Wednesday, 11 November 2026

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంది!

ఒకప్పుడు ఒక పార్టీలో కీలకంగా ఉండి, అధికార కేంద్రాలకు దగ్గరగా ఉండి, రాజకీయ వ్యవస్థలో తనదైన పాత్ర పోషించిన నాయకుడు ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తే సహజంగానే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.

పార్టీ పేరు పరివర్తన అయినంత మాత్రాన రాజకీయ సంస్కృతిలో పరివర్తన వచ్చేసినట్టేనా? జెండా మారితే భావజాలం మారుతుందా? పార్టీ కార్యాలయం మారితే ప్రజల సమస్యలపై వైఖరి మారుతుందా?

ఈరోజు విజయవాడలో విజయసాయిరెడ్డి ప్రకటించిన పరివర్తన రాజనీతి పార్టీ  పేరు వినడానికి కొత్తగా, ఉంది. దేశభక్తి, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలు, యువతకు ప్రాధాన్యం వంటి అంశాలను ఆయన పార్టీ లక్ష్యాలుగా ప్రకటించారు. 2029 ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా వెల్లడించారు.

ఇన్నాళ్లూ రాజకీయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన నాయకులే ఇప్పుడు ఆ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని కొత్త జెండాలతో బయలుదేరడం విడ్డూరం.

నిన్నటి వరకు అధికార రాజకీయాల్లో ఒక భాగంగా ఉన్న అనుభవం ఇప్పుడు కొత్త పార్టీకి పెట్టుబడిగా మారుతుందా? లేక ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలే కొత్త పార్టీకి పునాదులవుతాయా?

యువతకు అవకాశాలు కల్పించడం మంచి ఆలోచనే. కానీ యువతకు అవకాశం ఇచ్చే ముందు పాత తరం నాయకులు తమ రాజకీయ అనుభవాన్ని కొంత పక్కన పెట్టగలరా? యువతకు కేవలం టికెట్లు ఇస్తారా? లేక నిర్ణయాధికారాన్ని కూడా అప్పగిస్తారా?

మరో ఆసక్తికరమైన విషయం కుటుంబ రాజకీయాలపై విమర్శలు. రాజకీయాల్లో వారసత్వానికి బదులు ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాదన వినడానికి బాగుంది. కానీ పార్టీ స్థాపకుడి చుట్టూ కాకుండా సంస్థాగత నాయకత్వం చుట్టూ పార్టీ ఎదగగలిగితేనే ఆ నినాదానికి అసలు పరీక్ష.

ఇక పార్టీ గుర్తుగా ధర్మచక్రం! ధర్మం అంటే కేవలం జెండా మధ్యలో చక్రం ఉండటమే కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, సొంత పార్టీ ప్రయోజనాలున్నా, ప్రజా ప్రయోజనాలున్నా ఒకే విధమైన ప్రమాణాలు పాటించడం కూడా ధర్మమే కదా!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రాజకీయ పార్టీలకు కొదవలేదు. ఒక పార్టీ అధికారంలో ఉంటుంది. మరొకటి ప్రతిపక్షంలో ఉంటుంది. ఇంకొకటి ప్రత్యామ్నాయం అంటుంది. ఇప్పుడు మరో పార్టీ పరివర్తన అంటోంది.

ప్రజలకు మాత్రం పార్టీలు మారినప్పుడల్లా తమ జీవితాల్లో మార్పు వస్తుందేమోనన్న ఆశ. కానీ ఎన్నికల తర్వాత వారి బతుకులు మరుతున్నాయా? 

రాజకీయాల్లో పార్టీలు పుట్టడం కొత్తేమీ కాదు. పేర్లు మారడం, జెండాలు మారడం, నినాదాలు మారడం కూడా కొత్త కాదు. కానీ ప్రజలు కోరుకుంటున్నది నాయకుల రాజకీయ ప్రస్థానంలో పరివర్తన కాదు... తమ బతుకుల్లో పరివర్తన!

పార్టీ పేరు పరివర్తన రాజనీతి పార్టీగా పెట్టుకున్నారు. ఇక ఆ పేరులోని పరివర్తన అక్షరాల్లోనే మిగిలిపోతుందా? ఆచరణలోకి వస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.

