Monday, 10 August 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969)


జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వీ మధుసూదనరావు  చిత్రానువాదం చేసి దర్శకత్వం వహించారు. ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. 


జైలు నుంచి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన జాకీ  (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ  (జయలలిత) తారసపడుతుంది. జయ ఇంటి నుంచి  పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ  ఆమె మేనమామ రాజు (ప్రభాకర రెడ్డి)ని  చూసి, అతడు దుర్మార్గుడని అంతకు ముందే తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని జయను తనతో ఇంటికి తీసుకువస్తాడు. తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టుకోకలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుంచి అతడిని ఒక దొంగ తప్పించి ముఠాలో చేరుస్తాడు ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గర నుంచి నుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక జైలు కెళ్ళి దారి మార్చుకుంటాడు. కాని జైల్ సూపరింటెండెంట్ (గుమ్మడి) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ అతడిని నమ్మి ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. మరోవైపు దొంగల ముఠా రఘును పాతదారిలోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెరువు కోల్పోయిన రఘుకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండెంట్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.



అదృష్టవంతులు (1969)

జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వీ మధుసూదనరావు  చిత్రానువాదం చేసి దర్శకత్వం వహించారు. ఆచార్య ఆత్రేయ మాటలు రాశారు. 

జైలు నుంచి విడుదలైన రఘు (నాగేశ్వరరావు) బ్రతుకు తెరువు కోసం ప్రయత్నించి లారీ డ్రైవర్ గా మారతాడు. అతనికి ఉద్యోగం దొరకడానికి సహకరించిన జాకీ  (పద్మనాభం) క్లీనర్ గా జత అవుతాడు. ఊటీకి లోడ్ తో వెళ్తున్న వారికి మగవేషం వేసుకని తిరుగుతున్న జయ  (జయలలిత) తారసపడుతుంది. జయ ఇంటి నుంచి  పారిపోయి వచ్చినదని తెలుసుకున్న రఘు ఆమెను ఇంటి దగ్గర దించే ప్రయత్నం చేస్తాడు. అక్కడ  ఆమె మేనమామ రాజు (ప్రభాకర రెడ్డి)ని  చూసి, అతడు దుర్మార్గుడని అంతకు ముందే తెలిసిన రఘు తన ప్రయత్నాని విరమించుకొని జయను తనతో ఇంటికి తీసుకువస్తాడు. తన గతాన్ని చెబుతాడు. బాల్యంలో తల్లి మందులు కోసం దొంగగా మారతాడు రఘు. పోలీసులు కొడుకుని అరెస్ట్ చేయడానికి వస్తే, చూసి తట్టుకోకలేని తల్లి మరణిస్తుంది. పోలీసుల నుంచి అతడిని ఒక దొంగ తప్పించి ముఠాలో చేరుస్తాడు ఆ దౌంగల ముఠా నాయకుని (జగ్గయ్య) కి రఘు అంటే గురి. ఒక సారి తల్లి దగ్గర నుంచి నుండి కొడుకును వేరు చేయవలసి వస్తుంది. అది చేయలేక జైలు కెళ్ళి దారి మార్చుకుంటాడు. కాని జైల్ సూపరింటెండెంట్ (గుమ్మడి) అతని పరివర్తనను నమ్మడు. రఘు కథ విని జయ అతడిని నమ్మి ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. వాళ్లకి కూతురు పుడుతుంది. మరోవైపు దొంగల ముఠా రఘును పాతదారిలోకి తీసుకురాడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో రఘు లారీని తగల బెడతారు బ్రతుకు తెరువు కోల్పోయిన రఘుకు అన్ని మార్గాలు మూసుకుపోతాయి. కుటుంబాన్ని పోషించడానికి జయ క్లబ్ లో డాన్స్ చేస్తుండగా రఘును తీసుకు వెళ్లి చూపుతాడు దొంగల నాయకుడు. రఘు తన పరిస్ధిత వివరించి జైల్ సూపరింటెండెంట్ ని కలిసి తన నిజాయితిని తెలిపి, పోలీస్ ఇన్ఫార్మర్ గా దొంగల ముఠాలో చేరి వారిని పోలీసులకు అప్పగిస్తాడు.

కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్నీ బాగుంటాయి. ముఖ్యంగా అయ్యయ్యో బ్రహ్మయ్య (సినారె), చింత చెట్టు చిగురు చూడు(ఆరుద్ర), కోడి కూసే జాము దాకా (ఆత్రేయ), ముద్దంటే చేదా ఆరుద్ర), నమ్మరే నేను మారానంటే నమ్మరే(ఆత్రేయ) , మొక్కజొన్న తోటలో ( కొనకళ్ళ వెంకటరత్నం) - పాటలు ఇప్పటికీ వింటుంటాం. చిత్రం లో అన్ని పాటలూ పద్మనాభం డ్యూయెట్ ( నామనసే గోదారి) సహా ఘంటసాల, సుశీల పాడారు. 

ఈ సినిమాను తమిళంలో తిరుడన్,  హిందీలో హిమ్మత్,  శ్రీలంకలో సింహళ భాషలో ఎదత్ సూర్య అదత్ సూర్య అనే పేర్లతో నిర్మించారు.*


Sunday, 9 August 2026

స్వరాజ్య స్వప్నం: భారత స్వాతంత్ర్య సంగ్రామ సంక్షిప్త గాథ



ఆగస్టు నెల రాగానే ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక తెలియని దేశభక్తి తరంగం ఉప్పొంగుతుంది. బ్రిటీష్ దాస్య శృంఖలాలను తెంచుకుని, ఒక స్వతంత్ర దేశంగా భారతావని మేల్కొన్న అద్భుత క్షణాల వెనుక తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, లక్షలాది మంది త్యాగాలు ఉన్నాయి. 1857 నాటి తొలి తిరుగుబాటు మంటల నుంచి 1947 నాటి స్వాతంత్ర్య సంబరాల వరకు సాగిన ఈ మహా గాథ సంక్షిప్త రూపం.

ప్రథమ స్వతంత్ర సంగ్రామం (1857) – నిప్పు రవ్వ

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీకి, అణచివేతకు వ్యతిరేకంగా భారతీయుల గుండెల్లో రగులుతున్న అసంతృప్తి ఒకేసారి బద్ధలైంది. తూటాలకు ఆవు, పంది కొవ్వు పూశారనే వార్త సిపాయిల్లో మంటలు రేపింది. బారక్‌పూర్‌లో మంగళ్ పాండే ఎక్కుపెట్టిన తుపాకీ తూటా ఓ మహా సంగ్రామానికి నాంది పలికింది. "నా ఝాన్సీని నేను ఇవ్వను" అంటూ రణరంగంలో దూకిన వీరనారి లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్, బహదూర్ షా జఫర్ వంటి నాయకులు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించారు. ఈ తిరుగుబాటు తాత్కాలికంగా విఫలమైనప్పటికీ, భారతీయులలో "మేము ఒక దేశం, మాకు స్వేచ్ఛ కావాలి" అనే జాతీయ భావన విత్తనాన్ని నాటింది. దీనితో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమై, భారత్ నేరుగా బ్రిటిష్ రాణి పాలనలోకి వెళ్లింది.

చైతన్య కిరణాలు (1885 - 1915) – సంస్థాగత పోరాటం

తుపాకులతోనే కాదు, కలాలతో, మేధస్సుతో కూడా పోరాడాలని భారతీయులు గ్రహించారు.ఏ.ఓ. హ్యూమ్ చొరవతో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది.  , దేశంలోని మేధావులంతా ఒక వేదికపైకి వచ్చారు. ప్రారంభంలో ఇది వినతులు, విజ్ఞప్తులకే (మితవాదులు) పరిమితమైంది. 1905 లో లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన దేశాన్ని రగిలించింది. లాల్-బాల్-పాల్ (లాలా లజపతిరాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్) నాయకత్వంలో విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉద్యమం ఊపందుకున్నాయి. "స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను" అనే తిలక్ నినాదం దేశవ్యాప్తంగా మారుమోగింది.

గాంధీ యుగం (1915 - 1930) – సత్యం, అహింస

1915లో దక్షిణాఫ్రికా నుంచి  మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ భారత్‌కు తిరిగి రావడంతో స్వాతంత్ర్య పోరాట శైలి పూర్తిగా మారిపోయింది. ఇది కొద్దిమంది మేధావుల పోరాటం నుంచి సామాన్య ప్రజల పోరాటంగారూపాంతరం చెందింది. 1919 లో జలియన్ వాలా బాగ్ లో జనరల్ డయ్యర్ జరిపిన క్రూరమైన నరమేధం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1920-22 లో సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వానికి ఏ రకంగానూ సహకరించకూడదని ఇచ్చిన పిలుపుతో దేశం మొత్తం ఏకమైంది. అయితే చౌరీచౌరా హింస వల్ల గాంధీజీ దీనిని నిలిపివేశారు. ప్రకృతి ఇచ్చిన ఉప్పుపై బ్రిటీష్ వారు పన్ను వేయడాన్ని నిరసిస్తూ 1930 లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేపట్టి కాలినడకన దండి చేరి, ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు.

విప్లవ వీరుల రక్తాభిషేకం – సమాంతర పోరాటం

ఒకవైపు గాంధీజీ అహింసా మార్గంలో వెళ్తుంటే, మరోవైపు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ విప్లవ వీరులు బ్రిటీష్ గుండెల్లో నిద్రపోయారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అసెంబ్లీలో బాంబులు వేసి, ఇన్క్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) అంటూ నవ్వుతూ ఉరితాడును ముద్దాడారు. ఆంధ్రా ఏజెన్సీ ప్రాంతంలో మన్యం విప్లవం ద్వారా అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ వారిని గడగడలాడించాడు. చంద్రశేఖర్ ఆజాద్ చివరి శ్వాస వరకు బ్రిటీష్ వారికి దొరకనని శపథం చేసి, అలహాబాద్ పార్కులో తనను తాను కాల్చుకుని అమరుడయ్యాడు. 

