ఉమ్మడి కుటుంబం (1967)
రామకృష్ణ, ఎన్.ఏ.టి. కంబైన్ పతాకంపై డి.యోగానంద్ దర్శకత్వంలో యన్టీఆర్, ఆయన సోదరుడు యన్.త్రివిక్రమరావు నిర్మించిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం 1967 ఏప్రిల్ 20న విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా ఎన్టీఆర్ అందించారు.
ఉమ్మడి కుటుంబం కథ విషయానికి వస్తే – ఓ ముసలి తల్లి (హేమలత) కి నలుగురు కొడుకులు. పెద్దవాడు నాగయ్య (రేలంగి)ఓ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. ఆయన భార్య గౌరి ( సూర్యాకాంతం) గయ్యాళి. వారికి ఓ కొడుకు. రెండో కొడుకు చంద్రం(సత్యనారాయణ) పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. అతని భార్య కాంతం ( ఎస్. వరలక్ష్మి) కి ఆడంబరాలు కావాలి. మూడోకొడుకు ముకుందం ( ప్రభాకర రెడ్డి) డాక్టర్. పట్నంలో ప్రాక్టీస్. అతని భార్య రమ ( సావిత్రి ) పేరుకు తగ్గట్టే లక్ష్మీకళ కలిగిన ఇల్లాలు. ఆమె అత్త దగ్గరే పల్లెలో ఉంటుంది. ఇక నాలుగో అబ్బాయి రాము(ఎన్టీఆర్). చదువు రాకపోయినా, తనవల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగరాదనే మంచి మనసు కలవాడు. అయితే అతనికి నాటకాల పిచ్చి. దాంతో తరచూ చీవాట్లు తింటూ ఉంటాడు. నాగయ్య కొడుక్కి రాము అంటే ఎంతో అభిమానం. డాక్టర్ ముకుందం, తన పల్లెటూరి భార్యపై విరక్తి పెంచుకొని పట్నంలో ఓ టక్కులాడి ( ఎల్. విజయలక్ష్మి) మోజులో పడతాడు. దాంతో ఇంటిముఖమే చూడడు. అందువల్ల రమను ఊళ్ళో వారితో కలసి గౌరి కూడా నానా మాటలూ అంటూ ఉంటుంది. ఇక చంద్రం, తన భార్య పోరు పడలేక, ఆమె పుట్టింటికే వెళతాడు. అక్కడ పలు అవమానాలు పడతాడు. ఛిన్నాభిన్నమైన కుటుంబాన్ని చూసి ముసలి తల్లి తల్లడిల్లి పోతుంది. ఆమె బాధ చూడలేక రాము పట్నం బయలు దేరుతాడు. దారిలో అతనికి శారద ( కృష్ణకుమారి) అనే ధనవంతురాలు పరిచయం అవుతుంది. ఆమె కారు చెడిపోతే, ఇంటిదాకా తోసుకుంటూ వెళతాడు రాము. శారద తండ్రి(నాగభూషణం) జమీందార్. అతనికి రాము మంచితనం నచ్చుతుంది. శారద కూడా రాముని ప్రేమిస్తుంది. రాము వచ్చిన పని తెలుసుకున్న జమీందార్ ఓ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా రాము టిప్పుటాపుగా తయారై తన అన్న ముకుందాన్ని బుట్టలో వేసుకున్న టక్కులాడితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతాడు. దాంతో ముకుందానికి ఆ వన్నెలాడి అసలు రంగు తెలిసి, భార్యను వెదుక్కుంటూ ఊరికి వెళతాడు. అదే సమయంలో భార్య దొంగతనాన్ని పట్టుకొని తగిన బుద్ధి చెబుతాడు నాగయ్య. ఇక పెళ్ళాం బెల్లమని వెళ్లిన చంద్రం అక్కడ అవమానాలు తాళలేక ఇంటిముఖం పడతాడు. తమ్ముడు బుద్ధి చెప్పగా చంద్రం భార్య కాంతం కూడా మెట్టినిల్లు చేరుకుంటుంది. తోడికోడళ్ళ మాటలు తట్టుకోలేక చనిపోవాలనుకున్న రమతో పాటే ఆమె అత్త కొడుకును నిలదీయాలని బయలు దేరుతుంది. వారు రాముకు తారసపడతారు. అందరూ గ్రామంలోని ఇల్లు చేరతారు. అక్కడ నాగయ్య కొడుకు బాబాయ్ రాముపై బెంగతో మంచం పట్టి ఉంటాడు. రామును చూశాక ఆ బాబు కోలుకోవడం, అన్నదమ్ములు మళ్ళీ కలుసుకోవడం, విడిపోయినప్పుడు కట్టుకున్న అడ్డు తొలగించుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రానికి సముద్రాల జూనియర్ రచన చేయగా, పాటలను సి.నారాయణ రెడ్డి, కొసరాజు, సముద్రాల జూనియర్ రాశారు. టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. ఇందులో ‘సతీ సావిత్రి’ నాటకం సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలచింది. సినిమా ప్రారంభంలోనే ఈ నాటకం ఉంటుంది. ఇందులో యన్టీఆర్ యమునిగా, సతీసావిత్రిగా వాణిశ్రీ, సత్యవంతునిగా రాజబాబు కనిపిస్తారు. దేవతయై దిగి వచ్చి.. పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్.
No comments:
Post a Comment