ఎందుకంటే రాజకీయాల్లో ప్రకటనకు ముహూర్తం పెట్టుకోవచ్చు. పరివర్తనకు మాత్రం ప్రజల ఆమోదమే ముహూర్తం!

-జీడిగుంట నాగేశ్వరరావు


Thursday, 5 November 2026

ఆదర్శ (అరాచక) కుటుంబం ( మూవీ రివ్యూ) -జీడిగుంట నాగేశ్వరరావు



వెంకటేష్, త్రివిక్రమ్ కలయిక అనగానే సహజంగా ఏర్పడే అంచనాల స్థాయికి ఆదర్శకుటుంబం చేరుకోలేదని చెప్పకతప్పదు. మొదటి భాగం సినిమా కొంత ఆహ్లాదకరంగా సాగినా తరువాత ఆదర్శకుటుంబం కాస్తా అరాచక కుటుంబంగా మారడంతో రెండో భాగం కథ కామెడీ నుంచి క్రైమ్, యాక్షన్ వైపు తిరిగి సహజత్వం కోల్పోయింది. 

మధ్యతరగతి కుటుంబానికి చెందిన చిట్టిబాబు (వెంకటేష్) ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటాడు. అనుకోకుండా రూ.100 కోట్ల లాటరీ తగలడంతో వారి కుటుంబ జీవితంలో కొత్త మలుపు మొదలవుతుంది. అయితే ఒక దొంగల ముఠా వారి ఇంటిపై దాడి చేయడంతో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది.

వెంకటేష్ యధాశక్తి సినిమాను ముందుకు నడిపించాడు. సహజమైన నటనతో కామెడీ, ఎమోషన్, యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశారు. శ్రీనిధి శెట్టి స్వర్ణ పాత్రలో సినిమాకు బలంగా నిలిచింది. నివేదా పేతురాజ్, నారా రోహిత్ పాత్రలకు తగిన ప్రాధాన్యం లభించలేదు. రావు రమేష్ ఫర్వాలేదు. సత్య కామెడీ పెద్దగా పండలేదు. 

త్రివిక్రమ్ నుంచి సహజంగా ఆశించే స్థాయి వినోదం, కథాబలం ఎంత మాత్రం కనిపించవు. గుర్తు పెట్టుకునే మాటలు కూడా మాంత్రికుడి కలం నుంచి పడలేదు. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఇంతకుముందు ఆయన బాణీల్లో విన్నట్టే ఉన్నాయి. నారాయణమ్మ పాట రాములో రాములో పాట సీక్వెన్స్ ను గుర్తు చేస్తుంది. 

మొత్తం మీద అంచనాలు తగ్గించుకుని వెళితే ఓ మోస్తరు వినోదం అందించే చిత్రం. కుటుంబ ప్రేక్షకులు ఒకసారి చూడవచ్చు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.*

తద్దినం తంతునానేనా...!

… 



అబ్దీకాలు పెట్టడం ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ల వర్ధంతి వస్తోందంటే కుటుంబమంతా కలిసి ఏర్పాట్లు చేసుకునేవారు. వంటింట్లో సందడి ఉండేది. ఆడవాళ్లు ఓపికగా పనులు చక్కబెట్టేవారు. కనీసం వంటమనిషిని పెట్టుకుని, మిగతా ఏర్పాట్లను ఇంట్లోవాళ్లే చూసుకునేవారు. ఆ రోజుల్లో ఆచారానికి ఆప్యాయత తోడయ్యేది.

ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్లకు ఓపిక లేదనో, తీరిక లేదనో తప్పుపట్టలేం. ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు వారికి. కానీ ఇంట్లో ఇలాంటి కార్యక్రమం పెట్టాలంటే వారి సహకారం మాత్రం అంతంతమాత్రమే.

ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ‘మీరు ఏ పనీ చేసుకోవాల్సిన అవసరం లేదు… అన్నీ మేమే చేసిపెడతాం’ అంటూ అమ్మవార్లపేర్లతో అనేక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంట్లో గొడవెందుకు, మనశ్శాంతి ముఖ్యం కదా అని వాటిని ఆశ్రయిస్తే అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది!

ఉదయం తొమ్మిది గంటలకే ఫస్ట్ షిఫ్టు!

