Monday, 20 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 


దేవదాసు (1953)

శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి వినోద బ్యానర్ పై డీ ఎల్ నారాయణనిర్మించిన దేవదాసు చిత్రం ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదంతెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. 1953 జూన్ 26న ఈ చిత్రం విడుదల అయింది. 

దేవదాసు (అక్కినేని నాగేశ్వరరావు) రావులపల్లి జమీందారు నారాయణరావు (యస్.వీ.రంగారావు) ద్వితీయ పుత్రుడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన పార్వతి (సావిత్రి), దేవదాసులు చిన్ననాటి నుంచి  స్నేహితులు. చీటికీ మాటికి తగాదా పడుతూ ఉంటారు. చదువు పట్ల శ్రద్ధ చూపకుండా అల్లరి చిల్లరగా తిరిగే దేవదాసుని చూసి అన్న లాగా జూదవ్యసనుడౌతాడన్న భయంతో, పై చదువుల కోసం జమీందారు అతనిని పట్నం పంపుతాడు. చదువు పూర్తి చేసిన దేవదాసు తిరిగి ఇంటికి వస్తాడు. యుక్తవయసుకి మళ్ళిన ఇరువురి మధ్య చనువుని చూసి సంతోషించిన పార్వతి తండ్రి వారి పెళ్ళి గురించి మాట్లాడటానికి దేవదాసు ఇంటికి వెళతాడు.  ఆస్తి, కులం తక్కువ అని జమీందారు అవమానపరుస్తాడు. తండ్రిని ఒప్పించటంలో దేవదాసు విఫలుడౌతాడు. తనని చంపి దేవదాసు ఇష్టం వచ్చినట్టు చేసుకొనవచ్చునన్న బెదిరింపుకి దేవదాసు లొంగిపోతాడు. ఆ రాత్రే తనను ఒంటరిగా కలుసుకొన్న పార్వతికి తల్లిదండ్రులని ఎదిరించి పెళ్ళి చేస్కోలేనని తెలుపుతాడు. దేవదాసు పాదాల వద్ద చోటిస్తే, ఎంతటి కష్టాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధమన్న పార్వతి మాటలకి సమయం కోరతాడు దేవదాసు. ఆ తర్వాతి రోజునే దేవదాసు పార్వతికి చెప్పకుండా పట్నం బయలుదేరి వెళ్ళిపోతాడు. జమీందారు వద్ద మాట పడ్డ పార్వతి తండ్రి అంతకన్నా మంచి సంబంధం తెచ్చుకోగలమని భార్యని పోగొట్టుకొని, పిల్లలు గల నలభై ఏళ్ళ దుర్గాపురం ఊరి జమీందారు భుజంగరావు (సి.యస్.ఆర్. ఆంజనేయులు)తో సంబంధం కుదుర్చుకొని వస్తాడు. తనని మరచిపొమ్మని దేవదాసు అదివరకే పంపిన ఉత్తరంతో పార్వతి ఆ వివాహనికి ఒప్పుకొంటుంది. పార్వతిని మరచిపోలేని దేవదాసు తిరిగి ఊరి బాట పడతాడు. కానీ అప్పటికే పార్వతి పెళ్ళి వేరొకరితో నిశ్చయం అయిపోయినదని తెలుసుకొని భగ్నహృదయుడౌతాడు. పార్వతిని మరచిపోవటానికి విఫల యత్నాలు చేస్తున్న దేవదాసుకి స్నేహితుడు భగవాన్ (శివరాం పేకేటి) మద్యాన్ని అలవాటు చేస్తాడు. చంద్రముఖి (లలిత) అనే వేశ్య భగవాన్ ద్వారా దేవదాసుకి పరిచయం అవుతుంది. పార్వతి పట్ల దేవదాసుకి ఉన్న ప్రేమని చూసి చలించిపోతుంది. దేవదాసుకు ఇష్టం లేకపోవటంతో తన వేశ్యావృత్తిని త్యజించి, దేవదాసునే పూజిస్తూ అతనికి సేవలు చేస్తూ ఉంటుంది. తన పట్ల అంతటి మమకారాన్ని పెంచు కొన్న చంద్రముఖిని దేవదాసు అభిమానించటం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మకి మాత్రం తాను ప్రేమ, పెళ్ళిళ్ళకి దూరమని తెలుపుతాడు. మితి మీరిన తాగుడు వలన కాలం గడిచే కొద్దీ దేవదాసు ఆరోగ్యం పాడవుతుంది. ఇది తెలిసిన తండ్రి మరణిస్తాడు. అన్న దేవదాసుకి ఆస్తిలో వాటా ఇవ్వకుండా జాగ్రత్తపడతాడు. మరణించే లోపు ఒక్కసారైనా పార్వతిని చూడాలని పార్వతి మెట్టిన ఊరికి దేవదాసు బయలుదేరతాడు. చివరికి పార్వతి ఇంటి వద్దనే ఆమెను చూడకుండానే మరణిస్తాడు. మరణించినది దేవదాసే అని తెలుసుకొని పార్వతి కూడా అతనిని చూడకుండానే మరణించటంతో సినిమా విషాదాంతం అవుతుంది.

చక్రపాణి చిత్రానువాదం చేసిన ఈ సినిమాకి మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్య రాశారు. సంగీతం సి.ఆర్.సుబ్బరామన్ అందించారు. ఇక దేవదాసు పాటలు - జగమే మాయ, కుడి ఎడమైతే, కల ఇదనీ, చెలియ లేదు, చెలిమి లేదు,పల్లెకు పోదాం, అంతా భ్రాంతియేనా, ఓ దేవదా, అందం చూడవయా - ఇప్పటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి.

ఈ సినిమా 100 రోజుల పండగను హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిపారు. అన్ని భారతీయ భాషలలో కలసి దాదాపు 10 సార్లు ఈ సినిమా విడుదల అయినా నాగేశ్వరరావు దేవదాసుగా నటించిన ఈ చిత్రానికి వచ్చినంత పేరు మరే దేవదాసు చిత్రానికీ రాలేదు. 1937లో హిందీలో పి.సి.బారువా దేవదాసు చిత్రాన్ని నిర్మించాడు (కె.ఎల్.సైగల్, జమున). అదే సంవత్సరంలో తమిళంలోనూ సి.వి.రావు నటుడు, దర్శకుడుగా దేవదాసు సినిమా వెలువడింది. మళ్ళీ 1955లో హిందీలో దిలీప్ కుమార్, వైజయంతిమాల, సుచిత్రాసేన్లతో మరొక దేవదాసు వచ్చింది. మళ్ళీ హిందీలోనే షారుక్ ఖాన్, ఐశ్వర్యారాయ్, మాధురీ దీక్షిత్లతో 2002లో ఇదే కథ సినిమాగా వచ్చింది. 1974లో కృష్ణ దేవదాసుగా నటించిన సినిమా విడుదలై 50రోజులు ఆడీతే, అదే సమయంలో మళ్ళీ విడుదలైన నాగేశ్వరరావు దేవదాసు 200 రోజులు ఆడడం విశేషం.*


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...