ఆ చిన్న పట్నంలో అదో క్లినిక్. క్లినిక్ అంటే అదేమీ చెప్పుకోదగ్గ ఆస్పత్రి ఏమీ కాదు. అది ఓ ఇంట్లో మూల ఉండే గది మాత్రమే. దానికేం బోర్డు లేదు. కానీ అది రామకృష్ణయ్య గారి ఆస్పత్రి అని ఆ ఊళ్లోని, చుట్టుపక్కల పల్లెల్లోని వారు పిలుస్తారు. ఆ ఆస్పత్రి గది ముందు రెండు అరుగులు. ఆ డాక్టర్ గారి క్వాలిఫికేషన్ ఆర్ఎంపీ మాత్రమే అయినా, ఆయన నాడి పట్టుకున్నాడంటే రోగం ఏమిటో చిక్కేసినట్టే. ఆయన చేత్తో మట్టి నలిపి మాత్రగా ఇచ్చినా రోగంపోతుందనే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ ఆయన ఫ్యామిలీ డాక్టరు. ఆయన ఎందులోనూ స్పెషలిస్ట్ కాదు. గానీ అన్ని రోగాలకి చికిత్స చేస్తాడు. ఒకరిద్దరు నర్సులను అందుబాటులో ఉంచుకుని కాన్పుల కేసులు చూస్తాడు. గెడ్డలేస్తే అరుగు మీద కూర్చోబెట్టి అలవోగ్గా కోసేస్తాడు. పళ్ళు పీకేయగలడు. కంటి పరీక్షలు చేసి అద్దాలు రాసివ్వడ్డమే కాదు వాటిని తెప్పించి కూడా ఇస్తాడు. పెద్ద రోగాలు, పెద్ద చికిత్సలకు అవసరమైతే పేషెంట్లను హైదరాబాద్ దాకా తీసుకుపోయి మరీ వైద్యం చేయిస్తాడు. సైకిల్ మీద పోయి చుట్టుపక్కల గ్రామాల్లోనూ, బస్సు మీద పోయి దూరపూళ్ళలోనూ కూడా వైద్యం చేస్తాడు.
ఆయన వైద్యం ఖరీదైనది ఎంతమాత్రం కాదు. ఎవరు ఎంత ఇస్తే అంత. తాము పండించే కూరా, నారా , పప్పు, ఉప్పు ఇచ్చి ఫీజుగా సరిపెట్టేసే వాళ్ళు కొందరైతే, అప్పుడప్పుడు కొందరు, ఏడాదికోసారి సత్యనారాయణ వ్రతం రోజు కాస్త పెద్దమొత్తంలో ఒకేసారి ఇచ్చేవాళ్ళు ఇంకొందరు. పిల్లల కోసం నాలుగు రాళ్లు కూడ బెట్టాలనే తాపత్రయం లేని మనిషి.
నలుగురు కొడుకులు, కూతుర్ని మరీ పెద్ద చదువులు కాదు గానీ ఉన్నంతలో చదివించాడు. డాక్టర్ గారి భార్య నరసమ్మ కూడా భర్త కు ఎదురు చెప్పకుండా, భర్త తెచ్చినదాన్ని కుటుంబంలో అందరికీ పొదుపుగా చేసి పెట్టేది. పెద్దయి మంచిగా సంపాదించుకోండని పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పేది. ఆ ఇల్లు నవ్వులు, ఆశలతో నిండి ఉండేది.
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక డిగ్రీలు తెచ్చుకుని ఒక్కొక్కరుగా హైదరాబాద్ వెళ్లారు. మొదట చిన్న గదుల్లో ఉండి, బస్సులు ఎక్కి, క్యూల్లో నిలబడి, ఇంటర్వ్యూల్లో తిరిగి, తక్కువ జీతాలతో మొదలుపెట్టి కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు. తండ్రి తెచ్చిన సంబంధాలే చేసుకుని క్రమంగా జీవితాల్లో స్థిరపడ్డారు.
పురుళ్లు, పుణ్యాలు, పండగలు, పబ్బాలకి వెళ్లి పిల్లల దగ్గర కొన్నాళ్ళు ఉండి రావడం తప్ప వాళ్ళకి ఎలాంటి భారం కాలేదు. వాళ్ళ నుంచి ఏం ఆశించలేదు కూడా. పిల్లల ఉత్తరాల కోసం ఎదురుచూస్తూ, కాస్త ఆలస్యం అయితే కంగారు పడుతూ ఏళ్ల పాటు కాలక్షేపం చేసేశారు.
