షిర్డీ సాయిబాబా పరమ భక్తులలో శ్యామా (మాధవరావు దేశ్‌పాండే) స్థానం అత్యంత విశిష్టమైనది. బాబాకు, శ్యామాకు మధ్య ఉన్న బంధం కేవలం గురుశిష్యుల బంధం మాత్రమే కాదు. అది ఒక ఆత్మీయ మిత్రుడిలా, ఒక తల్లీబిడ్డల అనురాగంలా సాగేది. సాయి సచ్చరిత్రలో శ్యామా ప్రస్తావన లేని అధ్యాయం దాదాపుగా ఉండదంటే అతిశయోక్తి కాదు.
శ్యామా అసలు పేరు మాధవరావు దేశ్‌పాండే. నిమోన్ గ్రామానికి చెందిన శ్యామా కుటుంబం, ఆయన చిన్నతనంలోనే షిర్డీకి వలస వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత, ద్వారకామాయి మసీదు పక్కనే ఉన్న చిన్న పాఠశాలలో మాధవరావు అసిస్టెంట్ టీచర్‌గా పనిచేశారు. మసీదు కిటికీలోంచి బాబాను నిరంతరం గమనిస్తూ ఉండేవారు.
మొదట్లో బాబాను ఒక పిచ్చి ఫకీరుగా భావించినప్పటికీ, కాలక్రమేణా బాబా దివ్యత్వాన్ని గ్రహించి సర్వస్వం ఆయనకే అర్పించారు. బాబా ఆయననుఎంతో ప్రేమగా "శ్యామా" లేదా "శ్యామ్యా" అని పిలిచేవారు.
బాబా స్వయంగా ఒక సందర్భంలో శ్యామాతో... "నీకు, నాకు మధ్య ఈ జన్మలోనే కాదు, గత 72 జన్మలుగా అనుబంధం ఉంది" అని చెప్తారు. అందుకే బాబా దగ్గర పూర్తి చనువు తీసుకోగలిగిన ఏకైక భక్తుడు శ్యామా మాత్రమే. బాబాను అందరూ ఎంతో భయభక్తులతో చూస్తే, శ్యామా మాత్రం ఎంతో ఆత్మీయంగా, ఒక్కోసారి గద్దించి కూడా మాట్లాడేవారు. మధ్యాహ్న హారతి తర్వాత, "దేవా! రా, భోజనానికి కూర్చో" అని బాబాను చెయ్యి పట్టుకుని పిలిచే చనువు శ్యామాకు ఉండేది.
సాయిబాబాను నేరుగా కలవడానికి లేదా తమ సమస్యలు చెప్పుకోవడానికి భయపడే కొత్త భక్తులు మొదట శ్యామానే ఆశ్రయించేవారు. శ్యామా ద్వారానే బాబాకు తమ విన్నపాలు పంపేవారు. బాబా కూడా శ్యామా మాటను ఎన్నడూ త్రోసిరాజనేవారు కాదు. బాబా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే లేదా ఎవరికైనా ప్రతినిధిగా పంపాల్సి వస్తే మొదట శ్యామానే పంపేవారు.
ఒకసారి శ్యామాను విషసర్పం కరిచింది. విషం శరీరం అంతటా ప్రాకుతుండగా ఆయన తల్లడిల్లిపోతూ ద్వారకామాయి మెట్లు ఎక్కబోయారు. అప్పుడు బాబా గంభీరంగా, కోపంతో "పైకి రావద్దు! దిగు! వెళ్ళిపో!" అని గద్దించారు. మొదట శ్యామా కంగుతిన్నా, బాబా అన్నది తనను కాదు, తన శరీరంలో ఉన్న 'విషాన్ని' అని తర్వాత గ్రహించారు. బాబా కేవలం తన మాటలతోనే ఆ విషాన్ని హరించి శ్యామాను బ్రతికించారు.
శ్యామాకు సంస్కృతం రాదు. కానీ బాబా ఒక రామదాసి భక్తుడి దగ్గర నుండి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని, దాని విశిష్టతను తెలిపి శ్యామాకు ప్రసాదంగా ఇచ్చారు. సంసార సాగరాన్ని దాటడానికి భగవన్నామం ఎంతో అవసరమని, అది శ్యామాకు రక్షణగా నిలుస్తుందని బాబా భావించారు.
బాబా ఆజ్ఞతో శ్యామా టీచర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆ తర్వాత కాలంలో నాడి చూసి వైద్యం చేసే నాటు వైద్యునిగా మారారు. ఆయన ఏ మందు ఇచ్చినా అందులో బాబా ఇచ్చిన "ఉదీ" కలిపి ఇచ్చేవారు. బాబా అనుగ్రహంతో ఆ మందు పరమౌషధంగా పనిచేసి ఎంతోమంది రోగులను నయం చేసింది.
1918లో బాబా మహాసమాధి చెందిన తర్వాత కూడా శ్యామా షిర్డీలోనే ఉంటూ బాబా సేవలోనే జీవితాన్ని గడిపారు. నిద్రపోయేటప్పుడు కూడా శ్యామా శ్వాసలో "సాయినాథ్ మహరాజ్.. సాయిబాబా" అనే నామస్మరణ వినిపించేదని సమకాలీన భక్తులు రాశారు. 1940లో శ్యామా పరమపదించారు. ఈ రోజుకూ షిర్డీ వెళ్ళే భక్తులు ద్వారకామాయికి సమీపంలో ఉన్న శ్యామా నివాసాన్ని దర్శించుకుంటూ ఉంటారు.
అర్జునుడికి శ్రీకృష్ణుడు, శివునికి నంది ఎలాగో సాయిబాబాకు శ్యామా అలా నిలిచారు. శ్రద్ధ, సబూరి (ఓర్పు,నమ్మకం) లతో గురువును ఎలా సేవించాలో శ్యామా జీవితం మనకు నేర్పుతుంది.*
No comments:
Post a Comment