మరి అంత పొద్దున్నే అబ్దీకం ఎలా పెడతాం అని మధ్యాహ్నం షిఫ్టు తీసుకుంటే జరిపించేవారు రొటేషన్‌లో మన దాకా వచ్చి ముగించేసరికి, మనం భోజనానికి కూర్చునే సమయం మూడు గంటలు దాటకపోతే గొప్పే! అప్పటివరకు పితృదేవతల ఆకలి సంగతి దేవుడెరుగు, ఇంట్లోవాళ్ల ఆకలి సంగతి చెప్పనక్కర్లేదు.

ఇక వీటిని పెట్టే పెద్ద వాళ్ళ పరిస్థితి మరీ దయనీయం. నడుం వంగదు.. మోకాళ్ళ నొప్పులు– అటు చేయించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువమంది వృద్ధులే అవుతున్నారు. మంత్రాలు మర్చిపోతున్నారు. కొందరు కుంటుకుంటూ వడ్డన చేస్తుంటే మనకి బాధేస్తుంది. చిన్నవాళ్ళు ఈ వృత్తిలోకి రావడం లేదు. 

ఇక రేట్ల విషయానికొస్తే… ఆరు వేల రూపాయలు దాటిపోయాయి. ఎక్కడైనా పాపభీతి మిగిలి ఉన్నవాళ్లు కొంచెం తక్కువకు చేస్తారేమోనని వెతుక్కోవాల్సిన పరిస్థితి.

అంతటితో అయిపోతుందా? అదనపు భోజనాల లెక్క మొదలవుతుంది. రెండొందల రూపాయలు దాటిన ఒక్కో భోజనం! ఇంటికి వచ్చిన బంధువుల సంఖ్యను బట్టి బిల్లు పెరుగుతూనే ఉంటుంది. చివరకు పితృకార్యానికి పెట్టిన ఖర్చు కంటే, వచ్చినవాళ్ల భోజనాల ఖర్చే ఎక్కువయ్యేలా ఉంది. ఆఫ్ కోర్స్- బంధువుల మాట అటుంచి కుటుంబాల్లలోని వారీ వీటికి రావడానికి ముఖం చాటేస్తున్నారు. 

నిజానికి ఈ సంస్థలు చేస్తున్న పనిని తప్పుపట్టలేం. వారికి కూడా సిబ్బంది, వంటసామగ్రి, రవాణా, ఇతర ఖర్చులు ఉంటాయి. కానీ సంప్రదాయ కార్యక్రమాలను ఒక సేవగా చూడాలా, లేక పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేయాలా అన్నదే ప్రశ్న.

ఇంట్లోవాళ్లకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో సంస్థలను ఆశ్రయిస్తే, చివరకు సంస్థల షిఫ్టులకు, రేట్లకు, నిబంధనలకు మనమే సర్దుకుపోవాల్సి వస్తోంది.

ఒకప్పుడు ఇల్లాలే అంతా చేసేది. తరువాత వంటమనిషి దొరికితే చాలనేపరిస్థితి. . ఇప్పుడు సంస్థ దొరకాలి, షిఫ్టు కుదరాలి, రేటు భరించాలి, అదనపు భోజనాల లెక్క తేలాలి!

మొత్తానికి పితృదేవతలకు పెట్టే అబ్దీకం కంటే, ఆ ఏర్పాట్లు చేసే సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందమే పెద్ద కార్యక్రమంగా మారిపోయింది.

ఇదే ప్రస్తుత కాలమహిమ!

పితృదేవతల ఆశీస్సులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, కార్యక్రమం చేసే ఇంటి పెద్దకు మాత్రం జేబుకు పెద్ద చిల్లు,  ఒళ్ళు హూనం తధ్యం.*

Friday, 30 October 2026

భారత సమైక్యతా శిల్పి సర్దార్ వల్లభాయి పటేల్ (జయంతి 31/10/) జీడిగుంట నాగేశ్వరరావు

 



భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అగ్రగామి నాయకుడిగా, దేశ సమైక్యతా శిల్పిగా సర్దార్ వల్లభాయి పటేల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జయంతి (అక్టోబర్ 31) ని భారతదేశంలో "రాష్ట్రీయ ఏక్తా దివస్" గా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశాన్ని ఒకే తాటిపై నిలపడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.

