పాతాళ భైరవి (1951)
1951 లో విడుదలైన విజయా - వాహినీ స్టూడియో వారి పాతాళ భైరవి సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన అద్భుత కావ్యంగా ఇది నిలిచిపోయింది.
నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన పాతాళభైరవి సినిమా - దర్శకుడు కె.వి. రెడ్డి దర్శకత్వ ప్రతిభకు, ఎస్వీఆర్ నటనకు, ఎన్టీఆర్ కు లభించిన గొప్ప ఆదరణకు నిదర్శనం. మార్కస్ బార్ట్లీ కెమెరా పనితనం అద్భుతం.
ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు (ఎన్టీఆర్). సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు (బాలకృష్ణ). రాజకుమార్తె ఇందు (మాలతి)అప్పుడప్పుడూ ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడి (రేలంగి) దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం, ఆమెను ఒకసారి పాము బారి నుంచి కాపాడటం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసుపడుతుంది. రాజ కుమారి జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు బంధు వియోగం ఉందని చెబుతారు. దాంతో రాజు ఆమెను అంతఃపురం విడిచి వెళ్ళవద్దని చెబుతాడు. తోటరాముడు ఆమెను చూడటానికి రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజకుమారిని కలుస్తాడు. ఇంకెప్పుడూ అలాంటి సాహసం చేయవద్దని ఆమె అతన్ని మందలిస్తుంది. తిరిగి వెళ్ళేటపుడు అతన్ని రాజభటులు బంధిస్తారు. రాజు ఆగ్రహంతో అతన్ని ఆ రాత్రికి బంధించి మరునాడే ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఆ రాత్రి అతన్ని చూడటానికి రాజకుమారి దొంగతనంగా వెళుతుంది. రాజు ఆమెను వెంబడించి వెళ్ళి తోటరాముడిని అతని అంతస్తు గురించి గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోమని విడిచిపెట్టేస్తాడు. రాజకుమార్తెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి తోటరాముడు నేపాళ మాంత్రికుని (ఎస్వీ రంగారావు) ఆశ్రయిస్తాడు. నేపాళ మాంత్రికుడు సర్వ లోకాధిపత్యం కోసం ఒక సాహస యువకుడిని పాతాళ భైరవి అనే శక్తికి బలి ఇవ్వడం కోసం వెతుకుతుంటాడు. ఆ మాంత్రికుడు రాముడిని తన బలిపశువుగా ఎన్నుకుంటాడు. రాముడు ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. మాంత్రికుడు అసలు ఆలోచన తెలుసుకొన్న తోటరాముడు అదునుచూసుకొని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. రాజు రాముడి ప్రయోజకత్వానికి సంతోషించి కూతుర్నిచ్చి పెళ్ళి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఈ లోగా మాంత్రికుని శిష్యుడు సదాజప (పద్మనాభం) సంజీవని మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకొంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరది తన మేనకోడలితో తనకు పెళ్ళి కావడం లేదని బాధతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడు అతన్ని ఆపి, తాను చెప్పినట్లు చేస్తే రాకుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని మాట ఇస్తాడు. మాంత్రికుడు చెప్పినట్లు రాముడి పూజా మందిరంలో ఉన్న పాతాళభైరవి శక్తిని తీసుకువచ్చి మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయవలన ఒక్కమారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. పెళ్ళి పీటలపైనున్న రాకుమారిని మాయం చేసి తనతో తీసుకెళ్ళి పోతాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి స్నేహితుడు అంజితో కలిసి మాంత్రికుని వెతుక్కుంటూ వెళతాడు. మాంత్రికుడు రాజకుమార్తెను బెదిరించి పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె మాత్రం తోటరాముడిని తప్ప మరెవ్వరినీ పెళ్ళి చేసుకోనని చెబుతుంది. దాంతో మాంత్రికుడు తన మంత్రశక్తితో రాముడిని బంధించి తీసుకువచ్చి ఆమె తనను పెళ్ళి చేసుకోకపోతే అతన్ని దేవికి బలి ఇస్తానని బెదిరిస్తాడు. మాయమైపోయిన మిత్రుడి కోసం వెతుకుతున్న అంజికి ఇద్దరు రాక్షసులు ఒక మాయ శాలువ, పాదరక్షలు గురించి పోట్లాడుకోవడం గమనించి తెలివిగా వారి దగ్గర నుంచి వాటిని కాజేస్తాడు. వాటి సహాయంతో రాముడు బంధించి ఉన్న గుహను చేరుకుంటాడు. అక్కడ శాలువాతో అదృశ్య రూపంలో వచ్చి రాముడిని విడిపిస్తాడు. తన దగ్గరున్న శాలువా, పాదరక్షలను రాముడికి ఇస్తాడు. మాంత్రికుడి బారి నుంచి ఎలా బయట పడాలో తెలియక వజ్రపుటుంగరాన్ని నూరి దాన్ని తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న ఇందును కాపాడతాడు. అంజి సదాజపకు స్పృహ తప్పించి అతని వేషంలో మాంత్రికుడి దగ్గరకు వెళతాడు. అంజి తెలివిగా మంత్రశక్తులున్న మాంత్రికుడి గడ్డాన్ని తొలగింప జేయిస్తాడు. తర్వాత రాముడు రాకుమార్తె లాగా నటించి అతని దగ్గర్నుంచి పాతాళ భైరవిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే సదాజపుడు వచ్చి అడ్డుపడతాడు. అప్పటికే మంత్ర శక్తులు కోల్పోయిన మాంత్రికుడితో రాముడు పోరాడుతుండగా అంజి పాతాళ భైరవి సహాయంతో అందరినీ మహలు తో సహా ఉజ్జయినికి చేర్చమంటాడు. మాంత్రికుడి పీడ దారి మధ్యలోనే వదిలించుకుని అందరూ రాజ్యం చేరుకుంటారు.
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ తెలుగు జాతి ఆరాధ్య దైవంగా మారే ప్రస్థానం మొదలైంది. ఒక సామాన్య తోటమాలి నుంచి వీరుడిగా ఎదిగే క్రమాన్ని ఆయన ఎంతో సహజంగా పండించారు. ‘నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా’ అనే ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుండి పోతుంది.
ఈ సినిమాలో నేపాల మాంత్రికుడు పాత్రను ఎస్.వి. రంగారావు పోషించలేదు, జీవించారనే చెప్పాలి. విలనిజాన్ని ఒక కళగా మార్చిన ఘనత ఆయనది. సాహసం సేయరా డింభకా... అంటూ ఆయన పలికే సంభాషణలు, ఆయన హావభావాలు దశాబ్దాల తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.
కథ, మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు అందించగా కమలాకర కామేశ్వరరావు స్క్రీన్ ప్లే రాశారు. ఘంటసాల సంగీతం మధురంగా ఉంటుంది. కలవరమాయే మదిలో, ఎంత ఘాటు ప్రేమయో, ప్రేమ కోసమై వలలో పడేనే, వినవే బాల, తీయని ఊహలు హాయిని గొలిపే పాటలు ఇప్పటికీ వీనుల విందు చేస్తూనే ఉంటాయి.*
No comments:
Post a Comment