Wednesday, 12 August 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965)



జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. జవర్ సీతారామన్ కధకు చిత్రానువాదం , దర్శకత్వం వీ మధుసూదనరావు. ఆచార్య ఆత్రేయ మాటలతో పాటు కొన్ని పాటలు రాశారు. ఆరుద్ర, కొసరాజు మరికొన్ని పాటలు రాశారు. 

రాజా జగన్నాథరావు (గుమ్మడి)  ధనిక జమీందారు. క్రమశిక్షణ, రూల్స్ విషయంలో   కుటుంబ సభ్యులు లేదా కార్మికులు అనే తేడా చూపించడు. ఎవరైనా ధైర్యం చేసి ఆయన నియమాలు ఉల్లంఘిస్తే వాళ్ళని కొట్టడానికి కూడా వెనకాడడు.ఇంట్లో  ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు. జగన్నాథరావు భార్య రూప దేవి (జి. వరలక్ష్మి), పెద్ద కుమారుడు రఘు (అక్కినేని నగేశ్వరరావు) గౌరవంతో ఆయన మాటలు వింటారు. కాని, చిన్న కుమారుడు చిన్నబాబు (నాగరాజు) ఈ నియమాలకు చాలా చికాకు తెచ్చుకుంటాడు. అతను చిన్న కోరికలను నెరవేర్చలేని ఇంటి కంటే ఒక జైలు కూడా మంచిదని అతను భావిస్తాడు. జగన్నాథరావు చిన్న కుమారుడు ఆలోచనలు గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా అతనిని రెండుసార్లు హెచ్చరిస్తాడు కానీ చిన్నబాబు పట్టించుకోడు.  జగన్నాథరావు విపరీతమైన కోపంతో చిన్నాబాబును కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ భయంతో అతడు షాక్ తో మరణిస్తాడు. ఈ సంఘటన ఫలితంగా జగన్నాథరావు మానసికంగా కృంగి పోతాడు. మంచం పడతాడు. మరోవైపు  గతం అతనిని వెంటాడుతుంది. ఒక స్త్రీ రోజూ రాత్రి దెయ్యం మాదిరి పాడుతూ నీడలా  భయపెడుతూ ఉంటుంది. తాను ప్రేమించిన పేద మహిళను, ఆమెకు తన  వల్ల కలిగిన అమ్మాయిని జగన్నాథరావు గుర్తు చేసుకుంటాడు. మరణిస్తూ ఈ విషయాన్ని రఘు కి చెప్పి ఏదో విధంగా ఆ అమ్మాయిని కనుగొని, చెల్లిగా చేరదీయమని కోరతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాణి (భానుమతి). వీధుల్లో డాన్సులు చేస్తూ పాడుతూ ఉంటుంది. రఘు తాను ప్రేమించిన మాలా (కృష్ణ కుమారి) సహాయంతో రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆమెను ఇంటికితీసుకు వస్తాడు, అతను రాణి ఇంటిలో సరిగ్గా ఎలా ఉండాలో నేర్పుతాడు. జగన్నాథరావు ఆస్తిపై కన్నేసి తమ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న నాగు (జగ్గయ్య), జోగులు (నెల్లూరు కాంతారావు) కు  బుద్ధి చెబుతాడు. ఆస్తి వారి చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడతాడు. తండ్రి కల నెరవేరుస్తాడు, చివరికి మాలాను వివాహం చేసుకుంటాడు. రాణి సహాయకులుగా రేలంగి, రమణారెడ్డి హాస్యం అందిస్తారు. 

కేవీ మహదేవన్ సంగీతం చేసిన ఈ చిత్రంలో తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, నువ్వంటే నాకెందుకో అదే ఇది, నిను వీడని నీడను నేను పాటలు ఇప్పటికీ రేడియోలో వినిపిస్తాయి. అలాగే భానుమతి పాడిన వినరా విస్సన్నా, దులపర బుల్లోడా పాటలు కూడా ఆదరణ పొందాయి.

1966లో సిడ్నీలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.*

 

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...