సాక్షి (1967)
దర్శకుడిగా బాపు తీసిన మొట్టమొదటి చిత్రం ‘సాక్షి‘. పిల్లినైనా హింసిస్తే పులిలా మారుతుందనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. నందనా ఫిలిమ్స్ పతాకంపై శేషగిరిరావు, సురేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1967 లో విడుదల అయింది.
పడవ నడిపే కిష్టయ్య (కృష్ణ) చాలా అమాయకుడు. అతన్ని ప్రేమించే అమ్మాయి చుక్క (విజయ నిర్మల). ఆమె అన్న ఫకీర్ మస్తాన్ (జగ్గారావు) లారీ డ్రైవర్. ఊరిలో పెద్ద రౌడీ. ఈ రౌడీ ఓ హత్య చేస్తుండగా కిష్టయ్య చూస్తాడు. ఊరి వాళ్ళ ప్రోద్బలంపై న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్తాడు. రౌడీకి జైలు శిక్ష పడుతుంది. కాని, రౌడీ జైలు నుంచి తప్పించుకుని వస్తున్నాడని తెలిసిన జనం, ప్రాణ భయంతో కిష్టయ్యకి ఆశ్రయం ఇవ్వటానికి నిరాకరిస్తారు. తనని పెళ్ళి చేసుకుంటే ఇక అన్న కిష్టయ్యని ఏమీ చేయడని నచ్చచెప్పి అతని చేత తాళి కట్టించుకుంటుంది. కానీ రౌడీ వచ్చి కొట్టడం మొదలు పెట్టేసరికి, భయంలోంచి వచ్చిన తప్పనిసరి ధైర్యంతో తాగి ఉన్న రౌడీని కిష్టయ్య తన శక్తి యావత్తూ వినియోగించి తిరిగి కొడతాడు. దాంతో రౌడీ మరణిస్తాడు.
ముళ్ళపూడి వెంకటరమణ కథ, మాటలు అందించగా చిత్రానువాదం కూడా బాపు చేశారు. మహదేవన్ సంగీతం సమకూర్చారు. అమ్మ కడుపు చల్లగా, ఎవరికి వారే ఈ లోకం, ఓరందగాడ బంగారు సామీ - పాటలు బాగుంటాయి.
ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల ఏవిధమైన మేకప్ లేకుండా నటించారు. రంగావఝుల రంగారావు అనే నటుడు ఈ చిత్రంలో కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని సాక్షి రంగారావుగా ప్రసిద్ధి చెందారు. సాక్షి సినిమా కోసం పులిదిండి గ్రామంలో కృష్ణ, విజయనిర్మల వివాహాన్ని చిత్రీకరించిన ఆలయంలోనే ఆ తరువాత నిజజీవితంలోనూ వారు పెళ్ళిచేసుకోవడం విశేషం.
No comments:
Post a Comment