Friday, 30 October 2026

భారత సమైక్యతా శిల్పి సర్దార్ వల్లభాయి పటేల్ (జయంతి 31/10/) జీడిగుంట నాగేశ్వరరావు

 



భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అగ్రగామి నాయకుడిగా, దేశ సమైక్యతా శిల్పిగా సర్దార్ వల్లభాయి పటేల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జయంతి (అక్టోబర్ 31) ని భారతదేశంలో "రాష్ట్రీయ ఏక్తా దివస్" గా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశాన్ని ఒకే తాటిపై నిలపడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.

స్వాతంత్ర్య సమయంలో భారతదేశం వందలాది చిన్న చిన్న సంస్థానాలుగా చీలిపోయి ఉంది. పటేల్ తన అసాధారణ రాజనీతిజ్ఞత, ధైర్యసాహసాలతో సుమారు 565 స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేశారు.

దేశ సమైక్యతను కాపాడటంలో ఆయన చూపిన దృఢ సంకల్పం, కఠిన నిర్ణయాల కారణంగా ఆయనను "ఉక్కు మనిషి" అని పిలుస్తారు.

గుజరాత్‌లోని బార్డోలిలో రైతులపై విధించిన అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు. ఆ సమయంలోనే అక్కడి మహిళలు ఆయనకు "సర్దార్" (నాయకుడు) అనే బిరుదును ప్రదానం చేశారు.

దేశ పాలనా రంగాన్ని బలోపేతం చేయడానికి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆధునిక అఖిల భారత సివిల్ సర్వీసుల వ్యవస్థకు పునాది వేశారు. అందుకే ఆయనను సివిల్ సర్వీసుల పితామహుడిగా కూడా కొలుస్తారు.

దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గుజరాత్‌లోని నర్మదా నది తీరాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన "స్టాట్యూ ఆఫ్ యూనిటీ"ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

జాతి సమైక్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్ ఆశయాలు ఎప్పటికీ ఆదర్శనీయం.*

విలక్షణ నేత ఇందిర (వర్ధంతి 31/10)

 



భారత రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, తన సమర్థవంతమైన పాలన, ధైర్యసాహసాలు,కఠిన నిర్ణయాలతో ప్రపంచస్థాయి నాయకురాలిగా ఎదిగారు.

కీలక నిర్ణయాలు

బ్యాంకుల జాతీయకరణ (1969): పేద ప్రజలకు, రైతులకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి 14 ప్రధాన ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణ చేశారు.

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం: పాకిస్తాన్‌పై విజయం సాధించి, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ విజయం ఆమె రాజనీతిజ్ఞతకు నిదర్శనం.

హరిత విప్లవం: భారతదేశంలో ఆహార ధాన్యాల కొరతను నివారించడానికి హరిత విప్లవాన్ని ప్రోత్సహించి, దేశాన్ని ఆహార భద్రత వైపు నడిపించారు.

అణు పరీక్షలు (1974): పొఖ్రాన్‌లో 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో మొదటిసారి విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించి భారత్‌ను అణుశక్తి దేశంగా నిలబెట్టారు.

విమర్శలు - వివాదాలు

1. అత్యవసర పరిస్థితి  (1975-1977)

 ఇందిరా గాంధీ పాలనలో అత్యంత చీకటి అధ్యాయంగా దీనిని పరిగణిస్తారు. రాజకీయ అశాంతి, కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించారు. ఈ కాలంలో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వేలాది మందిని విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించారు. పత్రికలపై కఠినమైన సెన్సార్‌షిప్ విధించారు.

2. ఆపరేషన్ బ్లూ స్టార్ (1984)

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని పవిత్ర స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న వేర్పాటువాద ఉగ్రవాదులను ఏరివేయడానికి 'ఆపరేషన్ బ్లూ స్టార్' పేరిట సైనిక చర్యకు ఆదేశించారు. ఈ సైనిక చర్య సమయంలో సిక్కుల పవిత్ర స్థలం దెబ్బతినడం, సిక్కుల మనోభావాలు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటనే ఆమె హత్యకు ప్రధాన కారణంగా మారింది.

3. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం

కాంగ్రెస్ పార్టీపై తన పట్టును నిలుపుకోవడానికి ఆమె పార్టీలో సీనియర్ నాయకులను పక్కనబెట్టి, హైకమాండ్ సంస్కృతిని, కేంద్రీకృత ప్రభుత్వాన్ని బలపరిచారనే విమర్శ ఉంది. ప్రాంతీయ నాయకుల స్వయంప్రతిపత్తిని తగ్గించి, పార్టీలో ప్రత్యర్థులను అణచివేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

4. కుటుంబ రాజకీయాలకు పెద్దపీట

ఇందిరా గాంధీ తన కుమారులైన సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా భారత రాజకీయాల్లో కుటుంబ పాలనకు బలమైన పునాది వేశారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ఈ విధంగా, ఆమె తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం వైపు నడిపించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే, అదే సమయంలో దేశ సమైక్యత కోసం ఆమె చేసిన  త్యాగం, తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ఆమెను చరిత్రలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

1984 అక్టోబర్ 31న న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన ఈ రోజును రాష్ట్రీయ సంకల్ప దివస్ గా పాటిస్తారు.*



Tuesday, 27 October 2026

బాబా సన్నిధి - శాంతి పెన్నిధి (జీడిగుంట నాగేశ్వరరావు)


షిర్డీకి వెళ్లాలనే ఆలోచన మనసులో కలిగినప్పటి నుంచే ఏదో తెలియని ఆనందం. సాయిబాబాను దర్శించుకోవాలనే కోరికతో అడుగులు ముందుకు సాగుతుంటే, మనసులో భక్తిభావం నెమ్మదిగా నిండిపోతుంది. ఇక షిర్డీ చేరుకుని బాబా ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి కలిగే అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది.

ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తుల సందడి కనిపిస్తుంది. అయినా ఆ సందడి మధ్యలోనూ ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. ఎటు చూసినా బాబా నామస్మరణ, భక్తుల ముఖాల్లో కనిపించే విశ్వాసం, సేవకుల క్రమబద్ధమైన నిర్వహణ - ఇవన్నీ కలిసి ఒక పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తాయి.

దర్శనానికి వెళ్లే మార్గంలో భక్తులు నెమ్మదిగా ముందుకు సాగుతుంటారు. ఆ నిరీక్షణలోనూ ఒక ఆనందం ఉంది. మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు ఉన్నా, బాబా సన్నిధికి చేరువవుతున్న కొద్దీ అవన్నీ క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయి. చివరకు సమాధి మందిరంలో బాబా దివ్యమూర్తిని చూడగానే, కొన్ని క్షణాల పాటు కాలమే ఆగిపోయినట్లనిపిస్తుంది.

సింహాసనంపై రాజాధిరాజులా మననే చూస్తున్నారా అనిపించే చల్లటి కళ్ళతో ప్రశాంతంగా కూర్చున్న బాబా రూపం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ ముఖంలోని కరుణ, ఆ చూపులోని ఆప్యాయత, ఆ సన్నిధిలోని పవిత్రత - భక్తుడి హృదయాన్ని నిశ్శబ్దంగా తాకుతాయి. మనం చెప్పాలనుకున్న బాధలు, అడగాలనుకున్న కోరికలు అన్నీ ఆయనకు ముందే తెలిసినట్లుగా అనిపిస్తుంది. మాటలతో ప్రార్థించలేకపోయినా, మనసులోని భావమే ప్రార్థనగా మారుతుంది.

ఆలయంలో దర్శన సౌలభ్యం కూడా ప్రశంసనీయం. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ, క్యూల నిర్వహణ, దారుల ఏర్పాటు, సిబ్బంది సహకారం దర్శనాన్ని క్రమబద్ధంగా సాగించేందుకు తోడ్పడతాయి. అయితే రద్దీని బట్టి వేచి ఉండే సమయం మారవచ్చు. 

అయినా బాబాను దర్శించుకున్న క్షణంలో ఆ నిరీక్షణ అంతా సార్థకమైనట్లుగా అనిపిస్తుంది.

సమాధి మందిరంతో పాటు ద్వారకామాయి, చావడి, గురుస్థాన్ వంటి పవిత్ర ప్రదేశాలను సందర్శించినప్పుడు బాబా జీవితంలోని వివిధ కోణాలు మన కళ్లముందు నిలుస్తాయి. 

ద్వారకామాయిలోని ధుని ప్రత్యేకమైన భక్తిభావాన్ని కలిగిస్తే, చావడి బాబా జీవితంతో ముడిపడిన పవిత్ర జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. గురుస్థాన్ వద్ద నిలబడినప్పుడు ఆధ్యాత్మికతతో మనసు నిండిపోతుంది. 

దర్శనం కాగానే బయట పంచే విభూతి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మిఠాయి ప్రసాదం అమృతానుభూతిని అందిస్తుంది. 500 మీటర్ల దూరంలోని ప్రసాదాలయంలో ఉచితంగా మంచి భోజనం చేసిరావడానికి  కూపను కూడా దర్శనం కాగానే చేతికి అందిస్తారు.

బాబాకు రోజూ మూడు హారతులతో పాటు ఉదయం రెండు స్లాట్లుగా ఆయన సమక్షంలో అభిషేకాలు, సాయి సత్యవ్రతాలు (రూ. 100 టిక్కెట్టు పై) జరిపించుకోవచ్చు. 

షిర్డీ సాయిబాబా సమాధి మందిరం దర్శించిన తరువాత తప్పక చూడదగినవి దత్తాత్రేయ మందిరం, గణపతి - శనీశ్వర - మహాదేవ మందిరాలు, లెండీ బాగ్‌లోని నందదీపం, పఠన సదుపాయాలు, దీక్షిత్ వాడా మ్యూజియం. ఇవన్నీ బాబా జీవితాన్ని, ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని మరింత దగ్గరగా పరిచయం చేస్తాయి. ఇవన్నీ ఆలయం లోపలే ఉన్నాయి. 

సాయిబాబా జీవిత చరిత్ర, సాయి సచ్చరిత్ర వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి, పారాయణ చేయడానికి ఆలయం లోపల ఉన్న విశాలమైన హాలు భక్తులకు విశేషమైన అనుభూతి కలిగిస్తుంది. 

అలాగే ఆలయంలోని దీక్షిత్ వాడా మ్యూజియం భక్తులు తప్పక చూడదగిన ప్రదేశం. బాబా ఉపయోగించిన వస్తువులు, ఆయన పాదుకలు, సట్కా (కర్ర), కఫ్నీ వస్త్రం, పాత ఛాయాచిత్రాలు వంటి చారిత్రక జ్ఞాపకాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. వాటిని చూస్తుంటే బాబా జీవించిన కాలం మన కళ్లముందు నిలిచినట్లుంటుంది.

బాబా వెలిగించిన పవిత్ర దీపం నిరంతరం వెలుగుతూ ఉండే ప్రదేశంగా లెండీ బాగ్ లోని  నంద దీపానికి విశిష్టత ఉంది. పచ్చని చెట్ల మధ్య దీపాన్ని దర్శించుకోవడం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.

ఒకసారి దర్శనం అయిపోయాక ఆలయప్రాంగణంలో ఎంత సేపైనా గడపవచ్చు. ఎక్కడికక్కడ కూర్చునేందుకు బెంచీలు. అడుగడుగునా దాహం తీర్చే చల్లటి మంచినీటి సదుపాయం. మండుటెండలోనూ  చల్లని గాలితో సేద తీర్చే పచ్చటి మహా వృక్షాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. తక్షణ అత్యవసర వైద్య సహాయం అందించడానికి ఒక ప్రాథమిక వైద్యశాల కూడా ఆలయ సమీపంలోనే నిరంతరం అందుబాటులో ఉంటుంది. 

