్ హసీన్ (మధుమతి) బహుళ ప్రజాదరణ పొందాయి.
1974లో వచ్చిన రజనీగంధ సినిమాలోని "కయీ బార్ యుహీ దేఖా హై" అనే పాటకుగానూ ఉత్తమ నేపథ్య గాయకుడిగా ముఖేష్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా 4 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు.
1976 ఆగస్టు 27న అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఒక సంగీత విభావరి కోసం వెళ్లినప్పుడు గుండెపోటుతో కన్నుమూశారు.
జనచైతన్య స్ఫూర్తి దాశరథి (జయంతి జూలై 22)
దాశరథి కృష్ణమాచార్యులు (1925 – 1987) తెలుగు సాహితీ లోకంలో అభ్యుదయ కవిగా, విప్లవగళంగా, సినీ గీత రచయితగా చెరగని ముద్ర వేసిన మహనీయుడు. తెలంగాణ విమోచన పోరాటంలో తన కలంతో, గళంతో ప్రజా చైతన్యాన్ని రగిలించిన ఉద్యమకారుడు.
1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ గ్రామంలో జన్మించారు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లలో సంస్కృతం, తెలుగు, ఉర్దూ, పారసీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.
నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభ తరఫున చురుగ్గా పాల్గొన్నారు
నిజాం ప్రభుత్వం ఆయనను నిజామాబాద్, వరంగల్ జైళ్లలో బంధించింది. జైలులో కలం, కాగితం ఇవ్వకపోతే, బొగ్గు ముక్కలతో జైలు గోడలపై పద్యాలు రాసి తన నిరసన తెలిపారు.
“నా తెలంగాణ, కోటి రతనాల వీణ"
"ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని"
దాశరథి కవిత్వం సమాజంలో చైతన్యాన్ని, ఆవేశాన్ని నింపేలా ఉండేది. పద్యం, గేయం, వచనం.. ఏ రూపమైనా ఆయన శైలి ప్రత్యేకమైనది.
ఆయన రచనల్లో ‘అగ్నిధార‘ నిజాం పాలనపై ఎక్కుపెట్టిన మొదటి కావ్య అస్త్రం. ‘రుద్రవీణ‘ తెలంగాణ ప్రజల తిరుగుబాటును ప్రతిబింబించే కావ్యం. ‘మహాంధ్రోదయం‘ విశాలాంధ్ర అవశ్యకతను చాటిచెప్పిన రచన. ‘తిమిరంతో సమరం‘ సమాజంలోని చీకట్లతో చేసిన పోరాటానికి అద్దం పట్టే కావ్యం. ‘పునర్నవం‘ కవితా పుష్పకం, అమృతాభిషేకం.‘యాత్రాస్మృతి’ ఆయన జీవిత విశేషాల సమాహారం.
1961లో ‘వాగ్దానం’ చిత్రంలో పాటతో సినీ ప్రస్థానం ప్రారంభించారు. దాదాపు 2,000 పైగా పాటలు రాసి, మధురమైన సాహిత్యంతో శ్రోతలను అలరించారు.
ఆయన రాసిన ‘తిమిరంతో సమరం’ కావ్యానికి 1974 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
1977 నుంచి 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా సేవలు అందించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు.
దాశరథి కృష్ణమాచార్యులు 1987 నవంబరు 5న కన్నుమూశారు. ఆయన రాసిన పద్యాలు, గేయాలు తెలుగు భాష ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి.*
విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా: పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ: నీట్ అక్రమాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు మంగళవారం ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేసిన లాఠీ ఛార్జ్‌పై ప్రధాని మోదీ మౌనం వీడాలని, ఆయన మౌనం వీడేంత వరకు ధర్నా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. తర్వాత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీనితో లోక్ కల్యాణ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 3 గంటలకు పైగా ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఆ తర్వాత పోలీసులు కాంగ్రెస్ అగ్రనేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
హైదరాబాద్ లోనూ
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కోసం ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనకు మద్దతుగా హైదరాబాద్ లో కూడా విద్యార్థి సంఘాలు ఆందో ళనకు దిగాయి. సోమాజిగూడలోని లోక్ భవన్ ముట్టడికి విద్యార్థులు బయల్దేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి, పలువురిని అరెస్ట్ చేశారు.
