ఏకవీర (1969)
తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు విజయవంతమైన చిత్రాలుగా మాత్రమే కాకుండా సాహిత్యాన్ని వెండితెరపై పండించిన ప్రయోగాలుగా గుర్తుండిపోతాయి. 1969లో వచ్చిన ఏకవీర అలాంటి చిత్రమే. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సాధారణ ప్రేమకథ కాదు. ప్రేమకు ఎదురైన సామాజిక పరిస్థితులు, విధి, రాజకీయం, గౌరవం, త్యాగం కలిసి మనుషుల జీవితాలను ఎలా విషాదాంతానికి నడిపిస్తాయో చెప్పే కథ.
ఎన్టీఆర్, కాంతారావు, జమున, కె.ఆర్.విజయ ఈ చిత్రంలో పోటీపడి నటించారు. ప్రేమ ఒకరితో, పెళ్లి ఒకరితో జరిగిన ఈ నలుగురి మధ్య సంఘర్షణే చిత్ర కథాంశం.
ఈ పాత్రలను కేవలం హీరో,హీరోయిన్, విలన్ అనే మూసలో చూడలేం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంది. కానీ ఆ ప్రేమను తమకు నచ్చిన విధంగా అనుభవించే స్వేచ్ఛ మాత్రం వారికి లేదు. అదే కథలోని విషాదానికి మూలం. ఏకవీరలో ఆసక్తికరమైన అంశం- ప్రేమ. కానీ ప్రేమకు స్వేచ్ఛ లేదు. సేతుపతి, ఏకవీర మధ్య ఉన్న అనుబంధం ఒకవైపు, వీరభూపతి, మీనాక్షి మధ్య ఏర్పడే పరిస్థితులు మరోవైపు కథను సంక్లిష్టం చేస్తాయి. వ్యక్తులు తమ మనసులోని మాటను పూర్తిగా చెప్పుకోలేకపోవడం, చెప్పాల్సిన సమయంలో సమాచారం చేరకపోవడం, పరిస్థితులు తమ చేతుల్లో లేకపోవడం కథను విషాదం వైపు నడిపిస్తాయి. కె.ఆర్. విజయ పోషించిన ఏకవీర పాత్ర ఈ చిత్రానికి ఆత్మ. ఆమె కేవలం ప్రేమించే యువతి కాదు. ప్రేమను పవిత్రంగా భావించే స్త్రీ. తన జీవితంలో ఎదురైన పరిస్థితులను ఎదుర్కొంటూనే, తన మనసులోని ప్రేమను కాపాడుకోవాలనుకునే వ్యక్తిత్వం ఆ పాత్రలో కనిపిస్తుంది. చివరి దశలో ఆమె తీసుకునే నిర్ణయం ప్రేక్షకుడిని తీవ్రంగా కలచివేస్తుంది. ఆమె విషాదం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు - ఆ కాలంలోని స్త్రీకి తన జీవితంపై ఉన్న పరిమిత స్వేచ్ఛకు ప్రతీకగా కూడా చూడవచ్చు. ఎన్టీఆర్ పోషించిన సేతుపతి పాత్రలో వీరోచితత్వం కంటే భావోద్వేగం ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ సాధారణంగా పోషించే శక్తివంతమైన పాత్రలకు భిన్నంగా ప్రేమ, బాధ్యత, పరిస్థితుల మధ్య నలిగిపోయే వ్యక్తిగా కనిపిస్తారు. కాంతారావు పోషించిన వీరభూపతి పాత్ర కూడా చాలా కీలకమైనది. ఈ పాత్రవెనుక కూడా భావోద్వేగం ఉంది. పరిస్థితులు తెలిసిన తర్వాత అతనిలో ఏర్పడే పశ్చాత్తాపం పాత్రను మరింత మానవీయంగా మారుస్తుంది. జమున పోషించిన మీనాక్షి పాత్ర కథలో మరో ముఖ్యమైన మలుపు. జమున తన సహజమైన అభినయంతో ఈ పాత్రకు ప్రత్యేకమైన బరువు తీసుకొచ్చారు.