(1942 - 1947) – 'డూ ఆర్ డై'

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో స్వాతంత్ర్య పోరాటం తుది ఘట్టానికి చేరింది. బ్రిటీష్ వారు భారత్‌ను వదిలి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. 1942 లో గాంధీజీ ఇచ్చిన ‘ డూ ఆర్ డై‘ పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నాయకులందరినీ అరెస్ట్ చేసినా, ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని నడిపారు. మరో వైపు నేతాజీ సుభాష్ చంద్ర బోస్   "నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను" అంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నిర్మించి, బ్రిటీష్ సైన్యంపై సాయుధ పోరాటానికి దిగారు. ఇది బ్రిటీష్ వారి సైనిక పునాదులను కదిలించింది.

ఆగస్టు 15, 1947 – స్వేచ్ఛా భారతం

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బలహీనపడిన బ్రిటీష్ ప్రభుత్వం, భారతీయుల నిరంతర పోరాటానికి తలవొగ్గక తప్పలేదు. అయితే, దురదృష్టవశాత్తూ దేశ విభజన (భారత్, పాకిస్తాన్) అనే అవాంఛనీయ పరిణామంతో  స్వాతంత్ర్యం సిద్ధించింది. 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి... ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం నవజీవనంలోకి, స్వేచ్ఛలోకి అడుగుపెట్టింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ తన ప్రసిద్ధ ప్రసంగం - ట్రిస్ట్ విత్ డెస్టినీ - చేశారు.

ఇప్పుడు మనం పీల్చే ప్రతి స్వేచ్ఛా వాయువు వెనుక, మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఉన్నాయి. వారిని స్మరించుకుంటూ, దేశ ప్రగతికి పునరంకితం కావడమే ఈ ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవ వేళ మనం వారికిచ్చే నిజమైన నివాళి. జైహింద్!

  


నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు


 విచిత్ర కుటుంబం (1969)

1969 మే 28 ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు విడుదలైన విచిత్ర కుటుంబం సినిమా విశేష ప్రజాదరణ పొందింది. శ్రీ రాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై వీకేపీ సుంకవల్లి నిర్మించిన ఈ చిత్రానికి కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించారు. కృష్ణ, శోభన్ బాబు  కూడా నటించడంతో ఈ చిత్రం అప్పట్లో పెద్ద మల్టీ స్టారర్ గా నిలిచింది.

రాజశేఖరం ( ఎన్టీఆర్) లాయర్. భార్య కమల ( సావిత్రి) అమాయకురాలు. రాజశేఖరం  తమ్ముడు కృష్ణ ( కృష్ణ), చెల్లెలు సంధ్యారాణి.  కృష్ణ ఊళ్ళో అన్యాయాల్లో జోక్యం చేసుకుంటూ గొడవపడుతూ ఉంటాడు. ఈ తగాదాలనుంచి కమల మరిదిని కాపాడుతూ ఉంటుంది. అదే ఊళ్ళో నాగరాజు ( నాగభూషణం భూస్వామి.  అక్రమాలకు పెట్టింది పేరు. అతని భార్య సుశీలకు ఇవన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటుంది. నాగరాజు, రాజశేఖరం కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నా రాజశేఖరం నాగరాజు ఆగడాలను అడ్డుకుంటూ ఉండటంతో నాగరాజు అతనిమీద కక్ష పెంచుకుంటూ ఉంటాడు. నాగరాజు తల్లిదండ్రులు అతని ప్రవర్తన నచ్చక ఆస్తినంతా తమ చిన్న కొడుకు రాఘవ ( శోభన్ బాబు) పేరు మీద రాస్తారు. దాంతో నాగరాజు తన తమ్ముడిని సరిగ్గా పట్టించుకోడు. రాజశేఖరం దంపతులు రాఘవను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుని పై చదువుల కోసం రష్యాకి పంపిస్తారు. కమల చెల్లెలు రాధ ( విజయనిర్మల) అల్లరి పిల్ల. అక్క గారింటికి వచ్చి కృష్ణతో ప్రేమలో పడుతుంది. దీనికి తోడు, నాగరాజు నుంచి తమకు రావలసిన. లక్ష రూపాయలను రాబట్టుకోవాలని వచ్చిన కమల అక్కడ, నాగరాజు అనుచరుడైన సింగన్న ( ప్రభాకరరెడ్డి) చేసిన హత్యను ప్రత్యక్షంగా చూస్తుంది. కానీ, భయంతో భర్తకు  చెప్పదు. రాఘవ జూలీ ( షీలా) అనే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తిరిగి రాగా, నాగరాజు వారికి సాదరంగా స్వాగతం పలుకుతాడు. త్వరలోనే ఆ జంట హనీమూన్‌కు వెళ్లగా, సింగన్న ద్వారా వారిని చంపడానికి కుట్ర పన్నుతాడు. రాజశేఖరంపై కత్తితో దాడి చేసిన నాగరాజును కృష్ణ ఆవేశంతో కొట్టబోగా కమల అతన్ని అడ్డుకుంటుంది. నాగరాజు నెలలోగా అతన్ని మట్టికరిపిస్తానని బెదిరిస్తాడు. కృష్ణ తనపై పై హత్యాయత్నం చేశాడని తప్పుడు ఆరోపణ కూడా చేస్తాడు. కృష్ణ జైల్లో ఉంటే నాగరాజు ఏమీ చేయలేడనీ కోర్టులో కమల కృష్ణ దోషి అని వాదిస్తుంది, కోర్టు అతనికి మూడు నెలల శిక్ష విధిస్తుంది, రాజశేఖరం ఆమెను గట్టిగా తిట్టడంతో ఆమె నాగరాజు రాక్షస రూపాన్ని, కృష్ణను నెలలోగా చంపుతానని చేసిన బెదిరింపు గురించి చెబుతుంది. మరిదిపై ఆమె ప్రేమను రాజశేఖరం అర్థం చేసుకుంటాడు. . అటు రాఘవ,  జూలీ మరణించినట్టు చేసిన నాగరాజు ప్రచారం అబద్ధమని సింగన్న  బయటపెట్టడంతో  నాగరాజు అతన్ని దాచిపెడతాడు. తాను చూసిన హత్యను చేసింది సింగన్నే అని కమల గుర్తించడంతో కృష్ణ నిర్దోషిగా విడుదల అవుతాడు. రాఘవ,  జూలీ బతికే ఉన్నారని రాజశేఖరం తెలుసుకుంటాడు. మారువేషంలో నాటకం ఆడి వారిని కాపాడతాడు. చివరకు రాజశేఖరం కుటుంబం మొత్తం కలిసి నాగరాజును జైలుకి పంపుతుంది. 

భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాసిన చిత్రానికి పాటలన్నీ డాక్టర్ సీ నారాయణ రెడ్డి రాశారు. టీబీ రాజు సంగీతం సమకూర్చారు. ఆడవే జలకమ్ములాడవే పాట సూపర్ హిట్.*

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

దేవత (1965)



హాస్య నటుడు పద్మనాభం తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పై సమర్పించిన దేవత చిత్రం 1965 జూలై 24 న విడుదల అయింది. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె. హేమాంబరదరరావు దర్శకుడు.  నిర్మాత బి.పురుషోత్తం. 


ప్రసాద్ (ఎన్టీఆర్) కాలేజీ లెక్చరర్. అతని భార్య సీత (సావిత్రి) , కొడుకు మధు (మాస్టర్ మురళి) . సీత తన అత్త పార్వతమ్మ (నిర్మల)ను, మామ లోకాభిరామయ్య (నాగయ్య) ను కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటుంది. ఒకసారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్య (పెరుమాళ్లు)ను చూడటానికి వెళుతుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే ఆస్పత్రిలో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయిందని చెబుతారు. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళతాడు. ఆమె తన పేరు లలిత (సావిత్రి) అని, సీత కాదని అంటుంది. ప్రసాద్ ఆమెను సైకియాట్రిస్టుకు చూపిస్తాడు. సైకియాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదని, సీత మరణించి ఉంటుందని చెబుతుంది.  ముసలివాళ్లైన తల్లిదండ్రుల కోసం, అనారోగ్యంతో బాధ పడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది. ప్రసాద్ లలితను, ఆమె ప్రియుడు రమేష్‌ (వల్లం నరసింహారావు)ను కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ లలిత శీలాన్ని అనుమానిస్తాడు. శేషయ్య తాను చనిపోయే ముందు తన ఆస్తిని అంతా తన కుమార్తె సీత పేరుమీద వ్రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి (రాజనాల) కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టుపెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్‌నే పెళ్లి చేసుకుంటుంది.


సినిమా పిచ్చి ఉన్న పాత్రలో పద్మనాభం , అతని ప్రియురాలిగా గీతాంజలి హాస్యాన్ని అందించారు. ఎస్. పి . కోదండపాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, తొలి వలపే పదే పదే, బొమ్మను చేసి, ప్రాణం పోసి- పాటలు ప్రజాదరణ పొందాయి. * 

Thursday, 6 August 2026

 ఆత్మీయులు (1969)


యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా 1969లో వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన ‘ఆత్మీయులు‘ సినిమా కుటుంబ కథాచిత్రంగా ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో అక్కినేని హీరోయిన్ గా వాణిశ్రీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక స్థాయికి ఎదిగింది. సారథి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించిన దుక్కిపాటి మధుసూదనరావు చిత్రానువాదం కూడా చేశారు. 

ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ద్వితీయ ఉత్తమ చిత్రంగా 1969 వ సంవత్సరానికి రజిత నంది అందుకొంది. 

