వీరాభిమన్యు (1965)
1965లో విడుదలైన భారీ పౌరాణిక చిత్రం వీరాభిమన్యు. ఇది శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచగా, అభిమన్యుడిగా నటించిన శోభన్ బాబు ను అగ్రహీరోగా మార్చింది. రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్‌లాల్ నహతా, డూండీ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వీ మధుసూదనరావు అద్భుతంగా తెరకెక్కించారు. 1965 ఆగస్టు 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయవంతమైన సినిమాగా నిలిచింది.
ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు (ఎన్టీఆర్) అర్జునుడు (కాంతారావు) కు పద్మవ్యూహం రహస్యాన్ని చెబుతుండగా, గర్భవతిగా ఉన్న సుభద్ర ( ఎస్. వరలక్ష్మి) వింటుంది. గర్భంలో ఉన్న శిశువు అభిమన్యుడు ఆ వ్యూహాన్ని గ్రహిస్తాడు. కానీ దాని నుండి ఎలా బయటపడాలో మాత్రం వినలేడు. అయితే అభిమన్యుడి భవిష్యత్ తెలిసిన కృష్ణుడు పద్మవ్యూహం నుంచి ఎలా బయపడాలో చెప్పకుండా అంతటితో ముగిస్తాడు.
అభిమన్యుడు (శోభన్ బాబు) పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో పెద్దవాడై, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదిస్తాడు. వీరత్వం, ధైర్యం కలిగిన యువరాజుగా ఎదుగుతాడు.ఒక సందర్భంలో, విరాట రాజు కుమార్తె ఉత్తర ( కాంచన) తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. పెద్దల ఆశీర్వాదంతో వారి వివాహం జరుగుతుంది.
మహాభారత యుద్ధం మొదలవడంతో ద్రోణాచార్యుడు అర్జునుడు లక్ష్యంగా అత్యంత కఠినమైన పద్మవ్యూహం పన్నుతాడు. అప్పుడు పెద్దలు ఎవరూ లేకపోవడంతో పరిస్థితిని చూసి, యువ అభిమన్యుడు ముందుకు వస్తాడు. పద్మవ్యూహం నుంచి బయటకు రావడం తెలియకపోయినా పాండవుల కోసం, ధర్మం కోసం అభిమన్యుడు యుద్ధంలోకి దిగుతాడు.
కౌరవ యోధులంతా కలసి మూకుమ్మడిగా జరిపిన దాడిలో అభిమన్యుడు వీరమరణం పొందుతాడు.
దీనికి కారణమైన సైంధవుణ్ణి చంపుతానని ఆగ్రహావేశాలతో ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు కృష్ణ మాయ సాయంతో అతడిని చంపుతాడు. శ్రీకృష్ణునితో అన్నీ తెలిసి కూడా నీవు అభిమన్యుణ్ణి కాపాడలేదని నిందించడంతో అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపి, అభిమన్యుడు చంద్రలోకంలో ఉన్నాడని, శరీరంతో వచ్చే బంధాలు శరీరంతో నశిస్తాయని, పుట్టినవానికి చావు తప్పదని కృష్ణుడు జ్ఞాన బోధ చేయడంతో సినిమా ముగుస్తుంది.
సినిమాలో ముఖ్యంగా పద్మవ్యూహంలో రవికాంత్ నగాయిచ్ కెమెరా ప్రతిభ కనబడుతుంది. అదిగో నవలోకం పాట ఇప్పటికీ పాపులర్. సముద్రాల రాఘవాచార్య మాటలు రాయగా మహదేవన్ సంగీతం సమకూర్చారు. *