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
గూఢచారి 116 (1966)
విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన గూఢచారి 116 చిత్రం తెలుగులోనే తొలి గూఢచారి సినిమాగా ప్రజాదరణ పొందింది. 11:08:1966 న ఈ సినిమా విడుదల అయింది.కృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలలో 'గూఢచారి 116' ఒకటి. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజునే కృష్ణకు 20 సినిమాలలో ఆఫర్లు రావడం విశేషం.
దేశంలో విధ్వంసం సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజంట్ 303 (శోభన్‌బాబు)ని గూఢచార సంస్థ నియమిస్తుంది. విదేశీ విద్రోహులకు సహాయపడే మన దేశ ముఠాకు దామోదర్ (ముక్కామల) నాయకుడు, అతని ముఠాలో ఎంతోమంది రౌడీలు పనిచేస్తూ వుంటారు. విద్రోహశక్తులు దామోదర్ ముఠా సాయంతో దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే వారి మూలాలను పసిగట్టి వాళ్లు వాడిన కారు నెంబరు వంటి కొన్ని ఆధారాలను ఏజంట్ 303 సంపాదిస్తాడు. వాటిని గూఢచార సంస్థకు చేరవేసేలోపు శత్రువ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. సీఐడీ ఉన్నతాధికారి (ఎ.వి. సుబ్బారావు) ఈ చిక్కును విడదీసే బాధ్యతను గోపి (కృష్ణ) అనే ఏజెంట్ 116కు అప్పగిస్తాడు. ఆ విద్రోహ ముఠాకు ఒక విదేశీయుడు (రాజనాల) బాస్. అతడు తన ఏజెంట్ దామోదరం (ముక్కామల)ను ‘ఆర్‌డి’ అనే కోడ్ భాషలో సంప్రదిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ఉంటాడు. దామోదరం కూతురు రాధ (జయలలిత). ఏజెంట్ 303 సేకరించిన ఆధారాలను సంపాదించే ప్రయత్నంలో దామోదరం ఆ ఏజెంట్ చెల్లెలు సుగుణ (గీతాంజలి)ని కలిసి, తనను సీఐడీ అధికారిగా పరిచయం చేసుకొని, ఆమెను పావుగా వాడుకొనే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా గోపి ఆమె వద్దకు వచ్చి తనను గూఢచారి 116 అని పరిచయం చేసుకుంటాడు. కానీ సుగుణ గోపినీ నమ్మదు. ఆ ఇంట్లో ఉన్న ఏజెంట్ 303 ఫోటో మీద ఉన్న అడ్రస్ ఆధారంగా గోపి నెగిటివ్‌లు సంపాదించి, వాటి ఆధారంగా విద్రోహ ముఠా ఆనుపానులు తెలుసుకుని వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో, రాధ ప్రేమలో పడతాడు. రాధకు ఆమె తండ్రే విధ్వంసాలు సృష్టిస్తున్న విషయాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా దామోదరంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దామోదరం విదేశీ ముఠా నాయకుడిని కలిసి ఇకపై నేరప్రవృత్తికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెబుతాడు. అందుకు ఆగ్రహించిన ముఠా నాయుకుడు రాధను బంధిస్తాడు. ఇక గోపి చాకచక్యంతో విద్రోహ ముఠాను మట్టికరిపించి, ముఠా నాయకుడు విమానంలో పారిపోతుంటే తన జీపుతో డీకొట్టి ఆ విమానాన్ని పేల్చివేస్తాడు. గోపి, రాధ, ఒకటౌతారు.
ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆరుద్ర మాటలు రాశారు. టీ చలపతిరావు సంగీతం సమకూర్చిన చిత్రంలోని పాటలన్నీ హిట్. ఈసినిమాలో "నువ్వు నా ముందుంటే" పాటను కలర్ లో చిత్రించారు. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాను 1967లో ‘ఫర్జ్‘ గా హిందీలో పునర్నిర్మించారు.
