మాంగల్య బలం (1959)
అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై దుక్కిపాటి మధుసూదన రావు నిర్మించిన మాంగల్య బలం చిత్రం బెంగాలీ భాషలో నిర్మించిన అగ్నిపరీక్ష చిత్రానికి తెలుగు పునర్నిర్మాణం. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. ఆత్రేయ మాటలు రాశారు.
రావుసాహెబ్ పాపారావు (ఎస్ వీ రంగారావు) భార్య కాంతమ్మ(సూర్యకాంతం). ఆమెకు కూతురు సరోజ(సావిత్రి), కొడుకు సూర్యం(రమణమూర్తి). పాపారావు తల్లి పార్వతమ్మకన్నాంబ), చెల్లెలు సీత(జీ.వరలక్ష్మి), బావ రామయ్య (జూనియర్ ఎ.వి.సుబ్బారావు). సీతకు అనారోగ్యంగా ఉందని తెలిసి, ఆమె ఉంటున్న పల్లెటూరికి తల్లిని పంపుతాడు పాపారావు. ఆమెకు తోడుగా చిన్నప్పటి సరోజ, సూర్యం వెళ్తారు. అవసాన దశలోవున్న కూతురి కోరిక మేరకు సరోజ, సీత కొడుకు చంద్రశేఖర్ (ఏఎన్ఆర్) లకు పార్వతమ్మ వివాహం జరిపిస్తుంది. దీనికి ఆగ్రహించిన కాంతమ్మ కోర్టుద్వారా బాల్య వివాహాన్ని రద్దు చేయిస్తుంది. పార్వతమ్మ పల్లెటూరిలోనే ఉండి చంద్రాన్ని, అల్లుడు రామయ్యను కనిపెట్టుకుని ఉంటుంది. సరోజకు యుక్తవయసు వస్తుంది. ఆమెకు చిన్నప్పటి పెళ్లి గుర్తుండదు. పెద్దవాడైన చంద్రం పట్నంలో చదువుతుంటాడు. అమ్మమ్మ కోరిక మేరకు తన భార్య సరోజను కలుసుకుంటాడు. శేఖర్‌గా ఆమె కుటుంబానికి దగ్గరై సరోజ ప్రేమ పొందుతాడు. కాని పాపారావు దంపతులు డబ్బుగల శేఖర్ మిత్రుడు కైలాసం (రేలంగి) కు సరోజను ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటారు. కానీ కైలాసం మీనాక్షి (రాజసులోచన) ను ప్రేమిస్తాడు. శేఖర్ - సరోజల చనువు చూసిన అన్న సూర్యం బాల్యంలోనే ఆమెకు వివాహం జరిగిన విషయాన్ని చెబుతాడు. ఆ విషయం తెలిశాక సరోజ - శేఖర్‌ను దూరం పెడుతుంది. కానీ నాయనమ్మ పార్వతమ్మ ద్వారా చంద్రం, శేఖర్ ఒక్కడేనని తెలుసుకుని ఆనందిస్తుంది. సరోజకు కైలాసంతో పెళ్లి నిశ్చయిస్తుండగా.. శేఖర్‌తో కలిసి పల్లెటూరికి వెళ్లిపోతుంది సరోజ. విషయం తెలుసుకున్న పాపారావు శేఖర్‌ను అంతం చేసే ఉద్దేశంతో ఆ ఊరికి వెళ్తాడు. తండ్రి ప్రయత్నానికి కూతురు సరోజ, తల్లి పార్వతమ్మ అడ్డుపడిన సమయంలో - పార్వతమ్మకు తూటా తగిలి గాయపడుతుంది. తల్లి స్థితిని, మేనల్లుడి మంచిని గ్రహించిన పాపారావులో మార్పు రావటం, వారందరినీ తీసుకొని పట్నంవచ్చి కాంతమ్మ మనసును మార్చటంతో చిత్రం సుఖాంతమౌతుంది.
మాస్టర్ వేణు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలు శ్రీ శ్రీ, కొసరాజు రాశారు. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వాడిన పూలే వికసించేనే పాటలు ఇప్పటికీ రేడియోలో వినిపిస్తూ ఉంటాయి.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకే సారి చిత్రీకరించారు. తెలుగు సినిమా 1959, జనవరి 7న విడుదల కాగా తమిళంలో మంజల్ మహిమై పేరుతో అదే నెల 14వ తేదీన విడుదల చేశారు. *
No comments:
Post a Comment