ఈ ప్రదేశాలన్నీ చూసిన తరువాత ఒక విషయం స్పష్టమవుతుంది. షిర్డీ అంటే కేవలం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు; అది మనసును మనం తిరిగి చూసుకునే ఒక అవకాశం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ తమదైన అనుభూతి ఉంటుంది. కొందరికి అది కోరిక నెరవేరిన ఆనందం. మరికొందరికి కష్టాల మధ్య లభించిన ధైర్యం.ఇంకొందరికి మాటల్లో చెప్పలేని ప్రశాంతత.

దర్శనం ముగించుకుని ఆలయం బయటకు వస్తున్నప్పుడు, వచ్చినప్పటి మనసుకూ, తిరిగి వెళ్తున్నప్పటి మనసుకూ మధ్య ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. సమస్యలు అన్నీ తొలగిపోయాయని కాదు; వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరిగినట్లుగా అనిపిస్తుంది. బాబా మనతోనే ఉన్నారనే నమ్మకం హృదయంలో నిలిచిపోతుంది.

షిర్డీ దర్శనం అంటే బాబా విగ్రహాన్ని చూడటం మాత్రమే కాదు; ఆయన సన్నిధిలో మనసుకు ప్రశాంతతను, హృదయానికి ధైర్యాన్ని, జీవితానికి కొత్త ఆశను పొందడం.

అందుకే షిర్డీ నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా మనసు అక్కడే ఉండిపోతుంది. చెవుల్లో బాబా నామస్మరణ మారుమోగుతూనే ఉంటుంది. హృదయంలో ఒకే భావన మిగిలిపోతుంది - 

“సబ్ కా మాలిక్ ఏక్… శ్రద్ధా, సబూరీ.”

ఈ రెండు మాటలే షిర్డీ యాత్ర ఇచ్చే గొప్ప సందేశం. భక్తితో ముందుకు సాగాలి, ఓర్పుతో జీవించాలి. బాబా సన్నిధిలో పొందిన ఆ ప్రశాంతతను మన దైనందిన జీవితంలోనూ నిలుపుకోవాలి.

అదే నిజమైన షిర్డీ దర్శనం.*

Monday, 19 October 2026

విజయదశమి విశిష్టత -జీడిగుంట నాగేశ్వరరావు

 

దేవతలను, ముల్లోకాలను భయభ్రాంతులకు గురిచేసిన మహిషాసురుడిని సంహరించేందుకు దేవతల శక్తులన్నీ ఏకమై ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించాయని పురాణాలు చెబుతాయి. తొమ్మిది రాత్రులపాటు సాగిన భీకర పోరాటం అనంతరం పదో రోజున అమ్మవారు మహిషాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు.

అమ్మవారి ఈ గాథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. మనలోని అహంకారం, కోపం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలను జయించినప్పుడే నిజమైన విజయం సాధించినవారమవుతాం.

విజయదశమి ఆచారాలు — వాటి అంతరార్థం

ఆయుధ పూజ: మన జీవనోపాధికి ఉపయోగపడే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, వృత్తిపరమైన పరికరాలను పూజించడం ద్వారా కష్టానికి, వృత్తికి గౌరవం తెలియజేస్తాం.

విద్యారంభం: చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ద్వారా జ్ఞానార్జనకు శ్రీకారం చుడతారు.

శమీ వృక్ష పూజ: శమీ వృక్షాన్ని పూజించి ఆకులను పరస్పరం పంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది స్నేహం, శుభాకాంక్షలు, సౌభాగ్యానికి ప్రతీక.

కొత్త పనుల ప్రారంభం: విజయదశమి శుభదినమనే విశ్వాసంతో కొత్త వ్యాపారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, విద్యా కార్యక్రమాలు, ఇతర శుభకార్యాలకు శ్రీకారం చుడతారు.

విజయదశమికి రామాయణంతోనూ సంబంధం

విడదీయలేని అనుబంధం ఉంది. సీతాదేవిని అపహరించిన రావణాసురుడిపై శ్రీరాముడు యుద్ధం చేసి, అతడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజుగా కూడా ఈ పండుగను భావిస్తారు.

రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు, అపారమైన శక్తిసంపన్నుడు. అయినప్పటికీ అతడి అహంకారం, అధర్మం పతనానికి కారణమయ్యాయి. శ్రీరాముడు మాత్రం కష్టాలను ఎదుర్కొంటూ సత్యం, ధర్మం, సహనం, కర్తవ్యనిష్ఠతో విజయాన్ని సాధించాడు.

ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే — అధికారం, ఐశ్వర్యం, పాండిత్యం ఉన్నంత మాత్రాన విజయం శాశ్వతం కాదు. ధర్మబద్ధమైన జీవనమే మనిషికి నిజమైన గౌరవాన్ని తెస్తుంది.

విజయదశమి సందేశం

విజయదశమి అంటే కేవలం పండుగ చేసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, స్వీట్లు పంచుకోవడం మాత్రమే కాదు. మన జీవితాన్ని మనం సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సందర్భం.

మనలోని రావణుడిని మనమే గుర్తించాలి. మన అహంకారమే రావణుడైతే, మనలోని ధర్మబుద్ధే శ్రీరాముడు కావాలి. మన బలహీనతలే మహిషాసురుడైతే, మనలోని ఆత్మవిశ్వాసం, సంకల్పబలం దుర్గాదేవి శక్తిగా మారాలి.

కుటుంబంలో ప్రేమ, సమాజంలో మానవత్వం, మాటల్లో నిజాయితీ, చేతల్లో న్యాయం ఉన్నప్పుడే పండుగల అసలైన ఉద్దేశం నెరవేరుతుంది. ఇతరులపై విజయం సాధించడం కంటే మనలోని చెడును జయించడం గొప్ప విజయం.

విజయదశమి మనకు అందించే అసలైన సందేశం ఇదే — ధర్మాన్ని నమ్మాలి, సత్యాన్ని ఆచరించాలి, మానవత్వాన్ని కాపాడాలి. ప్రతి అపజయాన్ని కొత్త పాఠంగా స్వీకరించి, ప్రతి అడ్డంకిని ధైర్యంగా అధిగమిస్తూ ముందుకు సాగాలి.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు! 


Saturday, 17 October 2026

ఎల్‌నినో ఆకాశంలో…ఎఫెక్ట్‌ వంటింట్లో…! (సంపాదకీయం- జీడిగుంట నాగేశ్వరరావు)


ఎల్నినో మాట అలా ఉంచితే మీడియా గోల చూస్తుంటే మాత్రం ప్రజల మెదడులో కరువు తాండవించేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. వాతావరణ శాఖ ఒక చిన్న సలహా ఇస్తే చాలు, మన మీడియా "గొట్టాం" వీరులు దాన్ని ప్రళయ ఘోషలా మార్చేస్తారు. 

ప్రభుత్వ హెచ్చరికల వెనుక ఉన్న అసలు ఉద్దేశం నీటి ఎద్దడిని తట్టుకోవడం, రైతులను నష్టాల నుంచి కాపాడడం. కానీ ఈ ప్రచారార్భాటపు లంకె పెట్టే వీరులకు ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయి? వారికి కావాల్సింది కేవలం సంచలనం, జనాన్ని భయపెట్టడమే!

చానెళ్లలో ప్రళయం.. దుకాణంలో వాస్తవం!

మీడియా హైపర్ డ్రామా: "ఇక దేశంలో బియ్యం దొరకవు, పండించే వరి లేదు, రేపు కేజీ బియ్యం వంద రూపాయలు దాటిపోతుంది" అంటూ స్టూడియోలలో కూర్చొని గొంతులు చించుకోవడం నిత్యకృత్యమైపోయింది.

వ్యాపారుల దందా: ఇక ఈ వార్తలు  దళారులు, వ్యాపారులకు పండగే. మీడియా కల్పించిన కృత్రిమ భయాన్ని ఆసరాగా చేసుకొని, అప్పుడే నిల్వలన్నీ దాచిపెట్టడం మొదలెట్టేసారు.  కిలో 85 బియ్యం అమాంతం 95 అంటున్నారు.

ఈ బియ్యం ఎల్‌నినో వచ్చాక పండిన ధాన్యమా? నిన్నటి వరకు ఉన్న నిల్వలకు ఈరోజే ఈ  ధరలు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించే నాథుడే లేడు. ఆ దిశగా అవగాహన కల్పించే తెలివైన మీడియా కూడా లేదు. 

నీటి ఎద్దడి ఉంటే రైతులు ఏ పంట వేయాలి? ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి? నీటి లభ్యతను బట్టి ఏ ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలి? వీటిపై వ్యవసాయ శాఖ శాస్త్రీయంగా అవగాహన కల్పించాలి. అవసరమైతే రైతులకు విత్తనాలు, పెట్టుబడి సాయం, పంటల కొనుగోలు విషయంలో భరోసా ఇవ్వాలి.

కానీ రైతుకు వరి వేయొద్దని చెప్పడం ఒక్కటే ప్రభుత్వ బాధ్యత కాదు. వరి వేయకపోతే రైతు ఆదాయానికి ప్రత్యామ్నాయం ఏమిటో కూడా చెప్పాలి. పంట మార్చుకుంటే దిగుబడి, గిట్టుబాటు ధర విషయంలో రక్షణ కల్పించాలి. సాగునీటి లభ్యతను బట్టి స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలి.

రైతును కాపాడాలి… వినియోగదారుడిని ఆదుకోవాలి… ఈ ఇద్దరి మధ్యలో నిలబడి లాభాలు పిండుకునేవారిపై నిఘా పెట్టాలి.

రైతుకు మాత్రం ప్రతి విషయంలో ఆంక్షలు, సూచనలు, హెచ్చరికలు! కానీ వ్యాపారులపై నియంత్రణ ఎక్కడ? ధరలు పెరిగితే నిల్వలపై తనిఖీలు ఎక్కడ? కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలేవి? బియ్యం ధరల పెరుగుదలకు అసలు కారణాలపై ప్రభుత్వ వివరణ ఎక్కడ?

ప్రకృతి మన చేతుల్లో లేదు. వర్షాలు మన ఆజ్ఞలకు అనుగుణంగా కురవవు. కానీ ధరల నియంత్రణ, నిల్వల పర్యవేక్షణ, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోనే ఉన్నాయి. మరి వాటిని సమర్థంగా అమలు చేయలేకపోతే ప్రకృతిని నిందించి ప్రయోజనం ఏమిటి?

రైతుకు నీటి భరోసా ఇవ్వలేని వ్యవస్థ, వినియోగదారుడికి ధరల భరోసా ఇవ్వలేని పాలన, వాస్తవాలను పరిశీలించకుండా సంచలనాలకు ప్రాధాన్యమిచ్చే మీడియా… ఈ మూడింటి మధ్య నలిగిపోయేది సామాన్యుడే!

మీడియా బాధ్యత ఎక్కడ?