జగన్నాధం (గుమ్మడి) దగ్గర పాలేరుగా పనిచేస్తున్న వీరన్న(ధూళిపాళ) కు ఒక కొడుకు సూర్యం (నాగేశ్వరరావు), ఒక కూతురు సీత (చంద్రకళ). జగన్నాధం ప్రాణాల్ని రక్షించే ప్రయత్నంలో వీరన్న చనిపోతాడు. వీరన్న భార్య మరో ఆడ బిడ్డని ప్రసవించి కన్ను మూస్తే వీరయ్య చెల్లెలు మహంకాళి (సూర్యకాంతం) ఆ బిడ్డను భానూ ప్రకాష్, రాధాకుమారి దంపతులకు అమ్మేస్తుంది. జగన్నాధం పల్లె విడిచి పట్నం వెళ్ళిపోతాడు. పిల్లల ఆలనాపాలన కోసం డబ్బు పంపించినా మేనత్త మహంకాళి (సూర్యకాంతం) వాళ్ళకి చేరకుండా వాళ్ళని కష్టాలు పెడుతుంది. ఆమె కొడుకు పద్మనాభం ను స్కూల్ కి పంపి వీళ్ళిద్దరినీ ఇంట్లో పనులు చేయిస్తుంది. సూర్యం చెల్లితో పట్నం వెళ్లిపోయి ఒక హోటల్ యజమాని అభిమానం  సంపాదించి  కష్టపడి చదివి యూనివర్సిటీలోనే ఫస్ట్ గా వస్తాడు. సీత ఇంటి పనులను చక్కగా తీర్చుదిద్దుతుంది. నిజాన్ని తెలిసిన జగన్నాధం ఇద్దర్నీ తన ఇంటికి తీసుకొని వస్తాడు. జగన్నాధానికి ఒక కొడుకు చంద్రం (చంద్రమోహన్). అన్న లాయర్ రాజారావు ( నాగభూషణం) కూతురు జయ (వాణిశ్రీ) కూడా జగన్నాథం వద్దే ఉంటుంది. సూర్యానికి దగ్గరవుతుంది. మహంకాళి అమ్మేసిన ఆడపిల్ల సరోజ  (విజయనిర్మల) ను మహంకాళి కొడుకు చిట్టిబాబు (పద్మనాభం) ప్రేమిస్తాడు. కానీ విలాసాల వ్యామోహం ఉన్న సరోజ అతడిని కాదని చంద్రం వైపు మొగ్గు చూపిస్తుంది. కానీ సీత అణకువకు ముచ్చటపడిన జగన్నాధం తన కొడుకు చంద్రానికి బలవంతంగా సీతతో వివాహం జరిపిస్తాడు. సూర్యం పోలీసు ఆఫీసరు అవుతాడు. చంద్రం సీతను వదిలేసి సరోజను పెళ్ళాడాలని చూస్తాడు. సరోజ కూడా తన చెల్లెలు అని తెలిసిన సూర్యం చివరకు పరిస్థితులన్నీ చక్కదిద్ది తాను జయను పెళ్లాడతాడు. సరోజకు చిట్టిబాబుతో పెళ్ళి జరిపిస్తాడు. సీత, చంద్రంల కాపురం నిలబెడతాడు. మహంకాళి జైలుకి వెడుతుంది. ప్రభాకర రెడ్డి విలనిజం తగు పాళ్లలో ఉంటుంది. 

చిత్రానికి ఎస్. రాజేశ్వరరావు సంగీతం పెద్ద ప్లస్. మొత్తం 9 పాటలూ హిట్. సుశీలతో ఘంటసాల డ్యూయెట్స్ - చామంతీ ఏమిటే, కళ్ళలో పెళ్లి పందిరి, అమ్మబాబు నమ్మరాదు, అన్నయ్య కలలే పండెను, ఈ రోజుల్లో పడుచువారు- ఒక ఎత్తయితే, బాలు,సుశీల డ్యూయెట్ - చిలిపి నవ్వుల నిను చూడగానే- మరో మధుర గీతం. ఇక సుశీల వీణ పాట మదిలో వీణలు మ్రోగే- ఇప్పటికీ జన హృదయాలను మీటుతూనే ఉంటుంది. మాటలు రాసిన పినిశెట్టి శ్రీరామ్మూర్తి కూడా అవసరమైన చోట్ల భావోద్వేగాలను పండించారు.* 



Tuesday, 4 August 2026

సంక్షిప్త మహాభారతం - జీడిగుంట నాగేశ్వర రావు

 


మహాభారత కావ్యం మొదటిసారిగా మనకు వినిపించింది నైమిశారణ్యంలో. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన చాలా కాలం తర్వాత, శౌనకుడు అనే మహర్షి నేతృత్వంలో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుండగా, సూత మహర్షి అక్కడకు వస్తారు. అక్కడి మునుల కోరిక మేరకు ఆయన ఈ భారత కథను చెప్పడం ప్రారంభించారు.

అయితే, దీనికంటే ముందు వైశంపాయన మహర్షి, అర్జునుడి మునిమనుమడు అయిన జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో ఈ కథను మొదటిసారి వినిపించారు.

కథా గమనంలో చూస్తే, మహాభారతం చంద్రవంశం నుంచి మొదలవుతుంది. ముఖ్యంగా శంతన మహారాజు కాలం నుంచి  అసలైన కథ ఊపందుకుంటుంది.

హస్తినాపురాన్ని పాలించే శంతన మహారాజు ఒకరోజు గంగానది తీరంలో ఒక అందమైన స్త్రీని చూసి మోహించి, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆమె గంగాదేవి. ఆమె ఒక షరతు విధిస్తుంది. "నేను ఏమి చేసినా మీరు నన్ను ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను.

అందుకు శంతనుడు అంగీకరిస్తాడు. వారికి పుట్టిన ఏడుగురు పిల్లలను గంగాదేవి నదిలో కలిపేస్తుంది. ఎనిమిదవ బిడ్డను కూడా నదిలో వేయబోతుంటే, శంతనుడు ఆగలేక ఆమెను నిలదీస్తాడు. షరతు ప్రకారం గంగాదేవి ఆ బిడ్డను తనతో తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ పేరు దేవవ్రతుడు. విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత దేవవ్రతుడిని తిరిగి శంతనుడికి అప్పగిస్తుంది. ఈ దేవవ్రతుడే మనకు తెలిసిన భీష్ముడు.

ఇక్కడ గంగాదేవి ఏడుగురు పిల్లల్ని నదిలో ఎందుకు కలిపి వేసిందో తెలుసుకుందాం. 

—--------

పూర్వం 'వసువులు' అనే ఎనిమిది మంది దేవతలు ఉండేవారు. ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వశిష్ట మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ వశిష్ఠుడి వద్ద ఉన్న 'నందిని' అనే పవిత్ర ఆవును చూసి, ఎనిమిదవ వసువు అయిన 'ద్యువు' తన భార్య కోరిక మేరకు ఆ ఆవును దొంగిలిస్తాడు. దీనికి మిగిలిన ఏడుగురు వసువులు సహకరిస్తారు.

ఈ విషయం తెలిసిన వశిష్ట మహర్షి కోపించి, "మీరు దేవతలైనా సరే, భూలోకంలో మనుష్యులుగా జన్మించండి" అని శపిస్తాడు.

వసువులు తమ తప్పు తెలుసుకుని వశిష్ఠుడిని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు మహర్షి శాపాన్ని సడలిస్తూ - "సహకరించిన ఏడుగురు వసువులు భూమిపై జన్మించిన వెంటనే శాప విమోచనం పొందుతారు. కానీ ఆవును దొంగిలించిన 'ద్యువు' మాత్రం భూమిపై ఎక్కువ కాలం జీవించి, గొప్ప పరాక్రమవంతుడిగా పేరు తెచ్చుకుంటాడు” అని చెబుతాడు. 

భూలోకంలో జన్మించక తప్పదని తెలిసిన వసువులు, గంగాదేవిని కలిసి తమను ఆమె గర్భాన జన్మించేలా అనుగ్రహించమని కోరుకుంటారు. తాము పుట్టిన వెంటనే తమను నదిలో వేసి, మళ్ళీ దేవలోకానికి వెళ్ళేలా శాప విమోచనం కలిగించమని ప్రార్థిస్తారు.

అందుకే గంగాదేవి శంతన మహారాజును వివాహం చేసుకున్నప్పుడు, "నేను ఏమి చేసినా అడగకూడదు" అనే షరతు విధిస్తుంది. ఆమె తన ఏడుగురు బిడ్డలను నదిలో వేయడం అంటే వారిని చంపడం కాదు, నిజానికి వారికి శాప విమోచనం కలిగించి తిరిగి దేవలోకానికి పంపడం.

ఎనిమిదవ బిడ్డగా పుట్టినవాడే ఆ 'ద్యువు'. శంతనుడు అడ్డుకోవడం వల్ల గంగ అతడిని నదిలో వేయలేదు. మొదట దేవవ్రతుడు అని పేరు కలిగిన ఆయనే గంగాపుత్రుడైన భీష్ముడు. వశిష్ఠుడి శాపం ప్రకారం భీష్ముడు భూలోకంలో ఎక్కువ కాలం జీవించాల్సి వచ్చింది.

—-------------

ఇక శంతనుడు కొన్నేళ్ల తర్వాత  సత్యవతి అనే మత్స్యకన్యను చూసి ఇష్టపడతాడు. కానీ ఆమె తండ్రి దాశరాజు "సత్యవతికి పుట్టే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలని ఒక కఠినమైన షరతు విధిస్తాడు. 

తండ్రి కోరిక తీర్చడం కోసం, దేవవ్రతుడు భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తాడు: "నేను రాజ్యధికారాన్ని వదులుకుంటున్నాను. నేను అసలు పెళ్లే చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను.  కాబట్టి సత్యవతి బిడ్డల రాజ్యానికి ముప్పు ఉండదని కఠిన ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ వల్లే దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వచ్చింది.  ఆయన త్యాగం భీష్మ ప్రతిజ్ఞగా వాసి గాంచింది. 

