అవేకళ్ళు (1967)
పూర్తి రంగుల్లో రూపొందిన తొలి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ గా 1967 డిసెంబర్ 14న విడుదలైన ‘అవేకళ్ళు’ సినిమా విశేషాదరణ చూరగొంది. ఎవిఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో క్రైం థ్రిల్లర్ల జాబితాలో మొదటి వరుసలో నిలిచింది. కథ, దర్శకత్వం ఏ సీ త్రిలోక్ చందర్. నిర్మాత ఏ వీ మెయ్యప్పన్.
రాజశేఖరం(రాజనాల), చంద్రం (రామదాసు) అన్నదమ్ములు. వారి పెద్దన్నయ్య ఓ యాక్సిడెంట్ లో మరణించి ఉంటాడు. రెండో అన్నయ్యను ఎవరో చంపేసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తారు. ఆ హత్యచూసిన ఆయన భార్య వసంత (పుష్ప కుమారి) ని కూడా చంపబోతారు. ఆమెకు మతిభ్రమిస్తుంది. అదే సమయంలో రాజశేఖరం అన్న కూతురు సుశీల (కాంచన), తన ఫ్రెండ్స్ తో క్రిస్మస్ సెలవులకు సంఘసేవ చేయడానికి వస్తుంది. వారందరికీ చంపేస్తామన్న ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అందరూ ఆ ఇంట్లో ఉండడానికే భయపడుతూ ఉంటారు. సుశీలకు హోటల్ లో పనిచేసే భాస్కర్ (కృష్ణ)తో పరిచయం అవుతుంది. అతను కూడా వారి ఇంట్లోకి వెళతాడు. అక్కడ జరిగే సంఘటనలు గమనిస్తాడు. అందరినీ అనుమానిస్తాడు. అతని మిత్రుడు నిత్యానందం (పద్మనాభం) కూడా భాస్కర్ కు సాయం చేస్తూంటాడు. అందరూ ఆ ఇంటిలోనే ఉంటూ హంతకుని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తూంటారు. ఈ లోగా హంతకుడు చంద్రాన్ని చంపేస్తాడు. సుశీలను కూడా చంపాలని నల్లని దుస్తులు వేసుకొని, ముసుగు వేసుకొని వస్తాడు. అతనితో భాస్కర్ తలపడతాడు. ఆ పోరాటంలో అతని కళ్ళు మాత్రమే గుర్తుంచుకోగలుగుతాడు భాస్కర్. ఆ తరువాత ఇంట్లో వాళ్ళందరినీ నుంచో బెట్టి ముసుగుపెట్టి రాజశేఖరం, వారింటి డాక్టర్, వారితో పాటే ఉండే ఓ ముదుసలి సురేంద్ర నాథ్) ని పరీక్షిస్తాడు. ఆ ముసలివాడే అసలు దోషి అని తేలుస్తాడు. అప్పుడు ముసలివాడుగా నటిస్తున్నవాడు అసలు రూపం చూపించి, ఎందుకు తాను హత్యలు చేస్తున్నాడో చెబుతాడు. రాజశేఖరం తండ్రే తనకూ తండ్రి అని, కానీ, అందరూ కలసి తన తల్లిని సజీవదహనం చేశారని, అందువల్లే పగపట్టి అందరినీ మట్టుపెడుతున్నానని వివరిస్తాడు. రాజశేఖరంను, సుశీలను చంపాలని ప్రయత్నించగా భాస్కర్ అడ్డుకుంటాడు. తప్పించుకు పారిపోతూండగా, పోలీసుల తుపాకి గుళ్ళకు బలవుతాడు హంతకుడు. చివరకు భాస్కర్ ఓ సి.ఐ.డి. ఆఫీసర్ అన్న సత్యాన్ని పోలీసాఫీసర్ (గుమ్మడి)చెబుతాడు. హత్యల ఆచూకీ కోసమే భాస్కర్ ప్రత్యేకంగా వచ్చాడని తెలుస్తుంది. భాస్కర్, సుశీల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
ఈ చిత్రానికి డి.వి.నరసరాజు మాటలు రాశారు. వేదా సంగీతం అందించారు. మావూళ్ళో ఒక పడుచుంది, డుమ్ డుమ్ గంగిరెద్దు పాటలు ఇప్పటికీ వినిపిస్తాయి.
ఈ సినిమా మొదటి సారి విడుదల కంటే రిపీట్ రన్స్ లో మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళంలో రవిచంద్రన్, కాంచన జంటగా నిర్మించారు.*
No comments:
Post a Comment