Sunday, 12 July 2026

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

డాక్టర్ చక్రవర్తి (1964)

కోడూరి కౌసల్యాదేవి రచించిన "చక్రభ్రమణం" నవల ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన డాక్టర్ చక్రవర్తి సినిమా 1964లో విడుదల అయింది. అన్నపూర్ణా బ్యానర్ పై ఈ సినిమాను దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. 

డాక్టర్ చక్రవర్తి (అక్కినేని నాగేశ్వరరావు), డాక్టర్ శ్రీదేవి (కృష్ణకుమారి)  ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ చక్రవర్తి చెల్లెలు అయిన సుధ (గీతాంజలి) క్యాన్సర్ వ్యాధి వల్ల మరణిస్తూ తన ఆడపడుచు నిర్మల (షావుకారు జానకి) ను పెళ్ళిచేసుకోవలసిందిగా అన్న దగ్గర మాట తీసుకుంటుంది. చెల్లెలు చివరి కోరికను మన్నించిన చక్రవర్తి నిర్మలను పెళ్ళి చేసుకుంటాడు.

చక్రవర్తికి ఆప్తమిత్రుడు రవీంద్ర (జగ్గయ్య). అతని భార్య మాధవి (సావిత్రి) రచయిత్రి. వారిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కలిసి మెలిసి జీవిస్తుంటారు. మరణించిన తన చెల్లెలు సుధను మాధవిలో చూసుకుంటాడు చక్రవర్తి. వీరి అనుకూల దాంపత్యంలో సూర్యకాంతం పాత్ర ఎలాగైనా గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. 
చక్రవర్తి, మాధవిలపై రవీంద్ర లో లేనిపోని అనుమానాలు రగిలిస్తుంది. ఫలితంగా రవీంద్ర తన మిత్రుడు చక్రవర్తిని అనుమానించి అవమానిస్తాడు. నిర్మల కూడా చక్రవర్తిని అనుమానిస్తుంది. అప్పటికే గర్భవతిగా ఉన్న మాధవి.. డాక్టర్ శ్రీదేవి, చక్రవర్తిల సహాయంతో బిడ్డకు జన్మనిస్తుంది. చివరకునిర్మల, రవీంద్ర నిజం తెలుసుకుని పశ్చాతాపపడడంతో సినిమా సుఖాంతం అవుతుంది.

ఈమూవీలో సావిత్రి అసలు అన్నగా గుమ్మడి నటించగా.. మరణించిన తన చెల్లెలిని.. సావిత్రిలో చూసుకునే పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం. ప్రేమ విఫలం అయ్యి, చెల్లెలు మరణించి, స్నేహితుడితో మాటలు పడుతూ.. భార్య సాధింపులతో హీరో పాత్ర పడే స్ట్రగుల్ ప్రేక్షకుల మనసుని కరిగిస్తుంది. 
మరో వైపు సావిత్రి కష్టాలు కంటతడి పెట్టిస్తాయి. అయినా తన కాపురం గురించి, భర్త పరువు గురించి ఆలోచించే ఇల్లాలుగా సావిత్రి కనబరచిన అభినయం సినిమాకు ప్రధానాకర్షణగా నిలచింది. గుమ్మడి పాత్ర నిడివి ఇందులో చాలా తక్కువే అయినా కనిపించిన కొన్ని సీన్స్ లోనూ తనదైన ప్రత్యేకత చాటారు. కృష్ణ కుమారి, షావుకారు జానకి, గీతాంజలి తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.

డాక్టర్ చక్రవర్తి సినిమా పాటలు ఇప్పటికీ శ్రోతలు మర్చిపోలేరు.  మోలోడీ మాల అల్లినట్టుగా.. సాలూరి వారి గీతాలు.. చెవులకు ఇంపుగా వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ... ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుకా, నీవు లేక వీణ పలుకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది, పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, ఎవరో జ్వాలను రగిలించారు, నిజం చెప్పవే పిల్లా పాటలు దశాబ్దాలుగా సినిమా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. 

డాక్టర్ చక్రవర్తి సినిమా 1964  ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం, అలాగే మొట్టమొదటి స్వర్ణ నంది అవార్డు అందుకుంది. ఈ సినిమాతో మొదటిసారి అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సాధించడం విశేషం. *

No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

 అదృష్టవంతులు (1969) జగపతి పిక్చర్స్ కు అదృష్టం తెచ్చి పెట్టిన సినిమా అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదల అయింది. వీబీ రాజేంద్ర ప్రసాద్...