స్వాతంత్ర్య సమయంలో భారతదేశం వందలాది చిన్న చిన్న సంస్థానాలుగా చీలిపోయి ఉంది. పటేల్ తన అసాధారణ రాజనీతిజ్ఞత, ధైర్యసాహసాలతో సుమారు 565 స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేశారు.

దేశ సమైక్యతను కాపాడటంలో ఆయన చూపిన దృఢ సంకల్పం, కఠిన నిర్ణయాల కారణంగా ఆయనను "ఉక్కు మనిషి" అని పిలుస్తారు.

గుజరాత్‌లోని బార్డోలిలో రైతులపై విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు. ఆ సమయంలోనే అక్కడి మహిళలు ఆయనకు "సర్దార్" (నాయకుడు) అనే బిరుదును ప్రదానం చేశారు.

దేశ పాలనా రంగాన్ని బలోపేతం చేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆధునిక అఖిల భారత సివిల్ సర్వీసుల వ్యవస్థకు పునాది వేశారు. అందుకే ఆయనను సివిల్ సర్వీసుల పితామహుడిగా కూడా కొలుస్తారు.

దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గుజరాత్‌లోని నర్మదా నది తీరాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన "స్టాట్యూ ఆఫ్ యూనిటీ"ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జాతి సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్ ఆశయాలు ఎప్పటికీ ఆదర్శనీయం.*

విలక్షణ నేత ఇందిర (వర్ధంతి 31/10)

 



భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తన సమర్థవంతమైన పాలన, ధైర్యసాహసాలు,కఠిన నిర్ణయాలతో ప్రపంచస్థాయి నాయకురాలిగా ఎదిగారు.

కీలక నిర్ణయాలు

బ్యాంకుల జాతీయకరణ (1969): పేద ప్రజలకు, రైతులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణ చేశారు.

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం: పాకిస్తాన్‌పై విజయం సాధించి, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ విజయం ఆమె రాజనీతిజ్ఞతకు నిదర్శనం.

హరిత విప్లవం: భారతదేశంలో ఆహార ధాన్యాల కొరతను నివారించడానికి హరిత విప్లవాన్ని ప్రోత్సహించి, దేశాన్ని ఆహార భద్రత వైపు నడిపించారు.

అణు పరీక్షలు (1974): పొఖ్రాన్‌లో 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో మొదటిసారి విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించి భారత్‌ను అణుశక్తి దేశంగా నిలబెట్టారు.

విమర్శలు - వివాదాలు

1. అత్యవసర పరిస్థితి  (1975-1977)

 ఇందిరా గాంధీ పాలనలో అత్యంత చీకటి అధ్యాయంగా దీనిని పరిగణిస్తారు. రాజకీయ అశాంతి, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించారు. ఈ కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వేలాది మందిని విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించారు. పత్రికలపై కఠినమైన సెన్సార్‌షిప్ విధించారు.

2. ఆపరేషన్ బ్లూ స్టార్ (1984)

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని పవిత్ర స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న వేర్పాటువాద ఉగ్రవాదులను ఏరివేయడానికి 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరిట సైనిక చర్యకు ఆదేశించారు. ఈ సైనిక చర్య సమయంలో సిక్కుల పవిత్ర స్థలం దెబ్బతినడం, సిక్కుల మనోభావాలు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటనే ఆమె హత్యకు ప్రధాన కారణంగా మారింది.

3. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం

కాంగ్రెస్ పార్టీపై తన పట్టును నిలుపుకోవడానికి ఆమె పార్టీలో సీనియర్ నాయకులను పక్కనబెట్టి, హైకమాండ్ సంస్కృతిని, కేంద్రీకృత ప్రభుత్వాన్ని బలపరిచారనే విమర్శ ఉంది. ప్రాంతీయ నాయకుల స్వయంప్రతిపత్తిని తగ్గించి, పార్టీలో ప్రత్యర్థులను అణచివేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

4. కుటుంబ రాజకీయాలకు పెద్దపీట

ఇందిరా గాంధీ తన కుమారులైన సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా భారత రాజకీయాల్లో కుటుంబ పాలనకు బలమైన పునాది వేశారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ఈ విధంగా, ఆమె తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం వైపు నడిపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే, అదే సమయంలో దేశ సమైక్యత కోసం ఆమె చేసిన  త్యాగం, తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఆమెను చరిత్రలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