ప్రజలను అప్రమత్తం చేయడం మీడియా బాధ్యత. కానీ ప్రజలను భయపెట్టడం కాదు. ప్రభుత్వ విధానంపై ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో అవసరమే. అయితే ప్రభుత్వం నిజంగా ఏం చెప్పింది, శాస్త్రవేత్తలు ఏం అంచనా వేస్తున్నారు, నీటి వనరుల పరిస్థితి ఏమిటి, బియ్యం నిల్వలు ఎంత ఉన్నాయి, మార్కెట్లో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే అంశాలను పరిశీలించకుండా ‘వంద రూపాయలు’ అంటూ ఊదరగొడితే అది జర్నలిజమా? జాతరలో జోస్యమా?

ఒక వార్త ప్రసారమయ్యాక దాని ప్రభావం ప్రజలపై ఎలా పడుతుందో కూడా మీడియా ఆలోచించాలి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరల విషయంలో నిర్ధారణ లేని అంచనాలను సంచలనాలుగా మార్చడం వల్ల మార్కెట్లో అనవసరమైన భయాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

అయితే బియ్యం ధరలు పెరిగాయని చెప్పే ప్రతి వార్తా తప్పే కాదు. ధరల పెరుగుదల వాస్తవమైతే దాన్ని బయటపెట్టాలి. కానీ ధర పెరిగే అవకాశం ఉందని చెప్పడం వేరు… ధర పెరగడానికి ముందే భయాన్ని మార్కెట్లోకి వదలడం వేరు! ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉంది.

ఎల్‌నినో ప్రభావం ఎంత ఉంటుందో వాతావరణ నిపుణులు అంచనా వేస్తారు. వర్షపాతం ఎలా ఉండవచ్చో శాస్త్రీయ సంస్థలు వివరిస్తాయి. నీటి లభ్యతను బట్టి వ్యవసాయ ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించాలి. బియ్యం ఉత్పత్తి, నిల్వలు, సరఫరా పరిస్థితులను బట్టి ధరలపై సమీక్ష జరగాలి.

కానీ ఇవన్నీ పక్కనపెట్టి, ఎల్‌నినో పేరుతో ముందుగానే ధరలు పెరిగితే మాత్రం ప్రజలకు మిగిలేది ఆందోళనే!

రైతు పొలంలో పంట పండాలి. వ్యాపారి వ్యాపారం న్యాయంగా సాగాలి. మీడియా వాస్తవాలను వెలుగులోకి తేవాలి. ప్రభుత్వం ధరలపై నిఘా పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది.

ఏదైనా ప్రస్తుతానికి ఎల్‌నినో ఆకాశంలో ఉంటే  దాని ఎఫెక్ట్‌ మాత్రం సామాన్యుడి వంటింట్లో కనిపిస్తోంది…!*


Wednesday, 14 October 2026


భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మానవతావాదానికి, సర్వమత సమైక్యతకు ప్రతీక అయిన దైవ స్వరూపం శ్రీ షిర్డీ సాయిబాబా. కులమతాలకు అతీతంగా కోట్లాది మంది హృదయాల్లో కొలువైన ఆ పరమ గురువు మహాసమాధి చెంది నేటికీ (అక్టోబర్ 15) 108 సంవత్సరాలు.  ఈ సందర్భంగా సాయిబాబా దివ్యచరణాలకు కోట్లాది భక్తులు నివాళులు అర్పిస్తున్నారు.


1918 అక్టోబరు 15వ తేదీ విజయదశమి నాడు మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు బాబా తన భౌతిక దేహాన్ని విడిచారు.

శరీరంతో సంబంధం లేకుండా, తాను ఎల్లప్పుడూ భక్తులకు అండగా ఉంటానని బాబా షిర్డీ వేదికగా భక్తులకు అభయం ఇచ్చారు. ఆయన ప్రసాదించిన పదకొండు హామీలు నేటికీ భక్తుల జీవితాలకు దిక్సూచిగా నిలుస్తున్నాయి: 


మహాసమాధిలోకి ప్రవేశించే ముందు బాబా తన భక్తురాలు లక్ష్మీబాయికి తొమ్మిది నాణేలను అందించారు. ఈ తొమ్మిది నాణేలు నవవిధ భక్తి మార్గాలకు ప్రతీకలుగా భావిస్తారు. భగవంతుడిని చేరుకోవడానికి తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నాయని సాయిబాబా బోధించారు.


నవవిధ భక్తి మార్గాలు


1. శ్రవణం (భగవంతుని లీలలను వినడం)

భగవంతుని అవతారాల మహిమలను, దివ్య చరిత్రలను, లీలలను పరిపూర్ణ భక్తిశ్రద్ధలతో వినడమే శ్రవణం. భగవంతుని కథలను వినడం ద్వారా మనసు పవిత్రమవుతుంది. హృదయంలో భక్తిభావం పెంపొందుతుంది.

2. కీర్తనం (భగవంతుని మహిమలను గానం చేయడం)

భగవంతుని గుణగణాలను, మహిమలను కీర్తిస్తూ గానం చేయడమే కీర్తనం. భజనలు, సంకీర్తనలు భక్తులకు దైవానుగ్రహాన్ని అందిస్తాయి. పరిసరాలను పవిత్రం చేసి మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.

3. స్మరణం (నిరంతరం భగవంతుడిని స్మరించడం)

ఏకాగ్రతతో, ప్రేమతో నిరంతరం భగవంతుడిని స్మరించడమే స్మరణం. సుఖదుఃఖాల్లోనూ, కష్టసుఖాల్లోనూ దైవనామాన్ని మరువకుండా స్మరించడం ద్వారా మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని చేరుకోగలడు.

4. పాదసేవనం (భగవంతుని పాదసేవ)

భగవంతుని పాదాలను సేవించడం, ఆయన పట్ల వినయవిధేయతలను ప్రదర్శించడం పాదసేవనం. భగవంతుని పాదసేవలోనే శరణాగతి భావం దాగి ఉంది. గురువును దైవస్వరూపంగా భావించి సేవించడం కూడా ఈ భక్తి మార్గంలో భాగమే.

5. అర్చనం (పూజించడం)

భగవంతుని విగ్రహాలను పుష్పాలతో, పూజాద్రవ్యాలతో అర్చించి, భక్తిశ్రద్ధలతో ఆరాధించడమే అర్చనం. మనసును దైవంపై నిలిపి, పవిత్ర భావంతో పూజ చేయడం ద్వారా భక్తుడు భగవంతునికి చేరువవుతాడు.

6. వందనం (నమస్కరించడం)

భగవంతునికి నమస్కరించడం, ఆయన మహిమలను స్మరిస్తూ వినయంతో ప్రార్థించడం వందనం. అహంకారాన్ని విడిచిపెట్టి దైవం ముందు తలవంచడం ఈ భక్తి మార్గంలోని ప్రధాన లక్షణం. సంపూర్ణ విశ్వాసంతో చేసే నమస్కారం భక్తుని హృదయంలో వినయాన్ని పెంపొందిస్తుంది.

7. దాస్యం (దైవసేవకునిగా జీవించడం)

తనను తాను భగవంతుని సేవకునిగా భావించి, ఆయన సంకల్పానికి అనుగుణంగా జీవించడమే దాస్యభక్తి. భగవంతుని గుణగణాలను, స్వభావాన్ని, మహిమను అర్థం చేసుకుంటూ ఆయన సేవలో తరించడం ఈ భక్తి మార్గంలోని విశిష్టత.

భగవంతుని ఆజ్ఞను శిరసావహిస్తూ, తన కర్తవ్యాలను దైవసేవగా భావించి నిర్వర్తించే వ్యక్తి దాస్యభక్తిని ఆచరిస్తున్నట్లే.

8. సఖ్యం (భగవంతుడిని స్నేహితునిగా భావించడం)

భగవంతుడిని ఆత్మీయ స్నేహితునిగా భావించి, ఆయనతో మనసులో సంభాషిస్తూ, తన సుఖదుఃఖాలను ఆయనతో పంచుకోవడమే సఖ్యభక్తి. నిజమైన స్నేహితునిపై ఎలాంటి సందేహాలు లేకుండా విశ్వాసం ఉంచినట్లే, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటమే ఈ భక్తి మార్గంలోని అంతరార్థం.

9. ఆత్మనివేదనం (సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం)

తన శరీరాన్ని, మనసును, ఆత్మను, తనకున్న సమస్తాన్ని భగవంతునికి అర్పించడమే ఆత్మనివేదనం. తనకంటూ ఏదీ మిగుల్చుకోకుండా సర్వస్వాన్ని దైవానికి సమర్పించి, ఆయన సంకల్పమే తన సంకల్పంగా భావించి జీవించడం ఈ భక్తి మార్గంలోని పరమార్థం.

ఆత్మనివేదనలో భక్తుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి, తన జీవితాన్ని భగవంతుని చేతుల్లో ఉంచుతాడు. సంపూర్ణ శరణాగతితో దైవంపై ఆధారపడతాడు.


సాయిబాబా బోధనలోని అంతరార్థం


సాయిబాబా మసీదు లేదా ద్వారకామాయిలో పలుమార్లు ఇలా చెప్పేవారు:

“నన్ను అత్యంత ప్రేమించేవాడు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తాడు.”


భక్తుల ఆధ్యాత్మిక అభ్యున్నతిపై బాబా ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారి కష్టాలను తొలగించి, వారికి సంతోషాన్ని కలిగించేందుకు కృషి చేసేవారు.


సద్గురువు పాదాలను భక్తిశ్రద్ధలతో స్మరించినప్పుడు మన కష్టాలు తొలగిపోతాయి. మరణభయం తన తీవ్రతను కోల్పోతుంది. ఈ ప్రాపంచిక జీవనంలోని బాధలు, కష్టాలు క్రమంగా దూరమవుతాయి.

సద్గురువుపై సంపూర్ణ విశ్వాసం, దైవనామ స్మరణ, సేవాభావం, శరణాగతి -  ఇవే భక్తి మార్గంలో మనల్ని ముందుకు నడిపించే ప్రధాన సాధనాలు.


సాయిబాబా మహాసమాధి దినం కేవలం ఒక ఆధ్యాత్మిక స్మరణ దినం మాత్రమే కాదు. ఆయన బోధనలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టుకోవాల్సిన సందర్భం కూడా.


దైవనామ స్మరణ మనసుకు ప్రశాంతతను అందించాలి. భక్తి మనలో వినయాన్ని పెంచాలి. ఆరాధన మనలో దయాగుణాన్ని నింపాలి. సేవ మనల్ని తోటి మనుషులకు చేరువ చేయాలి. విశ్వాసం మనకు ధైర్యాన్ని అందించాలి. సహనం మనల్ని సరైన మార్గంలో నడిపించాలి.


మన హృదయాల్లో ద్వేషానికి బదులు ప్రేమను, స్వార్థానికి బదులు సేవను, అహంకారానికి బదులు వినయాన్ని నింపుకున్నప్పుడే సాయినాథుని బోధనలకు నిజమైన గౌరవం ఇచ్చినవారమవుతాం.


సబ్ కా మాలిక్ ఏక్ - అందరికీ దైవం  ఒక్కడే.

అదే సాయినాథుని ఆధ్యాత్మిక సందేశం. అదే మానవత్వానికి మార్గదర్శకం. అదే నవవిధ భక్తి మనకు అందించే జీవన సారం.


