అమాయకుడు (1968)
రాజ్ కపూర్ నటించిన అనారీ హిందీ చిత్రాన్ని తెలుగులో హీరో కృష్ణతో అమాయకుడు పేరుతో ఉదయశ్రీ పిక్చర్స్ పతాకంపై అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో నిర్మించారు. 1968 లో ఈ చిత్రం విడుదలైంది.
రాజు (కృష్ణ) అమాయకుడు. నీతి, నిజాయితీ గలవాడు. బొమ్మలు గీస్తూ ఉంటాడు. తల్లి, తండ్రి ఎవరూ లేని అనాథ. మేరియమ్మ (జి.వరలక్ష్మి) ఇంట్లో అద్దెకు ఉంటాడు. ఎక్కడ ఏ పనిలో, ఉద్యోగంలో చేరినా అచ్చట మోసాలు తట్టుకోలేక ఉద్యోగాలు వదిలివేస్తుంటాడు. జాలి హృదయం గల మేరియమ్మ అతణ్ణి మందలిస్తూనే, అతని పోషణ భారం వహిస్తుంది. చిత్రాలు గీసి డబ్బులు సంపాదించమని, వాటికి తనే డబ్బు చెల్లిస్తుంటుంది. ఒకరోజు రాజు, ఆ వూరిలో ధనవంతుడయిన రామనాథం (గుమ్మడి) తమ్ముని కూతురు రాణి (జమున)ని కలుసుకుంటాడు. ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని, పిలిచి, తన స్నేహితురాలు (పనిమనిషి) ఆశ (విజయలలిత)ను రాణిగా చెప్పి అతనితో తమాషా చేస్తుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. రాజుకూడా ఆమె పేద పిల్ల అని ప్రేమిస్తాడు. ఒకసారి డబ్బుతో పర్స్ పోగొట్టుకున్న రామనాథంకి దాన్ని తెచ్చి ఇచ్చిన రాజు నిజాయితి మెచ్చి, అతనికి తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. ఆ కంపెనీలో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంతలో రాజు, తన తమ్ముని కుమార్తె రాణిని ప్రేమించాడని తెలిసి రామనాథం ఆమె నుండి అతన్ని దూరం చేయాలని రాణిని మందలిస్తాడు. ఈలోపు ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వలన జ్వరంతో బాధపడుతున్న మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడడంవల్ల దాంతో ఆమె మరణిస్తుంది.హత్యానేరంపై జైలుపాలయిన రాజును రక్షించటానికి రాణి ప్రయత్నించటం, దాన్ని విఫలం చెయ్యాలని రాణి బాబాయి రామనాథం అడ్డుకోవటం, చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవటంతో అతను అరెస్ట్ రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు. రాణి, రాజుల వివాహంతో చిత్రం సుఖాంతమౌతుంది.
బి. శంకర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో మనిషయితే మనసుంటే, అనుకోనా ఇది నిజమనుకోనా(దేవులపల్లి), చందమామ రమ్మంది చూడు, బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు, పోలేవునీవు, (సినారె), పట్నంలో శాలిబండ ( ఏ. వేణుగోపాల్) పాటలు హిట్ అయ్యాయి. *
No comments:
Post a Comment