1984 అక్టోబర్ 31న న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన ఈ రోజును రాష్ట్రీయ సంకల్ప దివస్ గా పాటిస్తారు.*



Tuesday, 27 October 2026

బాబా సన్నిధి - శాంతి పెన్నిధి (జీడిగుంట నాగేశ్వరరావు)


షిర్డీకి వెళ్లాలనే ఆలోచన మనసులో కలిగినప్పటి నుంచే ఏదో తెలియని ఆనందం. సాయిబాబాను దర్శించుకోవాలనే కోరికతో అడుగులు ముందుకు సాగుతుంటే, మనసులో భక్తిభావం నెమ్మదిగా నిండిపోతుంది. ఇక షిర్డీ చేరుకుని బాబా ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి కలిగే అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది.

ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తుల సందడి కనిపిస్తుంది. అయినా ఆ సందడి మధ్యలోనూ ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. ఎటు చూసినా బాబా నామస్మరణ, భక్తుల ముఖాల్లో కనిపించే విశ్వాసం, సేవకుల క్రమబద్ధమైన నిర్వహణ - ఇవన్నీ కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి.

దర్శనానికి వెళ్లే మార్గంలో భక్తులు నెమ్మదిగా ముందుకు సాగుతుంటారు. ఆ నిరీక్షణలోనూ ఒక ఆనందం ఉంది. మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు ఉన్నా, బాబా సన్నిధికి చేరువవుతున్న కొద్దీ అవన్నీ క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయి. చివరకు సమాధి మందిరంలో బాబా దివ్యమూర్తిని చూడగానే, కొన్ని క్షణాల పాటు కాలమే ఆగిపోయినట్లనిపిస్తుంది.

సింహాసనంపై రాజాధిరాజులా మననే చూస్తున్నారా అనిపించే చల్లటి కళ్ళతో ప్రశాంతంగా కూర్చున్న బాబా రూపం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ ముఖంలోని కరుణ, ఆ చూపులోని ఆప్యాయత, ఆ సన్నిధిలోని పవిత్రత - భక్తుడి హృదయాన్ని నిశ్శబ్దంగా తాకుతాయి. మనం చెప్పాలనుకున్న బాధలు, అడగాలనుకున్న కోరికలు అన్నీ ఆయనకు ముందే తెలిసినట్లుగా అనిపిస్తుంది. మాటలతో ప్రార్థించలేకపోయినా, మనసులోని భావమే ప్రార్థనగా మారుతుంది.

ఆలయంలో దర్శన సౌలభ్యం కూడా ప్రశంసనీయం. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, క్యూల నిర్వహణ, దారుల ఏర్పాటు, సిబ్బంది సహకారం దర్శనాన్ని క్రమబద్ధంగా సాగించేందుకు తోడ్పడతాయి. అయితే రద్దీని బట్టి వేచి ఉండే సమయం మారవచ్చు. 

అయినా బాబాను దర్శించుకున్న క్షణంలో ఆ నిరీక్షణ అంతా సార్థకమైనట్లుగా అనిపిస్తుంది.

సమాధి మందిరంతో పాటు ద్వారకామాయి, చావడి, గురుస్థాన్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించినప్పుడు బాబా జీవితంలోని వివిధ కోణాలు మన కళ్లముందు నిలుస్తాయి. 

ద్వారకామాయిలోని ధుని ప్రత్యేకమైన భక్తిభావాన్ని కలిగిస్తే, చావడి బాబా జీవితంతో ముడిపడిన పవిత్ర జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. గురుస్థాన్ వద్ద నిలబడినప్పుడు ఆధ్యాత్మికతతో మనసు నిండిపోతుంది. 

దర్శనం కాగానే బయట పంచే విభూతి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మిఠాయి ప్రసాదం అమృతానుభూతిని అందిస్తుంది. 500 మీటర్ల దూరంలోని ప్రసాదాలయంలో ఉచితంగా మంచి భోజనం చేసిరావడానికి  కూపను కూడా దర్శనం కాగానే చేతికి అందిస్తారు.

