-జీడిగుంట నాగేశ్వరరావు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్నాటక సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార. కేవలం గాయకుడిగానే కాకుండా, వాగ్గేయకారుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన సంగీతానికి చేసిన సేవలు అనన్యసామాన్యం.
1930 జూలై 6న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, శంకరగుప్తం గ్రామంలో జన్మించారు. ఎనిమిదేళ్ల చిన్న వయసులోనే ఆయన విజయవాడలో తన మొదటి పూర్తిస్థాయి కచేరీని నిర్వహించారు. ఆయన అద్భుత ప్రతిభను చూసి ప్రముఖ హరికథా విద్వాంసులు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గ ఆయన పేరుకు 'బాల' అనే గౌరవ విశేషణాన్ని చేర్చారు.
సంగీతంలో కొత్త ప్రయోగాలు చేయడం ఆయన ప్రత్యేకత. కర్నాటక సంగీత సంప్రదాయాలను గౌరవిస్తూనే, ఆయన సరికొత్త రాగాలను సృష్టించారు. కేవలం మూడు, నాలుగు స్వరాలతోనే అద్భుతమైన రాగాలను కల్పించారు. ఆయన సృష్టించిన కొన్ని కొత్త రాగాలు - మహతి, సుముఖం, సర్వశ్రీ, లవంగి, సిద్ధి.
తెలుగు, సంస్కృతం, తమిళ భాషల్లో 400లకు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలను ఆయన స్వయంగా రచించి, స్వరపరిచారు. ఆయన కేవలం గాత్ర విద్వాంసుడే కాదు, వయొలిన్, వీణ, మృదంగం, కంజీర వంటి వాయిద్యాలను కూడా అద్భుతంగా వాయించగలరు. చెన్నైలో ఎందరో ప్రముఖ గాయకులకు ఆయన వయొలిన్ సహకారం అందించారు.
'భక్త ప్రహ్లాద' చిత్రంలో నారదుడి పాత్రలో నటించి, మెప్పించారు. సినిమాల్లో కూడా పాడారు. నీవూ నేనూ , ఏటిలోని కెరటాలు, వసంత గాలికి, తలలిత రాగ సుధా, శ్రీరామ జయరామ, మౌనమే నీ భాష మొదలైన పాటలు ఇప్పటికీ అలరిస్తాయి.
భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి అవార్డును, ఫ్రాన్స్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు ‘చెవాలియర్‘ ను అందుకున్నారు. ఉత్తమ గాయకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల్లో జాతీయ సినీ పురస్కారాలు కూడా అందుకున్నారు.
ఆయన 2016 నవంబర్ 22న చైన్నైలో పరమపదించారు. స్వరమై, రాగమై, తిల్లానా రూపంలో సంగీత ప్రియుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు..*
No comments:
Post a Comment