ఈ 108వ మహాసమాధి దినోత్సవం సందర్భంగా, బాబా బోధించిన "శ్రద్ధా - సబూరి" (నమ్మకం -  ఓర్పు) మార్గంలో నడుచుకుంటూ, తోటివారికి సహాయం చేయడమే మనం బాబాకుర్పించే నిజమైన నివాళి.*

శ్రీ సాయినాథ మహారాజ్ కీ జై!* 

Saturday, 10 October 2026

మధుర సంగీత రసాలూరించిన సాలూరి (జయంతి అక్టోబర్ 11) -జీడిగుంట నాగేశ్వరరావు

 


తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ సంగీత దర్శకులలో సాలూరి రాజేశ్వరరావు ఒకరు. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన అందించిన మధురమైన గీతాలు, అజరామరమైన బాణీలు తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  

రాజేశ్వరరావు అక్టోబర్ 11, 1922 న విజయనగరం జిల్లా (అప్పటి శ్రీకాకుళం జిల్లా) సాలూరు సమీపంలోని శివరామపురం గ్రామంలో జన్మించారు.ఆయన తండ్రి సన్యాసిరాజు ప్రముఖ మృదంగ విద్వాంసులు. రాజేశ్వరరావు కేవలం నాలుగో ఏటనే కర్ణాటక సంగీత రాగాలను గుర్తించగల ప్రతిభ కనబరిచారు.  చిన్నతనంలోనే గ్రామఫోన్ రికార్డుల ద్వారా భగవద్గీత శ్లోకాలు పాడుతూ ప్రసిద్ధి చెందారు.

1935లో వచ్చిన 'శ్రీకృష్ణ లీలలు' చిత్రంలో బాలకృష్ణుడిగా నటించి, తెలుగు ప్రేక్షకులకు నటుడిగా కూడా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని మూకీ, మాట్లాడే చిత్రాలలోనూ నటించారు.   ప్రముఖ జెమినీ స్టూడియోస్‌లో దాదాపు దశాబ్ద కాలం పాటు పని చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు.

భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని లలిత సంగీతం, జానపద బాణీలతో అద్భుతంగా మిళితం చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. మోహనం, అభేరి, కళ్యాణి, సింధుభైరవి వంటి రాగాలను ఆయన తన పాటలలో అత్యంత మధురంగా మలిచారు.  

ఆయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు -  మల్లీశ్వరి (1951), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957) తెలుగు చలనచిత్ర సీమలో మైలురాళ్ళగా నిలిచాయి: ఇవేకాక రాజు-పేద, విప్రనారాయణ, భలేరాముడు, చెంచులక్ష్మి, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం వంటి మరెన్నో చిత్రాలకు అద్భుతమైన బాణీలు సమకూర్చారు.

సాలూరి రాజేశ్వరరావు ఏ పాట కంపోజ్ చేసినా, దాని వెనుక బలమైన రాగ ప్రణాళిక ఉండేది. ఒక రాగంలో వర్ణం ఎలాగైతే పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరాలు, చరణం, చిట్టస్వరాలతో క్రమపద్ధతిలో సాగుతుందో, ఆలాగే ఆయన కొన్ని పాటలను కూడా అదే శాస్త్రీయ క్రమశిక్షణతో, రాగ లక్షణాలు చెడకుండా మలిచారు.

కర్ణాటక సంగీతంలోని వర్ణాల రూపాలను, రాగాల (మోహనం, కళ్యాణి, అభేరి, శంకరాభరణం వంటివి) గంభీరతను కోల్పోకుండానే, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా లలితమైన బాణీలుగా మార్చడంలో ఆయన సిద్ధహస్తులు. ఒక వర్ణం ప్రాథమిక నిర్మాణ సూత్రాలను ఆయన సినిమా పాటల చరణాలు,ఇంటర్లూడ్స్  లో చాలా చాకచక్యంగా ఉపయోగించేవారు.

ఆయన పాటల్లో రాగాల కూర్పు, స్వరాల విన్యాసం అచ్చం ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో వర్ణం పాడుతున్నంత గంభీరంగానూ, అదే సమయంలో ఎంతో మధురంగానూ ఉంటాయి.

రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వీణ  వాద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూపొందించిన పాటలు తెలుగు సినీ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. ఆయనకు వీణా వాద్యంపై ఉన్న మమకారం, కర్ణాటక సంగీత పరిజ్ఞానం కారణంగా ఆయన సినిమాలలో వీణ మోత ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది

సాలూరి కుటుంబం నుంచి  సంగీత రంగంలోకి ఎంతో మంది వచ్చారు. ఆయన కుమారులు సాలూరి రామలింగేశ్వరరావు, సాలూరి పూర్ణచంద్రరావు, సాలూరి వాసురావు,ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి కోటేశ్వరరావు (కోటి) అందరూ సంగీత రంగంలోనే స్థిరపడ్డారు. ఆయన అన్నగారు సాలూరు హనుమంతరావు కూడా సంగీత దర్శకులే.  

రాజేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా సేవలు అందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ (డాక్టరేట్) గౌరవాన్ని అందుకున్నారు.  తమిళనాడు ప్రభుత్వం నుంచి  కలైమామణి పురస్కారం పొందారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి  ప్రఖ్యాత రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు.

తెలుగు ప్రజల హృదయాల్లో తన స్వరాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోయిన సాలూరి రాజేశ్వరరావు అక్టోబర్ 25, 1999న కన్నుమూశారు.*


Friday, 9 October 2026


శరదృతువు వచ్చిందంటే ప్రకృతిలోనే కాదు… మనసుల్లోనూ ఒక ప్రత్యేకమైన పండుగ వాతావరణం మొదలవుతుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రులు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలు.

తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించడం ఈ పర్వానికి ప్రధాన ప్రత్యేకత. ఒకే పరాశక్తి… భక్తుల భావనను బట్టి, అవసరాన్ని బట్టి, కార్యసిద్ధిని బట్టి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది.

దుర్గగా రక్షిస్తుంది.
లక్ష్మిగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది.
సరస్వతిగా జ్ఞానాన్ని అందిస్తుంది.
చండికగా దుష్టశక్తులను సంహరిస్తుంది.
అన్నపూర్ణగా ఆకలిని తీరుస్తుంది.

అందుకే నవరాత్రులు కేవలం పండుగ రోజులు కావు. శక్తిని తెలుసుకునే తొమ్మిది ఆధ్యాత్మిక మెట్లు.

మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి వరాన్ని పొందాడు. ఆ వరంతో దేవతలను, ఋషులను, మానవులను బాధించడం ప్రారంభించాడు. అతని ఆగడాలను తట్టుకోలేక దేవతలు పరమశక్తిని ప్రార్థించారు.

దేవతలందరి తేజస్సులు ఏకమై ఒక మహాశక్తి అవతరించింది. ఆమె దుర్గాదేవి.

సింహవాహనంపై అధిరోహించిన అమ్మవారు మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేసి, తొమ్మిది రోజుల అనంతరం అతడిని సంహరించింది. అందుకే నవరాత్రులు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కూడా నిలిచాయి.

నవరాత్రుల్లో ప్రాంతానుసారం అమ్మవారి అలంకారాల్లో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ సంప్రదాయం, స్థానిక ఆచారం, కుటుంబ సంప్రదాయం ఆధారంగా అలంకారాలు మారవచ్చు.

అయితే నవదుర్గల సంప్రదాయంలో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో ఇలా పూజిస్తారు.

1.పాడ్యమి – శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి

అలంకారం: బంగారు కవచంతో అమ్మవారు తేజోవంతంగా దర్శనమిస్తారు.

నైవేద్యం: కట్టె పొంగలి లేదా చలిమిడి, వడపప్పు.

విశిష్టత: నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సూచకంగా, భక్తులకు సకల ధైర్యసాహసాలను అందిస్తుంది.

2. విదియ – శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

అలంకారం: చిన్నారి బాలికగా, మనోహరమైన స్వరూపంలో దర్శనం.

నైవేద్యం: పరమాన్నం (పాయసం), తీపి బూంది.

విశిష్టత: విద్య, విజ్ఞానం, సద్బుద్ధిని ప్రసాదించే లలితాదేవి చిన్ననాటి రూపం.

3. తదియ – శ్రీ గాయత్రీ దేవి

అలంకారం: ఐదు ముఖాలు, వేదస్వరూపిణిగా అలంకారం.

నైవేద్యం: అల్లం గారెలు, పులిహోర.

విశిష్టత: సకల మంత్రాలకు మూలమైన గాయత్రీ దేవి ఉపాసన వల్ల జ్ఞానసిద్ధి లభిస్తుంది.

4. చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి

అలంకారం: చేతిలో గరిటె, పాత్ర ధరించి సమస్త జీవకోటికి అన్నం పెట్టే తల్లిగా దర్శనం.

నైవేద్యం: దద్ద్యోజనం (పెరుగు అన్నం), కేసరి.

విశిష్టత: క్షామం, ఆకలి బాధలు తొలగి సస్యశ్యామలమైన జీవితాన్ని ఇస్తుంది.

5. పంచమి – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

అలంకారం: చెరకుగడ, పాశాంకుశాలు ధరించిన శాంత స్వరూపిణి.

నైవేద్యం: రవ్వ కేసరి లేదా క్షీరాన్నం.

విశిష్టత: సంసారిక సుఖాలు, సౌభాగ్యం, ఆనందాన్ని ప్రసాదించే మాతృమూర్తి.

6. షష్ఠి – శ్రీ మహాలక్ష్మీ దేవి

అలంకారం: తామరపూలు ధరించి, ఐశ్వర్యదాత్రిగా దర్శనం.

నైవేద్యం: పూర్ణం బూరెలు, క్షీరాన్నం.

విశిష్టత: అష్టైశ్వర్యాలు, సంపదలు, దాంపత్య సుఖాన్ని అనుగ్రహిస్తుంది.

7. సప్తమి – శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం)

అలంకారం: వీణ, పుస్తకంతో శ్వేత వస్త్రధారిగా ప్రత్యక్షం.

నైవేద్యం: అటుకులు, బెల్లం, శనగలు, దద్ద్యోజనం.

విశిష్టత: విద్యార్థులకు అత్యంత పవిత్రమైన రోజు. జ్ఞానం, వాక్శుద్ధి లభిస్తాయి.

8. అష్టమి (దుర్గాష్టమి) – శ్రీ మహిషాసురమర్దిని దేవి

అలంకారం: అష్టభుజాలలో ఆయుధాలు ధరించి సకల దుష్టశిక్షణ చేసే ఉగ్రరూపం.

నైవేద్యం: చక్రపొంగలి, అల్లం గారెలు.

విశిష్టత: శత్రు భయాలు, మానసిక ఆందోళనలు తొలగి విజయం లభిస్తుంది.

9. నవమి (మహానవమి) – శ్రీ రాజరాజేశ్వరీ దేవి

అలంకారం: జగత్తునంతటినీ ఏలే మహారాజ్ఞిగా, అత్యంత శోభాయమానమైన స్వరూపం.

నైవేద్యం: పులిహోర, పాయసం, గారెలు.

విశిష్టత: నవరాత్రి పూజల పరిపూర్ణ ఫలితాన్ని, మోక్షాన్ని అందిస్తుంది.

పూజా విధానం -ముఖ్యమైన నియమాలు

ఘటస్థాపన: నవరాత్రుల మొదటి రోజున పూజా మందిరంలో ఇత్తడి లేదా మట్టి కలశాన్ని స్థాపించి, అందులో నీరు, పసుపు, కుంకుమ, నాణేలు వేసి మామిడి ఆకులు, కొబ్బరికాయతో కలశ పూజ చేస్తారు.

లలితా సహస్రనామ పారాయణం: ప్రతి రోజూ లలితా సహస్రనామాలు, ఖడ్గమాల లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయడం అత్యంత శ్రేష్ఠం.