పిల్లలంతా కలసి తండ్రికి ఘనంగా హైదరాబాద్ లో షష్టిపూర్తి చేశారు. అప్పటి నుంచి ఏటా ఎవరో ఒకరి ఇంట్లో ఆయన పుట్టిన రోజును జరిపే ఏర్పాటు చేశారు.
అలా కాలం గడచిపోయింది. నరసమ్మలో ఓపిక తగ్గుతోందన్న భయం మొదలైంది. రామకృష్ణయ్య డాక్టర్ గా ధైర్యం చెబుతున్నా ఎప్పుడు ఎలా ఉంటామో- ఇక పిల్లల దగ్గరికి చేరితే మంచిది కదా- అనేది నరసమ్మ. కానీ ఉన్న ఊరు, వారసత్వంగా వచ్చిన ఇల్లు, ఏదో వైద్యం మీద వచ్చే నాలుగు డబ్బులు వదులుకుని పిల్లల దగ్గర చేరి వాళ్ళకి భారం కావడం ఎందుకని రామకృష్ణయ్య వాదన.
సంవత్సరాలు గడిచాయి. మనవళ్లు పెరిగారు. కొందరి చదువులు, కొందరి ఉద్యోగాలు, కొందరి పెళ్లిళ్లు…కుటుంబం పెద్ద వృక్షంలా విస్తరించింది.
ఆ సంవత్సరం శ్రావణమాసం దగ్గరపడుతోంది. ఈ సారి పుట్టినరోజు తమ ఇంట్లో చేస్తామని, బయలుదేరి రమ్మని రెండో కొడుకు ఉత్తరం రాశాడు.
అందరి ఇళ్లలోనూ తలో పది రోజులు ఉండి పుట్టిన రోజు నాటికి రెండో కొడుకు ఇంటికి వెళ్ళొచ్చని నరసమ్మ ఆశ పడింది.
“సరే. నువ్వు ముందే వెళ్లు. పిల్లలందరి దగ్గర ఉండు. నేను ఇక్కడి పని సర్దుకుని పుట్టినరోజుకల్లా వస్తాను. తరువాత కలసి వచ్చేద్దాం” అన్నాడు రామకృష్ణయ్య.
అయితే, నరసమ్మలో ఇంకో ఆలోచన.
ఈ సారి ఎలాగైనా పిల్లలతో మాట్లాడి తండ్రిని ఊరొదిలి అక్కడకు వచ్చేలా ఒప్పించాలని. తమ భవిష్యత్తు గురించి, తమ వృద్ధాప్యం గురించి, తన గౌరవం గురించి మనసులో అనేక ప్రశ్నలతో ఆమె రైలెక్కింది.
—-------------------
అనుకున్నట్టే అందరిళ్ళలో తలో పదిరోజులు గడిచిపోయాయి. కానీ ఏదో అసంతృప్తి. ఎవరి బిజీ వాళ్ళది. ప్రతి ఒక్కరి చుట్టూ ఒక వేగం ఉంది. తాము ఇక్కడే ఉంటే ఆ వేగంలో తమ స్థానం ఏమిటో ఆమె నిశ్శబ్దంగా గమనించింది. మొత్తం మీద ప్రతి ఇంటి ప్రేమకీ బాధ్యతల గోడలు ఉన్నాయి.
“ ఇక్కడ శాశ్వతంగా ఉండగలమా?” అనే ప్రశ్నను నరసమ్మ ఒక్కో ఇంట్లో ఒక్కోసారి వేసుకుంది. ఎవరూ నేరుగా “వద్దు” అనరు. ఎవరూ గౌరవం తగ్గించరు. కానీ ఒక్కో ఇంటి దినచర్యలో తమ కోసం ఒక స్థిరమైన చోటు వెతుక్కోవడం అంత సులువు కాదని ఆమెకు అర్థమైంది.
పిల్లలు చిన్నప్పుడుతమ చేతుల్లో పెరిగారు. ఇప్పుడు వాళ్లు పెద్దయ్యాక, తమ తమ కుటుంబాల చుట్టూ ఒక కొత్త బంధాన్ని నిర్మించుకున్నారు. అందులోతల్లిదండ్రులకు గౌరవం ఉంది కానీ అది స్థానం కాదేమో..
ఈ నిజం నర్సమ్మను గాయపరచలేదు.
కానీ లోతుగా కదిలించింది. భర్త చెప్పిందే నిజమేమో అనిపించింది.
వాళ్ల జీవితాల్లోకి శాశ్వతంగా వెళ్లడం అనేది ప్రేమను పంచుకోవడం కంటే వారి జీవితాల్లో జోక్యమే అవుతుందేమో.