అలా సత్యవతిని వివాహమాడిన శంతనునికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలుగుతారు. చిత్రాంగదుడు యుద్ధంలో మరణించగా, విచిత్రవీర్యుడు రాజు అవుతాడు. విచిత్ర వీర్యుడికి వివాహం చేయడానికి భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను బలవంతంగా తీసుకు వస్తాడు. కానీ వారిలో పెద్దదైన అంబ తాను సాల్వ రాజును ప్రేమించానని చెప్పడంతో భీష్ముడు ఆమెను తిరిగి వెనక్కు పంపి  అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. 

దురదృష్టవశాత్తూ విచిత్రవీర్యుడు సంతానం కలగకముందే వ్యాధితో మరణిస్తాడు. కురువంశం అంతమైపోతుందేమో అని భయపడిన సత్యవతి, తన తొలి కుమారుడైన వేదవ్యాసుడిని పిలిపిస్తుంది.

సత్యవతి కోరిక మేరకు, వ్యాసమహర్షి అనుగ్రహంతో (నియోగ పద్ధతి ద్వారా) అంబిక, అంబాలిక వారసులను పొందాలని నిర్ణయిస్తారు.

అంబిక వ్యాసుడి తేజస్సును చూడలేక కళ్ళు మూసుకుంటుంది. అందుకే ఆమెకు పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడు పుడతాడు.

అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో పాలిపోతుంది.   అందుకే ఆమెకు పాండురోగంతో పాండురాజు జన్మిస్తాడు.

అంబిక భయంతో తన దాసిని పంపిస్తుంది. ఆ దాసికి ధర్మ స్వరూపుడైన విదురుడు జన్మిస్తాడు.

వయసులో పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అంధుడు కావడం వల్ల, పాండురాజు హస్తినాపురానికి రాజు అవుతాడు.

పాండురాజుకు కుంతి, మాద్రి అనే ఇద్దరు భార్యలు. ఒక శాపం వల్ల పాండురాజు భార్యలతో కలిస్తే మరణిస్తాడు. అప్పుడు కుంతి తనకు చిన్నతనంలో దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని ఉపయోగించి దేవతలను ప్రార్థిస్తుంది:

1. యమధర్మరాజు వల్ల ధర్మరాజు

2. వాయుదేవుని వల్ల భీముడు

3. ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మిస్తారు.

కుంతి ఆ మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించగా, ఆమెకు అశ్విని దేవతల వల్ల నకులుడు, సహదేవుడు జన్మిస్తారు. ఈ ఐదుగురు పాండవులు.

ధృతరాష్ట్రుడి భార్య గాంధారి. ఆమె గర్భం దాల్చినప్పటికీ రెండు ఏళ్ల వరకు ప్రసవం జరగదు. కుంతికి సంతానం కలిగిందని తెలిసి అసూయతో, ఆవేదనతో ఆమె తన కడుపుపై కొట్టుకోగా ఒక మాంసపు ముద్ద బయటకు వస్తుంది. వ్యాసమహర్షి ఆ ముద్దను 101 ముక్కలు చేసి, నెయ్యి కుండలలో భద్రపరుస్తాడు.

కొంతకాలం తర్వాత ఆ కుండల నుంచి మొదట దుర్యోధనుడు, తర్వాత మిగిలిన 99 మంది తమ్ముళ్లు,  దుశ్శల అనే ఒక చెల్లెలు జన్మిస్తారు. వీరే కౌరవులు.

—----------

పాండురాజు మరణం తర్వాత, పాండవులు -  ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు - హస్తినాపురానికి వస్తారు. ధర్మరాజు పెద్దవాడు కాబట్టి రాజ్యాధికారం ఆయనకే దక్కాలని ప్రజలు కోరుకుంటారు, కానీ ధృతరాష్ట్రుడి కుమారుడైన దుర్యోధనుడు దానిని అంగీకరించడు.

చిన్నతనం నుండే పాండవులు ధైర్యసాహసాల్లో ముందంజలో ఉండేవారు. ఇది చూసి ధృతరాష్ట్రుడి పెద్ద కుమారుడు దుర్యోధనుడి మనసులో అసూయ అనే విషవృక్షం మొలకెత్తింది.

భీముడి అపారమైన బలం, అర్జునుడి గురి తప్పని విలువిద్య దుర్యోధనుడికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తన మామ శకుని మాయాలోచనలతో, పాండవులను అంతం చేయడానికి రకరకాల కుట్రలు పన్నాడు. విషాహారం తినిపించాడు, నదిలో పడేశాడు. కానీ ప్రతిసారీ పాండవులు మరింత బలవంతులై తిరిగి వచ్చారు.

దుర్యోధనుడు పన్నిన క్రూరమైన పన్నాగాలలో లక్క ఇంటి దహనం ఒకటి. పాండవులను గౌరవంగా పంపి, వారు నివసించే ఇల్లును లక్కతో నిర్మించి, ఒక అర్ధరాత్రి దానికి నిప్పు పెట్టాడు. మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాండవులు అందులో కాలి బూడిదయ్యారని హస్తినాపురమంతా వార్త వ్యాపించింది. కౌరవులు సంబరాలు చేసుకున్నారు.

కానీ, విదురుడి హెచ్చరికతో పాండవులు ఆ ఇంటి కింద ఒక రహస్య సొరంగాన్ని తవ్వుకుని, మంటల నుండి తృటిలో తప్పించుకున్నారు. ఆ రాత్రి భీముడు తన తల్లిని, నలుగురు సోదరులను భుజాలపై ఎత్తుకుని గాఢాంధకారంలో అడవి వైపు పరుగెత్తాడు. లోకం దృష్టిలో చనిపోయిన వారు, అజ్ఞాతవాసం ప్రారంభిస్తూ బ్రాహ్మణ వేషాల్లో సంచరించసాగారు.

పాంచాల దేశం ద్రౌపదీ స్వయంవరంతో కళకళలాడుతోంది. బ్రాహ్మణ వేషంలో ఉన్న యువకుడు సభ మధ్యలోకి వచ్చాడు. పైన వేగంగా తిరుగుతున్న చేప బొమ్మను, కింద నీటిలో చూస్తూ కొట్టడమనే అసాధ్యమైన పనిని అతడు అతి సునాయాసంగా పూర్తి చేశాడు.

ద్రౌపది ఆ బ్రాహ్మణ యువకుడిని వరించింది.  ఆ యువకుడు ఎవరో కాదు. పాండవ మధ్యముడు అర్జునుడే. అయితే విధి వశాన ద్రౌపది పాండవులు ఐదుగురికీ భార్య కావలసి వచ్చింది. అదెలా అంటే-

అర్జునుడు ద్రౌపదీ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని కొట్టి, ద్రౌపదిని గెలుచుకుని తన సోదరులతో కలిసి ఇంటికి వస్తాడు. అప్పుడు కుంతీదేవి లోపల ఏదో పనిలో ఉంటుంది. బయట నుండి అర్జునుడు "అమ్మా! ఈరోజు మేము ఒక అద్భుతమైన భిక్షను తెచ్చాము" అని అంటాడు.

లోపల ఉన్న కుంతి అది ఏదో పండ్లు లేదా ధన ధాన్యాలు అనుకుని, చూడకుండానే "మీరు తెచ్చిన దానిని మీ ఐదుగురు సమానంగా పంచుకోండి" అని చెబుతుంది. ఆ కాలంలో తల్లి మాటను దైవవాక్కుగా భావించేవారు. ఒకసారి నోటి నుంచి వచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం ధర్మానికి విరుద్ధం. దీంతో పాండవులు, ద్రౌపది ధర్మసంకటంలో పడ్డారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి వేదవ్యాస మహర్షి అక్కడకు వచ్చి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించారు.  పూర్వజన్మలో ద్రౌపది ఒక గొప్ప తపస్విని. ఆమె తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన ఐదు ఉత్తమ గుణాలను కోరుకుంటూ శివుడి కోసం తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆమె ఉత్సాహంలో ఐదు సార్లు  "పతిం దేహి" అని ఐదుసార్లు పలికింది.శివుడు ఆమె కోరిక మేరకు, వచ్చే జన్మలో ఐదుగురు భర్తలు లభిస్తారని వరం ఇచ్చాడు.

పాండవులు ఐదుగురు నిజానికి పంచేంద్రియాలకు లేదా పంచ ప్రాణాలకు ప్రతీకలు. ద్రౌపది ప్రకృతి స్వరూపిణి. వీరి ఐక్యత వెనుక లోక కల్యాణం, ధర్మ స్థాపన అనే ఉద్దేశ్యం ఉందని వ్యాసుడు ధర్మరాజుకు వివరించాడు. చివరకు ద్రుపద మహారాజు అంగీకారంతో, ద్రౌపది ఐదుగురిని వివాహం చేసుకుంది.

—----------


ఇక ద్రౌపదీ స్వయంవరంలో గెలిచింది లక్క ఇంటి దహనంలో చనిపోయాడనుకున్న అర్జునుడే అని తెలియడంతో  కౌరవుల గుండెల్లో మంట మొదలైంది. రాజ్యాన్ని మళ్ళీ పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాండవులకు ఎడారి వంటి 'ఖాండవప్రస్థం' ఇచ్చారు. కానీ శ్రీకృష్ణుడి సాయంతో వారు దానిని స్వర్గం లాంటి ఇంద్రప్రస్థంగా మార్చారు.

పైగా ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు 'మయుడు' అనే రాక్షస శిల్పిని ప్రాణాలతో కాపాడాడు. దానికి కృతజ్ఞతగా, లోకంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన సభామంటపాన్ని పాండవుల కోసం మయుడు నిర్మించాడు. దీని నిర్మాణానికి సుమారు 14 నెలలు పట్టింది.

