Sunday, 30 August 2026

మూడు జిల్లాలకు అండ- వెలిగొండ -జీడిగుంట నాగేశ్వరరావు


ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నియోజకవర్గం పెద్దార వీడు మండలం గొట్లగట్టు గ్రామం వద్ద 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన వెలిగొండ ప్రాజెక్టు (నల్లమల సాగర్ జలాశయం) తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. 

ఆ ప్రాంత నీటి సమస్యల పరిష్కారం కోసం, ఈ ప్రాజెక్టు సాధన కోసం పోరాటం చేసిన సీపీఐ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం ఎదుర్కొంటున్న తీవ్రమైన కరువు, ఫ్లోరైడ్ సమస్యల నుంచి నుండి ప్రజలను రక్షించడానికి, శ్రీశైలం మిగులు జలాలను గ్రావిటీ ద్వారా ఈ ప్రాంతానికి తరలించవచ్చని ఆయన నిరంతరం బలంగా గళమెత్తారు.ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వెలిగొండ ప్రాజెక్టు మంజూరు చేయించడం కోసం అనేక ఉద్యమాలు, సుదీర్ఘ పాదయాత్రలు నిర్వహించారు.

ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.10,200 కోట్ల నుంచి రూ.10,580 కోట్లు వరకు ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, పునరావాస (ప్యాకేజీల కోసం దాదాపు రూ.6,700 కోట్లకు పైగా వెచ్చించారు.

ప్రాజెక్టుకు తొలిసారిగా 1996 మార్చి 5న చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.  ఆ తర్వాత 2004 -2005లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో 'జలయజ్ఞం' కార్యక్రమంలో భాగంగా పనులు వేగవంతమయ్యాయి.

తొలి దశలో భాగంగా దాదాపు 10.70 నుంచి 14 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌లో నిల్వ చేస్తారు.  

ఉమ్మడి ప్రకాశం (ప్రస్తుత మార్కాపురం జిల్లా పరిధి), నెల్లూరు, కడప జిల్లాలలోని తీవ్ర ఫ్లోరైడ్, కరువు ప్రభావిత ప్రాంతాలకు ఇది జీవనాధారం.  

ఫేజ్-1 ద్వారా సుమారు 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.  

ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందిపడుతున్న దాదాపు 4 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుతుంది.  

శ్రీశైలం జలాశయం కొల్లం వాగు నుంచి నల్లమల కొండల గుండా నిర్మించిన జంట సొరంగాల ద్వారా నీటిని తరలించి, తీగలేరు, ఫీడర్ కాలువల ద్వారా ఆయకట్టుకు అందిస్తారు.  

ఈ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు తాగునీటి కొరత తీరి, వ్యవసాయానికి భరోసా లభిస్తుంది.*

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...