ఇంతలోనే మనసులో ఒక భయం - “ఇద్దరమే ఆ పాత ఇంట్లో ఉంటే… వృద్ధాప్యంలో ఏదైనా జరిగితే? రాత్రి మధ్యలో ఆయనకి జ్వరం వచ్చినా? తనకేమైనా అయితే? ఎవరు? ఎలా?
ఆ భయం ఆమెను రాత్రిళ్లు పోనిచ్చేదికాదు.
పిల్లలకి దగ్గరవ్వాలా - భారం అవ్వాలా? అనే ప్రశ్న మరింత బాధ పెట్టేది. రెండు నిజాల మధ్య ఆమె మనసు అల్లాడి పోయింది.
—-------------
శ్రావణమాసం మొదలైంది.
రామకృష్ణయ్య వచ్చాడు.
ఆయనను చూసిన క్షణంలో నరసమ్మ మనసుకు ఒక బలమైన ఆధారం దొరికింది. తన భర్త పక్కన కూర్చున్నప్పుడే తన జీవితం సరిగా ఉన్నట్టు ఆమెకు అనిపించింది.
ఆ రాత్రి అందరూ నిద్రపోయాక, అతిథి గదిలో చీకటి మధ్య మెల్లగా మాట్లాడింది.
మీరు చెప్పిందే సరైందేమో-
భర్త ఆమె వైపు చూశాడు.
“ఏమైంది?”
“పిల్లలందరూ మంచివాళ్లే. గౌరవం ఉంది. ప్రేమ ఉంది. కాని వాళ్ల జీవితాలు వాళ్లవి అయిపోయాయి. మనం వీళ్ళతో ఉండగలం… కానీ అతిథుల్లానే కావచ్చు.”
భర్త వింటున్నాడు.
“కాని నాకు ఒకటే భయం,” అని ఆమె స్వరం కంపించింది.
“మనిద్దరమే ఉంటే ఏదైనా జరిగితే? ఒకరికి ఒకరు తప్ప ఇంకెవరు ఉండం. ఆలోచిస్తే భయంగా ఉంది.”
రామకృష్ణయ్య కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
“జీవితం అంతా మనం కలిసి నడిచాం కదా. మిగిలిన దారినీ అలాగే నడుద్దాం. పిల్లలు మన వాళ్లు, మనమూ వారి వాళ్ళం. అవసరం అయితే వాళ్లు వస్తారు. కానీ మన పెద్దరికం వదిలి వాళ్ల జీవితాల్లోకి చొరబడలేం. కొన్ని రోజులు ఉండి మనం తిరిగి వెడదాంలే- “ అన్నాడు స్థిరంగా.
ఆ మాటలో ఓదార్పు ఉంది.
ఓ అంగీకారం ఉంది.
ఓ కనిపించని ముగింపు కూడా ఉంది.
నరసమ్మ భర్త భుజంపై తల వాల్చింది.
“సరే” అంది.
ఆ రాత్రి ఆమెకు కొద్దిగా నిద్ర పట్టింది.
మరుసటి రోజు శ్రావణమాసం మొదటి మంగళవారం. రామకృష్ణయ్య పుట్టిన రోజు సందడి. ఉదయం నుంచే ఇంట్లో ఉత్సాహం. నగరంలో నాలుగు చోట్ల నుంచి పిల్లల కుటుంబాలన్నీ రెండో కొడుకు ఇంటికి చేరుకున్నాయి. మధ్యాహ్నం విందు భోజనం. పెద్దల పేకాట. పిల్లల ఆటపాటలు. .. వృద్ధుల మనసులు సంతోషంతో నిండిపోయాయి.
ఇంట్లో పెద్ద ముత్తైదువ ఉన్నట్టు తెలిసి నోములు నోచుకున్న ఇరుగూ పొరుగూ వచ్చి నరసమ్మ కు బొట్టూ తాంబూలం ఇచ్చి ఆశీస్సులు. తీసుకున్నారు. “ ఇంట్లో ఇలా పెద్ద వాళ్లు ఉండాలి. పెద్ద కుటుంబం, అందరినీ కట్టిపడేసే అదృష్టం” అన్నారు. నరసమ్మ సంబరపడి పోయింది.