షిర్డీ సాయి గురువు - వెంకూసా
షిర్డీ సాయిబాబా గురువు గురించి తెలుసుకోవడం అంటే అది ఒక రహస్యమైన, అంతకంటే ఆధ్యాత్మికమైన లీలతో కూడుకున్న విషయం. ఎందుకంటే బాబా తన పూర్వాశ్రమం (చిన్నప్పటి జీవితం) గురించి గానీ, తన గురువు గురించి గానీ ఎప్పుడూ స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పలేదు.
కానీ, సాయి సచ్చరిత్ర, బాబా నోటి నుంచి వచ్చిన కొన్ని సంకేతాల ద్వారా, బాబా చరిత్రను పరిశోధించిన పెద్దల ప్రకారం, బాబా గురువు పేరు వెంకూసా. ఆయన మహారాష్ట్రలోని సెల్వడి అనే ప్రాంతానికి చెందిన గొప్ప జ్ఞాని, పరమ భక్తుడు.
చిన్నతనంలోనే బాబా వెంకూసా చెంతకు చేరారు. వెంకూసాకు బాబా అంటే ప్రాణం. తన వద్ద ఉన్న ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ, జ్ఞానాన్ని బాబాకు ధారపోశారు. బాబా తన గురువుతో కలిసి దాదాపు 12 సంవత్సరాల పాటు ఉన్నట్లు చెప్తారు. ఆ తర్వాతే బాబా షిర్డీకి చేరుకున్నారు.
సాయి సచ్చరిత్రలో బాబా తన గురువు గురించి ఎంతో మధురంగా, భక్తితో చెప్పుకున్న సందర్భం ఒకటి ఉంది. బాబా తన గురువును "గురుమహారాజ్" అని పిలిచేవారు.
బాబా మాటల్లోనే: నా గురువు నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన నా నుంచి దేనినీ ఆశించలేదు - కేవలం రెండు పైసలు తప్ప. ఆ రెండు పైసలు ఏమిటంటే ఒకటి 'శ్రద్ధ' (నమ్మకం), రెండవది 'సబూరి' (ఓర్పు). నేను నా గురువును పూర్తిగా నమ్మి, ఆయన సేవలోనే గడిపాను."
ఒకరోజు కొందరు దుర్మార్గులు బాబాపై అసూయతో ఒక పెద్ద ఇటుకను విసిరారు. అది గమనించిన బాబా గురువు వెంకూసా, ఆ ఇటుక బాబాకు తగలకుండా అడ్డంగా నిలబడ్డారు. ఆ ఇటుక వెంకూసా తలకు తగిలి రక్తం వచ్చింది. తన శిష్యుడి కోసం గురువు దెబ్బ తిన్నారు. ఆ తర్వాత ఆ గురువు తన వస్త్రంతో రక్తాన్ని తుడిచి, ఆ ఇటుకను బాబాకు ఇస్తూ... "దీనిని ప్రాణప్రదంగా దాచుకో" అని ఆశీర్వదించారు. బాబా ద్వారకామాయిలో నిత్యం తన వద్ద ఉంచుకునే ఆ ప్రసిద్ధ ఇటుక ఆయన గురువు ఇచ్చినదే! ఆ ఇటుక విరిగిన తరువాతే ఆయన సమాధి చెందారు.
బాబా మొదటిసారి షిర్డీకి వచ్చినప్పుడు (సుమారు 16 ఏళ్ల వయసులో) ఆయన ఒక వేప చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉండేవారు. ఆ వేప చెట్టు ఆకులు విచిత్రంగా తీపిగా ఉండేవి. ఒకరోజు కొందరు గ్రామస్థులు బాబాను "నువ్వు ఎవరు? ఇక్కడే ఎందుకు కూర్చున్నావు?" అని అడిగారు. అప్పుడు బాబా ఆ వేప చెట్టు కింద ఉన్న నేలను తవ్వమని చెప్పారు. అక్కడ భూమి లోపల ఒక చిన్న గది, నాలుగు దీపాలు వెలుగుతూ కనిపించాయి. అప్పుడు బాబా... "ఇది నా గురువు తపస్సు చేసిన స్థలం. నా గురువు సమాధి ఇక్కడే ఉంది. ఇక్కడే నన్ను భద్రంగా చూసుకున్నారు" అని చెప్పారు.