మయసభ సాధారణ కట్టడం కాదు. అది కళ్ళను భ్రమింపజేసే మాయాజాలం. నేల స్ఫటికంలా మెరుస్తూ, స్వచ్ఛమైన నీటి కొలనులా కనిపిస్తుంది.నిజంగా నీరున్న చోట అద్దంలాంటి నేల ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. తెరిచి ఉన్నట్లు కనిపించే తలుపులు నిజానికి మూసి ఉన్న గోడలు. గోడల్లా కనిపించేవి దారులు. సూర్యరశ్మి లేకపోయినా, సభ లోపల రత్నాల కాంతితో పగలులా వెలుగుతూ ఉంటుంది. రాజసూయ యాగం ముగిశాక, దుర్యోధనుడు ఈ సభను చూడటానికి వచ్చాడు. అక్కడ అతనికి వరుసగా అవమానాలు ఎదురయ్యాయి.స్ఫటికపు నేలను చూసి నీరు అనుకుని, తన రాజవస్త్రాలు తడవకుండా పైకి ఎత్తుకుని నడిచాడు. అది చూసి అక్కడున్న వారు నవ్వారు.తర్వాత ఒక నిజమైన నీటి కొలనును చూసి, అది నేల అనుకుని అడుగు వేసి నీటిలో పడిపోయాడు.గోడను ద్వారం అనుకుని వెళ్లి తల బాదుకున్నాడు.

దుర్యోధనుడు నీటిలో పడినప్పుడు ద్రౌపది చూసి నవ్విందని, "గుడ్డివాని కొడుకు గుడ్డివాడే" అని అన్నదని ప్రతీతి. ఈ అవమానమే దుర్యోధనుడిలో ప్రతీకార జ్వాలను  రగిల్చింది. తన మేనమామ, కపట బుద్ధి గల శకునితో కలిసి పాండవుల సర్వస్వాన్ని హరించడానికి ఒక పన్నాగం పన్నాడు.

—---------

హస్తినాపురంలో జూదశాల సిద్ధమైంది. పిలుపు రాగానే ధర్మరాజు తన సోదరులతో కలిసి వచ్చాడు. జూదం ఒక వ్యసనమని తెలిసినా, క్షత్రియ ధర్మం ప్రకారం పిలుపును కాదనలేకపోయాడు. పాండవుల తరపున ధర్మరాజు ఆడుతుంటే, కౌరవుల తరపున మాయావి శకుని పాచికలు విసిరాడు.

ఒక్కొక్కటిగా పాండవుల సంపద, రథాలు, ఏనుగులు, చివరకు రాజ్యం కూడా శకుని మాయా పాచికల పాలయ్యాయి. ఓటమి మత్తులో ధర్మరాజు తన వివేకాన్ని కోల్పోయాడు. తన తమ్ముళ్లను, తనను తాను పణంగా పెట్టి ఓడిపోయాడు. చివరకు సర్వం కోల్పోయిన తరుణంలో, శకుని విషపూరితమైన నవ్వుతో, "ధర్మరాజా! ఇంకా నీ దగ్గర ద్రౌపది ఉంది కదా, ఆమెను పణంగా పెట్టు" అని ప్రేరేపించాడు. విధి వంచించిన ధర్మరాజు, ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు.

హస్తినాపుర రాజసభ ఆ రోజు మౌనంగా లేదు.. అది ఒక ఘోరకలికి సాక్షిగా నిలిచింది. జూదంలో సర్వం కోల్పోయిన ధర్మరాజు విగతజీవిలా తలవంచుకుని కూర్చున్నాడు. కౌరవుల అట్టహాసం సభను కంపింప చేసింది.  దుర్యోధనుడి కళ్లలో ఒక వికృతమైన ఆనందం. "దుశ్శాసనా! వెళ్లి ఆ ద్రౌపదిని ఈడ్చుకురా! దాసిగా ఆమె ఉండాల్సింది సభలో, అంతఃపురంలో కాదు!" అని గర్జించాడు.

దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ఏకవస్త్ర గా ఉన్న ఉన్న ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ సభలోకి తీసుకువచ్చాడు.సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలు తలలు దించుకున్నారు. "రక్షించండి! పితామహా.. ఆచార్యా.. కురువంశపు గౌరవాన్ని కాపాడండి!" అని ద్రౌపది ఆర్తనాదాలు చేస్తూ భీష్మ, ద్రోణుల పాదాల చెంత పడి రోదించింది. కానీ, ధర్మ సూక్ష్మాల ముసుగులో ఆ మహామహులందరూ శిలల్లా మారిపోయారు. కట్టుకున్న భర్తలు ఐదుగురు సింహాల్లాంటి వారే.. కానీ ధర్మరాజు కట్టిన 'ఓటమి' అనే సంకెళ్లలో బందీలయ్యారు. భీముడి కళ్లు ఎర్రబడి రక్తం చిందుతున్నాయి, అర్జునుడి గాండీవం పక్కనే ఉన్నా అది నిశ్శబ్దంగా ఉంది.

దుర్యోధనుడి వికృత చేష్టలు పరాకాష్టకు చేరాయి. "వస్త్రాలు వలవండి! వీరు మా దాసులు, వీరికి రాజవస్త్రాలు ఎందుకు?" అని ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు క్రూరంగా నవ్వుతూ ద్రౌపది చీరను లాగడం మొదలుపెట్టాడు. ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కరి తలలు సిగ్గుతో వంగిపోయాయి.

ద్రౌపది తన బలాన్నంతా కోల్పోయింది. భర్తలను చూసింది—నిస్సహాయత తప్ప ఏమీ లేదు. పెద్దలను చూసింది—మౌనం తప్ప మరేమీ లేదు. చివరకు రెండు చేతులూ ఆకాశం వైపు చాచి, ప్రాణవాయువునంతా కూడగట్టుకుని అరిచింది.  ఇరు చేతులూ పైకెత్తి, కళ్లు మూసుకుని "గోవిందా! ద్వారకా నిలయా! అనాథ రక్షకా! నన్ను కాపాడు!!" అని  పరమాత్ముడైన శ్రీకృష్ణుడిని వేడుకుంది.

అప్పుడు జరిగింది ఒక అద్భుతం. అప్పటివరకు చీకటిగా ఉన్న సభలో ఒక దివ్యమైన కాంతి. దుశ్శాసనుడు లాగుతున్న కొద్దీ వస్త్రం అనంతంగా వస్తూనే ఉంది. రంగు రంగుల పట్టు వస్త్రాలు కొండలా పేరుకుపోయాయి. దుశ్శాసనుడు చెమటలు పట్టి, చేతులు పడిపోయి, కుప్పకూలిపోయాడు. కానీ ద్రౌపది మానం మాత్రం సురక్షితంగా ఉంది. కృష్ణుడు అదృశ్యంగా ఉండి తన సోదరిని కాపాడుకున్నాడు.

అవమానంతో రగిలిపోతున్న ద్రౌపది, తన విరబోసిన జుట్టును చూపిస్తూ సభను గడగడలాడించింది. "ఈ జుట్టును ముడివేయను! ఏ రోజైతే నా జుట్టును ఈ దుశ్శాసనుడి రక్తంతో తడుపుతానో, ఏ రోజైతే ఆ దుర్యోధనుడి తొడలు విరిగి నేలకూలుతాయో.. ఆ రోజే నేను కేశ సంస్కారం చేసుకుంటాను!" అని శపథం చేసింది.

భీముడు గంభీరంగా లేచి నిలబడి, గదను నేలకేసి కొడుతూ— "ఓ కురు వృద్ధులారా! వినండి! ఈ దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగకపోతే, ఈ దుర్యోధనుడిని యుద్ధ భూమిలో మట్టి కరిపించకపోతే నాకు వీర స్వర్గం కూడా వద్దు!" అని ప్రతిజ్ఞ చేశాడు.

చివరకు ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని, పాండవులకు 12 ఏళ్ల అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం శిక్షగా విధించాడు. పాండవులు తమ ఆయుధాలను పట్టుకుని, కళ్లలో ప్రతీకార జ్వాలలను నింపుకుని అడవి బాట పట్టారు.

ఆ రోజు హస్తినాపుర రాజసభలో ధర్మం చనిపోయింది. కానీ ఒక మహా సంగ్రామానికి పునాది పడింది. పాండవులు అరణ్యానికి బయలుదేరారు, కానీ వారి కళ్లలో ఉన్నది కేవలం ప్రతీకారేచ్ఛ.

—------------

ఆ నిశ్శబ్ద ప్రతీకారం, ఆ నివురు గప్పిన నిప్పు లాంటి పాండవుల ఉద్వేగం ఇప్పుడు అడవి బాట పట్టింది. అరణ్యవాసంలోని కష్టాలు వారిని మరింత రాటుదేల్చాయి.

రాజభోగాలు అనుభవించిన పాండవులు ఇప్పుడు గడ్డి పరకల మీద పడుకుంటున్నారు. కానీ తమతో పాటు వచ్చిన వందలాది మంది బ్రాహ్మణులకు, అనుచరులకు అన్నం పెట్టడం ధర్మరాజుకు పెద్ద సమస్యగా మారింది. సూర్య భగవానుడిని ప్రార్థించగా, ఆయన ఒక 'అక్షయపాత్ర'ను ప్రసాదించాడు.

"ధర్మరాజా! ద్రౌపది భోజనం చేసే వరకు ఈ పాత్ర నుంచి నఅన్నం వస్తూనే ఉంటుంది" అని వరం ఇచ్చాడు. కానీ ఆ పాత్ర కేవలం ఆకలిని మాత్రమే తీర్చగలదు, కౌరవుల మీద ఉన్న ప్రతీకార దాహాన్ని కాదు. యుద్ధం అనివార్యమని గ్రహించిన వేదవ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చి, "అర్జునా! కేవలం సాధారణ ఆయుధాలతో యుద్ధం గెలవలేవు. పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సాధించు" అని దిశానిర్దేశం చేశాడు.

అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించాడు. అగ్ని మధ్యలో ఉండి, ప్రాణవాయువునే ఆహారంగా తీసుకుంటూ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. అర్జునుడి ఏకాగ్రతను పరీక్షించడానికి శివుడు ఒక 'కిరాతుడి'  రూపంలో వచ్చాడు. అదే సమయంలో ఒక రాక్షసుడు పంది రూపంలో అర్జునుడిపైకి దూసుకువచ్చాడు.

