దేవత (1965)
హాస్య నటుడు పద్మనాభం తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పై సమర్పించిన దేవత చిత్రం 1965 జూలై 24 న విడుదల అయింది. ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రానికి కె. హేమాంబరదరరావు దర్శకుడు. నిర్మాత బి.పురుషోత్తం.
ప్రసాద్ (ఎన్టీఆర్) కాలేజీ లెక్చరర్. అతని భార్య సీత (సావిత్రి) , కొడుకు మధు (మాస్టర్ మురళి) . సీత తన అత్త పార్వతమ్మ (నిర్మల)ను, మామ లోకాభిరామయ్య (నాగయ్య) ను కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటుంది. ఒకసారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్య (పెరుమాళ్లు)ను చూడటానికి వెళుతుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే ఆస్పత్రిలో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయిందని చెబుతారు. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళతాడు. ఆమె తన పేరు లలిత (సావిత్రి) అని, సీత కాదని అంటుంది. ప్రసాద్ ఆమెను సైకియాట్రిస్టుకు చూపిస్తాడు. సైకియాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదని, సీత మరణించి ఉంటుందని చెబుతుంది. ముసలివాళ్లైన తల్లిదండ్రుల కోసం, అనారోగ్యంతో బాధ పడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది. ప్రసాద్ లలితను, ఆమె ప్రియుడు రమేష్ (వల్లం నరసింహారావు)ను కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ లలిత శీలాన్ని అనుమానిస్తాడు. శేషయ్య తాను చనిపోయే ముందు తన ఆస్తిని అంతా తన కుమార్తె సీత పేరుమీద వ్రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి (రాజనాల) కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టుపెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్‌నే పెళ్లి చేసుకుంటుంది.
సినిమా పిచ్చి ఉన్న పాత్రలో పద్మనాభం , అతని ప్రియురాలిగా గీతాంజలి హాస్యాన్ని అందించారు. ఎస్. పి . కోదండపాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, తొలి వలపే పదే పదే, బొమ్మను చేసి, ప్రాణం పోసి- పాటలు ప్రజాదరణ పొందాయి. *
No comments:
Post a Comment