Tuesday, 21 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 


గూఢచారి 116 (1966)

విజయలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ నిర్మించిన గూఢచారి 116 చిత్రం తెలుగులోనే తొలి గూఢచారి సినిమాగా ప్రజాదరణ పొందింది. 11:08:1966 న ఈ సినిమా విడుదల అయింది.కృష్ణ కెరీర్ ను  మలుపు తిప్పిన సినిమాలలో 'గూఢచారి 116' ఒకటి. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజునే కృష్ణకు 20 సినిమాలలో ఆఫర్లు రావడం విశేషం. 

దేశంలో విధ్వంసం సృష్టిస్తూ శత్రుదేశాలకు సాయపడే విద్రోహుల ముఠాను అంతం చేసేందుకు రహస్య ఏజంట్‌ 303 (శోభన్‌బాబు)ని గూఢచార సంస్థ నియమిస్తుంది. విదేశీ విద్రోహులకు సహాయపడే మన దేశ ముఠాకు దామోదర్‌ (ముక్కామల) నాయకుడు, అతని ముఠాలో ఎంతోమంది రౌడీలు పనిచేస్తూ వుంటారు. విద్రోహశక్తులు దామోదర్‌ ముఠా సాయంతో దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే వారి మూలాలను పసిగట్టి వాళ్లు వాడిన కారు నెంబరు వంటి కొన్ని ఆధారాలను ఏజంట్‌ 303 సంపాదిస్తాడు. వాటిని గూఢచార సంస్థకు చేరవేసేలోపు శత్రువ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. సీఐడీ ఉన్నతాధికారి (ఎ.వి. సుబ్బారావు) ఈ చిక్కును విడదీసే బాధ్యతను గోపి (కృష్ణ) అనే ఏజెంట్‌ 116కు అప్పగిస్తాడు. ఆ విద్రోహ ముఠాకు ఒక విదేశీయుడు (రాజనాల) బాస్‌. అతడు తన ఏజెంట్‌ దామోదరం (ముక్కామల)ను ‘ఆర్‌డి’ అనే కోడ్‌ భాషలో సంప్రదిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ఉంటాడు. దామోదరం కూతురు రాధ (జయలలిత). ఏజెంట్‌ 303 సేకరించిన ఆధారాలను సంపాదించే ప్రయత్నంలో దామోదరం ఆ ఏజెంట్‌ చెల్లెలు సుగుణ (గీతాంజలి)ని కలిసి, తనను సీఐడీ అధికారిగా  పరిచయం చేసుకొని, ఆమెను పావుగా వాడుకొనే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా గోపి ఆమె వద్దకు వచ్చి తనను గూఢచారి 116 అని పరిచయం చేసుకుంటాడు. కానీ సుగుణ గోపినీ నమ్మదు. ఆ ఇంట్లో ఉన్న ఏజెంట్‌ 303 ఫోటో మీద ఉన్న అడ్రస్‌ ఆధారంగా గోపి నెగిటివ్‌లు సంపాదించి, వాటి ఆధారంగా విద్రోహ ముఠా ఆనుపానులు తెలుసుకుని వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో, రాధ ప్రేమలో పడతాడు. రాధకు ఆమె తండ్రే విధ్వంసాలు సృష్టిస్తున్న విషయాన్ని తెలియజెప్పి ఆమె ద్వారా దామోదరంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దామోదరం విదేశీ ముఠా నాయకుడిని కలిసి ఇకపై నేరప్రవృత్తికి తిలోదకాలు ఇస్తున్నట్లు చెబుతాడు. అందుకు ఆగ్రహించిన ముఠా నాయుకుడు రాధను బంధిస్తాడు. ఇక గోపి చాకచక్యంతో విద్రోహ ముఠాను మట్టికరిపించి, ముఠా నాయకుడు విమానంలో పారిపోతుంటే తన జీపుతో డీకొట్టి ఆ విమానాన్ని పేల్చివేస్తాడు. గోపి, రాధ, ఒకటౌతారు.

ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆరుద్ర మాటలు రాశారు. టీ చలపతిరావు సంగీతం సమకూర్చిన చిత్రంలోని పాటలన్నీ హిట్. ఈసినిమాలో "నువ్వు నా ముందుంటే" పాటను కలర్ లో చిత్రించారు. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమాను 1967లో ‘ఫర్జ్‘ గా హిందీలో పునర్నిర్మించారు.


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...