తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ సంగీత దర్శకులలో సాలూరి రాజేశ్వరరావు ఒకరు. సుమారు ఐదు దశాబ్దాలకు పైగా ఆయన అందించిన మధురమైన గీతాలు, అజరామరమైన బాణీలు తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
రాజేశ్వరరావు అక్టోబర్ 11, 1922 న విజయనగరం జిల్లా (అప్పటి శ్రీకాకుళం జిల్లా) సాలూరు సమీపంలోని శివరామపురం గ్రామంలో జన్మించారు.ఆయన తండ్రి సన్యాసిరాజు ప్రముఖ మృదంగ విద్వాంసులు. రాజేశ్వరరావు కేవలం నాలుగో ఏటనే కర్ణాటక సంగీత రాగాలను గుర్తించగల ప్రతిభ కనబరిచారు. చిన్నతనంలోనే గ్రామఫోన్ రికార్డుల ద్వారా భగవద్గీత శ్లోకాలు పాడుతూ ప్రసిద్ధి చెందారు.
1935లో వచ్చిన 'శ్రీకృష్ణ లీలలు' చిత్రంలో బాలకృష్ణుడిగా నటించి, తెలుగు ప్రేక్షకులకు నటుడిగా కూడా పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని మూకీ, మాట్లాడే చిత్రాలలోనూ నటించారు. ప్రముఖ జెమినీ స్టూడియోస్‌లో దాదాపు దశాబ్ద కాలం పాటు పని చేసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు.
భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని లలిత సంగీతం, జానపద బాణీలతో అద్భుతంగా మిళితం చేయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. మోహనం, అభేరి, కళ్యాణి, సింధుభైరవి వంటి రాగాలను ఆయన తన పాటలలో అత్యంత మధురంగా మలిచారు.
ఆయన సంగీతం అందించిన ఎన్నో సినిమాలు - మల్లీశ్వరి (1951), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957) తెలుగు చలనచిత్ర సీమలో మైలురాళ్ళగా నిలిచాయి: ఇవేకాక రాజు-పేద, విప్రనారాయణ, భలేరాముడు, చెంచులక్ష్మి, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం వంటి మరెన్నో చిత్రాలకు అద్భుతమైన బాణీలు సమకూర్చారు.
సాలూరి రాజేశ్వరరావు ఏ పాట కంపోజ్ చేసినా, దాని వెనుక బలమైన రాగ ప్రణాళిక ఉండేది. ఒక రాగంలో వర్ణం ఎలాగైతే పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరాలు, చరణం, చిట్టస్వరాలతో క్రమపద్ధతిలో సాగుతుందో, ఆలాగే ఆయన కొన్ని పాటలను కూడా అదే శాస్త్రీయ క్రమశిక్షణతో, రాగ లక్షణాలు చెడకుండా మలిచారు.
కర్ణాటక సంగీతంలోని వర్ణాల రూపాలను, రాగాల (మోహనం, కళ్యాణి, అభేరి, శంకరాభరణం వంటివి) గంభీరతను కోల్పోకుండానే, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా లలితమైన బాణీలుగా మార్చడంలో ఆయన సిద్ధహస్తులు. ఒక వర్ణం ప్రాథమిక నిర్మాణ సూత్రాలను ఆయన సినిమా పాటల చరణాలు,ఇంటర్లూడ్స్ లో చాలా చాకచక్యంగా ఉపయోగించేవారు.
ఆయన పాటల్లో రాగాల కూర్పు, స్వరాల విన్యాసం అచ్చం ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో వర్ణం పాడుతున్నంత గంభీరంగానూ, అదే సమయంలో ఎంతో మధురంగానూ ఉంటాయి.
రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో వీణ వాద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి రూపొందించిన పాటలు తెలుగు సినీ సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. ఆయనకు వీణా వాద్యంపై ఉన్న మమకారం, కర్ణాటక సంగీత పరిజ్ఞానం కారణంగా ఆయన సినిమాలలో వీణ మోత ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది
సాలూరి కుటుంబం నుంచి సంగీత రంగంలోకి ఎంతో మంది వచ్చారు. ఆయన కుమారులు సాలూరి రామలింగేశ్వరరావు, సాలూరి పూర్ణచంద్రరావు, సాలూరి వాసురావు,ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి కోటేశ్వరరావు (కోటి) అందరూ సంగీత రంగంలోనే స్థిరపడ్డారు. ఆయన అన్నగారు సాలూరు హనుమంతరావు కూడా సంగీత దర్శకులే.
రాజేశ్వరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా సేవలు అందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ (డాక్టరేట్) గౌరవాన్ని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం పొందారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రఖ్యాత రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు.
తెలుగు ప్రజల హృదయాల్లో తన స్వరాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోయిన సాలూరి రాజేశ్వరరావు అక్టోబర్ 25, 1999న కన్నుమూశారు.*

No comments:
Post a Comment