Friday, 17 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 


సిరిసంపదలు (1962)

పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై వి.వెంకటేశ్వర్లు నిర్మించి పీ పుల్లయ్య చిత్రానువాడం,  దర్శకత్వం వహించిన ‘సిరిసంపదలు‘ సినిమా 1962 సెప్టెంబర్ 16న విడుదల అయింది. ఇది కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది.

రఘుపతినాయుడు (నాగయ్య) జమీందారీ వంశంలో పుట్టి దానధర్మాలు చేస్తూ పేరుపొందాడు. జగపతినాయుడు ( గుమ్మడి) అతని కుమారుడు. పార్వతమ్మ (శాంతకుమారి) కుమార్తె. పార్వతమ్మను చక్రధరానికి ( (సుబ్బారావు) ఇచ్చి పెళ్ళి చేశారు. అతడు వారి ఇంట్లోనే ఉండి ఇంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. వారికి ప్రసాద్ (ఏఎన్ఆర్) అనే కుమారుడు ఉన్నాడు. జగపతినాయుడుకు పద్మ(సావిత్రి), లత (వాసంతి), రమ ( గిరిజ) అని ముగ్గురు కూమర్తెలు. వారి తల్లి చనిపోయింది. అయితే తన అన్న కుమార్తెలను పార్వతమ్మే పెంచింది. పద్మను చిన్నప్పటి నుంచి ప్రసాద్‌కిచ్చి పెళ్లిచేయాలనే అనుకుంటూ ఉండేవారు.

కృష్ణాష్టమికి రఘుపతినాయుడుగారి ఇంటిలో మామూలుపద్ధతిలో దానధర్మాలు ఘనంగా జరిగాయి. ఈ దానధర్మాలు మితిమీరి పోతున్నందున తగ్గించవలసిందని చక్రధరం మామకు చెబుతాడు. దానికి ఆయన సమ్మతించడు. దానితో చక్రధరం తనకిక ఆ ఆజమాయిషితో నిమిత్తం లేదని తాను కుటుంబంతో వెళ్ళిపోతానని అంటాడు. రఘుపతినాయుడు వద్దని వారించినపుడు జరిగిన ఘర్షణలో క్రిందపడి మరణిస్తాడు. "నా తండ్రి మరణానికి కారకుడవు నువ్వే. ఇక బయటకు పో" అని జగపతినాయుడు కేకలు వేస్తాడు. ఇంటిలోంచి వెళ్ళిపోయిన చక్రధరం తన స్వస్థానం చేరుకున్నా మామగారి మరణానికి తానే కారణమన్న నింద భరించలేక బెంగతో మరణిస్తాడు.

అక్కడ పార్వతమ్మ పెంపులో పెరిగిన జగపతినాయుడు కుమార్తెలు పద్మ, లత, రమ తమ లాలనపాలనలు చూసేవారు లేక అమితమైన దైన్యస్థితిలో పడిపోతారు. వారిని పట్నంతీసుకు వెళ్ళి జగపతినాయుడు కాన్వెంటులో చేర్పిస్తాడు.

జగపతినాయుడుకూడా తండ్రివలే పరువుప్రతిష్టల కోసం ప్రాకులాటలో తలకు మించిన అప్పులు చేస్తాడు. అప్పులిచ్చేది సార్థకనామధేయుడైన భుజంగం (రాజనాల). జగపతినాయుడు గుమాస్తా గంటయ్య ( రమణారెడ్డి)తన యజమాని ఆసుపాసులన్నీ భుజంగానికి తెలియజేస్తూ ఉండేవాడు.

భుజంగం కుమారుడు మధు (చలం) జగపతినాయుడు కుమార్తె లతను ప్రేమిస్తాడు. కాలేజీలో పరిచయమైన ప్రసాద్, పద్మను లతను రమను తల్లివద్దకు తీసుకురాగానే ఆమె వారు తన అన్నకుమార్తెలన్న విషయం గ్రహిస్తుంది. పద్మ ప్రసాద్ ప్రేమించుకుని పెళ్లిచేసుకోవాలనుకొంటారు. కాని జగపతినాయుడు సమ్మతించడు.

మధు తనకు బాకీదారుడైన జగపతినాయుడు కుమార్తె లతను పెళ్ళాడ నున్నాడని తెలుసుకుని ఆగ్రహావేశపరుడై భుజంగం పెళ్ళిసంబంధం గురించి మాట్లాడటానికి వచ్చిన జగపతినాయుణ్ణి అవమానిస్తాడు. జగపతినాయుడు భుజంగాన్ని కొట్టి జైలుపాలవుతాడు. జైల్లోఉన్నసమయంలో భుజంగం దావావేసి జప్తు చేయడానికి రాగా ప్రసాద్ అడ్డుకుని తానే ఆ ఇంటిని వేలంపాట పాడి కొని పద్మను, లతను, రమను ఆదరిస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న జగపతినాయుడు మేనల్లుని మంచితనానికి సంతోషించి పద్మనిచ్చి పెళ్ళిచేస్తాడు.

భుజంగం కుమారుడు మధుకు, లతకు వివాహం జరుగుతుంది. జగపతినాయుడు, పార్వతమ్మల కుటుంబాలు ఏకమౌతాయి. 

కధ, మాటలు పినిశెట్టి శ్రీరామమూర్తి అందించగా మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. మనం ఇప్పటికీ తరచూ వింటూ ఉండే ఈ పగలు రేయిగా, ఎందుకో సిగ్గెందు కో, వేణు గానమ్ము వినిపించెనే - పాటలు ఈ చిత్రంలోవే.*


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...