చిట్టి చెల్లెలు (1970)
రక్త సంబంధం, ఆడపడుచు చిత్రాల తరువాత చ ఎన్టీఆర్ అన్న పాత్రలో జీవించిన మరో చిత్రం చిట్టి చెల్లెలు. ఇందులో చెల్లెలుగా వాణిశ్రీ కూడా ఎన్టీఆర్ తో పోటీ పడి నటించారు. ఏవీఎం ప్రొడక్షన్స్ వారి “చిట్టి చెల్లెలు” సినిమా 1970 జూలై 29 న విడుదల అయింది.
శాంత (వాణిశ్రీ) పుట్టగానే తల్లి మరణించింది. అందుకే ఆ పసిపాప మీద తండ్రి (గుమ్మడి) కి కోపం, నిరాదరణ. కానీ కొడుకు రాజా (ఎన్టీఆర్) తన చెల్లెలిని కను రెప్పలా కాపాడుతుంటాడు. తండ్రి త్రాగుబోతు, జూదరి అయ్యాడు. అతను జైలుకు వెళ్ళినప్పుడు రాజా, శాంత లకు ఒక ధనవంతుల ఇంట ఆశ్రయం లభించింది. పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజా వ్యవసాయం పనులు చూస్తున్నాడు. ఆ ఇంటి యజమాని, యువకుడు అయిన రఘు (హరనాధ్) మద్రాసులో చదువు ముగించుకు వచ్చాడు. రఘుకు బ్యాంకులో ఉద్యోగం వస్తుంది. శాంతకు, రఘుకు రాజా వివాహం జరిపిస్తాడు. వారి అన్యోన్య అన్యొన్య దాంపత్యాన్ని చూసి మురిసిపోతాడు. రఘు ప్రమోషన్ మీద మద్రాసు వెళ్ళవలసి వస్తుంది. రాజాను టీచరమ్మ జానకి (రాజశ్రీ) ప్రేమిస్తుంది. దొంగ నోట్లను ముద్రించే ముఠా నాయకుడు రఘు ని తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నంలో విఫలుడై అతని పై కత్తి విసరగా మరణావస్థలో రఘు ఆసుపత్రి చేరతాడు. దుండగుని ముఖం పోలీసుల ఫొటోల జాబితాలో గుర్తు పట్టి రఘు చనిపోతాడు. బ్యాంకు ఏజంటు రాజాను మద్రాసు రప్పించి రఘు శవాన్ని చూపిస్తాడు. రాజా మనసు వికలమైపోతుంది. గర్భవతిగా ఉన్న తన చెల్లెలుకు విషయం చెప్పలేక కుమిలిపోతాడు. చెల్లెలు శాంత తన పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని వ్రతం చేసుకుంటుంటే కన్నీటి పర్యంతం అవుతాడు. శాంతకు తాత్కాలిక ఉపశమనంకోసం మద్రాసునుంచి రఘు వ్రాసినట్లుగా , రాజా ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాడు. అవి జానకి చదివి వినిపిస్తుంది. ఒకసారి సంతకం రఘు బదులు రాజా అని ఉండడం తో జానకి రాజాను నిలదీసి విషయం తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఒకరోజు జైలునుండి పారిపోయి వచ్చిన దొంగ నోట్ల ముఠా నాయకుడు శాంత ఇంటికి వస్తాడు. అక్కడ రఘు ఫొటోను చూసి చేజేతులా తానే తన కూతురి పసుపు కుంకుమలు చెరిపేసేనని నిజం తెలుసుకుంటాడు, శాంత బిడ్డని ప్రసవించి చనిపోతుంది. ఆమెని ముత్తైదువుగా సాగనంపుతారు, శాంత బిడ్డను రాజా, జానకి పెంచుతారు. సినిమాలో రేలంగి, పద్మనాభం, గీతాంజలి హాస్యం కూడా శృతి మించదు.
గుహనాధన్ రచన , ఎం. కృష్ణన్ దర్శకత్వం వహించిన చిట్టి చెల్లెలు సినిమాలో ఎస్ రాజేశ్వర రావు స్వరపరచిన అన్ని పాటలూ ఆణి ముత్యాలే. ఈ రేయి తీయనిది - పాట ఇప్పటికీ సూపర్ హిట్. అందాల పసిపాప, జుం జుం తుమ్మెద పాడింది పాటలు కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. శ్రీ రామ వనవాసం నాటకం ఒక ఆకర్షణ.
No comments:
Post a Comment