Sunday, 30 August 2026

 


భలే తమ్ముడు (1969)

షమ్మీకపూర్ ద్విపాత్రాభినయంతో హిందీలో విజయవంతమైన చైనా టౌన్ చిత్రం ఆధారంగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో తారకరామా పిక్చర్స్ పై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన భలే తమ్ముడు చిత్రం 1969 లో విడుదలైంది. చిత్రానువాదం, దర్శకత్వం బీ ఏ సుబ్బారావు. 

కొందరు గ్యాంగ్‌స్టర్లకు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్  (మిక్కిలినేని) శిక్ష విధించడంతో వారి నాయకుడు, గణపతి / గన్,  (రాజనాల) ప్రసాద్‌ను చంపి, అతని కవల కుమారులలో ఒకడైన రామ్ ప్రసాద్‌ (ఎన్టీఆర్) ను అపహరిస్తాడు. రామ్, ఆ గ్యాంగ్‌స్టర్ల మధ్య పాల్ అనే పేరుతో పెరిగి, కరడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఒకసారి, ఒక దోపిడీలో పోలీసులు పాల్‌ను పట్టుకుంటారు. ఇన్‌స్పెక్టర్ శేఖర్ (ప్రభాకర రెడ్డి) అతన్ని రహస్యంగా దాచి, నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ, ఎంత హింసించినా అతను ఒప్పుకోడు. తల్లి (శ్రీ రంజని)పెంపకంలో పెరిగిన చిన్నవాడైన శ్యామ్ ప్రసాద్ (ఎన్టీఆర్) క్లబ్ సింగర్. అతను రావు సాహెబ్ (రేలంగి) కూతురైన గీత( కేఆర్ విజయ) ను ప్రేమిస్తాడు. వారి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న రావు సాహెబ్, తన కూతురిని హైదరాబాద్‌కు తీసుకువెళ్తాడు, శ్యామ్ కూడా అతనిని అనుసరిస్తాడు. ఒక రాత్రి, శ్యామ్ గీత ఇంట్లోకి ప్రవేశించగా, రావు సాహెబ్ అతన్ని అరెస్టు చేయిస్తాడు. ఇన్‌స్పెక్టర్ శేఖర్  పాల్ శ్యామ్‌ల మధ్య పోలికను గమనించి, అతనికి సీఐడీ ఉద్యోగం ఆఫర్ చేసి, పాల్ అనే పేరుతో గ్యాంగ్‌లోకి పంపుతాడు. పాల్ ప్రేయసి లీల తప్ప ముఠాలోని అందరూ అతన్ని నమ్ముతారు. లీల అతని నడవడికను అనుమానించి, అసలు నిజాన్ని కనుగొంటుంది. అప్పుడు షామ్ మొత్తం కథను చెప్పి ఆమె సహాయం కోరగా, ఆమె అంగీకరిస్తుంది. అది విన్న గన్, షామ్‌ను పట్టుకుంటాడు. ఇంతలో, పాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా, అంబులెన్స్ ప్రమాదానికి గురవుతుంది. అతడిని శ్యామ్ అనుకుని గీత కాపాడుతుంది.  శ్యామ్ తన ముఠాను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న పాల్ ఆమెను తన స్థావరానికి తీసుకువెళ్తాడు. అతను శ్యామ్ ను కొట్టడం చూసి లీల అతనికి అడ్డుపడి అసలు నిజాన్ని బయటపెడుతుంది. పాల్ తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడతాడు, సోదరులు ఇద్దరూ ఒక్కటై గన్,అతని ముఠా అంతాన్ని చూస్తారు. పాల్ పోలీసులకు లొంగిపోతాడు.  ఆరు నెలల జైలు శిక్ష అనంతరం విడుదలవుతాడు, శ్యామ్ పోలీస్ అధికారి అవుతాడు, రామ్, లీల,  శ్యామ్ , గీతల వివాహాలతో సినిమా సుఖాంతం అవుతుంది. 

ఈ చిత్రానికి సంగీతం అందించిన టీ వీ రాజు కొన్ని పాటలను హిందీ పాటల బాణీలోనే స్వరపరిచారు. హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ తొలిసారిగా తెలుగు సినీ రంగానికి పరిచయమై పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె, గుమ్మా గుమ్మా పాటలు - ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

తర్వాత కాలంలో అమితాబ్ తో హిందీలో తీసిన డాన్ (తెలుగులో యుగంధర్) కూడా ఇదే ఇతివృత్తంతో వచ్చింది. కృష్ణ నటించిన టక్కరిదొంగ- చక్కని చుక్క చిత్రం కూడా ఇలాగే ఉంటుంది.*


No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...