Saturday, 18 July 2026

సాయి భక్తులు - కుశాల్ చంద్



షిర్డీ సాయిబాబా తొలితరం ఇష్ట భక్తులలో కుశాల్ చంద్ ఒకరు. బాబాకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడిగా ఆయన ప్రేమాభిమానాలను మెండుగా పొందిన ధన్యజీవి ఆయన. ఆయన షిర్డీకి సమీపంలో ఉన్న రహతా గ్రామానికి చెందిన సంపన్న మార్వాడీ వ్యాపారస్తుడు.

కుశాల్ చంద్ నీమ్‌గావ్ జమీందారు అయిన నానాసాహెబ్ డెంగలేకు మేనల్లుడు. నానాసాహెబ్ ద్వారానే ఆయనకు బాబా పరిచయమయ్యారు. బాబా రహతా గ్రామానికి వెళ్లినప్పుడల్లా కుశాల్ చంద్ ఇంట్లోనే బస చేసేవారు. కుశాల్ చంద్ కుటుంబం బాబాను ఎంతో భక్తితో,  తమ ఇంటి దైవంగా చూసుకునేవారు.

బాబా మొదట్లో రహతా గ్రామానికి తరచూ వెళ్లేవారు. బాబా నడిచి రాకుండా ఉండడానికి కుశాల్ చంద్ ఎల్లప్పుడూ ఒక అందమైన ఎడ్లబండిని (లేదా గుర్రపు బండిని) షిర్డీకి పంపించేవారు. బాబా ఆ బండిపై ఎంతో వైభవంగా రహతా వచ్చేవారు. ఊరి పొలిమేరల్లోనే కుశాల్ చంద్ బాబాకు ఘన స్వాగతం పలికి, తన ఇంటికి తీసుకువెళ్లి పిండివంటలతో భోజనం పెట్టేవారు. బాబా కూడా ఆ కుటుంబంపై ఎంతో వాత్సల్యం చూపించేవారు.

సాయి సచ్చరిత్రలో కుశాల్ చంద్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన లీల ఉంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా ద్వారకామాయిలో నిద్రిస్తూ, హఠాత్తుగా నిద్రలేచి పక్కనే ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్‌తో  "నువ్వు వెంటనే రహతా వెళ్లి కుశాల్ చంద్‌ను తీసుకురా. నేను కలలో రహతా వెళ్లాను, అక్కడ కుశాల్ చంద్ నన్ను కలవడానికి ఎంతో ఆరాటపడుతున్నాడు" అని చెప్పారు. బాబా ఆజ్ఞ ప్రకారం కాకాసాహెబ్ గుర్రపు బండి తీసుకుని వెంటనే రహతా వెళ్లారు. అక్కడ కుశాల్ చంద్ ఇల్లు చేరగానే ఆయనకు ఒక వింత అనుభవం ఎదురైంది. కుశాల్ చంద్ అప్పటికే బండి సిద్ధం చేసుకుని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాకాసాహెబ్ ఆశ్చర్యపోయి అడగ్గా, కుశాల్ చంద్ ఇలా చెప్పారు: నేను ఇప్పుడే మధ్యాహ్నం నిద్రపోతుండగా నా కలలో బాబా కనిపించారు. 'నువ్వు వెంటనే షిర్డీ రా' అని నన్ను ఆజ్ఞాపించారు. అందుకే నేను బయలుదేరుతున్నాను."

బాబా అంతర్దృష్టి, భక్తుడి పట్ల ఆయనకున్న ప్రేమ ఎలాంటివో నిరూపించడానికి ఈ లీల ఒక అద్భుత నిదర్శనం. ఇద్దరూ కలిసి షిర్డీ వచ్చి బాబాను దర్శించుకుని పరవశించిపోయారు.

బాబా సమాధి చెందడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచిషిర్డీ వదిలి ఎక్కడికీ వెళ్లడం మానేశారు. అయినప్పటికీ కుశాల్ చంద్ తరచూ షిర్డీ వచ్చి బాబాను దర్శించుకుంటూ ఉండేవారు. బాబా కూడా ఆయనను ఎంతో ఆదరంగా పలకరించి, యోగక్షేమాలు అడిగేవారు. దైవానికి, భక్తుడికి మధ్య ఉన్న ఆత్మిక బంధం దూరాలను దాటి ఎలా పనిచేస్తుందో కుశాల్ చంద్ లీల ద్వారా మనకు అర్థమవుతుంది. బాబా నోట కుశాల్ అని ప్రేమగా పిలిపించుకున్న ఆ పుణ్యమూర్తి ధన్యుడు.*


No comments:

Post a Comment

నాటి చిత్రాలు- నేటికీ జ్ఞాపకాలు

అంతస్తులు (1965) జగపతి పిక్చర్స్ నుంచి వీబీ రాజేంద్ర ప్రసాద్ అందించిన మరో చిత్రం అంతస్తులు. 1965 లో విడుదలైన ఈ సినిమా జాతీయ ఉత్తమ చిత్రం అవా...