షిర్డీ సాయిబాబాకు అత్యంత ప్రియమైన భక్తులలో తాత్యా కోతే పాటిల్ స్థానం అగ్రగణ్యమైనది. బాబాను కేవలం దైవంగానే కాకుండా, తన సొంత అన్నయ్యగా, గురువుగా భావించి ఎంతో చనువుగా మెలిగిన ఏకైక భక్తుడు ఈయనే. సాయి సచ్చరిత్రలో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎంతో మధురమైనది.
మనం ముందుగా చెప్పుకున్నట్లు, ఈయన బాబాను అడవుల్లో వెతికి అన్నం పెట్టిన పవిత్ర మూర్తి బాయిజా బాయి కుమారుడు.
బాబా మొదట షిర్డీకి వచ్చినప్పుడు తాత్యా చిన్న చిన్న పిల్లాడు. బాబా అడవుల్లో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి వెళ్లేవాడు. బాబా మసీదులో స్థిరపడ్డాక, తాత్యా బాబాను "మామా" అని, ఆ తర్వాత "అన్నయ్యా" అని పిలిచేవాడు. బాబా కూడా ఆయన్ను ఎంతో ముద్దుగా "తాత్యా" లేదా "కోతే చా" (కోతే కొడుకు) అని పిలిచేవారు. చిన్నప్పుడు తాత్యా బాబా వీపుపై ఎక్కి ఆడుకునేవాడట. బాబా కూడా అతనితో కలిసి నవ్వుతూ, తుళ్లుతూ గడిపేవారు.
ద్వారకామాయిలో బాబాతో కలిసి పడుకునే ముగ్గురు ముఖ్య భక్తులలో తాత్యా ఒకరు (మిగిలిన ఇద్దరు మహల్సాపతి, శ్యామా). బాబా, తాత్యా ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని పడుకునేవారట. రాత్రి పూట ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునేవారు. ఒకవేళ తాత్యా గాఢనిద్రలోకి జారుకుంటే, బాబా అతని కాళ్లు నొక్కుతూ, దుప్పటి కప్పుతూ ఒక తల్లిలా చూసుకునేవారట.
మొదట్లో తాత్యాకు వ్యాపారంలో సరైన సంపాదన ఉండేది కాదు. బాబా అనుగ్రహం వల్ల ఆయన వ్యవసాయం, వ్యాపారం ఊపందుకుని షిర్డీలోనే సంపన్న వ్యక్తిగా మారారు. కానీ ఎంత సంపద వచ్చినా బాబాపై ఉన్న భక్తి అణుమాత్రం కూడా తగ్గలేదు. బాబా ప్రతిరోజూ భక్తుల నుంచి వచ్చే దక్షిణలో కొంత భాగాన్ని తాత్యాకు ఇచ్చేవారు. అలా బాబా తన ఆఖరి రోజు వరకు ప్రతిరోజూ తాత్యాకు రూ. 4 నుంచిరూ. 35 వరకు ఇస్తూనే ఉండేవారు.
1918వ సంవత్సరం విజయదశమి సమయానికి షిర్డీలో తీవ్రమైన అంటువ్యాధి (మహమ్మారి) వ్యాపించింది. దానికి తాత్యా కోతే కూడా గురయ్యారు. ఆయన పరిస్థితి విషమించి, చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జ్యోతిష్యులు కూడా తాత్యా ఆ విజయదశమి రోజున మరణించడం ఖాయమని చెప్పారు.
కానీ సరిగ్గా అదే రోజు (1918 అక్టోబర్ 15న) బాబా ద్వారకామాయిలో కూర్చుని, "నా తమ్ముడు తాత్యా చనిపోకూడదు, అతనికి బదులు నేను వెళ్తాను" అని ప్రకటించారు. బాబా తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టి మహాసమాధి చెందారు. ఆశ్చర్యకరంగా, చావు అంచుల్లో ఉన్న తాత్యా కోతే పాటిల్ పూర్తిగా కోలుకుని, లేచి నిలబడ్డారు. తన భక్తుడి ప్రాణాలను కాపాడడం కోసం సాయిబాబా తన ప్రాణాలనే త్యాగం చేశారు. భక్తుని కోసం దేవుడే తన ప్రాణాలను ధారపోసిన ఈ లీల ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే అత్యంత అరుదైనది.
షిర్డీలో ప్రతి రెండు రోజులకు ఒకసారి బాబా ద్వారకామాయి నుంచి చావడికి ఊరేగింపుగా (చావడి ఉత్సవం) వెళ్లేవారు. ఈ ఉత్సవంలో బాబాను ఎంతో వైభవంగా నడిపించే బాధ్యతను తాత్యానే చూసుకునేవారు. బాబా సమాధి చెందిన తర్వాత కూడా తాత్యా షిర్డీ సంస్థాన్ వ్యవహారాలలో, బాబా పూజలలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన 1945 లో మరణించే వరకు బాబా సేవలోనే గడిపారు.
No comments:
Post a Comment