కుంకుమార్చన: అమ్మవారి పటము లేదా శ్రీచక్రానికి కుంకుమతో లేదా ఎర్రటి అక్షతలతో అర్చన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది.

కన్యాపూజ -  సువాసిని పూజ: అష్టమి, నవమి రోజుల్లో చిన్న పిల్లలను (కన్యలను) దేవి స్వరూపంగా భావించి వారికి పూజ చేసి, వస్త్రాలు, తాంబూలం, పిండివంటలు సమర్పిస్తారు.

దీక్షా నియమాలు: ఈ తొమ్మిది రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం, ఏకభుక్తం ఉండటం, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం విశేష ఫలితాలనిస్తుంది.

విజయదశమి – విజయ సంకేతం

పదవ రోజు వచ్చే విజయదశమి (దసరా) చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి విజయాన్ని, రావణాసురుడిని సంహరించిన శ్రీరాముని విజయాన్ని తలచుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున జమ్మి చెట్టు (శమీ వృక్షం) ను పూజించి, ఆ పత్రాలను పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవడం శుభప్రదం.

అమ్మవారికి తొమ్మిది రోజులూ తొమ్మిది అలంకారాలు చేస్తాం. కానీ ఆ తొమ్మిది రూపాల వెనుక ఉన్న ఒకే శక్తిని గుర్తించడం ముఖ్యం.

ఆమెను పూలతో అలంకరిస్తాం…

 కానీ మనసును కూడా పూలంత స్వచ్ఛంగా చేసుకోవాలి.

దీపాలు వెలిగిస్తాం…

 కానీ మనలోని అజ్ఞానాంధకారాన్ని కూడా తొలగించాలి.

నైవేద్యాలు సమర్పిస్తాం…

 కానీ మన అహంకారాన్ని కూడా సమర్పించాలి.

అమ్మవారిని పూజిస్తాం…

కానీ స్త్రీని గౌరవించే సంస్కారాన్ని మన జీవితంలో ఆచరించాలి.

అదే శరన్నవరాత్రుల అసలైన సందేశం.

తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన…
పదో రోజు విజయోత్సవం…
కానీ ఆ శక్తి, ఆ వెలుగు, ఆ విజయం - 
మన జీవితమంతా కొనసాగాలి.

"సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే"



మాధవి, మాలతి  ఇద్దరూ ఒకే బెంచీపై కూర్చుని భవిష్యత్తు వైపు కళ్లు విప్పి చూసిన చిన్ననాటి స్నేహితులు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో వారి ప్రపంచం చాలా చిన్నది, కానీ ఆశయాలు మాత్రం ఆకాశమంత.

మాధవి కళ్లలో ఎప్పుడూ అమెరికా కల మెరుస్తూ ఉండేది. "ఎమ్‌సెట్ రాసి, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కొట్టి, అటుపై ఇద్దరం కలిసి అమెరికా వెళ్దాం మాలతీ! అక్కడే మన భవిష్యత్తు" అని తరచూ చెప్పేది.

కానీ మాలతి ఆలోచనలు వేరు. "నా వల్ల కాదు మాధవీ... అంత పెద్ద కలలు కనే స్థోమత నా కుటుంబానికి లేదు. నాకు ఈ చిన్న ఊరు, నా పరిధిలోని జీవితమే చాలు" అని నవ్వుతూనే అనేది.

ఒకే గమ్యం వైపు సాగాల్సిన ఆ రెండు నౌకలు అక్కడే రెండు వేర్వేరు దిశలకు పయనించాయి.

మాధవి తన పట్టుదలను వదల్లేదు. వేరే నగరంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివి, గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే అనుకున్నట్లే అమెరికాలో ఎమ్.ఎస్ చేయడానికి వెళ్లిపోయింది. అక్కడ చదువు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఆ పై పూర్తిస్థాయి జాబ్... ఇలా ప్రతి క్షణం తన కెరీర్ ను నిచ్చెన మెట్లు ఎక్కించడంలోనే లగ్నమైపోయింది.

ఇటు మాలతి స్థానిక డిగ్రీ కాలేజీలో చేరింది. మొదటి సంవత్సరంలోనే ఇంట్లో వాళ్లు చూసిన సంబంధాన్ని ఒప్పుకుని పెళ్లి చేసుకుంది. కానీ తన చదువును ఆపేయలేదు. ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేసి, శ్రమించి పోటీ పరీక్షలు రాసి బ్యాంక్ ఉద్యోగం సంపాదించింది. కాలక్రమంలో ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆమె భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడి, హైదరాబాద్‌లో ఒక సొంత విల్లా తీసుకున్నాడు. ఇంటిని సంతోషాల నిలయంగా మార్చుకుంది మాలతి.

అమెరికాలో మాధవి కెరీర్ పరంగా ఎంతో సాధించింది. డాలర్లు సంపాదించింది, హోదా పెరిగింది. కానీ ఈ పరుగులో తన వ్యక్తిగత జీవితాన్ని, వయస్సును మరిచిపోయింది. చదువు పూర్తయి, ఉద్యోగంలో స్థిరపడి, సరైన సంబంధం వెతికేసరికి ఆమెకు 35 ఏళ్లు వచ్చాయి. చివరికి తల్లిదండ్రులు కుదిర్చిన ఒక సంబంధానికి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లికొడుకు బట్టతల, ఆకర్షణ లేని రూపం... కానీ వయసు దాటిపోతోందన్న భయంతో మాధవి ఆ పెళ్లికి అంగీకరించింది.

పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చింది మాధవి. ఎంత కాలమో వేచి చూసిన తన పెళ్లికి చిన్ననాటి ప్రాణస్నేహితురాలు మాలతిని ప్రత్యేకంగా ఆహ్వానించింది.

పెళ్లి రోజు... ఫంక్షన్ హాల్‌లోకి మాలతి తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అడుగుపెట్టింది. నిండైన కట్టుబొట్టు, ముఖంలో వెలిగిపోతున్న ప్రశాంతత, భర్త కళ్లలో కనిపిస్తున్న అనురాగం, పిల్లల కేరింతలు... మాలతి కుటుంబాన్ని చూడగానే మాధవి గుండెల్లో ఏదో తెలియని వేదన మొదలైంది

పట్టు చీరలు, వజ్రాల నగలు, అమెరికా డాలర్లు తన వద్ద ఉన్నాయి... కానీ మాలతి వద్ద ఉన్న ఆత్మీయమైన కుటుంబ బంధం, జీవితంలోని సంపూర్ణత తన వద్ద లేవు. కరియర్, అమెరికా కల వెనుక పరిగెత్తి తన జీవితంలోని అత్యుత్తమ వసంతాలను, సహజమైన సంతోషాలను కోల్పోయానని మాధవికి మొదటిసారి అర్థమైంది. మాలతి నవ్వుల వెనుక ఉన్న నిజమైన తృప్తి ముందు తన అమెరికా హోదా వెలవెలబోయినట్లనిపించింది. ఆ క్షణం నుంచి మాధవి మనస్సులో తీవ్రమైన మానసిక సంఘర్షణ మొదలైంది.

పెళ్లి ముగిసింది. నెల రోజుల తర్వాత మాధవి తన భర్తతో కలిసి అమెరికా తిరిగి వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. లగేజ్ చెకిన్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్తుండగా... దూరంగా మాలతి కుటుంబం కనిపించింది

ఆశ్చర్యపోయిన మాధవి పరుగెత్తుకుంటూ వెళ్లి, "మాలతీ! నువ్విక్కడ?" అని అడిగింది.

మాలతి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. మాధవి చేతులు పట్టుకుని, "మా ఆయన ఆఫీస్ వాళ్లు ఆయన్ని ప్రాజెక్ట్ మీద అమెరికా పంపుతున్నారు మాధవీ! మేము కూడా అమెరికా షిఫ్ట్ అయిపోతున్నాం. అందరం కలిసి బయలుదేరాం. ఫ్లైట్ ఎక్కడానికి వచ్చాం!" అని ఉత్సాహంగా చెప్పింది

ఆ మాట వినగానే మాధవి మనసుకి ఏదోలా అయిపోయింది. మాట రాక మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది.

ఏ అమెరికా కల కోసం తను చిన్నతనంలో సంతోషాలను, అనుబంధాలను, వయసును త్యాగం చేసిందో... అదే అమెరికా జీవితం మాలతికి సునాయాసంగా, ఒక సంపూర్ణమైన కుటుంబంతో, ఆలస్యమైనా అనుబంధాల తీపితో సహజంగా దక్కింది.

మాధవి మనస్సులో అప్పటివరకు ఉన్న అహంకారం, అసూయ, వేదన ఒకేసారి ఆవిరైపోయి తీవ్రమైన శూన్యత ఆవరించింది. అమెరికా విమానం ఎక్కడానికి అడుగులు వేస్తున్న మాధవికి, తను గెలిచాననుకున్న జీవితంలో ఎంత పెద్ద ఓటమి దాగి ఉందో స్పష్టంగా అర్థమైంది. నిశ్శబ్దంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది.*

Thursday, 8 October 2026

 


కాలం మారేకొద్దీ మనుషుల నడుమ సంభాషణల వేగం పెరిగింది గానీ, భావాల గాఢత తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. నేటి వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిళ్ళ వేగంలో ఒకప్పటి తపాలా ఉత్తరం తెచ్చిన తీపి జ్ఞాపకాలు మరుగునపడిపోయాయి.

ఒకప్పుడు ఉత్తరం కేవలం ఒక కాగితం ముక్క కాదు... అది రెండు మనసులను కలిపే అదృశ్య వంతెన. దూరంగా ఉన్న కన్నవారి క్షేమాన్ని, కట్టుకున్నవారి అనురాగాన్ని, ప్రాణస్నేహితుడి ఆత్మీయతను మూటగట్టుకుని వచ్చే అక్షర రూపం. పోస్ట్ మాన్ సైకిల్ బెల్ వినపడగానే గుండెల్లో ఏదో ఉద్వేగం… "నా పేరిట ఉత్తరం ఉందా?" అని ఆశగా ఎదురుచూసే ఆ క్షణాలు వర్ణనాతీతం.

పోస్ట్ కార్డ్ మీద వంకరటింకరగా రాసిన నాన్న ఆశీస్సులు, ఇన్‌లాండ్ లెటర్‌లో నీలిరంగు కాగితం నిండా అమ్మ కురిపించిన ఆప్యాయతలు, పోస్టల్ కవరు లోపల దాక్కున్న ప్రియమైనవారి తొలి ప్రేమ లేఖలు... ఒక్కో అక్షరం వెనుక ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో కన్నీళ్లు, నవ్వులు. లేఖ తెరిచి చదువుతుంటే ఎదురుగా ఆ మనిషే నిలబడి మాట్లాడుతున్నంత అనుభూతి కలిగేది. ఆ కాగితం మీద పడిన చేతివ్రాత, ఆ కాగితానికి ఉండే ప్రత్యేకమైన వాసన చదివేవారిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేవి

ఈరోజు అర చేతిలో ప్రపంచం ఉన్నా, ఒక ఉత్తరాన్ని తెరిచేటప్పుడు అనుభవించిన ఆ కాచి వడపోసిన ఎదురుచూపుల ఆనందం, ఆ ఆత్రుత నేటి డిజిటల్ యుగంలో లభించవు. మడతలు పడిన ఆ పాత లేఖలను నేటికీ దాచుకున్నవారికి తెలుసు... అప్పట్లో ఒక ఉత్తరం విలువ ఎంతో, అది పంచిన బంధాల బరువు ఎంతో!

