వెలుగునీడలు (1961)
ప్రతి మనిషి జీవితంలో కష్టం, సుఖం వెలుగు నీడల్లా వుంటాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశంతో అన్నపూర్ణా వారు నిర్మించిన వెలుగునీడలు చిత్రం 1961 జనవరి 7 న విడుదలైంది. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు చిత్రానువాదం చేసి దర్శకత్వం వహించారు. ఆత్రేయ మాటలు రాశారు.
రావు బహదూర్ వెంకట రామయ్య (యస్.వి.రంగారావు), భార్య కనకదుర్గమ్మ (సూర్యకాంతం) దంపతులకు సంతానంలేని కారణంగా సుగుణ (సావిత్రి)ని పెంచుకుంటారు. తరువాత వారికి సంతానయోగం కలిగి వరలక్ష్మి (గిరిజ) పుడుతుంది. దాంతో కనకదుర్గమ్మకు సుగుణపై ప్రేమ పోయి ద్వేషం మొదలవుతుంది. దీనిని గ్రహించిన వెంకట రామయ్య సుగుణ బాధ్యతల్ని గుమస్తా వెంగళప్ప (రేలంగి) కి అప్పచెబుతాడు. డాక్టరు చదువుతున్న సుగుణకు కవితలు రాసే చంద్రం (నాగేశ్వరరావు)తో పరిచయమవుతుంది. అది ప్రేమకు దారితీస్తుంది. విదేశాల నుంచి వచ్చిన రఘు (జగ్గయ్య) సుగుణ అంటే అభిమానం చూపిస్తాడు. రవికి క్షయ వస్తుంది.తన పరిస్థితి తెలిసిన రవి సుగుణను ఒప్పించి రఘుతో పెళ్ళి జరిపిస్తాడు. అయితే విధి వంచితుడై రఘు ప్రమాదంలో మరణిస్తాడు. రవి చికిత్స తీసుకుని ఆరోగ్యవంతుడవుతాడు. సుగుణ కోరిక మేరకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. రావుబహదూర్ వెంకటరామయ్య. తాను బ్రిటీష్ కాలంలో ప్రారంభించిన రాజసేవ పత్రిక అదే పేరుతో, అదే ధోరణితో నడపడమే కాక జార్జిప్రెస్ అన్న ప్రెస్ పేరునూ అలాగే కొనసాగిస్తారు. రాజసేవ పత్రికను నడిపించమన్న మావగారి కోరిక మీద దాని యాజమాన్యం స్వీకరించి నడిపిస్తాడు రవి. రాజసేవ పత్రికను నవజ్యోతిగా మార్చి, దాన్ని లాభాల బాట పట్టిస్తారు. అయితే తన అభ్యుదయ భావాలతో పత్రిక లాభాల్లో పనివారికి వాటా ఇవ్వాలని ఆశించగా అప్పటికే ఆ లాభాలన్నిటినీ కుటుంబంలోని వారు ఖర్చుచేసేయడంతో హతాశుడవుతాడు. మరోవైపు కనకదుర్గమ్మ గతంలో చంద్రం, సుగుణ ప్రేమించుకున్న విషయంపై వరలక్ష్మిలో అనుమానం రేపుతుంది. బోనస్ కోసం కార్మికులు చేస్తున్న పోరాటంలో చంద్రం వారితో కలుస్తాడు. వెంకటరామయ్య కొత్త కార్మికులను తీసుకువస్తాడు. వారి మధ్య పోరాటాన్ని ఆపే ప్రయత్నంలో వరలక్ష్మి తీవ్రంగా గాయపడుతుంది. సుగుణ ఆమెను కాపాడుతుంది. దానితో అనుమానాలు తొలగి అందరూ ఒకటవుతారు.
మానవ సంబంధాలను సహజంగా ప్రదర్శించడంలో దర్శకుడు ఆదుర్తి నైపుణ్యం చంద్రం సుగుణను డాక్టర్ రఘును పెళ్లి చేసుకోమని ఒప్పించే సన్నివేశంలోనూ, అలాగే ఆ తర్వాతి మరో సన్నివేశంలో వరలక్ష్మిని పెళ్లి చేసుకోమని సుగుణ చంద్రంను ఒప్పించిన సన్నివేశంలోనూ కనబడుతుంది. ఏఎన్ఆర్, సావిత్రి ఇద్దరూ భావోద్వేగాలను సున్నితంగా పండించారు. ఆత్రేయ సంభాషణలు సందర్భోచితంగా, సూటిగా, హృద్యంగా ఉంటాయి.
పెండ్యాల నాగేశ్వర రావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో 6 పాటలు శ్రీశ్రీ రాస్తే రెండు కొసరాజు రాశారు. పాడవోయి భారతీయుడా పాట వినకుండా మన ఆగస్టు 15 సంపూర్ణం కాదు. కల కానిది, విలువైనది పాట ఇప్పటికీ ధైర్యాన్ని ఇస్తూనే ఉంటుంది. హాయీ హాయిగా జాబిల్లి తొలి- పాట ఎవర్ గ్రీన్. ఓ రంగయో పూల రంగయో శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా 'తూయ ఉల్లం‘ పేరుతో ఏకకాలంలో తీశారు.*
No comments:
Post a Comment