అర్జునుడు, ఆ బోయవాడు ఇద్దరూ ఒకేసారి బాణాలు వదిలారు. ఆ పంది చనిపోయింది.

"ఎవరు నువ్వు? నా వేటను నువ్వు కొడతావా?" అని అర్జునుడు గర్జించాడు.

బోయవాడు నవ్వి, "అడవిలో వేట నా హక్కు, నీకెవరు ఇచ్చారు ఈ అధికారం?" అని సవాలు విసిరాడు.

ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. అర్జునుడి అమ్ములపొది ఖాళీ అయిపోయింది. విల్లు విరిగిపోయింది. ఆశ్చర్యపోయిన అర్జునుడు మట్టితో ఒక లింగాన్ని చేసి పూజించి, ఆ పువ్వులను బోయవాడిపై వేయగా.. అవి ఆ బోయవాడి తలపై కనిపించాయి. అప్పుడు గానీ అర్జునుడికి అర్థం కాలేదు—తను పోరాడుతున్నది సాక్షాత్తూ ముక్కంటితో అని!

అర్జునుడు శివుడి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. శివుడు ప్రసన్నుడై, "అర్జునా! నీ పరాక్రమానికి మెచ్చాను. లోక వినాశనం చేయగల శక్తినే కాదు, ధర్మాన్ని నిలబెట్టే శక్తిని నీకు ఇస్తున్నాను" అంటూ పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఇంద్రుడు కూడా అర్జునుడిని స్వర్గానికి పిలిపించి మరిన్ని దివ్యాస్త్రాలను, యుద్ధ మెలకువలను నేర్పించాడు. పాండవుల అమ్ములపొది ఇప్పుడు అజేయమైన అస్త్రాలతో నిండిపోయింది.

పన్నెండేళ్ల అరణ్యవాసం ముగిసింది. ఇప్పుడు అత్యంత కఠినమైన 'అజ్ఞాతవాసం'. ఎవరికీ గుర్తు పట్టకుండా విరాట రాజు కొలువులో చేరారు. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వలలుడనే వంటవాడిగా, అర్జునుడు బృహన్నల అనే నృత్య గురువుగా, నకుల సహదేవులు అశ్వగజ పోషకులుగా, ద్రౌపది సైరంధ్రిగా వేషాలు మార్చుకున్నారు.

అక్కడ కూడా ద్రౌపదిని అవమానించిన కీచకుడిని భీముడు చీకటి గదిలో సంహరించి తన పగను తీర్చుకున్నాడు. గడువు ముగియగానే, ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఎదుర్కొని తన విశ్వరూపాన్ని చూపాడు. పాండవులు బ్రతికే ఉన్నారని, వారు యుద్ధానికి సిద్ధమని కౌరవులకు హెచ్చరిక అందింది.

—--------

హస్తినాపుర వీధులు ఆ రోజు ఒక వింతైన నిశ్శబ్దంతో ఉన్నాయి. పాండవుల తరపున రాయబారిగా సాక్షాత్తూ ఆ కృష్ణ పరమాత్మ వస్తున్నాడని తెలిసి నగరం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ధృతరాష్ట్రుడు ఆడంబరమైన ఏర్పాట్లు చేశాడు, కానీ కృష్ణుడు వాటన్నింటినీ కాదని, పేదవాడైన విదురుడి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాడు.

మరుసటి రోజు కురుసభ కళకళలాడుతోంది. కృష్ణుడు సభలోకి అడుగుపెడుతుంటే, ఆయన తేజస్సు చూసి భీష్మ, ద్రోణ, విదురులు తమకు తెలియకుండానే లేచి నిలబడ్డారు.

కృష్ణుడు శాంతంగా, కానీ గంభీరంగా మాట్లాడటం ప్రారంభించాడు:

"ధృతరాష్ట్ర మహారాజా! పాండవులు యుద్ధం కోరుకోవడం లేదు. వారు అడిగేది కేవలం వారి వాటా రాజ్యమే. వద్దు అనుకుంటే.. కనీసం ఐదు గ్రామాలు ఇవ్వండి. రక్తం చిందించకుండా ఈ కురువంశాన్ని కాపాడుకో" అని హితవు పలికాడు.

కృష్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. "కృష్ణా! ఆ పాండవులకు ఈ రాజ్యంలో సూదిమొన మోపినంత భూమి కూడా ఇవ్వను! నువ్వు వారి పక్షపాతివి. నిన్ను ఇప్పుడే బంధిస్తే, పాండవుల సగం బలం పోతుంది" అని అరిచాడు.

శకుని, కర్ణుల ప్రోత్సాహంతో దుర్యోధనుడు కృష్ణుడిని బంధించమని తన సైనికులను ఆదేశించాడు. రాజసభలో కలకలం మొదలైంది. భీష్ముడు ఆవేదనతో కళ్లు మూసుకున్నాడు. విదురుడు భయంతో వణికిపోయాడు. కానీ కృష్ణుడు మాత్రం చిరునవ్వు నవ్వి, "దుర్యోధనా! నన్ను బంధించడం నీ వల్ల అవుతుందనుకుంటున్నావా?" అన్నాడు.

క్షణాల్లో సభ అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. కృష్ణుడి రూపం పెరుగుతూ, ఆకాశాన్ని తాకింది. ఆయనలో కోట్లాది సూర్యుల తేజస్సు. ఆయన శరీరంలోనే రుద్రులు, ఆదిత్యులు, వసువులు.. సకల దేవతలు కనిపిస్తున్నారు. ఆయన ఒక చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం.. భయంకరమైన ఉగ్రరూపం!

సభలో ఉన్న అంధుడైన ధృతరాష్ట్రుడికి ఆ ఒక్క క్షణం కంటిచూపు వచ్చింది. ఆ విశ్వరూపాన్ని చూసి ఆయన విలవిలలాడిపోయాడు. "కృష్ణా! చాలు! నీ ఈ అనంత రూపాన్ని భరించలేకపోతున్నాను. నన్ను మళ్ళీ అంధుడిని చేయి" అని వేడుకున్నాడు.

కృష్ణుడు తన రూపాన్ని ఉపసంహరించుకుని, కంఠంలో గంభీరతతో ఇలా అన్నాడు:

దుర్యోధనా! నువ్వు శాంతిని నిరాకరించావు. ఇక రాబోయేది యుద్ధమే! అది కేవలం యుద్ధం కాదు.. పాపానికి, పుణ్యానికి మధ్య జరిగే ప్రక్షాళన. సిద్ధంగా ఉండు!"

సభ నుండి బయటకు వచ్చిన కృష్ణుడు, కర్ణుడిని తన రథంపై ఎక్కించుకుని ఊరి వెలుపలికి తీసుకెళ్లాడు. అక్కడ కర్ణుడికి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు.

"కర్ణా! నువ్వు రాధేయుడివి కాదు.. కౌంతేయుడివి. నువ్వు కుంతీదేవి పెద్ద కొడుకువు. నువ్వు పాండవుల వైపు వస్తే, వారంతా నీ పాదాలకు నమస్కరిస్తారు. నువ్వే చక్రవర్తివి అవుతావు" అని ఆశ చూపాడు.

కానీ కర్ణుడు కళ్లలో నీళ్లతో నవ్వి.. "కృష్ణా! కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న దుర్యోధనుడిని, యుద్ధం రాగానే వదిలేస్తే నేను మనిషినేనా? నాకు రాజ్యం వద్దు, కీర్తి వద్దు. నా మిత్రుడి కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ వెన్నుపోటు పొడవను" అన్నాడు.

కృష్ణుడు కర్ణుడి గొప్పతనాన్ని మెచ్చుకుంటూ.. యుద్ధం అనివార్యమని నిర్ధారించుకుని వెనుదిరిగాడు.

శాంతి వచనాలు ముగిశాయి... ఇక వినిపించేది పాంచజన్య శంఖారావం మాత్రమే! 

—---------

కురుక్షేత్ర మైదానం లక్షలాది సైనికుల కవాతుతో, ఏనుగుల ఘీంకారాలతో, రథాల చక్రాల ఘోషతో దద్దరిల్లిపోతోంది.

కురుక్షేత్రం... కౌరవ పక్షాన ఒకవైపు పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం. భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహామహులు. మరోవైపు పాండవ పక్షాన ధర్మం, భీమార్జునుల పరాక్రమం, రథసారథిగా సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడు.

యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి, అర్జునుడు తన గాండీవాన్ని పక్కన పెట్టి రథంపై కూలబడ్డాడు. తన కళ్లముందు ఉన్నది శత్రువులు కాదు... తనను పెంచి పెద్ద చేసిన పితామహుడు భీష్ముడు, విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు, ప్రాణ సమానమైన అన్నదమ్ములు.

"కృష్ణా! రాజ్యం కోసం వీరందరినీ చంపాలా? ఈ నెత్తుటి కూడు నాకు వద్దు. నా చేతులు వణుకుతున్నాయి, గాండీవం జారిపోతోంది. యుద్ధం చేయను!" అంటూ అర్జునుడు కన్నీరు పెట్టుకున్నాడు. అది పిరికితనం కాదు, ఒక మహావీరుడికి కలిగిన అత్యంత గాఢమైన మమకారం.

అప్పుడు శ్రీకృష్ణుడు తన రథచక్రంపై నిలబడి, అర్జునుడి వైపు తీక్షణంగా చూశాడు. ఆ సమయంలోనే కాలం స్తంభించిపోయింది. లోకానికి దిశానిర్దేశం చేసే భగవద్గీత ఆ రణక్షేత్రంలోనే పుట్టింది.

"అర్జునా! ఈ దేహం శాశ్వతం కాదు, ఆత్మ ఒక్కటే శాశ్వతం. చంపేవాడివి నువ్వు కాదు, చచ్చే వారు వీరు కాదు. అంతా నా సంకల్పం మేరకే జరుగుతోంది. నువ్వు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే! ఫలితాన్ని ఆశించకుండా నీ కర్మను నిర్వర్తించు. అధర్మాన్ని ఎదురించడమే క్షత్రియ ధర్మం," అని గర్జించాడు.

