కాలం మారేకొద్దీ మనుషుల నడుమ సంభాషణల వేగం పెరిగింది గానీ, భావాల గాఢత తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. నేటి వాట్సాప్ మెసేజ్‌లు, ఈమెయిళ్ళ వేగంలో ఒకప్పటి తపాలా ఉత్తరం తెచ్చిన తీపి జ్ఞాపకాలు మరుగునపడిపోయాయి.
ఒకప్పుడు ఉత్తరం కేవలం ఒక కాగితం ముక్క కాదు... అది రెండు మనసులను కలిపే అదృశ్య వంతెన. దూరంగా ఉన్న కన్నవారి క్షేమాన్ని, కట్టుకున్నవారి అనురాగాన్ని, ప్రాణస్నేహితుడి ఆత్మీయతను మూటగట్టుకుని వచ్చే అక్షర రూపం. పోస్ట్ మాన్ సైకిల్ బెల్ వినపడగానే గుండెల్లో ఏదో ఉద్వేగం… "నా పేరిట ఉత్తరం ఉందా?" అని ఆశగా ఎదురుచూసే ఆ క్షణాలు వర్ణనాతీతం.
పోస్ట్ కార్డ్ మీద వంకరటింకరగా రాసిన నాన్న ఆశీస్సులు, ఇన్‌లాండ్ లెటర్‌లో నీలిరంగు కాగితం నిండా అమ్మ కురిపించిన ఆప్యాయతలు, పోస్టల్ కవరు లోపల దాక్కున్న ప్రియమైనవారి తొలి ప్రేమ లేఖలు... ఒక్కో అక్షరం వెనుక ఎన్నో భావోద్వేగాలు, ఎన్నెన్నో కన్నీళ్లు, నవ్వులు. లేఖ తెరిచి చదువుతుంటే ఎదురుగా ఆ మనిషే నిలబడి మాట్లాడుతున్నంత అనుభూతి కలిగేది. ఆ కాగితం మీద పడిన చేతివ్రాత, ఆ కాగితానికి ఉండే ప్రత్యేకమైన వాసన చదివేవారిని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేవి
ఈరోజు అర చేతిలో ప్రపంచం ఉన్నా, ఒక ఉత్తరాన్ని తెరిచేటప్పుడు అనుభవించిన ఆ కాచి వడపోసిన ఎదురుచూపుల ఆనందం, ఆ ఆత్రుత నేటి డిజిటల్ యుగంలో లభించవు. మడతలు పడిన ఆ పాత లేఖలను నేటికీ దాచుకున్నవారికి తెలుసు... అప్పట్లో ఒక ఉత్తరం విలువ ఎంతో, అది పంచిన బంధాల బరువు ఎంతో!
ప్రపంచ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు!

No comments:
Post a Comment