ప్రపంచ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు!


Wednesday, 7 October 2026

సినీ మేటి - పేకేటి ( జయంతి అక్టోబర్ 8) జీడిగుంట నాగేశ్వరరావు




పేకేటి శివరాం (పేకేటి శివరామ సుబ్బారావు) దక్షిణ భారత సినిమా రంగంలో నటుడిగా, దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 1918 అక్టోబరు 8న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో జన్మించారు.  

1937లో మద్రాసు వెళ్లిన ఆయన సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో (కెమెరా, పత్రికా రంగం, హెచ్ఎంవీ సంస్థ) పనిచేశారు. హెచ్ఎంవీలో ఉన్న సమయంలో అమరగాయకుడు ఘంటసాల  కంఠాన్ని గుర్తించి ఆయనతో ప్రైవేట్ రికార్డులు పాడించడంలో ముఖ్యపాత్ర పోషించారు.  'భగవాన్' అనే కలం పేరుతో 18 డిటెక్టివ్ నవలలు రాశారు.  

తెలుగు చిత్రసీమలో హాస్య నటుడిగా, విలన్‌గా, సహాయ నటుడిగా వందకు పైగా చిత్రాల్లో నటించారు.  

ప్రసిద్ధ చిత్రాలు: దేవదాసు (1953), కన్యాశుల్కం (1955), అనార్కలి (1955), చిరంజీవులు (1956), పెళ్ళినాటి ప్రమాణాలు (1958), ఇల్లరికం (1959), గులేబకావళి కథ (1962), అల్లూరి సీతారామరాజు (1974) మొదలైనవి.  

దర్శకుడిగా తెలుగులో చుట్టరికాలు (1968), భలే అబ్బాయిలు (1969)  చిత్రాలకు దర్శకత్వం వహించారు.  

కన్నడ చిత్రసీమలో కూడా దర్శకుడిగా మంచి విజయం సాధించారు. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌తో చక్ర తీర్థ (1967), పునర్జన్మ (1969), కులగౌరవ (1971), దారి తప్పిద మగ (1975) వంటి హిట్ చిత్రాలు తీశారు.

ప్రముఖ కన్నడ, తెలుగు నటి జయంతి ఆయన భార్య.  టాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా ఈయన కుమారుడే. తమిళ నటుడు ప్రశాంత్ ఈయనకు మనుమడు అవుతారు.  ఆయన 2006 డిసెంబరు 30న చెన్నైలో కన్నుమూశారు.*


 


షిర్డీ గ్రామం అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. ఆకాశంలో ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు.  అలుముకున్న మంచు తెరల మధ్య వేప చెట్టు ఆకులు గాలికి వింతగా శబ్దం చేస్తున్నాయి. ఆ చలిలో, వేప చెట్టు కింద నేల మీద పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యువకుడి చుట్టూ ఏదో అభౌతికమైన కాంతి ఉంది.

గుమ్మంలో కళాపి జల్లుతున్న బాయిజా బాయి అటు వైపు చూసింది. అంతకు ముందు రోజు వరకు అక్కడ కనిపించని ఆ కుర్రవాడు ఎవరో ఆమెకు అర్థం కాలేదు. 

"ఎవరీ కుర్రాడు? ఇంత చలిలో, కనీసం ఒంటిపై సరిగ్గా బట్ట కూడా లేకుండా ఎలా కూర్చోగలుగుతున్నాడు?" ఆమె మనసులో ప్రశ్న. 

దగ్గరకు వెళ్ళింది. ఆ యువకుడి కళ్ళు మూసి ఉన్నాయి. ముఖం మీద అంతులేని ప్రశాంతత. చుట్టూ ఉన్న ప్రపంచంతో అతనికి సంబంధమే లేనట్టుంది.

అకస్మాత్తుగా... ఆ యువకుడు కళ్ళు తెరిచాడు. ఆ చూపుల్లో కోపం లేదు, కానీ ఒక రకమైన తీక్షణత ఉంది. అది బాయిజాబాయిని భయపెట్టలేదు, సరిగ్గా చెప్పాలంటే ఒక అమ్మలా కరిగించింది.

"అమ్మా... ఆకలి," అన్నాడు ఆ యువకుడు. ఆ గొంతులో ఉన్న ఆర్ద్రత షిర్డీ చరిత్రను మార్చబోతోందని అప్పట్లో ఎవరికీ తెలియదు.

బైజాబాయికి అప్పటిదాకా ఉన్న లోకం వేరు, ఆ యువకుడి కళ్ళలోకి చూసిన తర్వాత కనిపిస్తున్న లోకం వేరు. "ఆకలి" అన్న ఆ పిలుపులో ఒక బిడ్డ ఆర్తి ఉంది, అదే సమయంలో ఒక బ్రహ్మజ్ఞాని గాంభీర్యం ఉంది. ఆమె గబగబా ఇంటికి వెళ్లి, రొట్టెలు, కూర పట్టుకొచ్చింది.

ఆ యువకుడు మౌనంగా భుజించాడు. ఆయన తింటున్న తీరు చూస్తుంటే, ఆయన శరీరానికి ఆహారం ఇస్తున్నట్టు లేదు, ఏదో యజ్ఞగుండంలో ఆహుతులు వేస్తున్నట్టుగా ఉంది.

"నాయనా.. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?" బైజాబాయి అడిగింది.

ఆ యువకుడు నవ్వి, పక్కనే ఉన్న మట్టిని చూపించాడు. "అక్కడి నుండే వచ్చాను, రేపు అక్కడికే వెళ్తాను." ఆ సమాధానం ఆమెకు అర్థం కాలేదు, కానీ ఆ మాటల్లో ఏదో సత్యం ఉందని మాత్రం ఆమె మనసు ఘోషించింది.

—————-

కొద్దిరోజులకే షిర్డీలో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. 'ఒక పిచ్చివాడు వచ్చాడట.. వేప చెట్టు కింద కూర్చుని గంటల తరబడి కళ్ళు మూసుకుంటాడట' అని కొందరు, 'కాదు.. ఆయనలో ఏదో దైవాంశ ఉంది' అని మరికొందరు అనుకోసాగారు.

ఒకనాడు గ్రామంలోని కొందరు కుర్రాళ్ళు ఆ యువకుడిని ఏడిపించాలని వెళ్లారు. ఆయన కళ్ళు మూసుకుని ఉండటం చూసి, రాయి విసరబోయారు. కానీ, సరిగ్గా అప్పుడే ఆ వేప చెట్టు ఆకుల నుంచి ఒక వింతైన సువాసన రావడం మొదలైంది. ఆ చెట్టు ఆకులు సాధారణంగా చేదుగా ఉంటాయి. కానీ ఆ క్షణంలో అక్కడ గాలిలో తీపి వాసన నిండిపోయింది.

ఆశ్చర్యంతో ఒక అబ్బాయి ఆ చెట్టు ఆకును కోసి నోట్లో వేసుకున్నాడు.

"అరేయ్! ఇది తీయగా ఉందిరా!" అని వాడు కేక వేశాడు.

అవును.. ఆ యోగి కూర్చున్న ప్రభావమో ఏమో కానీ, ఆ చేదు వేప ఆకులు తేనెకంటే తీయగా మారాయి. ఆ అద్భుతం చూసి షిర్డీ ప్రజలు నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు ఆయనను ఒక సాధారణ బిచ్చగాడిగా చూసిన కళ్ళు, ఒక్కసారిగా భక్తితో నిండిపోయాయి. 

ఆ యువ యోగి వేప చెట్టు కింద ఉన్నంత కాలం షిర్డీ ప్రజలు ఒక వింతైన ఆకర్షణకు లోనయ్యారు. కానీ ఒక ఉదయం, ప్రజలు నిద్రలేచి చూసేసరికి ఆ చెట్టు కింద ఎవరూ లేరు. ఆ యువకుడు ఏమైపోయాడు? ఎటు వెళ్ళాడు? ఎవరికీ తెలియదు.

————-

రోజులు గడిచాయి, నెలలు మారాయి, సంవత్సరాలు పక్కకు జరిగాయి. షిర్డీ మళ్ళీ తన పాత దైనందిన జీవితంలోకి వెళ్ళిపోయింది. కానీ బైజాబాయి లాంటి కొందరి మనసుల్లో మాత్రం ఆ యువకుడి రూపం పచ్చగానే ఉంది.

కొన్నేళ్ల తర్వాత...

ఔరంగాబాద్ సమీపంలోని ధూప్ ఖేడా గ్రామంలో చాంద్ పాటిల్ అనే ఒక ముస్లిం పెద్ద మనిషి తన గుర్రం తప్పిపోయిందని ఆందోళనగా వెతుకుతున్నాడు. ఎక్కడా జాడ లేదు. అప్పుడే అతనికి దూరంగా ఒక చెట్టు కింద, చిరిగిన కఫ్నీ వేసుకుని, తలకు గుడ్డ కట్టుకుని కూర్చున్న ఒక యోగి కనిపించాడు.

"ఏమైంది చాంద్ పాటిల్? ఆ గుర్రం కోసం కదా నీ వెతుకులాట?" అన్నాడు ఆ యోగి.

చాంద్ పాటిల్ నిర్ఘాంతపోయాడు. ఈ అపరిచితుడికి తన పేరు, తన సమస్య ఎలా తెలుసు?

"అదిగో.. ఆ పొదల వెనుక నీ గుర్రం గడ్డి మేస్తోంది, వెళ్ళి తెచ్చుకో," అన్నాడు ఆ యోగి ప్రశాంతంగా. చాంద్ పాటిల్ వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ గుర్రం ఉంది. తిరిగి వచ్చి ఆ యోగి పాదాలకు మొక్కాడు. "స్వామీ! మీరు మా ఇంటికి అతిథిగా రావాలి," అని వేడుకున్నాడు.

కొన్నాళ్ల తర్వాత, చాంద్ పాటిల్ ఇంట్లో ఒక వివాహం నిశ్చయమైంది. ఆ పెళ్లి బృందం షిర్డీకి బయలుదేరింది. ఆ బృందంలో ఒక ఎద్దుల బండి మీద, నిశ్శబ్దంగా, కళ్లలో లోతైన ఆలోచనలతో కూర్చున్న ఆ యోగి ఎవరో కాదు... షిర్డీ ప్రజలు ఎప్పుడో మర్చిపోయిన ఆ యువకుడే!

—————-

పెళ్లి బృందం షిర్డీలోని ఖండోబా ఆలయ సమీపానికి చేరుకుంది. బండ్లు ఆగాయి. ఆ యోగి బండి దిగి మెల్లగా నేల మీద అడుగు పెట్టాడు.

అప్పుడే అక్కడ ఉన్న మహల్సాపతి ఆ యోగిని చూశాడు. సంవత్సరాలు గడిచినా, ఆ కళ్లలోని కాంతిని ఆయన గుర్తుపట్టాడు. ఒళ్లు పులకరించింది. అప్రయత్నంగా చేతులు జోడించి, భక్తి పారవశ్యంతో గట్టిగా పిలిచాడు:

"ఆవో.. సాయి!" (రండి సాయి!)

ఆ పిలుపుతో షిర్డీ గాలి ఒక్కసారిగా మారిపోయింది. అదృశ్యమైన ఆ యోగి, ఇప్పుడు ఒక పూర్తి స్థాయి సిద్ధ పురుషుడిగా, ఒక మహనీయుడిగా తిరిగి వచ్చాడు. ఈసారి ఆయన వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు.. షిర్డీని తన గుండెలకు హత్తుకుని, లోకానికి 'సాయి'గా మారడానికి.

