దేవాంతకుడు (1960)
ప్రఫుల్ల చక్రవర్తి 1958 నాటి సామాజిక ఫాంటసీ చిత్రం ‘జమాలాయే జీవంతో మనుష్' ఆధారంగా సీ పుల్లయ్య దర్శకత్వంలో భార్గవీ ఫిల్మ్స్ పై సీహెచ్ సుబ్బారావు నిర్మించిన సోషల్ ఫాంటసీ సినిమా ‘దేవాంతకుడు‘ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. 7 జూలై 1960న విడుదలైన ఈ చిత్రానికి అదుర్తి నరసింహ మూర్తి స్క్రీన్‌రైటర్‌గా వ్యవహరించగా సంభాషణలను వీ సదాశివ బ్రహ్మం 1960 దశకం నాటి నాటి జీవనశైలి, సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఆకట్టుకునేలా రాశారు.
నాటకాలు వేసే సుందరం (ఎన్టీఆర్) లక్షాధికారి భద్రయ్య (కేవీఎస్ శర్మ) కుమార్తె మీనాక్షి (కృష్ణకుమారి)ని ఆమె తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. ఆమె తండ్రి తన కుమార్తెకి వేరే పెళ్ళి చేసేందుకు ఇంట్లో బంధిస్తాడు. తన భర్త ప్రాణాపాయంలో ఉన్నాడని ఎవరో చెప్పిన మాటలు విని హీరోయిన్ చెరువులో దూకుతుంది. యమభటులు పొరపాటున తప్పుడు చిరునామాతో హీరోను యమలోకానికి తీసుకువెళ్తారు. యమలోకంలో సుందరం యముడి (ఎస్వీ రంగారావు) తో పోట్లాడి యముడి దున్నపోతు సహకారంతో యమస్థానాన్ని ఆక్రమిస్తాడు. యముడు నారదుడి (రఘురామయ్య) ద్వారా రాయబారం పంపి శ్రీమహావిష్ణువు ( కాంతారావు) శరణు వేడుకుంటాడు. మరోవైపు యముడి కోరిక మేరకు సుందరం అన్ని లోకాలూ చూసి వారంరోజుల తర్వాత యమలోకం తిరిగివచ్చేందుకు బయలుదేరతాడు. ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రుడితో వాగ్వాదం పెట్టుకుని, ఆపైన పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేసుకుని తన భార్యను బ్రతికించమని కోరతాడు. ఐతే అది శ్రీమహావిష్ణువు చేతిలో ఉందని శివుడు చెప్పగా తన మాటలతో విష్ణుమూర్తిని మెప్పించి భార్యను బ్రతికించుకుంటాడు. అయితే ఇదంతా కల కావడంతో నిద్రలేచి తన భార్యను కాపాడుకుంటాడు
అశ్వద్ధామ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో ఆరుద్ర రాసిన -గో గో గోంగూరా జై జై జై జై ఆంధ్రా కోరుకో కోరుకో- పాట విశేష ఆదరణ పొందింది.
దేవంతకుడు చిత్రాన్ని తమిళంలో ‘నాన్ కంద స్వర్గం‘ పేరుతో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు సినిమా రంగంలో సామాజిక ఫాంటసీ చిత్రాలకు దేవంతకుడు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తరువాతి కాలంలో వచ్చిన . యమగోల చిత్రానికి స్ఫూర్తినిచ్చింది. ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన చిత్రం యమదొంగ (2007) మూల కథాంశం దేవంతకుడు, యమగోల చిత్రాల నుంచి ప్రేరణ పొందిందని చెప్పడం గమనార్హం.*
No comments:
Post a Comment