Friday, 31 July 2026

పీఎం-కిసాన్ పథకం మరో ఐదేళ్లు - కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

న్యూఢిల్లీ:.  పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.3,15,614 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కేంద్ర ప్రాయోజిత పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 ఆర్థిక సహాయం అందుతోంది. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో ప్రతి నాలుగు నెలలకొకసారి రూ.2000 చొప్పున మొత్తం జమ చేస్తున్నారు. 'పీఎం కిసాన్' పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో మొత్తం 4.47 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని అందించింది. సూర్య సరోవర్​ యోజన​
పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు రూ.5,070 కోట్లతో 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. జలాశయాలు, పారిశ్రామిక చెరువులపై సోలార్ ప్లాంట్ల నిర్మాణమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ సామర్థ్యాన్ని 5,000 మెగావాట్లకు పెంచనున్నారు. 10,000 మెగావాట్ల సామర్థ్యంతో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026-27 నుంచి 2030-31 వరకు ప్రాజెక్టులను అమలులోకి తీసుకురానుండగా, 2032-33 వరకు కేంద్రం ఆర్థిక సహకారం అందించనుంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక్కో ప్రాజెక్టుకు 50 లక్షల వరకు, అలాగే నిర్మాణ దశలో ప్రతి మెగావాట్‌కు కోటి చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం చేయనుంది. 

సముద్ర వనరుల పరిశోధన, వినియోగం దిశగా చేపడుతున్న రూ.84,084 కోట్ల విలువైన 'సముద్ర మంథన్' ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 

క్రీడారంగాన్ని ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా, జాతీయ క్రీడా ఫెడరేషన్ పథకానికి రూ.36, 441 కోట్లు మంజూరు చేశారు. 

రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు ట్విన్ ట్యూబ్ సొరంగాల నిర్మాణాలకు గాను రూ.9,779 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...