మల్లీశ్వరి-1951
తెలుగు సినీ వైభవానికి మచ్చుతునకల్లాంటి చిత్రాల్లో ఒకటి వాహినీ పిక్చర్స్ పై బీ ఎన్ రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన మల్లీశ్వరి. రాయలకాలపు నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం రాయలసీమ సంస్కృతిని, శిల్పకళను ఎంతో అందంగా చూపించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, బీ ఎన్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఓ సాధారణ ప్రేమకథను ఒక కావ్యంలా తీర్చిదిద్దాయి. 1951 డిసెంబరు 20 న విడుదలైన ఈ చిత్రం ఆ నాటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ప్రతిభ వల్ల ఒక కాలాతీత కళాఖండంగా నిలిచింది.
తుంగభద్రా నదీ తీరాన ఉన్న ఒక చిన్న గ్రామంలో మల్లీశ్వరి (భానుమతి), ఆమె బావ నాగరాజు (ఎన్టీఆర్) కలసి మెలిసి పెరుగుతారు. చిన్నతనం నుంచే వారిద్దరి మధ్య అనురాగం, ప్రేమ చిగురిస్తాయి. మల్లికి పాటలంటే ప్రాణం, నాగరాజు శిల్పి. మల్లీశ్వరి మేనత్త హేమావతి ధనాశ పరురాలు. రాయలవారి ఆస్థానంలో అందమైన కన్యలను రాణివాసపు సేవకులుగా చేరిస్తే గొప్ప హోదా, సంపద వస్తాయని భావిస్తుంది. రాయలవారి ప్రతినిధులు గ్రామానికి వచ్చినప్పుడు మల్లీశ్వరిని ఎంపిక చేసి రాజసౌధానికి తీసుకెళ్తారు. ఆనాటి ఆచారం ప్రకారం రాణివాసంలో ఉన్న స్త్రీలను బయటి పురుషులు చూడకూడదు, ప్రేమిస్తే మరణశిక్ష పడుతుంది. దీంతో నాగరాజు, మల్లీశ్వరి వేరుపడతారు. మల్లీశ్వరి వియోగంతో తలడిల్లిపోయిన నాగరాజు, ఆమెను ఎలాగైనా చూడాలనే తపనతో విజయనగరం చేరుకుంటాడు. అక్కడ తన శిల్పకళా నైపుణ్యంతో రాజాస్థానంలో శిల్పిగా గుర్తింపు పొందుతాడు. ఒకనాడు రాజభవన ఉద్యానవనంలో నాగరాజు శిల్పాలు చెక్కుతుండగా, అనుకోకుండా మల్లీశ్వరిని కలుసుకుంటాడు. ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకునే క్రమంలో కాపలాదారులకు దొరికిపోతారు. రాజద్రోహం కింద ఇద్దరికీ మరణశిక్ష పడుతుంది. వారిద్దరినీ మహారాజు శ్రీకృష్ణదేవరాయలు ముందర ప్రవేశపెడతారు. వారి పవిత్రమైన ప్రేమను, నాగరాజు కళాకౌశలాన్ని అర్థం చేసుకున్న రాయలవారు వారిని క్షమించడమే కాకుండా, స్వయంగా వారి పెళ్లి జరిపించి ఆశీర్వదిస్తారు.
ఎస్ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో పాటలన్నీ ఆణిముత్యాలే. రెండు మూడు మినహా పాటలన్నీ దేవులపల్లి రాశారు. కోతీ బావకు పెళ్ళంట, పరుగులు తీయాలి, పిలిచిన బిగువటరా, ఆకాశవీధిలో, ఔనా నిజమేనా, మనసున మల్లెలు. - పాటలన్నీ మదురాతిమధురం. భానుమతి నటనా ప్రతిభ, గాత్రం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ సినిమాను ఇతర దేశాలలో కూడా ప్రదర్శించారు. చైనాలో ఈ సినిమా వందరోజులకు పైగా ఆడింది.మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగు- ఇలా అన్ని విభాగాల్లో అత్యంత శ్రద్ధ తీసుకున్న బీ ఎన్ రెడ్డి మల్లీశ్వరి చిత్రానికి అసలైన సృష్టికర్త అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.
భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా (2013 ఏప్రిల్‌లో) సీఎన్ఎన్ - ఐబీఎన్ ప్రచురించిన "ది 100 గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్ టైమ్" జాబితాలో 'మల్లీశ్వరి' చోటు దక్కించుకుంది.
అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ సినిమా స్క్రిప్ట్‌ను తమ చలనచిత్ర అధ్యయనాలలో పాఠ్యాంశంగా చేర్చుకోవడానికి ఆసక్తి చూపాయి.*
No comments:
Post a Comment