పెళ్లి బృందంతో వచ్చిన ఆ యోగి, పెళ్లి వేడుక ముగిసినా అక్కడే ఉండిపోయాడు. గ్రామ శివార్లలో ఉన్న ఒక పాడుబడ్డ మసీదు వైపు అడుగులు వేశాడు. "ఇదే నా స్థానం.." అని గొణిగాడు. ఆ మసీదు నిండా పాములు, తేళ్లు, దుమ్ము ధూళి ఉన్నాయి. కానీ ఆయన ప్రవేశించగానే ఆ వాతావరణం మారిపోయింది. ఆ పాడుబడ్డ కట్టడమే రేపు 'ద్వారకామాయి'గా పిలవబడబోతోందని, కోట్లాది మందికి దిక్కు కాబోతోందని ఆ గోడలకి కూడా అప్పుడు తెలీదు.

——————

గ్రామంలోని కొందరు పెద్దలు మసీదు దగ్గరకు వచ్చి గొడవ మొదలుపెట్టారు. "ఒక హిందూ సన్యాసి మసీదులో ఉండటమేంటి? అక్కడ నిప్పు రాజేయడమేంటి? ఇది అపచారం!" అంటూ అరిచారు.

సాయి బాబా మెల్లగా కళ్ళు తెరిచారు. ఆయన చూపు ఆ మనుషుల మీద పడగానే, వారి గొంతులు అప్రయత్నంగా మూగబోయాయి.

"ఈ మసీదు అల్లాది కాదు, రాముడిదీ కాదు.. ఇది 'ద్వారకామాయి'. ఇక్కడికి వచ్చే బిడ్డలను గుండెలకు హత్తుకునే తల్లి ఇది. తల్లి దగ్గర కులమతాల పట్టింపు ఏముంటుంది?" అన్నారు సాయి.

ఆ గొంతులో ఉన్న అధికారం, ప్రేమ వారిని కదలనివ్వలేదు. బాబా అక్కడే ఉన్న ఒక మట్టి కుండలోని నీటిని తీసుకుని నోట్లో పోసుకుని మళ్ళీ నేల మీద ఉమ్మారు. ఆశ్చర్యం! అక్కడ నేల మీద చిన్న చిన్న పువ్వులు పూసినట్టు ఒక వింతైన కాంతి కనిపించింది.

ఆ రోజు నుండి ఆ పాడుబడ్డ మసీదు 'ద్వారకామాయిగా మారిపోయింది. బాబా అక్కడ ఒక వింతైన జీవనశైలిని మొదలుపెట్టారు. పొద్దున్నే లేచి ఊరంతా తిరిగి భిక్షాటన చేయడం, వచ్చిన దానిని కుక్కలకు, పక్షులకు పెట్టి, మిగిలింది తాను తినడం.. ఇదంతా చూస్తుంటే షిర్డీ ప్రజలకు ఆయన ఒక పిచ్చివాడిలానో లేక అపర దైవంలానో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

కానీ బాబా మాత్రం తన ధుని దగ్గర కూర్చుని, నిప్పులను సరిచేస్తూ మౌనంగా నవ్వుకునేవారు. ఆ మంటల్లో ఆయన ఏం చూస్తున్నారో, ఏ కర్మలను దహిస్తున్నారో ఆ అల్లాకే ఎరుక!

పగలు భిక్షాటన, రాత్రి ధుని ముందు ధ్యానం - ఇదే ఆయన దినచర్య. 

————

ఆ మసీదులో వెలుగు నింపడానికి ప్రతిరోజూ ఆయనకు నూనె అవసరమయ్యేది. ఊరిలోని వర్తకులు మొదట్లో బాబాను ఒక వింతైన ఫకీరుగా చూస్తూ, అడిగినప్పుడల్లా కొంచెం నూనె దానం చేసేవారు.

కానీ ఒకరోజు వర్తకులందరూ ఏకమయ్యారు. "ఈ పిచ్చి ఫకీరుకు ప్రతిరోజూ నూనె పోయడం వల్ల మనకు లాభం లేదు, ఈరోజు ఎవరూ నూనె ఇవ్వకూడదు" అని నిర్ణయించుకున్నారు.

సాయంత్రం అయ్యింది. బాబా తన ఖాళీ రేకు డబ్బా  పట్టుకుని అంగడికి వెళ్లారు.

"నూనె లేదు సాయీ! ఈరోజు వ్యాపారం బాగాలేదు" అని ఒకరు, "అసలు మా దగ్గర నిల్వ లేదు" అని మరొకరు అబద్ధం చెప్పారు. బాబా ఏమీ అనలేదు. వారి కళ్లలోకి ఒకసారి జాలిగా చూసి, మౌనంగా వెనుదిరిగారు. వర్తకులు వెనక నుంచి నవ్వుకున్నారు. "చూద్దాం, ఈరోజు మసీదులో దీపాలు ఎలా వెలుగుతాయో!"

బాబా మసీదుకు చేరుకున్నారు. గ్రామంలోని కొందరు ఆసక్తిగా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు.

బాబా తన దగ్గర ఉన్న ఖాళీ ప్రమిదలను వరుసగా పేర్చారు. రేకు డబ్బాలో చుక్క నూనె లేదు. ఆయన పక్కనే ఉన్న కుండలోని నీటిని ఆ డబ్బాలో పోశారు. ఆ నీటిని నోట్లో పోసుకుని మళ్ళీ డబ్బాలోకి ఉమ్మారు. అది చూసి జనం ఈసడించుకున్నారు.

కానీ, మరుక్షణమే అద్భుతం జరిగింది.

ఆయన ఆ నీటిని ప్రమిదల్లో పోసి ఒత్తిని వెలిగించారు. ఆశ్చర్యం! నీటితో నిండిన ఆ ప్రమిదలు నూనె దీపాల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్రకాశంతో వెలగడం మొదలుపెట్టాయి. ఆ వెలుగు మసీదును దాటి వీధుల్లోకి ప్రసరించింది. హేళన చేసిన వర్తకులు భయంతో వణికిపోయారు. పరుగెత్తుకుంటూ వచ్చి బాబా పాదాల మీద పడ్డారు.

"క్షమించండి బాబా! మా అజ్ఞానంతో మిమ్మల్ని అవమానించాం" అని ఏడ్చారు.

బాబా వారిని శాంతంగా చూశారు. "వస్తువులో శక్తి లేదు. నమ్మకంలో ఉంది. అబద్ధం చెప్పడం కంటే నిజాయితీగా లేదని చెప్పడం మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తుంది.శ్రద్ధ ఉంటే శూన్యం కూడా వెలుగుతుంది"అన్నారు. ఆ రాత్రి షిర్డీ కళ్లు తెరిచింది.

—-------------

బాబా పేరు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది. రోగులు, కష్టాల్లో ఉన్నవారు మసీదుకు రావడం మొదలుపెట్టారు. 

ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆకాశం కారుమేఘావృతమై భయంకరమైన గాలివాన మొదలైంది. షిర్డీలో ఇళ్లు ఎక్కువగా గడ్డితో కప్పబడి ఉంటాయి. జనం ప్రాణభయంతో వణికిపోయారు. మసీదు లోపలికి కూడా వర్షపు నీరు చిమ్ముతోంది. ధుని మంట ఆరిపోయేలా ఉంది.

"బాబా! మమ్మల్ని కాపాడండి.. ఈ వానకు మా ఇళ్లు కొట్టుకుపోతాయి" అని జనం కేకలు వేశారు.

సాయి బాబా మౌనంగా లేచి మసీదు అంచు దగ్గరకు వచ్చారు. ఆకాశం వైపు చూస్తూ తన సటకా (కర్ర)ను నేల మీద గట్టిగా కొట్టారు. "ఆగు! శాంతించు!" ఆ గొంతులో మేఘ గర్జన లాంటి శబ్దం వినిపించింది:

అంతే.. అప్పటివరకు ఉధృతంగా కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. గాలి స్తంభించిపోయింది. నల్లటి మేఘాల చాటు నుండి సూర్యకిరణం నేరుగా బాబా ముఖం మీద పడింది. ప్రకృతి ఆ యోగి ఆజ్ఞకు శిరసావహించింది. ఆ రోజు షిర్డీ ప్రజలకు అర్థమైంది. ఈయన కేవలం అద్భుతాలు చేసే వ్యక్తి కాదు, పంచభూతాలను శాసించగల శక్తి స్వరూపమని.

బాబా దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు. ఆయనకు చాలా గర్వం. "బాబా! నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, వెంటనే ఇవ్వండి" అని అడిగాడు.

బాబా నవ్వి, "అంతేనా.. ఇప్పుడే ఇస్తాను" అని ఒక అబ్బాయిని పిలిచి, "వెళ్లి  సాహుకార్ దగ్గర ఒక ఐదు రూపాయలు అప్పు తీసుకురా" అని పంపారు.

ఆ అబ్బాయి వెళ్లి "ఆయన ఇంట్లో లేరు" అని వచ్చాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గరకు పంపారు. ఇలా మూడు నాలుగు సార్లు జరిగేసరికి ఆ ధనవంతుడికి అసహనం పెరిగింది. "బాబా! నా దగ్గర వేల రూపాయలు ఉన్నాయి, ఈ ఐదు రూపాయల కోసం ఇంత సమయం వృధా చేస్తారెందుకు? నేనే ఇస్తాను తీసుకోండి" అని జేబులో చేయి పెట్టాడు.

"వద్దు.. నీ దగ్గర డబ్బు ఉంది కానీ, ఇచ్చే గుణం (త్యాగం) లేదు. ఐదు రూపాయల అప్పు కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని చూసి కూడా నీ మనసు కరగలేదు. గర్వం ఉన్నచోట జ్ఞానం ఎలా ఉంటుంది?" అని గద్దించారు.

ఒకసారి మసీదు బయట ఒక మురికి కుక్క ఆకలితో అరుస్తోంది. బాబా తన ముందున్న పళ్లేన్ని ఆ కుక్క ముందు పెట్టారు. ఆ కుక్క తింటుంటే ఆయన ఎంతో తృప్తిగా చూస్తూ కూర్చున్నారు.

"బాబా! మీరు తిన్న పళ్లేన్ని ఆ కుక్కకు పెట్టడం ఏమిటి? అది అపవిత్రం కదా!" అని ఒక భక్తుడు అన్నాడు.

బాబా అతని వైపు చూసి, "ఆ కుక్కలో ఉన్న ఆకలి, నాలో ఉన్న ఆకలి వేరు కాదు. ఆకలికి కులం లేదు, ప్రాణికి భేదం లేదు. నీలో ఉన్న దైవమే దానిలోనూ ఉంది. ఇది అర్థమైన రోజే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది" అన్నారు.

ఆ మాటలతో అక్కడ ఉన్న వారందరిలో ఉన్న అహంకారం నీరైపోయింది. బాబా  ప్రతి చిన్న సంఘటనను జనానికి ఒక గొప్ప పాఠంగా మార్చారు.

మసీదులో బాబా నిరంతరం వెలిగించే ధుని నుంచి వచ్చే బూడిదను ఆయన 'ఉదీ' అని పిలిచేవారు. అది కేవలం బూడిద కాదు, బాబా కృపాకటాక్షం. ఒకసారి షిర్డీలో ప్లేగు వ్యాధి ప్రబలి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వైద్యం అందక, భయం గుప్పిట్లో ఉన్న గ్రామాన్ని చూసి బాబా చలించిపోయారు.