బాబాకు రోజూ మూడు హారతులతో పాటు ఉదయం రెండు స్లాట్లుగా ఆయన సమక్షంలో అభిషేకాలు, సాయి సత్యవ్రతాలు (రూ. 100 టిక్కెట్టు పై) జరిపించుకోవచ్చు. 

షిర్డీ సాయిబాబా సమాధి మందిరం దర్శించిన తరువాత తప్పక చూడదగినవి దత్తాత్రేయ మందిరం, గణపతి - శనీశ్వర - మహాదేవ మందిరాలు, లెండీ బాగ్‌లోని నందదీపం, పఠన సదుపాయాలు, దీక్షిత్ వాడా మ్యూజియం. ఇవన్నీ బాబా జీవితాన్ని, ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి. ఇవన్నీ ఆలయం లోపలే ఉన్నాయి. 

సాయిబాబా జీవిత చరిత్ర, సాయి సచ్చరిత్ర వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, పారాయణ చేయడానికి ఆలయం లోపల ఉన్న విశాలమైన హాలు భక్తులకు విశేషమైన అనుభూతి కలిగిస్తుంది. 

అలాగే ఆలయంలోని దీక్షిత్ వాడా మ్యూజియం భక్తులు తప్పక చూడదగిన ప్రదేశం. బాబా ఉపయోగించిన వస్తువులు, ఆయన పాదుకలు, సట్కా (కర్ర), కఫ్నీ వస్త్రం, పాత ఛాయాచిత్రాలు వంటి చారిత్రక జ్ఞాపకాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. వాటిని చూస్తుంటే బాబా జీవించిన కాలం మన కళ్లముందు నిలిచినట్లుంటుంది.

బాబా వెలిగించిన పవిత్ర దీపం నిరంతరం వెలుగుతూ ఉండే ప్రదేశంగా లెండీ బాగ్ లోని  నంద దీపానికి విశిష్టత ఉంది. పచ్చని చెట్ల మధ్య దీపాన్ని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

ఒకసారి దర్శనం అయిపోయాక ఆలయప్రాంగణంలో ఎంత సేపైనా గడపవచ్చు. ఎక్కడికక్కడ కూర్చునేందుకు బెంచీలు. అడుగడుగునా దాహం తీర్చే చల్లటి మంచినీటి సదుపాయం. మండుటెండలోనూ  చల్లని గాలితో సేద తీర్చే పచ్చటి మహా వృక్షాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. తక్షణ అత్యవసర వైద్య సహాయం అందించడానికి ఒక ప్రాథమిక వైద్యశాల కూడా ఆలయ సమీపంలోనే నిరంతరం అందుబాటులో ఉంటుంది. 

ఈ ప్రదేశాలన్నీ చూసిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. షిర్డీ అంటే కేవలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు; అది మనసును మనం తిరిగి చూసుకునే ఒక అవకాశం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ తమదైన అనుభూతి ఉంటుంది. కొందరికి అది కోరిక నెరవేరిన ఆనందం. మరికొందరికి కష్టాల మధ్య లభించిన ధైర్యం.ఇంకొందరికి మాటల్లో చెప్పలేని ప్రశాంతత.

దర్శనం ముగించుకుని ఆలయం బయటకు వస్తున్నప్పుడు, వచ్చినప్పటి మనసుకూ, తిరిగి వెళ్తున్నప్పటి మనసుకూ మధ్య ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. సమస్యలు అన్నీ తొలగిపోయాయని కాదు; వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరిగినట్లుగా అనిపిస్తుంది. బాబా మనతోనే ఉన్నారనే నమ్మకం హృదయంలో నిలిచిపోతుంది.

షిర్డీ దర్శనం అంటే బాబా విగ్రహాన్ని చూడటం మాత్రమే కాదు; ఆయన సన్నిధిలో మనసుకు ప్రశాంతతను, హృదయానికి ధైర్యాన్ని, జీవితానికి కొత్త ఆశను పొందడం.

అందుకే షిర్డీ నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా మనసు అక్కడే ఉండిపోతుంది. చెవుల్లో బాబా నామస్మరణ మారుమోగుతూనే ఉంటుంది. హృదయంలో ఒకే భావన మిగిలిపోతుంది - 

“సబ్ కా మాలిక్ ఏక్… శ్రద్ధా, సబూరీ.”