సాయంత్రం పెద్దాయన పుట్టినరోజు వేడుకలు. పిల్లలంతా వారికి కొత్త బట్టలు, కానుకలు ఇచ్చి దీవెనలు అందుకున్నారు. ఆ క్షణం రామకృష్ణయ్య కళ్ళలో చిన్న తడి. నరసమ్మలో ఓ భావోద్వేగం. తమ జీవితాలను వెనక్కి తిరిగి చూస్తే కళ్ళముందు పెరిగిన పిల్లలు. పెట్టింది తిని, కొనిచ్చిన బట్ట కట్టుకొని , తాహతు సరిపోక కొన్ని పుస్తకాలు కొనివ్వలేకపోయినా స్నేహితుల దగ్గర తెచ్చుకు చదువుకుని, ప్రయోజకులై ఇవాళ తండ్రులూ, తాతలుగా మారిన వాళ్ళముందు తాము పిల్లలై పోయిన ఉద్వేగం అది.
రాత్రి భోజనాలు అయ్యాయి. కోడళ్ళు , కూతురు ఇద్దరికీ దగ్గరుండి భోజనం వడ్డించారు. కోడళ్ళ వంటలకి వంకలు పెట్టి మా అమ్మ దగ్గర నేర్చుకోండి అని కొడుకులు ఆట పట్టిస్తుంటే సరదాగా నవ్వుకున్నారు.
రాత్రి పొద్దు పోతుంటే అందరూ బయలు దేరే సమయం వచ్చింది. బయట ఒకరి కొకరు బై చెప్పుకుంటుంటే లోపలి నుంచి కూతురు బయటకొచ్చి అమ్మ గుండె బరువు అంటోంది- చూడండి అంది కంగారుగా.. అందరూ తిరిగి పరుగున వచ్చారు. తల్లి ఆయాసపడ్డం చూసి సందు చివర్లో ఉన్న డాక్టర్ కోసం పరుగెత్తాడు రెండో కొడుకు.
కాని ఆ క్షణం కాలం ఎవరి కోసం ఆగలేదు. రామకృష్ణయ్య ఆమె నాడి పట్టుకు చూస్తుండగానే ఆయన భుజం మీద ఒరిగిపోయింది నరసమ్మ. జీవితంలో ఎన్నో ప్రాణాలు కాపాడిన ఆ డాక్టర్ చేతులు ఆ రాత్రి తన భార్యను మాత్రం నిలబెట్టలేకపోయాయి.‘ షీ ఈజ్ నో మోర్ ‘ - వణుకుతూ పలికింది రామ కృష్ణయ్య గొంతు.
పిల్లలందరూ తల్లి చుట్టూ చేరి బావురుమన్నారు. కోడళ్లు కన్నీటితో, మనవలు విషన్నవదనాలతో నిలబడిపోయారు.
రామకృష్ణయ్య కళ్ళలో నీరు లేదు. కానీ ఆయన మనసు నిశ్శబ్దంగా రోదిస్తోంది. తన చేతుల్లో ఇంకా ఆమె బరువు ఉన్నట్టే అనిపిస్తోంది. ఆ రాత్రి ఆమె తలను మోసిన తన అరచేతుల్లో ఆమె చివరి వేడి ఇంకా ఉన్నట్టుంది. ఎవరో ఆయనకు నీళ్లు ఇచ్చారు. ఎవరో పక్కన కూర్చున్నారు. ఎవరో “ధైర్యంగా ఉండండి” అన్నారు.కానీ ఆ మాటలు వినిపించలేదు.
యాభై ఏళ్లకు పైగా తోడున్న మనిషి, తన శ్వాసలా మారిన స్త్రీ, తన బలం ఒక్క క్షణంలో జ్ఞాపకంగా మారిపోతే, “ధైర్యంగా ఉండండి” అన్న మాట చాలా చిన్నది కదా..
మరునాడు ఆమెను అంత్యక్రియలకు సాగనంపుతూ.. నీ కోరిక నెరవేరిందా నర్సూ.. పిల్లలతో ఎలాగూ ఉండలేమని వాళ్ళ చేతుల మీదుగా వెళ్ళిపోతున్నావుగా - అనుకున్నాడు నిట్టూరుస్తూ..
అవును.. నరసమ్మ కోరుకున్నట్టు పిల్లల మధ్యే, వారి ప్రేమ మధ్యే, వారి చేతుల మీదుగానే ఆమె ప్రయాణం ముగిసింది.
—---
నెల తరువాత..
రామకృష్ణయ్య ఊరికి తిరుగు ప్రయాణమయ్యాడు.
పిల్లలందరూ ఒక్కసారిగా ఎదిరించారు.
“నాన్నా, మీరు ఒంటరిగా ఎలా ఉంటారు?”
“ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏమి చేస్తారు?”
“మా దగ్గరే ఉండండి.”
“మారుమారుగా అందరి దగ్గర ఉండండి.”
