Tuesday, 14 July 2026

ఉమ్మడి ఏపి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి

 

హైదరాబాద్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో 22 జనవరి 1953న జన్మించారు. 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్​ కేబినెట్​లో మంత్రిగా పని చేశారు. 

అనంతరం పార్టీతో విభేదించిన ముద్రగడ పద్మనాభం 1988లో మంత్రి పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పేర్లతో పార్టీలు స్థాపించిన ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్​కు వెళ్లారు. 2004లో తెలుగుదేశం తరఫున కాకినాడ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. 2009లో కాంగ్రెస్ లో చేరి ఆ ఏడాది పిఠాపురం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.

ముద్రగడ పద్మనాభం సామాజిక అంశాలపై పలు సందర్భాల్లో దీక్షలు చేపట్టారు. 1988లో ఉత్తరకంచిలో కొందరు దళిత, బీసీ యువకుల అరెస్ట్​ను నిరసిస్తూ పోలీస్​స్టేషన్ ముందు ఆయన దీక్షకు దిగారు. అప్పటి ప్రభుత్వం స్పందించి ఆ యువకుల్ని విడుదల చేసింది. 1994లో కాపు రిజర్వేషన్ల సాధన కోసం కోనసీమలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 

కాపు రిజర్వేషన్ల డిమాండ్ తో 2016 జనవరిలో తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన సభ' హింసాత్మకంగా మారింది. రత్నాచల్ ఎక్స్​ప్రెస్ దహనం సహా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కూడా తన నివాసంలో రిజర్వేషన్ల కోసం ఆయన దీక్షలు చేశారు. చాలాకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం సాధించడంతో తాను చేసిన సవాల్​కు కట్టుబడి తన పేరు మార్చుకుంటున్నట్లు ముద్రగడ ప్రకటించారు.



No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...