విచిత్ర కుటుంబం (1969)
1969 మే 28 ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు విడుదలైన విచిత్ర కుటుంబం సినిమా విశేష ప్రజాదరణ పొందింది. శ్రీ రాజ్ ఆర్ట్ ఫిలింస్ పతాకంపై వీకేపీ సుంకవల్లి నిర్మించిన ఈ చిత్రానికి కె. ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించారు. కృష్ణ, శోభన్ బాబు కూడా నటించడంతో ఈ చిత్రం అప్పట్లో పెద్ద మల్టీ స్టారర్ గా నిలిచింది.
రాజశేఖరం ( ఎన్టీఆర్) లాయర్. భార్య కమల ( సావిత్రి) అమాయకురాలు. రాజశేఖరం తమ్ముడు కృష్ణ ( కృష్ణ), చెల్లెలు సంధ్యారాణి. కృష్ణ ఊళ్ళో అన్యాయాల్లో జోక్యం చేసుకుంటూ గొడవపడుతూ ఉంటాడు. ఈ తగాదాలనుంచి కమల మరిదిని కాపాడుతూ ఉంటుంది. అదే ఊళ్ళో నాగరాజు ( నాగభూషణం భూస్వామి. అక్రమాలకు పెట్టింది పేరు. అతని భార్య సుశీలకు ఇవన్నీ తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటుంది. నాగరాజు, రాజశేఖరం కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నా రాజశేఖరం నాగరాజు ఆగడాలను అడ్డుకుంటూ ఉండటంతో నాగరాజు అతనిమీద కక్ష పెంచుకుంటూ ఉంటాడు. నాగరాజు తల్లిదండ్రులు అతని ప్రవర్తన నచ్చక ఆస్తినంతా తమ చిన్న కొడుకు రాఘవ ( శోభన్ బాబు) పేరు మీద రాస్తారు. దాంతో నాగరాజు తన తమ్ముడిని సరిగ్గా పట్టించుకోడు. రాజశేఖరం దంపతులు రాఘవను చిన్నప్పటి నుంచి బాగా చూసుకుని పై చదువుల కోసం రష్యాకి పంపిస్తారు. కమల చెల్లెలు రాధ ( విజయనిర్మల) అల్లరి పిల్ల. అక్క గారింటికి వచ్చి కృష్ణతో ప్రేమలో పడుతుంది. దీనికి తోడు, నాగరాజు నుంచి తమకు రావలసిన. లక్ష రూపాయలను రాబట్టుకోవాలని వచ్చిన కమల అక్కడ, నాగరాజు అనుచరుడైన సింగన్న ( ప్రభాకరరెడ్డి) చేసిన హత్యను ప్రత్యక్షంగా చూస్తుంది. కానీ, భయంతో భర్తకు చెప్పదు. రాఘవ జూలీ ( షీలా) అనే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తిరిగి రాగా, నాగరాజు వారికి సాదరంగా స్వాగతం పలుకుతాడు. త్వరలోనే ఆ జంట హనీమూన్‌కు వెళ్లగా, సింగన్న ద్వారా వారిని చంపడానికి కుట్ర పన్నుతాడు. రాజశేఖరంపై కత్తితో దాడి చేసిన నాగరాజును కృష్ణ ఆవేశంతో కొట్టబోగా కమల అతన్ని అడ్డుకుంటుంది. నాగరాజు నెలలోగా అతన్ని మట్టికరిపిస్తానని బెదిరిస్తాడు. కృష్ణ తనపై పై హత్యాయత్నం చేశాడని తప్పుడు ఆరోపణ కూడా చేస్తాడు. కృష్ణ జైల్లో ఉంటే నాగరాజు ఏమీ చేయలేడనీ కోర్టులో కమల కృష్ణ దోషి అని వాదిస్తుంది, కోర్టు అతనికి మూడు నెలల శిక్ష విధిస్తుంది, రాజశేఖరం ఆమెను గట్టిగా తిట్టడంతో ఆమె నాగరాజు రాక్షస రూపాన్ని, కృష్ణను నెలలోగా చంపుతానని చేసిన బెదిరింపు గురించి చెబుతుంది. మరిదిపై ఆమె ప్రేమను రాజశేఖరం అర్థం చేసుకుంటాడు. . అటు రాఘవ, జూలీ మరణించినట్టు చేసిన నాగరాజు ప్రచారం అబద్ధమని సింగన్న బయటపెట్టడంతో నాగరాజు అతన్ని దాచిపెడతాడు. తాను చూసిన హత్యను చేసింది సింగన్నే అని కమల గుర్తించడంతో కృష్ణ నిర్దోషిగా విడుదల అవుతాడు. రాఘవ, జూలీ బతికే ఉన్నారని రాజశేఖరం తెలుసుకుంటాడు. మారువేషంలో నాటకం ఆడి వారిని కాపాడతాడు. చివరకు రాజశేఖరం కుటుంబం మొత్తం కలిసి నాగరాజును జైలుకి పంపుతుంది.
భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాసిన చిత్రానికి పాటలన్నీ డాక్టర్ సీ నారాయణ రెడ్డి రాశారు. టీబీ రాజు సంగీతం సమకూర్చారు. ఆడవే జలకమ్ములాడవే పాట సూపర్ హిట్.*
No comments:
Post a Comment