“మీకు ఏం అవసరం వచ్చినా మేం చూసుకుంటాం.”
అది ప్రేమతో నిండిన వాదన.
కానీ రామకృష్ణయ్య ముఖంలో అలసిన ప్రశాంతత మాత్రమే ఉంది.
“మీరు అందరూ చెప్పేది ప్రేమతోనే. నాకు తెలుసు. కానీ నా జీవితం అక్కడే ఉంది. మీ అమ్మ అడుగుల శబ్దం ఉన్న ఇల్లు అది. నా వ్యాపకం ఏదో నాకుంది.. వైద్యం కోసం వచ్చేవాళ్ళు ఏదో సాయం చేస్తుంటారు. కొన్నాళ్లలా సాగనిద్దాం - అన్నాడు రామకృష్ణయ్య స్థిరంగా.
పిల్లలు మౌనమయ్యారు.
ఆ మౌనం ఓటమి కాదు.
తండ్రి అంతరంగం ముందు ప్రేమతో కూడిన ఓ అంగీకారం.
ఆ ఉదయం ఆకాశం మబ్బుల్తో నిండింది. బయల్దేరే ముందు రామమూర్తి నిశ్శబ్దంగా నరసమ్మ ఫొటో ముందు నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలేదు. కానీ అతని చూపు చాలా చెప్పింది. “వెళ్తున్నా,” అన్నట్టు..
మీ మొండి పట్టు మానరుగా .. ఫోటోలోంచి దిగులుగా చూస్తున్నాయి నర్సమ్మ కళ్ళు..
పెద్దకొడుకు టాక్సీలో సామాన్లు పెట్టాడు. చిన్న బట్టల బ్యాగ్ , మందుల సంచి, నరసమ్మ ఫోటో.
కారు మెల్లగా బయల్దేరింది.
హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ నడుస్తోంది. ఇక్కడి జీవితం ఎవరిని చూసి ఆగదు. ఎర్ర సిగ్నల్స్, ఫ్లైఓవర్లు, బస్సులు, పరుగులు—ప్రపంచం తన పనిలో ఉంది.
కానీ ఆ టాక్సీ వెనుక సీట్లో ఒక మనిషి మాత్రం తన జీవితమంతా వెనక్కి తిరిగి చూసు కుంటున్నాడు.
14 ఏళ్ల నరసమ్మ మొదటిసారి పెళ్లి చూపుల రోజున తలవంచి కూర్చున్న తీరు…
మొదటి సంతానం పుట్టిన రాత్రి ఆమె కళ్లలో మెరిసిన ఆనందం…
రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తే గుమ్మం దగ్గర వేచిచూసిన ఆమె నీడ…
పండుగల ముందు పిండివంటలు చేసి పిల్లలకి పదేసి రోజులు పెట్టి, అందరూ రెక్కలొచ్చి వెళ్ళిపోయాక వాళ్లేం తింటున్నారో అనే ఆమె పడిన తపన ..
“మనం వృద్ధాప్యంలో పిల్లల దగ్గర ఉందామా ?” అని అడిగిన ఆ మృదువైన ఆవేదన…
చివరగా—
తన చేతుల్లో తల వాల్చి, ఏదో చెప్పాలనుకుని చెప్పలేక మూసుకుపోయిన ఆమె కళ్ళు…
ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి.రామకృష్ణయ్య
గుండె భారమైంది.
ఆలోచనలతోనే కొడుకు భుజం మీద మెల్లగా తల ఆన్చాడు.
తండ్రి అలసటగా పడుకున్నాడనుకున్న కొడుక్కి రైల్వే స్టేషన్ కి వెళ్ళాకే తెలిసింది అది శాశ్వత నిద్ర అని, ఆయన కూడా అమ్మ దగ్గరకే వెళ్లిపోయాడని…
చివరికి వారు ఇద్దరూ
పిల్లల చేతుల మీదుగానే వెళ్లిపోయారు.
ఒకరు భర్త చేతుల్లో… పిల్లల మధ్య…
మరొకరు కొడుకు భుజంపై…
వాళ్లు కోరుకున్న గౌరవం అలాగే నిలిచింది.
పిల్లలు ఇవ్వాలనుకున్న ప్రేమ కూడా అర్థంలేని దుఃఖంగా మిగిలిపోలేదు..
ఆ చివరి క్షణాల్లో అది స్పర్శగా, ఆధారంగా, చేతుల బరువుగా మారింది.
బంధాలు… ఎంత చేరువైనా… ఎప్పటికీ దూరమే…*
No comments:
Post a Comment