Wednesday, 15 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 

మిస్సమ్మ (1955)

నాగిరెడ్డి. చక్రపాణి నిర్మించిన విజయా వారి మిస్సమ్మ చిత్రం  అద్భుతమైన పూర్తినిడివి హాస్య చిత్రంగా జనవరి 12 1955 న విడుదలయింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అతి పెద్ద ఘనవిజయం సాధించింది. యొతిష్ బెనర్జీ  "మన్మోయీ గర్ల్స్ స్కూల్" అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి రచన, చిత్రానువాదం చేశారు. 

ఒక పెళ్ళి కాని అమ్మాయి మేరీ (సావిత్రి) సరిగా పరిచయమైనా లేని ఒక పరాయి మగవాడు ఎంటీరావు ( ఎన్టీఆర్) కు భార్యగా నెలల తరబడి నటించే తప్పని పరిస్థితులు ఎదురవుతాయి.  నాయుడు ( ఎస్వీఆర్) తప్పిపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో నడుపుతున్న బడికి సెక్రటరీ గానే గాక అందులోనే మాస్టారుగిరీ వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు (ఏఎన్ఆర్) ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తానో డిటెక్టివుననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసిన వాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన ఎంటీరావు, మేరీ లను వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.  తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ ఏమోననే అనుమానం ఆ 'డిటెక్టివ్' రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు 'కూతురూ-అల్లుడూ' అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ "బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో" అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది. అయితే నాయుడి చిన్న కూతురు (జమున) ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు "నువ్వు కాకపోతే మా అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం." అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.

తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎమ్టీరావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది. ఎంటీ రావుకు అసిస్టెంట్ గా రేలంగి అందించిన హాస్యం బాగా పండింది.

ఈ సినిమాకు పింగళి నాగేంద్రరావు మాటలు, పాటలు మరింత వన్నె తెస్తే, ఎస్. రాజేశ్వరరావు సంగీతం, ఎ.ఎం.రాజా, పి.లీల, పి.సుశీల గాత్రమాధుర్యమూ కలిసి మిస్సమ్మ సినిమా పాటలను ఎవర్ గ్రీన్ గా ఉంచాయి. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి. రావోయి చందమామ, బృందావనమది అందరిదీ, ఆడవారి మాటలకు, ఏమిటో ఈ మాయ, తెలుసుకొనవె యువతీ/ చెల్లీ పాటలు ఈ నాటికీ సుపరిచితమే. ఈ సినిమాని ఇప్పటికీ పదే పదే టీవీల్లో చూస్తూ ఆనందించేవారు ఉన్నారు*.

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...