బుద్ధిమంతుడు (1969)
అక్కినేని ద్విపాత్రాభినయంతో బాపు, రమణ కాంబినేషన్లో 1969 లో వచ్చిన బుద్ధిమంతుడు చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయింది. ఆస్తికుడిగా, నాస్తికుడిగా ఏఎన్ఆర్ అదరగొట్టారు. భగవంతుడు భక్తునికి కనపడటం, మాట్లాడటం ట్రెండ్ ఈ చిత్రంతోనే ప్రారంభమైంది. చిత్ర కల్పన బ్యానర్ పై ఎన్ ఎస్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పలు కేంద్రాల్లో 100 రోజులాడింది.
మాధవాచార్యులు (అక్కినేని) శ్రీకృష్ణాలయ అర్చకుడు. ఆయనకు శ్రీకృష్ణుడు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. భార్య మరణించింది. తల్లి ( శాంతకుమారి), పదేళ్ల కుమారుడు, తమ్ముడు గోపాలాచార్యులు (అక్కినేని)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. తమ్ముడు గోపి నాస్తికుడు. స్నేహితులతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఊళ్ళో శేషాద్రి ( నాగభూషణం) చేసే మోసాలను ఎదుర్కొంటూ ఉంటాడు. తమ్ముడు దారి తప్పి తిరుగుతున్నాడని వాడిని మార్చమని మాధవయ్య తనకు కనిపించే శ్రీకృష్ణుడు (శోభన్ బాబు) ను వేడుకుంటూ ఉంటాడు. ఆ గుడి ధర్మకర్త శేషాద్రికి చెల్లెలు. తన పొలాలను, గుడి బాధ్యతను శేషాద్రికి అప్పగిస్తుంది. శేషాద్రి వాటి మీద వచ్చే ఆదాయాన్ని, బడి గ్రాంట్ ని దిగమింగుతూ ఉంటాడు. మాధవకు మాత్రం శేషాద్రి అంటే భక్తిగౌరవాలు. గోపీని ఊళ్లోంచి పంపెయ్యమంటూ మాధవయ్యను శేషాద్రి ఒత్తిడి చేస్తుంటాడు. శేషాద్రి చెల్లెలి కూతురు రాధ (విజయనిర్మల) గోపీతో ప్రేమలో పడుతుంది. ఆమె సావాసం తో గోపి వ్యసనాలు మాని బుద్ధిమంతుడు అవుతాడు. కానీ శేషాద్రి మేనకోడలిని తన కొడుకు ( కృష్ణంరాజు) కిచ్చి పెళ్లిచేసి ఆస్తినంతా తన పరం చేసుకోవాలన్న దురుద్దేశంతో రాధ ముందు గోపీని చెడ్డవాడిగా, బడిపంతులు కూతురు (సంధ్యారాణి) ని గర్భవతిని చేశాడని రాధను వారిని విడదీస్తాడు. అన్నకి, తమ్ముడికి మధ్య అంతరం పెరుగుతుంది. గుడికి, బడికి పోటీ పెడతారు. గాలిగోపురం కలశాన్ని గాలిలో ఎగరేసి దేవుని మహిమ చూపమని శేషాద్రి మాధవని ఆదేశిస్తాడు. అయితే శేషాద్రి లాంటి అల్పుల కోసం మహిమ చూపనని కృష్ణుడు అదృశ్యమవుతాడు. దానితో తల శిలకేసి కొట్టుకుంటానని మాధవ గుడి తలుపు వేసుకోవడంతో అన్నను కాపాడేందుకు గోపి ఆలయం పైకెక్కి కలశాన్ని గాలిలో ఎగర వేస్తాడు. అందరూ జయజయధ్వానాలు చేస్తారు. బయటకు వచ్చి తన మీద కోప్పడుతున్న అన్నతో “నీ అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకొని శేషాద్రి లాంటి దుర్మార్గులు ఆటలాడుతూ ఉంటే దేవుడు ఎందుకు మహిమ చూపాలి” అని గోపీ హితవు చెబుతాడు. శేషాద్రి దుర్మార్గం అందరికీ తెలుస్తుంది. గోపీ, రాధల మధ్య అపార్దాలు తొలగి పోతాయి. బడిపంతులు కూతుర్ని మోసం చేసింది శేషాద్రి కొడుకే ( కృష్ణం రాజు) అని తేలుతుంది. శేషాద్రిని పోలీసులు అరెస్ట్ చేయడంతో సినిమా ముగుస్తుంది.
ముళ్ళపూడి మాటలు మహదేవన్ స్వరాలు సినిమా స్థాయిని మరింత పెంచాయి. నాగేశ్వరరావుకు జోడీగా విజయనిర్మల ఒదిగిపోయింది. కృష్ణుడుగా శోభన్ బాబు ఆ తరువాత పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగాడు. నాగభూషణం, అల్లు రామలింగయ్య కాంబినేషన్ ఆ తరువాత చాలా చిత్రాలకు పునాది అయింది. వేయి వేణువులు మ్రోగే వేళ, గుట్టమీద గువ్వ కూసింది, భూమ్మీద సుఖ పడితే, తోటలోకి రాకురా, టాటా వీడుకోలు - పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.*
No comments:
Post a Comment