రాజమకుటం (1960)
వాహినీ ప్రొడక్షన్స్ పతాకంపై బీ ఎన్ రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన రాజమకుటం జానపద చిత్రాల్లో క్లాసిక్ గా ఆదరణ పొందింది. 1960 ఫిబ్రవరి 24 విడుదలైన ఈ చిత్ర కథను రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు బి.యన్. రెడ్డి, సంగీత దర్శకుడు వేణు కలసి తయారుచేశారు.
మహారాజును గుర్తు తెలియని దుండగులెవరో హత్య చేశారు. గురుకులంలో విద్యా భ్యాసం ముగించి రాజధానికి తిరిగి వస్తున్న యువరాజు (ఎన్టీఆర్)కు ఈ విషయం తెలిసింది. ఆ రాత్రే యువరాజుపై కూడా హత్యా ప్రయత్నం జరిగింది. దుండగులను చితగ్గొట్టి రాజధానికి తిరిగి వస్తూ దారిలో స్పృహతప్పి పడిపోతాడు. ప్రమీల (రాజసులోచన) అనే అమ్మాయి వచ్చి యువరాజును చూసి సేద తీర్చి రాజధానికి చేరుస్తుంది. ఆమె పట్ల ఆకర్షితుడైన రాకుమారుడు తనకు నా అన్న వాళ్లెవరూ లేరనీ పరదేశిననీ ఆమెతో చెప్తాడు. రాజధానికి రాగానే ఈ హత్యకు కారణం తన పినతండ్రి, సైన్యాధిపతి అయిన ప్రచండుడు (గుమ్మడి) అని తెలుసుకుంటాడు. తల్లి (కన్నాంబ) బోధల వల్ల ఆవేశాన్ని అణచుకొని సమయం కోసం చూస్తుంటాడు. రాజు హత్యకు అనుమానితులనే నెపంతో ప్రచండుడు రాకుమారుని ఆజ్ఞ పేరిట పలువురిని ఉరితీయిస్తాడు. అలా మరణించిన వారిలో ప్రమీల అన్న కూడా ఉన్నాడు. రాకుమారుడు ప్రతాపునిపై పగబట్టి అతని రక్తం కళ్ళ చూస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది ప్రమీల. శూరసేనుని (రాజనాల) సహాయంతో విప్లవసంఘం స్తాపిస్తుంది. రాకుమారుని పట్టాభిషేకం సందర్భంలో ప్రచండుడు విషం కలిపిన మధుపాత్రను రాకుమారునికి ఇస్తాడు. కుట్రను పసికట్టిన ప్రతాపుడు పానియాన్ని త్రాగినట్లు నటించి ఆ తర్వాత పిచ్చి ఎక్కినట్లు నాటకమాడుతాడు. ప్రచండుని దురాగతాలన్నీ ప్రతాపుని పేరిట జరుగుతూ ఉండటం వల్ల ప్రజలలో తనపై విశ్వాసం కుదిరేటట్లు చేసుకునేటందుకు 'నల్లత్రాచు' అనే ముసుగు మనిషిగా చెలామణి అవుతూ ప్రచండుని అరాచకాలు ఎదుర్కొంటాడు. 'నల్లత్రాచు' విప్లవసంఘానికి నాయకుడవుతాడు. ప్రమీలతో అతని ప్రేమ నచ్చని శూర సేనుడు ప్రతాపుని హత్య చేసేందుకు 'నల్లత్రాచు'ను పంపుతారు. ప్రతాపుని హత్య చేసి తీసుకుపోయినట్లు 'నల్లత్రాచు' నటిస్తాడు. అరాచకం ప్రబలుతుందనే వంకతో ప్రచండుడు తన కుమారునికి పట్టాభిషేకం తలపెడతాడు. ఈర్ష్యతో రగులుతున్న శూరసేనుడు నల్లత్రాచును పట్టి ప్రచండుని వద్దకు తెస్తాడు. అయితే నల్లత్రాచు మిత్రులంతా శూరసేనుడే నల్లత్రాచు అని చెప్పి అతనిని ఉరితీయిస్తారు. నల్లత్రాచు వేషాన్ని తీసివేసి రాకుమారుడుగా ఎదుట పడగానే ప్రచండుడు అతన్ని బంధించి జలసమాధి చేయించటానికి ప్రయత్నిస్తాడు. ప్రమీల ప్రతాపుని రక్షిస్తుంది. ప్రచండుని హతమార్చి ప్రతాపుడు ప్రమీలను పెళ్లాడి రాజవుతాడు.
మాస్టర్ వేణు స్వర పరిచిన పాటల్లో సడిసేయకో గాలి (దేవులపల్లి), ఊరేది పేరేది (బాలాంత్రపు), ఏడ నున్నడో ఎక్కడున్నాడో పాటలు బాగుంటాయి. జానపద విలన్ పాత్ర లో గుమ్మడి సత్తా చాటాడు.*
No comments:
Post a Comment