మీనాక్షి, ఏకవీర జీవితాల్లోకి వచ్చే విధానం కథను ఊహించని దిశలో తీసుకెళుతుంది. ఒక సందర్భంలో వీరభూపతి తనకు తెలియని నిజం మధ్య చిక్కుకోవడం, సేతుపతి దాన్ని చూడటం వంటి సంఘటనలు కథలో తీవ్రతను పెంచుతాయి. అందుకే ఏకవీరలో మంచి చెడు అనే సరళమైన విభజన కంటే తప్పులు చేసే మనుషులు, వాటి పరిణామాలు అనే కోణం బలంగా కనిపిస్తుంది.
సినిమాకు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సీ నారాయణ రెడ్డి పదునైన మాటలు, పసందైన కొన్ని పాటలు రాశారు. మరికొన్ని పాటలు దేవులపల్లి వారు రాశారు.కె.వి. మహదేవన్ అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలకు అనుగుణంగా సాగుతుంది.
ఏకవీర పాటల విభాగాన్ని చెప్పేటప్పుడు సినారె - దేవులపల్లి కవిత్వం, కె.వి. మహదేవన్ సంగీతం, ఘంటసాల - సుశీల - బాలు గాత్రం అనే కోణాలను కలిపి చూడాలి. తోటలో నా రాజు తొంగి చూచెను నాడు - పాట ఈ చిత్రంలోని బాగా గుర్తుండిపోయే గీతాల్లో ఒకటి. నీ పేరు తలచినా చాలు - మరో అందమైన సినారె గీతం. ఒక దీపం వెలిగింది ఒక రూపం వెలసింది - పాటలో కూడా సినారె రచనా ముద్ర కనిపిస్తుంది. వెలిగే దీపాన్ని ఒక రూపం ఆవిర్భావానికి, ఆరిపోయే దీపాన్ని ఒక రూపం కనుమరుగవ్వడానికి ప్రతీకగా మలచడం విశేషం. అలాగే ఎంత దూరమో - పాట నిండా కూడా సాహిత్య విలువలు ఉట్టిపడతాయి. ఇక దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ప్రతి రాత్రి వసంత రాత్రి - ఇప్పటికీ వసంత శోభ నింపుతుంది. సినారే రాయగా ఎన్టీఆర్, కాంతారావు కు బాలు పాడిన మూడు పద్య ఖండికలు - ఏ పారిజాతమ్ములీయగలనో, నీవు లేని తొలి రాతిరి- నిట్టూర్పుల పెను చీకటి, కలువ పూల చెంత చేరి - ఎవర్ గ్రీన్.
విశ్వనాథ సత్యనారాయణ నవలను ఆధారంగా చేసుకోవడం వల్ల కథలో సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నమైన సాహిత్య గంభీరత కనిపిస్తుంది. సినిమా స్క్రిప్టులో నవలలో లేని చాలా మార్పులు చేశారు. సినిమా ఆర్థికంగా విజయవంతం కానప్పటికీ సాహిత్యాన్ని సినిమాగా అనువదించిన ప్రయత్నం మాత్రం అభినందనీయం.
ఏకవీర నవలపై తెలుగు కావ్యాలతో పాటు పలు ఆంగ్ల నవలల ప్రభావం కూడా ఉందని విశ్వనాథ వారే స్వయంగా చెప్పారు. “సైలాస్ మారినర్లోని కథానిర్మాణం, కాళిదాస భవభూతులలోని శిల్పం, ఠాగూర్ నౌకాడూబీలోని శరీరవాంఛ దూరమైన ప్రేమధర్మం. నా తెలుగు రచనాశక్తీ - ఈ నాల్గింటినీ కలిపి ఏకవీరగా చేశాను” అని ఆయన అన్నారు.*
No comments:
Post a Comment