Tuesday, 25 August 2026

 భార్యాభర్తలు (1961)



ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఏవీ సుబ్బారావు  నిర్మించిన భార్యా భర్తలు సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రశంసలందుకొంది. లక్ష్మీ త్రిపురసుందరి రచించిన 'పెన్మనం' అనే తమిళ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా 1961 లో విడుదలైంది. దీనిని మలయాళంలో 'అభిమానం' (1975)గా రీమేక్ చేశారు. తమిళంలో 'ఇరువర్ ఉల్లం' (1963)గా హిందీలో 'హమ్రాహి' (1963)గా కూడా రీమేక్ చేశారు. తెలుగు చిత్రానికి శ్రీశ్రీ, పిచ్చేశ్వరరావు కలసి మాటలు రాశారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మారావు (గుమ్మడి).భార్య మాణిక్యమ్మ (నిర్మల).  ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు రామానందం (రేలంగి) అడ్వకేట్. రెండోవాడు ఆనంద్ (అక్కినేని) మద్రాసులో చదవు పూర్తి చేసి వచ్చి జల్సాగా తిరుగుతూ ఉంటాడు. కుమార్తె సరళ.   ఆనంద్ ప్రియురాళ్లలో ఒకరైన హేమలత(గిరిజ)  తనను పెళ్లి చేసుకోవాలని ఆనంద్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తుంది. దాంతో  అతను ఆమెను వదిలేస్తాడు. శారద ( కృష్ణ కుమారి) అనే స్కూల్ టీచర్ ను చూసి ఆమెను ఇష్టపడతాడు. చెడు సావాసాలు వదిలి ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడతాడు. కానీ ఆనంద్ పోకిరీ వేషాలు తెలిసిన శారద అతనిని నిరాకరిస్తుంది. శారద తమ ఇంటి గుమాస్తా శివకామయ్య ( రమణారెడ్డి) కూతురు కావడంతో పెద్దలు వారి పెళ్లి కుదురుస్తారు. పెళ్లయినా శారద అతడిని దగ్గరకు రానివ్వదు. ఆమె మనస్ఫూర్తిగా తనను అంగీకరించే వరకు ఆమెను తాకనని ఆనంద్ మాటిస్తాడు. హేమ ఆంజనేయులు (పద్మనాభం)ను పెళ్లి చేసుకుని ఆనంద్ స్నేహితుడైన గోపినాథ్ ఇంట్లో అద్దెకు ఉంటుంది. అతనితో కూడా చనువు మొదలుపెడుతుంది.  శారద ఆనంద్‌ను అంగీకరించడానికి ప్రయత్నించే సమయంలో హేమ కలహాలు సృష్టించడంతో శారద అనారోగ్యానికి హేమ ఆనంద్ ఇంటికి వచ్చి, డబ్బు కోసం ఒత్తిడి చేస్తుంటే ఆనంద్ ఆమెను తిడతాడు ఆ క్షణంలో, శారద ఆ సంభాషణను వింటుంది.  భర్త ఔన్నత్యాన్ని గ్రహిస్తుంది. అతనికి దగ్గరవుతుంది. ఇటు హేమ అక్రమ సంబంధాలను గుర్తించిన ఆంజనేయులు, ప్రతీకారంతో రగిలిపోతూ, హేమను హత్య చేస్తాడు. ఈ కేసులో ఆనంద్ ఇరుక్కుంటాడు. సోదరుడు రామానందం ప్రతివాద న్యాయవాదిగా రంగంలోకి దిగి శారద సహకారంతో ఆనంద్ ను కాపాడతాడు. ఆంజనేయులు జైలుకి వెడతాడు. భార్యాభర్తలు ఒకటవుతారు.

ఎస్. రాజేశ్వరరావు సంగీతం అందించిన ఈ చిత్రంలో - ఏమని పాడేదనో, మధురం మధురం ఈ సమయం, జోరుగా హుషారుగా, ఓ జవరాల, చూసి చూసి కళ్లు- పాటలు విశేష ఆదరణ పొందాయి. 

భార్యాభర్తలు సినిమా 1962 లో జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర పురస్కారాన్ని అందుకుంది. *

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...