అర్జునుడికి తన పరమాత్మ స్వరూపాన్ని, కాలస్వరూపాన్ని చూపిస్తూ... కర్తవ్యాన్ని బోధించాడు. "క్లైబ్యం మాస్మ గమః పార్థ!" (అర్జునా! పిరికితనాన్ని వదులు!) అన్న ఆ పిలుపుతో అర్జునుడిలో మమకారం పోయి, ధర్మగ్లానిని తుడిచేయాలనే సంకల్పం రగిలింది

యుద్ధం మొదలైంది! అది యుద్ధం కాదు, రక్తపాతపు ప్రళయం.

పదవ రోజు: భీష్ముడు అంపశయ్యపై కూలబడ్డాడు. కురువంశపు మహా వృక్షం నేలకూలింది. భీష్ముడి పతనం మహాభారత యుద్ధంలో అత్యంత విషాదకరమైన, కీలకమైన ఘట్టం. గతంలో సోదరుడికి పెళ్ళిచేయడానికి బలవంతంగా తీసుకొచ్చి చివరికి ఆమె సాల్వరాజు ప్రియురాలని తెలిసి వెనక్కి పంపేసిన అంబే శిఖండి రూపంలో భీష్ముని ఓటమికి కారణమైంది. తిరిగి వచ్చిన అంబను సాల్వరాజు తిరస్కరించడంతో  అంబ భీష్ముని వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా ఆమెను తిరస్కరిస్తాడు. భీష్ముడి వల్ల తన జీవితం నాశనమైందని భావించిన అంబ, ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమై ఆమె కోరినట్టే "నీవు వచ్చే జన్మలో ఒక పురుషుడిగా పుట్టి భీష్ముడి మరణానికి కారణమవుతావు" అని వరం ఇస్తాడు.

ఆమె ద్రుపద మహారాజు కుమార్తెగా 'శిఖండిని'గా జన్మిస్తుంది. తర్వాత ఒక యక్షుడి సహాయంతో స్త్రీ రూపాన్ని పురుష రూపంగా మార్చుకుని 'శిఖండి' అవుతుంది. భీష్ముడికి తన దివ్యదృష్టి ద్వారా శిఖండి ఎవరో, ఆమె పూర్వజన్మ ఏమిటో ముందే తెలుసు.

కురుక్షేత్ర యుద్ధం యుద్ధం మొదలైన మొదటి 9 రోజులు భీష్ముడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తాడు. భీష్ముడు బతికి ఉన్నంత కాలం తాము గెలవలేమని పాండవులకు అర్థమవుతుంది. ఆ రాత్రి పాండవులు భీష్ముడి వద్దకే వెళ్లి, ఆయనను ఎలా ఓడించాలో అడుగుతారు. ధర్మరాజుపై ఉన్న ప్రేమతో భీష్ముడే స్వయంగా రహస్యం చెబుతాడు

నేను ఆయుధం పట్టిన స్త్రీని చూసినా, లేదా పూర్వం స్త్రీగా ఉండి ఇప్పుడు పురుషుడిగా మారిన వ్యక్తిని చూసినా యుద్ధం చేయను. ఆ సమయంలో నేను నా ఆయుధాలను కింద పడేస్తాను.

దానితో 10వ రోజు యుద్ధంలో కృష్ణుడు అర్జునుడి రథం ముందు శిఖండిని నిలబెడతాడు. ఎదురుగా శిఖండిని చూడగానే, భీష్ముడు తన చేతిలోని విల్లును కింద పడేశాడు. ఆయన దృష్టిలో శిఖండి అంటే అంబ ఇంకా స్త్రీయే. స్త్రీపై ఆయుధం పట్టడం ఆయన ధర్మానికి విరుద్ధం.

అలా భీష్ముడు ఆయుధం వదిలేసిన క్షణంలో, కృష్ణుడి ఆదేశం మేరకు అర్జునుడు భీష్ముడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. భీష్ముడి శరీరం నిండా బాణాలు దిగబడతాయి. ఆయన నేల మీద పడకుండా, బాణాల మీదనే శయనిస్తాడు. దీనినే  అంపశయ్య/ బాణతల్పంఅంటారు.

అలాగే భీష్ముడికి తన తండ్రి శంతనుడి నుంచి 'స్వచ్ఛంద మరణం' అనే వరం కూడా ఉంది. అంటే ఆయన కోరుకున్నప్పుడే ప్రాణం పోతుంది. అప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. దక్షిణాయనంలో మరణించడం అంత శ్రేయస్కరం కాదని భావించి, భీష్ముడు బాణాల మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూస్తాడు.

యుద్ధం ముగిసిన తర్వాత, పాండవులకు 'శాంతి పర్వం' ద్వారా రాజనీతిని, ధర్మాన్ని బోధించి, చివరకు మాఘ శుద్ధ అష్టమి నాడు తన ప్రాణాలను వదులుతాడు. అదే భీష్మ అష్టమి.

—-----------

ఇక కురుక్షేత్రంలో భీష్ముడు అంపశయ్య పైకి. చేరిన తర్వాత, కౌరవ సైన్యానికి రెండవ సేనాధిపతిగా ద్రోణాచార్యుడు బాధ్యతలు స్వీకరించారు. ద్రోణుడి సారథ్యం భీష్ముడి కంటే భిన్నంగా, అత్యంత వ్యూహాత్మకంగా,కఠినంగా సాగింది.

18 రోజుల యుద్ధంలో భీష్ముడు 10 రోజులు యుద్ధం చేస్తే, ద్రోణుడు కేవలం 5 రోజులు సేనాధిపతిగా ఉన్నాడు. కానీ ఈ ఐదు రోజుల్లోనే పాండవ సైన్యానికి తీరని నష్టం కలిగించాడు.

దుర్యోధనుడు ద్రోణుడిని ఒక కోరిక కోరుతాడు - "పాండవులను చంపడం కంటే, ధర్మరాజును సజీవంగా బంధించి తెస్తే, మళ్ళీ జూదం ఆడించి అడవులకు పంపవచ్చు" అని. ద్రోణుడు దీని కోసం శకట వ్యూహం, మండల వ్యూహం వంటివి పన్నాడు. రెండు సార్లు ధర్మరాజును బంధించేంత దగ్గరకు వెళ్ళాడు, కానీ అర్జునుడు సమయానికి వచ్చి అడ్డుకున్నాడు.

ద్రోణుడి సారథ్యంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘట్టం పద్మవ్యూహం.అర్జునుడిని యుద్ధరంగం నుంచి దూరంగా పంపి, ద్రోణుడు అత్యంత క్లిష్టమైన 'పద్మవ్యూహం' పన్నాడు.

ఈ వ్యూహాన్ని ఛేదించడం కేవలం అర్జునుడికి, కృష్ణుడికి, ప్రద్యుమ్నుడికి, అర్జున కుమారుడు అభిమన్యుడికి మాత్రమే తెలుసు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం అభిమన్యుడికి తెలియదు. ద్రోణుడి పరోక్ష సహకారంతో, కౌరవ వీరులందరూ కలిసి ఒంటరిగా ఉన్న అభిమన్యుడిని అధర్మంగా చంపేశారు. ఇది ద్రోణుడి ప్రతిష్టకు ఒక మచ్చగా మిగిలిపోయింది. అభిమన్యుడి మరణం పాండవుల గుండెలను పిండేసింది.

ద్రోణుడు ఆయుధం పట్టి ఉన్నంత వరకు ఎవరూ అతన్ని ఓడించలేరని కృష్ణుడికి తెలుసు. అందుకే ఒక మాయోపాయం పన్నాడు. భీముడు 'అశ్వత్థామ' అనే పేరున్న ఏనుగును చంపి, "అశ్వత్థామ చనిపోయాడు" అని గట్టిగా అరుస్తాడు. తన కుమారుడు అశ్వత్థామ చనిపోయాడని భ్రమపడిన ద్రోణుడు, నిజాన్ని నిర్ధారించుకోవడానికి అబద్ధం చెప్పని ధర్మరాజును అడుగుతాడు. కృష్ణుడి సూచన మేరకు ధర్మరాజు "అశ్వత్థామ హతః.. కుంజరః" (అశ్వత్థామ మరణించాడు.. అది ఏనుగు) అని చెబుతాడు. 'కుంజరః' అనే మాట చెప్పేటప్పుడు కృష్ణుడు శంఖం ఊదడంతో ద్రోణుడికి అది వినబడదు.దీనితో పుత్ర శోకంతో ద్రోణుడు ఆయుధాలను త్యజించి, రథంపైనే యోగ సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ద్రుపద మహారాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడు ఖడ్గంతో ద్రోణుడి శిరస్సును ఖండిస్తాడు. భీష్ముడు పాండవుల పట్ల మమకారంతో కొంత మెత్తగా యుద్ధం చేస్తే, ద్రోణుడు తన శిష్యులైన పాండవుల మీద కూడా అత్యంత క్రూరమైన అస్త్రాలను ప్రయోగించి వృత్తి ధర్మాన్ని పాటించాడు.

ఇక 16వ రోజు యుద్ధంలో భీముడు తన గదతో దుశ్శాసనుడి రథాన్ని ముక్కలు చేశాడు. ఇద్దరి మధ్య ఘోరమైన మల్లయుద్ధం జరిగింది. భీముడు తన అపారమైన బలంతో దుశ్శాసనుడిని కింద పడేసి, అతని చేతులను శరీరం నుండి వేరు చేశాడు ఏ చేతులతో అయితే ద్రౌపదిని అవమానించాడో ఆ చేతులను ఖండించాడు.

భీముడు అంతటితో ఆగక, తన ప్రతిజ్ఞ ప్రకారం దుశ్శాసనుడి రొమ్మును చీల్చాడు. ఆ వేడి రక్తాన్ని దోసిళ్లతో తాగుతూ రౌద్ర రూపం దాల్చాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి కౌరవ సైన్యం భయంతో పరుగులు తీసింది. సాక్షాత్తూ కర్ణుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు.

