Tuesday, 25 August 2026

 మంచిమిత్రులు (1969)



కృష్ణ, శోభన్ బాబు పోటీ పడి నటించిన మంచి మిత్రులు సినిమా 1969లో విడుదలైంది. మధు పిక్చర్స్ పతాకంపై తాతినేని రామారావు దర్శకత్వంలో పీ. మల్లిఖార్జునరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

1967 లో ఏవీఎం సంస్థ తమిళంలో నిర్మించిన ‘పదియం‘ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. తరువాత హిందీలో కూడా ‘సచ్చాయి‘ పేరుతో ఈ చిత్రం తీశారు. అలాగే మలయాళంలో కూడా ‘ఇనయం కానం‘ పేరుతో వచ్చింది.

గోపి (కృష్ణ), శ్రీను/ శ్రీనివాస్ (శోభన్‌బాబు) స్నేహితులు. ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. గోపికి ఆవేశం ఎక్కువ. శ్రీను సమయానుకూలంగా సర్దుకుపోతుంటాడు. ఒకనాడు ఆఫీసర్‌తో వచ్చిన చిన్న తగాదా కారణంగా గోపి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన గోపి, శ్రీను మధ్య మాట పట్టింపునకు కారణమవుతుంది. దీంతో ఐదేళ్లపాటు ఇరువురూ విడివిడిగా జీవించి, ఆ తరువాత కలుసుకుందామని నిర్ణయించుకుంటారు. పట్నం చేరిన గోపి ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలుడవుతాడు. మంచికి పోగా చెడు ఎదురవటంతో అనుకోకుండా ఓ నేరంలో చిక్కుకోబోవటం, దాన్నించి తనను రక్షించిన గజదొంగ పశుపతి (నాగభూషణం)ని విడిపించే ప్రయత్నంలో తానే పెద్ద నేరస్తుడిగా, గజదొంగ గంగారాంగా మారతాడు. పశుపతి చెల్లెలు మీనా (గీతాంజలి) గంగారాంను ఇష్టపడుతుంది. వేరే వూరుచేరిన శ్రీను అనుకోకుండా గోపి తల్లిని, చెల్లెలు ఇందిర (విజయనిర్మల)ను కలుసుకుంటాడు. వాళ్లింట అవుట్‌హౌవుస్‌లో ఉంటున్న మాలోకం (చలం) గదిలో ఆశ్రయం పొందుతాడు. అలా ఇందిర ప్రేమను, ఇన్‌స్పెక్టరుగా ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. గంగారాంను అరెస్ట్ చేయటానికి స్పెషల్ డ్యూటీమీద శ్రీను హైద్రాబాదు వస్తాడు. అయితే, తల్లి మరణించటంతో ఇందిర కూడా హైద్రాబాదులోని గంగారాం వద్దకు చేరుకుంటుంది. గంగారాం ప్రయత్నాలను శ్రీనివాస్‌ విఫలం చేస్తుంటాడు. ఆక్ర మంలో ఐదేళ్ల అనంతరం తమ సంకేత స్థలంలో కలుసుకున్నపుడు, ఎవరెవరో నిజం తెలుసుకుంటారు. తరువాత గంగారాంను బంధించాలని శ్రీనివాస్, శ్రీనివాస్‌ను అడ్డుకోవాలని గంగారాం,  ఇద్దరూ బుల్లెట్ లేని తుపాకీలతో రావటం, మరో పోలీసు కాల్చిన తూటాతో గంగారాం గాయపడగా, మిత్రులిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని దుఃఖించటం, గంగారాం మరణించటంతో చిత్రం ముగుస్తుంది.

భమిడిపాటి రాధాకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాశారు. ఎస్పీ కోదండపాణి సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో కృష్ణకు ఘంటసాల, శోభన్ కు బాలు కలసి పాడిన ఎన్నాళ్ళో వేచిన హృదయం పాట ఇప్పటికీ హిట్.*

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...