మానవుడు-దానవుడు (1972)
హీరో శోభన్ బాబును జగన్ గా జనం ముందు నిలిపిన ‘మానవుడు-దానవుడు’ చిత్రం 1972 జూన్ 23న విడుదలైంది.
ఉషఃశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి.చిన్నప రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను సమకూర్చారు. పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మోదుకూరి జాన్సన్ మాటలు రాసిన ఈ చిత్రానికి అశ్వథ్థామ సంగీతం సమకూర్చారు. ఇప్పటికీ జాతీయ పర్వదినాలలోమనం వినే అణువున వెలసిన దేవా…” పాట ఈ చిత్రంలోదే. ఇంకా పచ్చని మన కాపురం, అమ్మాలాంటి చల్లనిది, ఎవరు వీరు- పాటలు ప్రజాదరణ పొందాయి.*
పేదరికం లో ఉన్న సీత (కృష్ణకుమారి) ని అమాయకులైన అమ్మాయిలతో బలవంతంగా వ్యభిచారం చేయించే పెద్దమనిషి భుజంగం (సత్యనారాయణ) మానభంగం చేస్తాడు. ఆమెను వ్యభిచార గృహానికి తరలిస్తాడు. చిన్న వయసులో ఉన్న సీత తమ్ముడు వేణు (పెద్దయ్యాక శోభన్ బాబు) జరిగిన ఘోరాన్ని చూస్తాడు. దిక్కులేని వేణుకు ఓ బాబా ( ముక్కామల) ఆశ్రయమిస్తాడు. కష్టపడి చదువుకొని డాక్టర్ అవుతాడు వేణు. భుజంగం కూతురు రాధాదేవి, వేణును ప్రేమిస్తుంది. మరోవైపు సమాజంలో కొందరు దుర్మార్గుల వల్ల బలైపోతున్న అబలలను రక్షించేందుకు జగన్ ( మరో శోభన్) బయలు దేరతాడు. అమ్మాయిలను రక్షించడంలో ఎందరో దుర్మార్గుల కీళ్ళు విరుస్తుంటాడు. వాళ్లందరికీ డాక్టర్ వేణు వైద్యం చేస్తూ ఉంటాడు. కులం, మతం అన్నవి లేవని, మనుషులంతా ఒక్కటేననే ఆదర్శ భావాలతో డాక్టర్ వేణు సాగుతూ ఉంటాడు. అతని చెంతనే రాధ కూడా చేరుతుంది. వేణు అక్క సీత ఓ పాపకూపంలో చిక్కుకొని ఉంటుంది. ఆమెను, ఆమెతో పాటు మరికొందరిని జగన్ బంధవిముక్తులను చేస్తాడు. సీతకు, వేణు ఆసుపత్రిలోనే సేవ చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఎదురుగా తమ్ముడే ఉన్నా పిలుచుకోలేక ఆవేదన చెందుతుందామె. భుజంగంతో జగన్ చేతులు కలుపుతాడు. డాక్టర్ వేణునూ ప్రేమిస్తున్న రాధ విషయం తెలిసి, అతణ్ని చంపే పని జగన్ కు అప్పగిస్తాడు భుజంగం. అది పూర్తి చేశాక, జగన్ భుజంగం కళ్ళ ముందే అతని కూతురును మానభంగం చేయబోతాడు. తట్టుకోలేని భుజంగం తన కారణంగా ఆమె బలికాకూడదని చేసిన పాపాలు అంగీకరిస్తాడు. అప్పుడు జగన్ అందరూ చనిపోయాడనుకుంటున్న వేణును తానే అని, భుజంగానికి బుద్ధి చెప్పేందుకే దానవుడు గా మారానని చెబుతాడు. వేణు, రాధ ఒకటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రం ఆరు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా తరువాత శోభన్ బాబు కాస్త నెగటివ్ టచ్ ఉన్న కేరెక్టర్స్ లో నటిస్తే, ఆ పాత్రలకు జగన్ అని పేరు పెట్టేవారు. శోభన్ బాబు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘జగన్’ అనే సినిమా కూడా రూపొందింది.
ఈ చిత్రాన్ని తమిళంలో శివాజీగణేశన్ హీరోగా ‘ఎంగల్ తంగ రాజా’ పేరుతో తెలుగు నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తరువాత హిందీలో వినోద్ ఖన్నా హీరోగా తెలుగు నిర్మాత డూండీ స్వీయ దర్శకత్వంలో ‘ఆధా దిన్ ఆధీ రాత్’ పేరుతో నిర్మించారు. మళయాళంలో కూడా మధు, శారద జంటగా ‘ఇదానేంటే వళి’ పేరుతో తెరకెక్కించారు. *
No comments:
Post a Comment