దుశ్శాసనుడి రక్తంతో తడిసిన తన చేతులతో భీముడు ద్రౌపది వద్దకు వెళ్ళాడు. 13 ఏళ్లుగా ముడివేయకుండా వదిలేసిన ఆమె కేశాలకు ఆ రక్తంతో తిలకం దిద్ది, స్వయంగా ముడివేశాడు. దీంతో ద్రౌపది పగ చల్లారింది, భీముడి శపథం నెరవేరింది.

—-------

దుశ్శాసనుడి మరణం తర్వాత, యుద్ధం 17వ రోజున కౌరవ సైన్యానికి కర్ణుడు నాయకత్వం వహించాడు. భీష్మ, ద్రోణుల తర్వాత కురు సైన్యాన్ని నడిపిన మూడవ మహావీరుడు ఆయనే. యుద్ధం మొదలవ్వడానికి ముందే, కర్ణుడు తన పెద్ద కుమారుడన్న సత్యాన్ని కుంతి గ్రహించింది. పాండవులను కాపాడుకోవడం కోసం ఆమె గంగా తీరంలో సూర్యారాధన చేస్తున్న కర్ణుడి వద్దకు వెళ్ళింది.

నువ్వు రాధేయుడివి కాదు, కౌంతేయుడివి.  నా కుమారుడివి. నీ తమ్ములైన పాండవుల పక్షాన చేరి యుద్ధం చేయి" అని వేడుకుంది.

"అమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన దుర్యోధనుడిని ఈ సమయంలో వదలలేను. అది మిత్రద్రోహం అవుతుంది" అని కర్ణుడు సున్నితంగా తిరస్కరించాడు.

అయితే, కుంతి బాధను చూసి కర్ణుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు.

అమ్మా! యుద్ధం ముగిశాక కూడా నీకు ఐదుగురు కొడుకులు మిగిలే ఉంటారు. నేను మరణిస్తే ఐదుగురు పాండవులు ఉంటారు ఒకవేళ అర్జునుడు మరణిస్తే నేను నీతో ఉంటాను. అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు పాండవులను నేను చంపను అని కుంతి కి మాటిచ్చాడు కర్ణుడు.

కర్ణుడు సేనాధిపతి అయిన తర్వాత యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది.

కర్ణుడికి సారథిగా శల్యుడిని నియమించారు. కానీ శల్యుడు నిరంతరం కర్ణుడిని కించపరుస్తూ, అతని మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ అర్జునుడిని పొగుడుతూ ఉండేవాడు.

కర్ణుడు యుద్ధంలో ధర్మరాజును, భీముడిని, నకుల సహదేవులను ఓడించాడు. కానీ కుంతికి ఇచ్చిన వరం ప్రకారం వారిని ప్రాణాలతో వదిలేశాడు.

17వ రోజు సాయంత్రం కర్ణ-అర్జునుల మధ్య తుది పోరు భీకరంగా జరిగింది. అర్జునుడి చేతిలో కర్ణుడి మరణం తప్పలేదు. కర్ణుడి మరణానికి మూడు ప్రధాన కారణాలు తోడయ్యాయి:

1. బ్రాహ్మణుడి శాపం వల్ల కర్ణుడి రథం చక్రం భూమిలోకి కూరుకుపోయింది.

2. పరశురాముడి శాపం వల్ల క్లిష్ట సమయంలో కర్ణుడికి తన అస్త్ర విద్యలు గుర్తుకు రాలేదు.

3. కుంతికి ఇచ్చిన వరం. కారణంగా కేవలం అర్జునుడిపైనే దృష్టి పెట్టి  ఇతర పాండవులను వదిలేయడం.

రథం చక్రాన్ని పైకి లేపుతున్న సమయంలో, నిరాయుధుడైన కర్ణుడిపై అర్జునుడు 'అంజలిక' అస్త్రాన్ని ప్రయోగించి అతని శిరస్సును ఖండించాడు.

కర్ణుడు మరణించాక, కుంతి పాండవుల వద్దకు వచ్చి కర్ణుడు మీ అన్నయ్య అని నిజం చెబుతుంది. అప్పుడు ధర్మరాజు ఎంతో దుఃఖించి, "ఈ రహస్యం మాకు ముందే తెలిసి ఉంటే ఇంత రక్తపాతం జరిగేది కాదు కదా!" అని ఆవేదన చెందుతాడు. లోకంలోని స్త్రీలెవరూ ఏ రహస్యాన్ని దాచలేకపోవుదురు గాక అని అప్పుడే ధర్మరాజు శపిస్తాడు.

కర్ణుడి మరణం తర్వాత, కౌరవ సైన్యానికి ఆఖరి సేనాధిపతిగా మద్రరాజు శల్యుడు బాధ్యతలు స్వీకరించాడు. శల్యుడు గొప్ప పరాక్రమవంతుడు. ఆయన పాండవ సైన్యాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు.

ధర్మరాజు  సాధారణంగా శాంతమూర్తి, కానీ ఆ రోజు ఆయన రౌద్ర రూపం దాల్చాడు. శల్యుడికి, ధర్మరాజుకు మధ్య భీకర పోరు జరిగింది. చివరకు ధర్మరాజు తన శక్తి ఆయుధాన్ని ప్రయోగించి శల్యుడిని సంహరించాడు. అదే సమయంలో సహదేవుడు తన శపథం ప్రకారం శకునిని వధించాడు.

—-------------


మహాభారత యుద్ధం  ఆఖరి రోజైన 18వ రోజు అత్యంత కీలకమైనది. ఆ రోజుతో కౌరవ సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 

సైన్యం అంతా నశించి, తన వారంతా చనిపోవడంతో దుర్యోధనుడు ఒంటరివాడయ్యాడు. దిక్కుతోచని స్థితిలో వైశంపాయన సరస్సు అని పిలిచే మడుగులోకి వెళ్లి, తన మాయా శక్తితో నీటిని స్తంభింపజేసి లోపల దాక్కున్నాడు.

పాండవులు కృష్ణుడితో కలిసి ఆ సరస్సు వద్దకు చేరుకుంటారు. ధర్మరాజు దుర్యోధనుడిని మాటలతో రెచ్చగొట్టగా, దుర్యోధనుడు సరస్సు నుంచి ను బయటకు వస్తాడు.

భీముడు, దుర్యోధనుడు మధ్య భీకరమైన గదా యుద్ధం జరుగుతుంది.ఇద్దరూ సమాన బలవంతులు కావడంతో యుద్ధం తెగదు. అప్పుడు కృష్ణుడు అతడి తొడపై కొట్టమని భీముడికి సైగ చేస్తాడు అప్పుడు దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని గతంలో చేసిన శపథం కూడా భీముడికి గుర్తు వస్తుంది. 

గదా యుద్ధ ధర్మం ప్రకారం నడుము కింద కొట్టకూడదు, కానీ అధర్మాన్ని అంతం చేయడానికి భీముడు దుర్యోధనుడి తొడలపై గదతో బాది అతన్ని పడగొడతాడు. అలా ద్రౌపది శపథాన్ని నెరవేర్చాడు.

దుర్యోధనుడు చావుబతుకుల మధ్య ఉండగా, అశ్వత్థామ వచ్చి చూస్తాడు. తన తండ్రి ద్రోణుడు, తన రాజు దుర్యోధనుడి పరిస్థితికి కారణమైన పాండవులపై పగ తీర్చుకుంటానని మాటిస్తాడు. 18వ రోజు రాత్రి, పాండవులు లేని సమయంలో వారి శిబిరంపై దాడి చేసి, ఉపపాండవులుగా పిలిచే ద్రౌపది ఐదుగురు కుమారులను, ధృష్టద్యుమ్నుడిని నిద్రలోనే హతమారుస్తాడు.

యుద్ధం ముగిసిన తర్వాత అశ్వత్థామ ఉత్తర కడుపులోని గర్భస్థ శిశువు (పరీక్షిత్తు) పైకి 'అపాండవాస్త్రం' (బ్రహ్మశిరోనామ అస్త్రం) ప్రయోగిస్తాడు. ఈ ఘోరమైన చర్యకు ఆగ్రహించిన శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు. అశ్వత్థామ నొసటిపై ఉన్న జన్మతః వచ్చిన దైవిక మణిని తీసివేస్తారు.శరీరం నిండా చీము, నెత్తురు కారే గాయాలతో, ఏకాకిగా 3,000 సంవత్సరాల పాటు భూమిపై తిరుగుతూ తీవ్రమైన బాధను అనుభవిస్తాడని శ్రీకృష్ణుడు శపిస్తాడు. కాబట్టి మహాభారత పురాణాల ప్రకారం అశ్వత్థామకు మరణం లేదు.

అలా యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కానీ ఆ విజయం వెనుక కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు, ముండమోపైన ఇల్లాళ్లు. గెలిచిన వారూ ఏడుస్తున్నారు, ఓడిన వారూ ఏడుస్తున్నారు.

ధర్మరాజు పట్టాభిషేకం చేసుకున్నాడు. కానీ ఆయన మనసులో శాంతి లేదు. గాంధారి కోపంతో శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. పద్దెనిమిది రోజుల యుద్ధం ఒక యుగాన్నే మింగేసింది. చివరకు పాండవులు కూడా సశరీరంగా స్వర్గానికి బయలుదేరారు.

మహాభారతం మనకు నేర్పిన సత్యం ఒక్కటే - అధర్మం ఎంత బలంగా ఉన్నా, ధర్మం వెంట దేవుడు ఉంటే విజయం నిశ్చయం. కానీ ఆ విజయం కోసం మనం ఎంతో కొంత త్యాగం చేయాల్సిందే. కురుక్షేత్ర మైదానం ఈరోజుకీ మనలోనే ఉంది. మన ఆలోచనలే కౌరవులు. మన ఆత్మ సాక్షియే కృష్ణుడు.(సమాప్తం)

—------


నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...