…
అబ్దీకాలు పెట్టడం ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రహసనంగా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ల వర్ధంతి వస్తోందంటే కుటుంబమంతా కలిసి ఏర్పాట్లు చేసుకునేవారు. వంటింట్లో సందడి ఉండేది. ఆడవాళ్లు ఓపికగా పనులు చక్కబెట్టేవారు. కనీసం వంటమనిషిని పెట్టుకుని, మిగతా ఏర్పాట్లను ఇంట్లోవాళ్లే చూసుకునేవారు. ఆ రోజుల్లో ఆచారానికి ఆప్యాయత తోడయ్యేది.
ఇప్పుడు కాలం మారింది. ఆడవాళ్లకు ఓపిక లేదనో, తీరిక లేదనో తప్పుపట్టలేం. ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు వారికి. కానీ ఇంట్లో ఇలాంటి కార్యక్రమం పెట్టాలంటే వారి సహకారం మాత్రం అంతంతమాత్రమే.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ‘మీరు ఏ పనీ చేసుకోవాల్సిన అవసరం లేదు… అన్నీ మేమే చేసిపెడతాం’ అంటూ అమ్మవార్లపేర్లతో అనేక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంట్లో గొడవెందుకు, మనశ్శాంతి ముఖ్యం కదా అని వాటిని ఆశ్రయిస్తే అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది!
ఉదయం తొమ్మిది గంటలకే ఫస్ట్ షిఫ్టు!
మరి అంత పొద్దున్నే అబ్దీకం ఎలా పెడతాం అని మధ్యాహ్నం షిఫ్టు తీసుకుంటే జరిపించేవారు రొటేషన్లో మన దాకా వచ్చి ముగించేసరికి, మనం భోజనానికి కూర్చునే సమయం మూడు గంటలు దాటకపోతే గొప్పే! అప్పటివరకు పితృదేవతల ఆకలి సంగతి దేవుడెరుగు, ఇంట్లోవాళ్ల ఆకలి సంగతి చెప్పనక్కర్లేదు.
ఇక వీటిని పెట్టే పెద్ద వాళ్ళ పరిస్థితి మరీ దయనీయం. నడుం వంగదు.. మోకాళ్ళ నొప్పులు– అటు చేయించే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువమంది వృద్ధులే అవుతున్నారు. మంత్రాలు మర్చిపోతున్నారు. కొందరు కుంటుకుంటూ వడ్డన చేస్తుంటే మనకి బాధేస్తుంది. చిన్నవాళ్ళు ఈ వృత్తిలోకి రావడం లేదు.
ఇక రేట్ల విషయానికొస్తే… ఆరు వేల రూపాయలు దాటిపోయాయి. ఎక్కడైనా పాపభీతి మిగిలి ఉన్నవాళ్లు కొంచెం తక్కువకు చేస్తారేమోనని వెతుక్కోవాల్సిన పరిస్థితి.
అంతటితో అయిపోతుందా? అదనపు భోజనాల లెక్క మొదలవుతుంది. రెండొందల రూపాయలు దాటిన ఒక్కో భోజనం! ఇంటికి వచ్చిన బంధువుల సంఖ్యను బట్టి బిల్లు పెరుగుతూనే ఉంటుంది. చివరకు పితృకార్యానికి పెట్టిన ఖర్చు కంటే, వచ్చినవాళ్ల భోజనాల ఖర్చే ఎక్కువయ్యేలా ఉంది. ఆఫ్ కోర్స్- బంధువుల మాట అటుంచి కుటుంబాల్లలోని వారీ వీటికి రావడానికి ముఖం చాటేస్తున్నారు.
నిజానికి ఈ సంస్థలు చేస్తున్న పనిని తప్పుపట్టలేం. వారికి కూడా సిబ్బంది, వంటసామగ్రి, రవాణా, ఇతర ఖర్చులు ఉంటాయి. కానీ సంప్రదాయ కార్యక్రమాలను ఒక సేవగా చూడాలా, లేక పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేయాలా అన్నదే ప్రశ్న.
ఇంట్లోవాళ్లకు ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో సంస్థలను ఆశ్రయిస్తే, చివరకు సంస్థల షిఫ్టులకు, రేట్లకు, నిబంధనలకు మనమే సర్దుకుపోవాల్సి వస్తోంది.
ఒకప్పుడు ఇల్లాలే అంతా చేసేది. తరువాత వంటమనిషి దొరికితే చాలనేపరిస్థితి. . ఇప్పుడు సంస్థ దొరకాలి, షిఫ్టు కుదరాలి, రేటు భరించాలి, అదనపు భోజనాల లెక్క తేలాలి!
మొత్తానికి పితృదేవతలకు పెట్టే అబ్దీకం కంటే, ఆ ఏర్పాట్లు చేసే సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందమే పెద్ద కార్యక్రమంగా మారిపోయింది.
ఇదే ప్రస్తుత కాలమహిమ!
పితృదేవతల ఆశీస్సులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, కార్యక్రమం చేసే ఇంటి పెద్దకు మాత్రం జేబుకు పెద్ద చిల్లు, ఒళ్ళు హూనం తధ్యం.*

No comments:
Post a Comment