ఈ రెండు మాటలే షిర్డీ యాత్ర ఇచ్చే గొప్ప సందేశం. భక్తితో ముందుకు సాగాలి, ఓర్పుతో జీవించాలి. బాబా సన్నిధిలో పొందిన ఆ ప్రశాంతతను మన దైనందిన జీవితంలోనూ నిలుపుకోవాలి.

అదే నిజమైన షిర్డీ దర్శనం.*

Monday, 19 October 2026

విజయదశమి విశిష్టత -జీడిగుంట నాగేశ్వరరావు

 

దేవతలను, ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేసిన మహిషాసురుడిని సంహరించేందుకు దేవతల శక్తులన్నీ ఏకమై ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించాయని పురాణాలు చెబుతాయి. తొమ్మిది రాత్రులపాటు సాగిన భీకర పోరాటం అనంతరం పదో రోజున అమ్మవారు మహిషాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు.

అమ్మవారి ఈ గాథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మనలోని అహంకారం, కోపం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలను జయించినప్పుడే నిజమైన విజయం సాధించినవారమవుతాం.

విజయదశమి ఆచారాలు — వాటి అంతరార్థం

ఆయుధ పూజ: మన జీవనోపాధికి ఉపయోగపడే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, వృత్తిపరమైన పరికరాలను పూజించడం ద్వారా కష్టానికి, వృత్తికి గౌరవం తెలియజేస్తాం.

విద్యారంభం: చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ద్వారా జ్ఞానార్జనకు శ్రీకారం చుడతారు.

శమీ వృక్ష పూజ: శమీ వృక్షాన్ని పూజించి ఆకులను పరస్పరం పంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది స్నేహం, శుభాకాంక్షలు, సౌభాగ్యానికి ప్రతీక.

కొత్త పనుల ప్రారంభం: విజయదశమి శుభదినమనే విశ్వాసంతో కొత్త వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విద్యా కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలకు శ్రీకారం చుడతారు.

విజయదశమికి రామాయణంతోనూ సంబంధం

విడదీయలేని అనుబంధం ఉంది. సీతాదేవిని అపహరించిన రావణాసురుడిపై శ్రీరాముడు యుద్ధం చేసి, అతడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజుగా కూడా ఈ పండుగను భావిస్తారు.

రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు, అపారమైన శక్తిసంపన్నుడు. అయినప్పటికీ అతడి అహంకారం, అధర్మం పతనానికి కారణమయ్యాయి. శ్రీరాముడు మాత్రం కష్టాలను ఎదుర్కొంటూ సత్యం, ధర్మం, సహనం, కర్తవ్యనిష్ఠతో విజయాన్ని సాధించాడు.

ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే — అధికారం, ఐశ్వర్యం, పాండిత్యం ఉన్నంత మాత్రాన విజయం శాశ్వతం కాదు. ధర్మబద్ధమైన జీవనమే మనిషికి నిజమైన గౌరవాన్ని తెస్తుంది.

విజయదశమి సందేశం

విజయదశమి అంటే కేవలం పండుగ చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, స్వీట్లు పంచుకోవడం మాత్రమే కాదు. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం.

మనలోని రావణుడిని మనమే గుర్తించాలి. మన అహంకారమే రావణుడైతే, మనలోని ధర్మబుద్ధే శ్రీరాముడు కావాలి. మన బలహీనతలే మహిషాసురుడైతే, మనలోని ఆత్మవిశ్వాసం, సంకల్పబలం దుర్గాదేవి శక్తిగా మారాలి.

కుటుంబంలో ప్రేమ, సమాజంలో మానవత్వం, మాటల్లో నిజాయితీ, చేతల్లో న్యాయం ఉన్నప్పుడే పండుగల అసలైన ఉద్దేశం నెరవేరుతుంది. ఇతరులపై విజయం సాధించడం కంటే మనలోని చెడును జయించడం గొప్ప విజయం.

విజయదశమి మనకు అందించే అసలైన సందేశం ఇదే — ధర్మాన్ని నమ్మాలి, సత్యాన్ని ఆచరించాలి, మానవత్వాన్ని కాపాడాలి. ప్రతి అపజయాన్ని కొత్త పాఠంగా స్వీకరించి, ప్రతి అడ్డంకిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలి.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 


పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...