నేడు షిర్డీలో ఉన్న ఆ స్థలాన్నే "గురుస్థాన్" అని పిలుస్తారు. భక్తులు ఇప్పటికీ అక్కడ ఉన్న వేప చెట్టుకు, బాబా పాదుకలకు పూజలు చేస్తారు. జగద్గురువైన సాయిబాబానే... ప్రతి గురువారం తన గురువును తలుచుకుంటూ ఉండేవారు. "గురువే సర్వస్వం. గురుని మించిన దైవం లేదు" అని హేమాడ్‌పంత్, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి భక్తులకు నిరంతరం బోధించేవారు. బాబా అంతటివాడే తన గురువు ఇచ్చిన ఇటుకను, గురుస్థానాన్ని అంతగా గౌరవించారంటే... సాయి మార్గంలో 'గురు సేవ' ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది.*
Monday, 20 July 2026
నాటకరంగ వికాసకర్త పీఎస్ఆర్ అప్పారావు ( జయంతి జూలై 21)
తెలుగు నాటకరంగ వికాసానికి, సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన పీఎస్ఆర్ అప్పారావు (పోణంగి శ్రీరామ అప్పారావు) 1923 జూలై 21న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందారు. ఆ తర్వాత 1961లో "తెలుగు నాటక వికాసం" అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్.డి సాధించారు.
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్‌గా, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కూడా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్‌గా, తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఆయన నాటక, నృత్య, సాహిత్య రంగాలపై 42కు పైగా ప్రామాణిక గ్రంథాలను రచించారు. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందినవి: 1. తెలుగు నాటక వికాసము (1967): 2.నాట్యశాస్త్రము (తెలుగు అనువాదం): 3. అభినయ దర్పణం: 4. ధర్మవరం రామకృష్ణమాచార్యులు జీవిత చరిత్ర 5. కూచిపూడి నృత్యం.
తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ అనేక అత్యున్నత పురస్కారాలు లభించాయి: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1961): ఆయన రాసిన ప్రసిద్ధ 'నాట్యశాస్త్రము' తెలుగు అనువాద గ్రంథానికి గానూ 1961 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1979 లో ఉత్తమ అధ్యాపక అవార్డు, 1994 లో రాజలక్ష్మి సాహిత్య పురస్కారం, 1996 లో అమెరికాలోని హ్యూస్టన్ సంస్థ నుంచి శ్రీకళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు.
తెలుగు నాటకరంగానికి ఒక స్పష్టమైన చరిత్రను, భరతుని నాట్యశాస్త్రానికి సరళమైన తెలుగు రూపాన్ని అందించి, తెలుగు అకాడమీ ద్వారా ఎన్నో పాఠ్యపుస్తకాల రూపకల్పనకు నేతృత్వం వహించిన శ్రీరామ అప్పారావు 2005లో కన్నుమూశారు.*
నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు
అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...
-
ముంబై:ప్రముఖ నటుడు ప్రదీప్‌సింగ్ రావత్ (74) ముంబయిలోని నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆయన నటించారు. సై, ఛ...
-
హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో కొన్ని పొరపాట్లు జరిగాయని, ఈసారి తాను బాధ్యత తీసుకుంటానని పార్టీ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువత...
-
షిర్డీ సాయిబాబా తొలితరం భక్తులలో నానాసాహెబ్ డెంగ్లే ఒకరు. ఆయన షిర్డీకి సమీపంలోని నీంగావ్ గ్రామానికి చెందిన సంపన్న జమీందారు. బాబా దైవత్వాన్న...