ఆయన ధుని నుంచి దోసెడు ఉదీని తీసి, గాలిలోకి చల్లుతూ, "నా బిడ్డలకు ఏమీ కాదు" అని గర్జించారు. విచిత్రంగా, ఎవరికైతే ఆ ఉదీని నీళ్లలో కలిపి ఇచ్చారో, వారు మృత్యువు అంచు నుంచి తిరిగి వచ్చారు. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా ఆ వ్యాధి షిర్డీ నుంచి  మటుమాయమైంది. ఆ రోజు నుండి 'ఉదీ' ప్రతి భక్తుడి ఇంట్లో ఒక దివ్యౌషధంగా మారిపోయింది. "ధనవంతుడైనా, పేదవాడైనా చివరకు మిగిలేది ఈ బూడిదే" అని బాబా తరచూ చెప్పేవారు.

—----------

షిర్డీ సాయి బాబా బోధనలు అత్యంత సరళమైనవి, కానీ లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆయన ఏనాడూ గ్రంథాలు రాయలేదు.పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వలేదు. తన జీవితం ద్వారా, చిన్న చిన్న మాటల ద్వారా మానవాళికి దిశానిర్దేశం చేశారు.

బాబా బోధనల్లోని ముఖ్యాంశాలు:

1. శ్రద్ధ - సబూరి:బాబా తన భక్తులను అడిగే రెండు ప్రధాన కానుకలు ఇవే.

• శ్రద్ధ : భగవంతునిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం. ఎన్ని కష్టాలు వచ్చినా దైవం మనల్ని కాపాడుతుందని నమ్మడమే శ్రద్ధ.

• సబూరి: ఓర్పు లేదా సహనం. కోరుకున్నది వెంటనే జరగకపోయినా, సరైన సమయం కోసం ఓపికతో వేచి ఉండటమే సబూరి. "ఓర్పు ఉంటేనే మనిషి గమ్యాన్ని చేరుకోగలడు." 

2. సబ్ కా మాలిక్ ఏక్ 

మత సామరస్యానికి బాబా  నిలువెత్తు నిదర్శనం.

 "దైవం ఒక్కడే" అని ఆయన చాటి చెప్పారు.

మసీదులో ఉంటూ, హిందూ పురాణాలను చదవమని ప్రోత్సహించేవారు.

కుల, మత భేదాలు మనిషి సృష్టించుకున్నవని, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని బోధించారు.

3. మానవ సేవయే మాధవ సేవ

బాబా దృష్టిలో ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం కంటే మించిన పూజ లేదు.

 "ఎవరైనా నీ దగ్గరకు ఆకలితో వస్తే, వారికి అన్నం పెట్టు. వారు మనిషైనా, జంతువైనా సరే.. నా కడుపు నిండినట్టే భావిస్తాను" అనేవారు.

 బాబా స్వయంగా భిక్షాటన చేసి తెచ్చిన ఆహారాన్ని కుక్కలకు, పక్షులకు పెట్టిన తర్వాతే తాను భుజించేవారు.

4. అహంకారాన్ని త్యజించడం

జ్ఞానానికి అతిపెద్ద శత్రువు అహంకారం అని బాబా చెప్పేవారు.

•"నేను" అనే భావన పోయినప్పుడే భగవంతుడు మనలోకి ప్రవేశిస్తాడు.

తన వద్దకు వచ్చే ధనవంతులను, పండితులను కూడా సామాన్యులలాగే చూస్తూ వారిలోని గర్వాన్ని అణచివేసేవారు.

5. ధుని - ఉదీ: బాబా వెలిగించిన ధుని నుంచి  వచ్చే బూడిద (ఉదీ) ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది.

ఈ ప్రపంచంలో ప్రతిదీ అశాశ్వతమని, చివరకు అంతా బూడిదలో కలవాల్సిందేనని ఆ ఉదీ గుర్తుచేస్తుంది.

అదే సమయంలో, ఆ ఉదీ భక్తుల కర్మలను దహించి వేస్తుందని ఆయన అభయమిచ్చారు.

6. ఆత్మవిశ్వాసం - శరణాగతి

"నీ భారం నా మీద వేయి.. నేను నిన్ను కాపాడతాను" అని బాబా హామీ ఇచ్చారు.

మనం చేసే ప్రతి పనినీ భగవంతుడికి అర్పించి, ఫలితాన్ని ఆయనకే వదిలేయాలి.

తనను నమ్మిన వారిని బాబా ఏనాడూ చేయి విడువనని, సమాధి నుంచికూడా తాను స్పందిస్తానని చెప్పారు.

బాబా బోధనలు ఏ ఒక్క మతానికో పరిమితం కావు. అవి సాటి మనిషిని ప్రేమించమని, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడమని చెప్పే సార్వజనీన ధర్మాలు.

బాబా తన భక్తులను కేవలం అనుచరుల్లా కాకుండా, తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. అందుకే "నా భక్తుడు ఎక్కడున్నా.. ఏడు సముద్రాల అవతల ఉన్నా, నేను వానిని లాక్కు వస్తాను" అని బాబా అభయమిచ్చారు.*

—-------------

బాబాకు బైజా బాయి కొడుకు తాత్యా కోతే పాటిల్ అంటే ప్రాణం. తాత్యా బాబాను 'మామా' అని పిలిచేవాడు. 1918వ సంవత్సరం వచ్చింది. బాబా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో తాత్యా కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు తాత్యా బ్రతకడం కష్టమని తేల్చేశారు.

ఒకరోజు మసీదులో బాబా వింతగా ప్రవర్తించారు. "తాత్యా చావకూడదు, అతనికి ఇంకా లోకంలో పని ఉంది" అని గొణిగారు. అక్టోబర్ 15వ తేదీ విజయ దశమి రోజు మధ్యాహ్నం... తాత్యా మరణ శయ్య మీద ఉన్నాడు. కానీ విచిత్రంగా, అప్పటివరకు మౌనంగా ఉన్న బాబా ఒక్కసారిగా తన ప్రాణాలను వదిలేశారు. బాబా శరీరం నిశ్చలమైంది. అదే క్షణంలో, చనిపోతాడనుకున్న తాత్యా కళ్లు తెరిచి, ఊపిరి పీల్చుకున్నాడు. తన బిడ్డ ప్రాణం కోసం బాబా తన ప్రాణాన్ని పణంగా పెట్టారని అప్పుడు అందరికీ అర్థమైంది.

బాబా తుది శ్వాస విడిచే ముందు నీళ్ళు నిండిన కళ్ళతో అక్కడే ఉన్న లక్ష్మీబాయిని  చూసి, తన జేబులో నుండి తొమ్మిది నాణేలను తీసి ఆమె చేతిలో వేశారు. అవి కేవలం నాణేలు కావు.. భక్తికి ఉండాల్సిన తొమ్మిది లక్షణాలు (నవవిధ భక్తులు). అది ఆయన ఇస్తున్న చివరి కానుక అని ఆమెకు అప్పుడు తెలియదు.

ఆ రాత్రి షిర్డీలో ఎవరూ భోజనం చేయలేదు. ఎవరి ఇంట్లోనూ దీపం వెలగలేదు. ఎందుకంటే, అందరి ఇళ్ళలో దీపమై వెలిగిన ఆ సాయి, ఇప్పుడు విశ్వజ్యోతిలో కలిసిపోయారు. ద్వారకామాయిలోని ధుని మాత్రం మౌనంగా వెలుగుతూనే ఉంది.. బాబా మళ్ళీ వస్తారని ఎదురుచూస్తున్నట్టుగా!

బాబా పార్థివదేహాన్ని ఎక్కడ సమాధి చేయాలనే చర్చ వచ్చింది. నాగ్ పూర్ కు చెందిన బూటీ అనే భక్తుడు కట్టించిన 'వాడ' (భవనం)లో బాబాను ఉంచాలని నిర్ణయించారు. "నేను మురళీధరుడిగా ఇక్కడే ఉంటాను" అని బాబా ముందే సూచించిన చోట ఆయనను సమాధి చేశారు. భక్తులు విలపిస్తుంటే, గాలిలో బాబా గొంతు వినిపిస్తున్నట్టు అనిపించింది— "నేను వెళ్లడం లేదు. నా సమాధి మాట్లాడుతుంది. నా మీద భారం వేసిన వాడిని నేను ఎప్పుడూ వదలను."

వంద సంవత్సరాలు దాటినా, షిర్డీ నేటికీ కోట్లాది మందికి ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆ మసీదులో ధుని ఇంకా వెలుగుతూనే ఉంది. బాబా బోధించిన "శ్రద్ధ - సబూరి" (విశ్వాసం - ఓర్పు) అనే రెండు మాటలు నేటి ఆధునిక కాలంలో ఒత్తిడితో బ్రతుకుతున్న మనిషికి మంత్రదండాలుగా మారాయి.

సాయి బాబా ఏ మతానికి చెందిన వారో ఎవరికీ తెలియదు. ఆయన హిందువుగా జీవించారు, ముస్లింగా ప్రార్థించారు, అందరినీ మనుషులుగా ప్రేమించారు. ఆయన జీవితం ఒక సందేశం: "దైవం ఒక్కడే, అది ప్రేమే."

సాయి బాబా చరిత్ర కేవలం కొన్ని అద్భుతాల సమాహారం కాదు. అది ఒక సామాన్య యోగి, అసామాన్య దైవంగా మారిన ప్రయాణం. ఆయన అడుగుజాడల్లో నడవడం అంటే మనిషిని ప్రేమించడం, ఆకలితో ఉన్న వానికి అన్నం పెట్టడం, కష్టంలో ఉన్న వానికి ఓదార్పునివ్వడం. సాయి ఎక్కడికో వెళ్లలేదు.. తనను నమ్మిన ప్రతి భక్తుడి ఆలోచనలో, ఆశలో ఆయన నిరంతరం జీవిస్తూనే ఉన్నారు.

బాబా వెళ్ళిపోయారు అనుకోవడం మన భ్రమ. ఆయన సమాధి చెందిన తర్వాతే ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. భౌతిక కాయానికి పరిమితమైన సాయి, మహా సమాధి ద్వారా విశ్వవ్యాప్తమయ్యారు.

ఒకప్పుడు కేవలం ఒక మారుమూల గ్రామం అయిన షిర్డీ, ఈనాడు కోట్ల మందికి శాంతిని ఇచ్చే ధామంగా మారింది. బాబా సమాధి మందిరంలో అడుగు పెట్టిన ప్రతి భక్తుడికి నేటికీ ఆ అనుభూతి కలుగుతుంది—ఆయన అక్కడే ఉన్నారు, మన బాధలను వింటున్నారు, మన భారాలను మోస్తున్నారు.

బాబా తన భక్తులను కేవలం అనుచరుల్లా కాకుండా, తన కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. అందుకే "నా భక్తుడు ఎక్కడున్నా.. ఏడు సముద్రాల అవతల ఉన్నా, నేను వానిని లాక్కు వస్తాను" అని బాబా అభయమిచ్చారు.*

చివరిగా ఆయన చెప్పిన మాట ఒక్కటే: "నీవు నా వైపు చూస్తే, నేను నీ వైపు చూస్తాను. నీ భారాన్ని నాపై వేస్తే, నేను దానిని మోస్తాను. నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే, నేను నీ వైపు పది అడుగులు వేస్తాను." (సమాప్తం)



పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...