గోవింద నామస్మరణతో ప్రశాంతంగా ప్రారంభమవ్వాల్సిన తిరుమల శ్రీవారి దర్శన ప్రయాణం, టీటీడీ వెబ్‌సైట్ తెరవగానే ఒలింపిక్స్ వంద మీటర్ల పరుగు పందెంలా మారుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోటా బుకింగ్ సమయంలో జరిగే ఈ నాటకం కోట్లాది మంది వృద్ధ భక్తులకు నరకం చూపిస్తోంది.
మధ్యాహ్నం మూడు గంటలకు సర్వర్ తెరవగానే, కంగారు పడుతూ ఒక ఖాళీ తేదీపై క్లిక్ చేస్తాం. "అమ్మో! ఈసారికి టికెట్ దొరికేసినట్లే" అని మనసులోనే తిరుమల లడ్డూ తినేస్తుంటాం..
అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. పేరు, వయస్సు టైప్ చేశాక... ఆధార్ కార్డ్ కాపీ అప్‌లోడ్ చేయాలి. 60 ఏళ్లు దాటిన వృద్ధులు కళ్లద్దాలు వెతుక్కుని, ఆధార్ వివరాలు టైప్ చేసి, ఫైల్ సైజ్ సరిచూసుకుని అప్‌లోడ్ చేసేసరికి అప్పటికే నిమిషాలు గడిచిపోతాయి.
"ఆధార్ అప్‌లోడ్ చేసి, వివరాలన్నీ సరిచూసుకుని, అత్యంత పవిత్రమైన మనస్సుతో 'సబ్మిట్' బటన్ నొక్కగానే తెరపై ప్రత్యక్షమయ్యే మెసేజ - :"ఈ స్లాట్ ఖాళీ లేదు, దయచేసి మరొక తేదీని ఎంచుకోండి."
తీరా ఆ మెసేజ్ చూసి పక్కనే ఉన్న మరో తేదీని మార్చుకుందామంటే అక్కడ 'చేంజ్ డేట్' అనే చిన్న ఆప్షన్ కూడా ఉండదు! మళ్లీ మొదటికొచ్చి, మెయిన్ పేజీకి వెళ్లి, ఇంకో తేదీని వెతుక్కుని నొక్కేలోపే... తెరపై ఎర్రటిబాక్సుతో "ఆల్ స్లాట్స్ బుక్డ్" అని తేలిపోతుంది. అంటే కథ ఖతమ్, దుకాణం బంద్!
ఇక 'ఎలక్ట్రానిక్ డిప్' భాగోతం.
టీటీడీ ప్రవేశపెట్టిన 'ఎలక్ట్రానిక్ డిప్' సిస్టమ్ చూడటానికి అత్యంత పారదర్శకంగా, సాంకేతికంగా కనిపించవచ్చు. కానీ, సాధారణ భక్తుడి కోణంలో చూస్తే ఇది ఒక పెద్ద "డిజిటల్ లాటరీ" వ్యాపారంలా మారింది.
ముందుగా ఉచితంగానే లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదో అదృష్టం. ప్రతి భక్తుడు తన ఆధార్ వివరాలన్నీ నమోదు చేసి, ఫోన్ నంబర్లు ఇచ్చి కాచుకుని కూర్చోవాలి.
నియమిత రోజున కంప్యూటర్ ద్వారా 'డిప్' తీస్తారు. కోట్ల మంది ఆశగా ఎదురుచూస్తుంటే... సిస్టమ్ నుంచి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. "మీకు స్లాట్ కేటాయించబడలేదు."
ఏ ప్రాతిపదికన ఎవరికి టికెట్లు వస్తున్నాయో, ఏ అల్గారిథమ్ పని చేస్తోందో ఆ దేవుడికే ఎరుక.
ఒకవేళ అదృష్టం బాగుండి 'డిప్'లో పేరు వస్తే... వెంటనే అమౌంట్ పే చేయడానికి ఇచ్చే సమయం అత్యంత స్వల్పం. ఆ లోపే పేమెంట్ గేట్‌వే హ్యాంగ్ అయినా, ఓటీపీ రాకపోయినా దక్కిన దర్శనం కాస్తా గోవిందా!
సీనియర్ సిటిజన్లకు, శారీరక ఇబ్బందులు ఉన్నవారికి ఈ రేస్‌లో ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. అందరినీ ఒకే కంప్యూటర్ 'డిప్' బాక్స్‌లో పడేసి ఆడించడం వల్ల, ఏళ్ల తరబడి స్వామివారిని చూడాలని తపించే వృద్ధులకు నిరాశే మిగులుతోంది.
మొత్తానికి, తిరుమలలో నేరుగా క్యూలైన్లలో నుంచోవడం కంటే... వెబ్‌సైట్ తెరచి, ఆధార్ ఎంటర్ చేసి, ఈ 'ఎలక్ట్రానిక్ డిప్' లాటరీ గెలవడమే అతిపెద్ద క్లిష్టమైన విషయంగా మారిపోయింది!
భక్తికి ఓపిక ఒక్కటే ఉంటే సరిపోదు, రాకెట్ వేగంతో పాటు కన్ఫర్మ్ అయ్యేంతవరకు గుండె నిబ్బరం కూడా ఉండాలని టీటీడీ డిజిటల్ వ్యవస్థ నిరూపిస్తోంది. వివరాలన్నీ తీసుకున్నాకే స్లాట్ లేదని చెప్పే బదులు, ముందే స్లాట్ హోల్డ్ చేసి తరువాత వివరాలు తీసుకునే వెసులుబాటు పెద్దలకు కల్పించాలనే ఆలోచన ఆ సన్నాసులకు ఎందుకుండదు…?
No comments:
Post a Comment