వాగ్దానం (1961)
శరత్ రచించిన 'వాగ్దత్త' ఆధారంగా ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో కవిత చిత్ర పతాకంపై కె.సత్యనారాయణ, డి.శ్రీరామమూర్తి నిర్మించిన ‘వాగ్దానం' చిత్రం 1961 అక్టోబర్ 5 న విడుదల అయింది. నవలతో నిమిత్తం లేకుండా ఈ చిత్రంలోని చాలా పాత్రలు, సన్నివేశాలు ఆత్రేయ సృష్టించినవే.
విశ్వనాథం (నాగయ్య), రంగనాథం (గుమ్మడి), జగన్నాథం (కె. వెంకటేశ్వరరావు) బాల్యమిత్రులు. విశ్వనాథం జమీందారు. ఆయన కూతురు విజయ (కృష్ణకుమారి). రంగనాథం ఆ జమీందారీకి దివాను. ఆయన కొడుకు చంద్రం (చలం). జగన్నాథం కులం లేని పిల్లను వివాహమాడి అందరికీ దూరమవుతారు. భార్య చనిపోయింది. ఆయన కొడుకు సూర్యం (నాగేశ్వరరావు). తన కూతురు విజయను సూర్యానికిచ్చి వివాహం చేస్తానని ఆమె పుట్టక ముందే విశ్వనాథం జగన్నాథానికి మాట ఇచ్చాడు. పెరిగి పెద్దవాళ్లైనా విజయ, సూర్యం ఒకరి నొకరు చూసుకోలేదు. విశ్వనాథం తన డబ్బుతో సూర్యాన్ని డాక్టరు చదివించాడు. ఆయన వద్దంటున్నా వినక జగన్నాథం ఈ అప్పుకుగాను తన ఆస్తిని ఆయనకు తాకట్టు రాశాడు. జగన్నాథం చనిపోయాడు. ఆ వార్త విని, మనోవ్యాధితో విశ్వనాథం మరణించాడు. చనిపోయేముందు తన కూతుర్ని రంగనాథానికి అప్పచెప్పాడు. సూర్యం వద్ద నుంచి అప్పు సొమ్మును తీసుకోవద్దని కూతురుకు చెప్పాడు. విజయకూ, తన కొడుక్కీ వివాహం చేస్తే జమీందారీ తనకు దక్కుతుందని రంగనాథం ఆశ. సూర్యం పల్లెటూళ్లో తన ఇంట్లోనే ఆస్పత్రి పెట్టి ప్రజాసేవ చేస్తున్నాడు. ఆ చుట్టు పక్కల ప్రజలందరికీ అతను దేవుడయ్యాడు. విజయకు తెలియకుండా రంగనాథం సూర్యం ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు. తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయినందుకు కుమిలిపోయింది విజయ. తన పాపానికి పరిహారంగా తన సర్వస్వం సూర్యానికి అర్పించాలనుకుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వారిని వేరుచేయడానికి రంగనాథం అబద్ధాలు చెప్పి స్పర్థలు కల్పించాడు. తన కొడుకుతో విజయకు బలవంతంగా పెళ్ళి ఏర్పాటు చేశాడు. చివరికి ఆయన కుట్రలు బైటపడ్డాయి. విజయ ధైర్యం తెచ్చుకుంది. ఆ వూళ్లో హరికధలు చెప్పే రామదాసు (రేలంగి) ఆమెకు సహాయం చేశాడు. అనుకున్న ముహూర్తానికి చంద్రంతో కాక సూర్యంతో ఆమె వివాహం జరిగింది
రేలంగి చెప్పే (ఘంటసాల) సీతా కళ్యాణం హరికథ ఇప్పటికీ రేడియోలో పాపులర్. అలాగే ఏఎన్ఆర్, కృష్ణకుమారి డ్యూయెట్ ‘నా కంటి పాపలో నిలిచిపోరా‘- నభూతో న భవిష్యతి.*
No comments:
Post a Comment