పరమానందయ్య శిష్యుల కథ (1966)
సి. పుల్లయ్య దర్శకత్వంలో 1966 లో విడుదలైన పరమానందయ్య శిష్యుల కథ మంచి వినోదాన్ని పంచింది. ఈ చిత్రాన్ని తోట సుబ్బారావు శ్రీ దేవి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. కథ, మాటలు వెంపటి సదాశివబ్రహ్మం అందించారు.
విజయ దుర్గం మహారాజు నందివర్ధనుడు (ఎన్టీఆర్) రాజనర్తకి రంజని (ఎల్. విజయలక్ష్మి)తో భోగలాలసుడై ప్రజల్ని అశ్రద్ధ చేస్తాడు. అయితే శివ భక్తుడు. ఎంత మత్తులో ఉన్నా శివార్చన మానడు. శివుడు (శోభన్ బాబు) అతని భక్తిని మెచ్చి అతనిని మార్చేందుకు తన భక్తురాలైన చిత్రలేఖ (కేఆర్ విజయ) అనే గంధర్వ కన్యను భూలోకానికి పంపుతాడు. ఆమె భూలోక అందాలను చూస్తూ కొలనులో స్నానమాడుతుండగా, తనను అమాయకంగా చూస్తున్న ఏడుగురు ఋషులపై కోపించి వారిని మూర్ఖులుగా శపిస్తుంది. వారి గురువు అరుణ కీర్తి అది చూసి ఆమె ఒక మానవుడిని కలిస్తే తన దేవలోక హోదాను కోల్పోతుందని ప్రతి శాపం ఇస్తాడు. పశ్చాత్తాపపడిన చిత్రలేఖ, తన వివాహంతో ఋషులకు శాప విముక్తి కలుగుతుందని ప్రకటిస్తుంది. దేవలోకానికి తిరిగి వెడుతూ కొలను గట్టున చెట్టుకు వేలాడదీసిన తన రుద్రాక్షమాలను మరచి పోతుంది. ఇటు వేటకు వెళ్ళిన నందివర్ధనుడు అడవిలో దుష్ట మంత్రి శివానందుడు ( ముక్కామల) తనపై చేయించిన దాడి నుంచి తప్పించుకొని గాయాలతో వస్తూ ఆ రుద్రాక్షను చూసి మెడలో వేసుకుంటాడు. మరోవైపు శాపగ్రస్తులైన ఏడుగురు ఋషులు తమ గురువు సలహా మేరకు విజయదుర్గం వెళ్లి, రాజ గురువు పరమానందయ్య (నాగయ్య) వద్ద శిష్యులు (పద్మనాభం, రాజబాబు, అల్లు రామలింగయ్య, బాలకృష్ణ, రామచంద్రరావు, శివరామకృష్ణయ్య, సారధి, మోదుకూరిసత్యం, చంద్రమౌళి)) గా చేరతారు. రుద్రాక్షమాలను వెతుక్కుంటూ భూలోకానికి తిరిగి వచ్చిన చిత్రలేఖ పాముగా మారి నందివర్ధనుని మెడలోంచి తీసుకునే ప్రయత్నంలో అనుకోకుండా నందివర్ధనుడు ఆమెను తాకడంతో ఆమె తన దేవత్వాన్ని కోల్పోతుంది. అతడు ఆమెను చూడగానే ప్రేమలో పడతాడు, చిత్రలేఖ పరిచయం అతనిలో మార్పును తెస్తుంది. ఆమెను పెళ్ళడాలని నిర్ణయిస్తాడు. కానీ ఆమె ఒప్పుకోదు. తన దేవకన్యత్వాన్ని తిరిగి పొందడం గురించి చిత్రలేఖ కలత చెందుతుండగా, పరమానందయ్య ఆమెకు తపస్సు చేయమని సలహా ఇస్తాడు. ఇంకో వైపు ఆ ఏడుగురు శిష్యుల అల్లరి చేష్టలు పరమానందయ్యకు వరాలుగా మారుతూ ఉంటాయి. ఒకసారి చిత్రలేఖ రాజభవనం నుంచి అడవిలోకి వెళ్లిపోగా మంత్రి అనుచరుడు జగరాయుడు (సత్యనారాయణ) ఆమెను పట్టుకుని బంధిస్తాడు. నందివర్ధనుడు ఆమెను కాపాడడంతో ఆమె కూడా అతడిని ప్రేమిస్తుంది. ఆ తరువాత, శివానందం రంజనిని నందివర్ధనుడికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి కుట్ర పన్నుతాడు. తాము చేసిన పనికి విసిగిపోయి ‘పోయి చావండిరా‘ అని పరమానందయ్య కోప్పడ్డంతో అలాగే చచ్చిపోదామని - అంతకుముందు ఆయన భార్య ( ఛాయా దేవి) వీల్లెక్కడ తినేస్తారో అని విషం అని భయపెట్టి దాచిపెట్టిన సున్నుండలను తినేస్తారు శిష్యులు. చచ్చి పోయామని భావించి వీధుల్లో తిరుగుతూ, స్వర్గం అనుకుని రాజ దుర్గంలో ప్రవేశిస్తారు. రంజనిని అప్సరగా భావించి ఆమె ఇంటికి వెళ్లి, శివానందం కుట్రను గుర్తించి నందివర్ధనుడికి తెలియ చేస్తారు. పోరాటంలో రంజని రాజును కాపాడుతూ తన ప్రాణాలను త్యాగం చేస్తుంది. శివానందం పారిపోతాడు. నందివర్ధనుడు, చిత్రలేఖల వివాహంతో వారు శాపం నుంచి విముక్తి పొందుతారు.
ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం చేశారు. నాలోని రాగమీవే (సినారె), ఎనలేని ఆనంద మీరేయి(సదాశివబ్రహ్మం), ఇదిగో వచ్చితి రతిరాజా(శ్రీశ్రీ), పరమగురుడు చెప్పినవాడు (కొసరాజు) పాటలు బాగుంటాయి.*
…
No comments:
Post a Comment