Wednesday, 19 August 2026

మాయాబజార్ (1957)



తెలుగు సినీ చరిత్రలోనే అగ్రతాంబూలం అందుకున్న సార్వకాలీన అద్భుతం విజయా వారి మాయాబజార్.  ఒక దివ్యమైన దృశ్యకావ్యంగా బి.నాగిరెడ్డి, ఏ చక్రపాణి నిర్మించిన మాయాబజార్ చిత్రం 1957 మార్చి 27 న విడుదల అయింది. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, మాటలు పింగళి నాగేంద్రరావు అందించారు. సంగీతం  ఎస్. రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు. పాటలన్నీ అణిముత్యాలే. 

మహాభారతంలోని శశిరేఖా పరిణయం ఆధారంగా ఈ చిత్రాన్ని రచయిత, దర్శకులు అత్యంత వినోదాత్మకంగా మలిచారు.

బలరాముని (గుమ్మడి) కుమార్తె శశిరేఖ (సావిత్రి), పాండవ మధ్యముడు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు (ఏఎన్ఆర్) చిన్నతనం నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్లడంతో, బలరాముడి భార్య రేవతి ( ఛాయాదేవి) ఒత్తిడితో శశిరేఖను కౌరవుల రాజు దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి (రేలంగి) ఇచ్చి పెళ్లి చేయాలని బలరాముడు నిశ్చయిస్తాడు. .ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికి బలరాముని తమ్ముడు శ్రీకృష్ణుడు (ఎన్టీఆర్) సూచనతో  భీముడి కుమారుడైన ఘటోత్కచుడు (ఎస్.వి.ఆర్) రంగంలోకి దిగుతాడు. ఘటోత్కచుడు తన రాక్షస మాయాజాలంతో నిజమైన శశిరేఖను ద్వారక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించి, తాను శశిరేఖ రూపం దాల్చి (మాయా శశిరేఖ) పెళ్లిపీటలపై కౌరవులను ముప్పుతిప్పలు పెడతాడు. చివరకు అభిమన్యుడు, శశిరేఖల కళ్యాణం జరిపించి కౌరవుల గర్వాన్ని అణచడమే ఈ చిత్ర కథ

ఘటోత్కచుడుగా ఎస్వీ రంగారావు,  శశిరేఖ/ మాయా శశిరేఖగా సావిత్రి మాయాబజార్ సినిమా కు ప్రాణం పోశారు. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ప్రాణప్రతిష్ఠ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు అభిమన్యుడు పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఘటోత్కచుడి అనుచరులుగా రమణారెడ్డి, చదలవాడ, నల్ల రామమూర్తి అల్లరి ఎప్పటికీ గుర్తుండి పోతుంది

ఎటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్  లేని రోజుల్లో ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్‌లే చేసిన మ్యాజిక్ అద్భుతం. శశిరేఖను ఘటోత్కచుడు  ఆకాశ మార్గంలో తీసుకు పోయే దృశ్యం సంభ్రమం కలిగిస్తుంది. 

లాహిరి లాహిరి లాహిరిలో  పాటను మద్రాస్‌లో మధ్యాహ్నం వేళ ఎండలో షూట్ చేసి, కెమెరా ఫిల్టర్ల సహాయంతో పౌర్ణమి రాత్రి వెన్నెల వెలుగులా చూపించారు.

ఘటోత్కచుడి 'వివాహ భోజనంబు' పాటలో లడ్డూలు ఎగిరి నోట్లో పడే దృశ్యం కోసం నెలల తరబడి కష్టపడి స్టాప్ మోషన్ సాంకేతికతను ఉపయోగించారు.

ఇష్టమైన వారిని చూసుకునే 'ప్రియదర్శిని' (మాజిక్ బాక్స్) కాన్సెప్ట్ నేటి వీడియో కాల్స్‌కి ఆనాడే పునాది లాంటిది.

మాయాబజార్ లోని పాటలతో, మాటలతో ( అహ నా పెళ్ళంట, చూపులు కలసిన శుభవేళ, వివాహ భోజనంబు, లాహిరి లాహిరిలో, హైహై నాయక)  చిత్రాలు కూడా ఆదరణ పొందాయి.

సిఎన్‌ఎన్-న్యూస్18 టీవీ చానెల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా మాయాబజార్ ఎంపికైంది. 

తెలుగువారు గర్వంగా చెప్పుకోదగ్గ ఏకైక క్లాసిక్ మాయాబజార్. కళలు, సాంకేతికత, నటన, సంగీతం కలగలిసిన ఈ సినిమా తరాలు మారినా తెలుగువారి మనస్సుల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది.* 

No comments:

Post a Comment

పరివర్తన పేరుతో మరో రాజకీయ ప్రయోగం! మారేది జెండానా? ఎజెండానా? లేక ప్రజల తలరాతా?

రాజకీయాల్లో పరివర్తన అనేది చాలా ఆకర్షణీయమైన పదం. ప్రజలకు మార్పు కావాలి. నాయకులకు మాత్రం ఆ మార్పు ఎప్పుడూ వారి రాజకీయ ప్రయాణంలోనే మొదలవుతుంద...