ఆడపడుచు (1967)
రక్తసంబంధం తరువాత ఎన్టీఆర్ మళ్లీ అన్న పాత్రలో రాణించిన చిత్రం ఆడపడుచు. ఇందులో ఎన్టీఆర్ కు చెల్లిగా టైటిల్ రోల్ లో చంద్రకళ. ఎన్టీఆర్ కు తమ్ముడిగా శోభన్ బాబు నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇద్దరు అన్నలతో చెల్లి పాడిన అన్నా నీ అనురాగం- పాట ఇప్పటికీ రాఖీ పండగ ప్రత్యేకమే.
కథ విషయానికి వస్తే సత్యం ( ఎన్టీఆర్) ఓ చిరుద్యోగి. తన తమ్ముడు శేఖర్(శోభన్బాబు), చెల్లెలు శారద (చంద్రకళ)తో కలసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేసే సుశీల, సత్యం ప్రేమించుకుంటారు. తన చెల్లెలు పెళ్ళి, తమ్ముడు స్థిరపడ్డాక పెళ్ళి చేసుకోవాలని భావిస్తాడు సత్యం. డాక్టర్ రమేశ్ ( హరనాథ్) తో శారదకు పెళ్ళి నిశ్చయమవుతుంది. అలాగే రావు బహదూర్ రంగారావు ఏకైక కుమార్తె లలిత (వాణిశ్రీ) ను శేఖర్ ప్రేమించడం, వారి పెళ్ళికి పెద్దలు అంగీకరించడం జరుగుతుంది. డబ్బు అవసరమై తన ఇంటిని తన చిన్నాన్న ధర్మయ్య వద్ద పూచీగా పెట్టి అప్పు తీసుకుంటాడు సత్యం. అనుకోకుండా ఓ ప్రమాదం కారణంగా శారద కంటిచూపు పోతుంది. చెల్లెలు జీవితం బాగుపడ్డాకే తన పెళ్ళి అనుకుంటాడు సత్యం. లలిత, శేఖర్ పెళ్ళి చేసుకుంటారు. ధనవంతుల అమ్మాయి అయిన లలిత ఆ ఇంట అడుగు పెట్టిన తరువాత నుంచీ వారి సంసారంలో కలతలు మొదలవుతాయి. లలిత తన పుట్టిల్లు చేరుకుంటుంది. భార్యతో పాటే శేఖర్ వెళతాడు. ధర్మయ్య జాలిచూపకుండా, తన అప్పు తీర్చమని, లేదా ఇల్లు ఖాళీ చేయమని అంటాడు. నిలువనీడలేని సత్యం, చెల్లెలితో శేఖర్ దగ్గరకు వెళతాడు. అక్కడ అవమానాల పాలవుతాడు. అన్నాచెల్లెళ్ళకు సాయం చేయలేని జీవితం తనదని భావించిన శేఖర్ తాగుడుకు బానిస అవుతాడు. శేఖర్ తాగుబోతయ్యాడని తెలుసుకున్న శారద తన పుట్టినరోజున వెళ్ళి అడిగితే ఆ వ్యసనం మానేస్తాడని ఆశిస్తుంది. అదే సమయంలో ఆమె ప్రమాదానికి గురవుతుంది. అప్పుడే కారులో వస్తోన్న శేఖర్ తన చెల్లెలును చూసి, ఆసుపత్రికి తీసుకువెళతాడు. సత్యం, చెల్లెలును వెదుక్కుంటూ వస్తాడు. అక్కడకు సుశీల కూడా వస్తుంది. శారద రాసిన ఉత్తరం చూసి సుశీల వచ్చానని చెబుతుంది. డాక్టర్ రమేశ్ కూడా అదే ఆసుపత్రిలో పనిచేస్తూ, శారదకు కంటి చూపు వస్తుందని చెబుతాడు. శారద రమేశ్ ను పెళ్ళాడుతుంది. సుశీల, సత్యం పెళ్ళవుతుంది. శారదను రమేష్ కంటికి శస్త్ర చికిత్స చేయించడానికి విదేశాలకు తీసుకు వెడుతుంటే అన్నలు ఆడపడుచుకు వీడ్కోలు చెప్పడం సినిమా ముగింపు.
సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.హేమాంభరధరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఆడపడుచు చిత్రం 1967 నవంబరు 30న విడుదలయింది. ఈ సినిమాకు టి.చలపతిరావు సంగీతాన్నందించారు. పద్మనాభం, గీతాంజలి, నాగభూషణం, చదలవాడ కుటుంబరావు కథకు తగ్గ ఇతర పాత్రలు పోషించారు. *
No comments:
Post a Comment