కలసివుంటే కలదు సుఖం (1961)
శ్రీ సారధి స్టూడియోస్ పతాకంపై వై. రామకృష్ణ ప్రసాద్, సి. వి. ఆర్. ప్రసాద్ నిర్మించిన కలసివుంటే కలదు సుఖం సినిమా 1961 లో విడుదలైంది.
ఇది ఇద్దరు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం కథ. అన్న (ఎస్ వీ రంగారావు), తమ్ముడు పెరుమాళ్ళు) కలసి ఉంటారు. అన్నకు పిల్లలు ఉండరు. తమ్మునికి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు చిన్నప్పుడే ఓ షాక్ వల్ల అవిటివాడు అవుతాడు. అతని పేరు కిష్టయ్య(ఎన్టీఆర్). చిన్నవాడు రఘు (హరనాథ్) పట్నంలో చదువుకుంటాడు. తనకు పిల్లలు లేని కారణంగా తమ్ముడి చిన్న కొడుకు రఘును దత్తత తీసుకుంటాడు అన్న. ఇక అన్న భార్యకు ఓ అల్లుడు రంగూన్ రాజా (రేలంగి) ఉంటాడు. వాడు వచ్చి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడతాడు. అవిటివాడయిన కిష్టయ్యను రాధ (సావిత్రి) అనే అమ్మాయి పెళ్ళి చేసుకుంటుంది. చిన్నవాడయిన రఘు, తన బావ చెల్లెలు అయిన జానకి ( గిరిజ) ని పెళ్ళాడతాడు. కిష్టయ్యకు ఓ కొడుకు పుడతాడు. కరెంట్ ట్రీట్ మెంట్ తో కిష్టయ్య అవిటి తనం నయమవుతుందని తెలిసి పట్నం వెళతారు. అక్కడ ఓ గది తీసుకొని కిష్టయ్య, రాధ, వారి బాబు ఉంటారు. రఘు పనిచేసే బ్యాంక్ లో డబ్బు తీసుకొని, ఓ నాటకాల కంపెనీ పెట్టి దివాళా తీస్తాడు రంగూన్ రాజా. దాంతో కిష్టయ్య కొడుకును తీసుకు వెళ్ళి సర్కస్ కంపెనీ వారికి అమ్ముతాడు. తమ బిడ్డ కోసం రాధ, కిష్టయ్య వెళతారు. అక్కడ బాబును రక్షించడానికి వెళ్ళిన కిష్టయ్యకు కరెంట్ షాక్ కొడుతుంది. అవిటితనం పోతుంది. చివరకు రంగూన్ రాజా నేరస్థుడు అని రుజువవుతుంది. పోలీసులు పట్టుకు పోతారు. అయితే ఎలాగైనా అతణ్ణి విడిపించాలని కిష్టయ్య పెదనాన్నకు చెబుతాడు. అతని మంచి తనం చూసి రంగూన్ రాజా సైతం కరిగిపోతాడు. తనలాంటి వాడిని కూడా ప్రేమించే మంచి మనసు ఉన్న కిష్టయ్య కుటుంబం పలు కష్టాల పాలు కావడానికి తానే కారణమని భావిస్తాడు. శిక్ష అనుభవించి వచ్చాక రంగూన్ రాజా కూడా అందరితో కలుస్తాడు. కథ అలా సుఖాంతమవుతుంది.
అవిటివాడిగా యన్టీఆర్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక రాధ పాత్రలో సావిత్రి తనదైన నటన ప్రదర్శించారు. రేలంగి విలనిజం సరదాగా ఉంటుంది. సూర్యకాంతం, హేమలత తోడికోడళ్ళ పాత్రలను పండించారు.
ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ రచన చేయగా, దర్శకుడు తాపీ చాణక్య స్క్రీన్ ప్లే రాశారు. ఇక ఇందులోని పాటలను కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర పలికించగా, మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ముద్దబంతి పూలుపెట్టి... మొగలి రేకును జడను చుట్టి.. పాట ఇప్పటికీ హిట్.
ఈ సినిమాను కన్నడలో రాజ్ కుమార్ హీరోగా మురియద మనే పేరుతో రీమేక్ చేయగా, అప్పటికే కన్నడ సీమలో యన్టీఆర్ కలసి ఉంటే కలదు సుఖం అనేక కేంద్రాలలో ప్రదర్శితమైన కారణంగా, రాజ్ చిత్రాన్ని ఎవరూ అంతగా ఆదరించలేదు. ఇక ఇదే కథతో హిందీలో సునీల్ దత్, నూతన్ జంటగా రూపొందిన రంగుల చిత్రం ఖాన్ దాన్ ఘనవిజయం సాధించింది. *
No comments:
Post a Comment