Saturday, 25 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు


 గుండమ్మకథ (1962)

విజయా వారి సినిమాల్లో మరో ఆణి ముత్యం గుండమ్మ కథ. ఎన్ టీ ఆర్, అక్కినేని వంటి హీరోలు ఉన్నా ”గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద పేరు పెట్టడం విశేషం. గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.

జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో నిర్మించిన మనె తుంబిద హెణ్ణు చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి గుండమ్మ కథగా రీమేక్ చేశారు. డి.వి.నరసరాజు  మాటలు రాశారు. అయితే నిర్మాతల్లో ఒకరైన నాగిరెడ్డి దీనిని ఒేకే చేసినా మరో నిర్మాత చక్రపాణి విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని కథను పూర్తిగా తిరగరాశారు. అంతవరకు పౌరాణికాలకు పరిమితమైన కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా ఈ సాంఘిక చిత్రానికీ సత్తా చాటుకున్నారు. 

గుండమ్మ (సూర్యకాంతం) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు ఊళ్ళో గయ్యాళిగా పేరు. ఆమెకు సవతి కూతురు లక్ష్మి (సావిత్రి), స్వంత కూతురు సరోజ (జమున), కొడుకు (హరనాథ్) ఉంటారు. ఇంటి చాకిరి మొత్తం లక్ష్మి మీద పడితే, సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకెగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుకా ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరినీ పనివాళ్ళలా ఉంచాలని, సరోజకు బాగా డబ్బున్న, చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్ళిచేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్యే గంటయ్య (రమణారెడ్డి) పెళ్ళి చెడగొడతూంటాడు. హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు (రాజనాల) విడుదలయ్యాకా అతనికి సరోజను ఇచ్చి చేయాలని అతని పథకం.

పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామభద్రయ్య (ఎస్ వీ రంగారావు) తన ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. వారు చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో, రామభద్రయ్య పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్థం చేసుకొంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదనీ, మరోవైపు సరోజకున్న పెంకెతనం, బద్ధకం తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ (ఎన్టీఆర్), రాజా (అక్కినేని) లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని ఆకర్షిస్తాడు. గుండమ్మకు కొడుకు (హరనాథ్) ప్రేమిస్తున్న అమ్మాయి (ఎల్ విజయలక్ష్మి)కి అన్నయ్యగా రాజా ప్రవేశించి, సరోజను ఆకట్టుకుంటాడు. సరోజ మంకుపట్టు పట్టుకు తోడు రాజా అతను ఆస్తిపరుడేనని నమ్మి గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన లక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేసి, తనకు లక్ష్మినిచ్చి పెళ్ళిచేయమని అంజి ఇచ్చిన సలహా నచ్చి అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది. రాజా తాను దుర్వ్యసనాలకు బానిసనని, దొంగనని, ఆస్తిపాస్తులూ లేనివాడినని కొత్త నాటకం మొదలుపెడతారు. రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారన్న వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి లక్ష్మిని నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు. కష్టపడి స్వతంత్రంగా జీవించడంలోని తృప్తి, ఉన్నదాంట్లో సర్దుకోవడం వంటివి అనుభవంలోకి తెస్తాడు. మరోవైపు గుండమ్మ కొడుకు తల్లిని లెక్కించకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. గుండమ్మ కోడలి దూరపుబంధువు దుర్గమ్మ (ఛాయాదేవి) ఆ చుట్టరికం అడ్డుపెట్టుకుని గుండమ్మ ఇంట్లో చేరుతుంది. ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు. ఇంతలో అంజి, లక్ష్మి వచ్చి స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్న గుండమ్మని కాపాడి, సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు. ఇటు రాజా యజమాని నుంచి జీతం తీసుకునేందుకు సరోజను పంపుతాడు. తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే యజమాని అని తెలుసుకుని అతను తనను తన భర్తను అవమానించాడన్న రోషంతో తిరిగి వస్తున్న సరోజను లక్ష్మి, అంజీ కలసి జరిగినదంతా చెప్తారు. యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. అలా అంతా కలుస్తారు.

ఈ సినిమాలో పాటలన్నీ పింగళి నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం, పాటలే ఈ సినిమా తిరుగులేని విజయానికి కారణమయ్యాయి. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లకు మొత్తం 8 పాటలను సమానంగా కేటాయించారు. ఈనాటికీ ఫ్రెష్ గా మనం వింటున్న గుండమ్మ కధ పాటల గురించి ప్రత్యేకంగా, విడివిడిగా చెప్పుకోనవసరం లేదు.*


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...